Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది మూడవ తరగతి గది. తెలుగు మాస్టారు పిల్లల నోట్ బుక్స్ చూస్తున్నాడు. క్లాసులో అందరూ తమ నోటుబుక్స్ తెలుగు మాస్టారు టేబల్ మీద పెట్టారు. రఘురామయ్య మాస్టారు వాటిని చూడటం లేదు. ఆయన చూపులన్నీ ఒక్క విద్యార్థి మీదే ఉన్నాయి. ఆ విద్యార్థి పేరు రమేష్.
''ఏరా! నీ నోటుబుక్ ఈ రోజైనా తెచ్చావా! అసలు చూసిరాత నోటుబుక్ ఉందా?'' అడిగాడు మాస్టారు.
''లేదు!'' అని నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు రమేష్.
''ఎందుకురా! నీవు స్కూలుకి వచ్చి ఎవర్ని ఉద్దరిస్తావ్?'' కోపంగా అన్నాడు మాస్టారు.
రమేష్ కోపంగా చూశాడు.
''ఏంట్రా నన్నే కోపంగా చూస్తావు? చదువుకొనే తెలివి లేదుగాని, రోషానికేమీ తక్కువ లేదు!'' నా క్లాసు అయిపొయ్యేటంత వరకు నీవు నిలబడే ఉండు!'' అంటూ రమేష్‌ను నిలబెట్టాడు రాఘురామయ్య మాస్టారు.
తెలుగు క్లాసు పూర్తయ్యి మాస్టారు వెళ్ళిపోగానే రమేష్ బెంచిమీద కూలబడ్డాడు.
ఇంతలో లెక్కల మాస్టారు ఆంజనేయులు వచ్చాడు.
''ఏమిరా! అందరూ టేబుల్స్ నేర్చుకున్నారా?'' అన్నాడు లెక్కల మాస్టారు గంభీరంగా.
''ఈ లెక్కల సారుకి తిక్క బాగా ఉంది. అందరూ ఫోన్లలో లెక్కలు చేస్తుంటే, ఈయన టేబుల్స్ అడుగుతాడేంట్రా?'' అన్నాడు రమేష్ మెల్లిగా తన పక్క స్టూడెంట్‌తో.
రమేష్ మెల్లిగా అన్నప్పటికీ, ఆంజనేయులు మాస్టారు చెవిలో పడనే పడింది.
''ఏమిరా నాకు తిక్క అంటావా? రెండవ ఎక్కం చదువు!'' అన్నాడు ఆంజనేయులు మాస్టారు కోపంగా.
''నాకు రెండవ ఎక్కం రాదు! ఒకటో ఎక్కం మాత్రమే వచ్చు!'' అన్నాడు రమేష్ బింకంగా.
''ఒకటో ఎక్కం కూడా నేర్చుకున్నావా? చాలా ఘనకార్యం చేశావుగాని, నా క్లాసు అయిపోయెంత వరకు నిలబడు'' అన్నాడు ఆంజనేయులు మాస్టారు.
కోపంగా లేచి నిలబడ్డాడు రమేష్.
లెక్కల మాస్టార్ పేరియడ్ అయిపోగానే రమేష్ బెంచి మీద కూర్చున్నాడు.
ఇంతలో సోషల్ మాస్టారు వచ్చారు.
''ఓరేరు! మన దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందిరా?'' అని అడిగాడు సోషల్ మాస్టారు.
అందరికన్నా ముందే చెయ్యి ఎత్తాడు రమేష్! చెప్పమన్నట్లు చూశాడు. సోషల్ మాస్టారు.
''2014లో స్వతంత్య్రం వచ్చింది సార్!'' అన్నాడు రమేష్ గొప్పగా. అందరూ నవ్వారు.
'ఒరేరు! నీలాంటి వాడు రాష్ట్రానికొక్కడు ఉంటే చాలు!
ఉన్న స్వాతంత్య్రం కూడా పోతుంది వెధవా! 2014లో స్వతంత్య్రం వచ్చిందని ఎవరు చెప్పారు!'' అడిగాడు సోషల్ మాస్టారు.
''మనకు స్వాతంత్య్రం 2014లో వచ్చిందని కంగనా రనౌత్ చెప్పింది సార్!'' అన్నాడు రమేష్ గర్వంగా.
''స్కూలు టీచర్లు చెప్పితే చెవికెక్కదు! ఆ చింపిరి బట్టల హీరోయిన్ చెప్పింది మాత్రం శిలాశాసనం! వెధవా కూర్చో'' అని తిట్టాడు సోషల్ మాస్టారు.
మరుసటి రోజు మళ్ళీ స్కూలు ప్రారంభమయ్యింది, హెడ్మాస్టర్ ఆందోళన పడుతున్నారు. ఒకేసారి తెలుగు, సోషల్, లెక్కల మాస్టార్లు స్కూలుకి రాలేదు. వారు ముగ్గురూ ఒకేసారి ఎందుకురాలేదో హెడ్మాస్టారుకి అంతుచిక్కడం లేదు. ముగ్గురి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వారికే మయ్యిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
తెలుగు మాస్టారు ఇంటికి దగ్గరగా ఉండే సురేష్ గుర్తుకు వచ్చాడు. వెంటనే హెడ్మాస్టర్ సురేష్‌ని పిలిచాడు. సురేష్ మూడవ తరగతి నుండి వచ్చాడు.
''ఏమిరా! మన తెలుగు మాస్టారు ఎందుకు రాలేదో తెలుసా?'' అడిగాడు హెడ్మాస్టర్.
సురేష్ ఏమీ మాట్లాడలేదు!
''ఏమిరా మాట్లడవు! తెలుసా లేదా?'' చిరాకుగా అడిగాడు హెడ్మాస్టర్.
''తెలుగు సారు! ఇంటికి రాత్రి మూడు గంటలకే ఐదుకార్లు వచ్చాయి సార్! నేను స్కూలుకి వచ్చే టైముకి కూడా కార్లు అక్కడే ఉన్నాయి సార్!'' అన్నాడు సురేష్.
''అయిదు కార్లు ఇంటికి వస్తే, మీ సారు స్కూలుకి రారా? కనీసం ఫోనైనా చేయాలి కదా!'' అన్నాడు విసుగ్గా హెడ్మాస్టర్.
''కార్లలో వచ్చిన వాళ్ళు మన సార్ ఫోను గుంజుకున్నారంట సార్!'' అన్నాడు సురేష్.
హెడ్ మాస్టర్‌కి తలగిర్రున తిరిగింది. అయిదు కార్లు ఒకేసారి రావటమేమిటీ? ఫోను గుంజుకోవటమేమిటో అర్థం కాలేదు.
''సరేగాని! మన సోషల్సారు ఇంటి పక్కన ఉండే శేఖర్ని పిలుచుకునిరాపో!'' అన్నాడు హెడ్ మాస్టారు.
సురేష్ వెళ్ళి శేఖర్ని పిలుచుకుని వచ్చాడు.
''ఏమిరా! శేఖర్, మన సోషల్ సారు ఎందుకు రాలేదో తెలుసా? సారు ఇల్లు మీ ఇంటి ముందే ఉంది కదా!'' అడిగాడు హెడ్మాస్టర్.
''సోషల్ సారు ఇంటికి రాత్రి ఒంటిగంట నుండి కార్లు వస్తూనే ఉన్నాయి సార్! సార్‌తో పాటు ఇంట్లో వారందరినీ ఒక రూములో కూర్చోబెట్టి ఫోన్లు గుంజుకుని, కార్లో వచ్చిన వారు ఏవేవో అడుగుతున్నారు సార్!'' అన్నాడు శేఖర్.
హెడ్ మాస్టర్‌కు ఈసారి కళ్ళు కూడా తిరిగాయి.
''ఏమి జరుగుతుందసలు? కార్లు రావడమేమిటీ! ఇంట్లో అందర్ని కూర్చోబెట్టి ఏమి అడుగుతున్నారు?'' అని ఆలోచిస్తుండగా సైన్సు టీచరు వచ్చింది! ఆమెతో పాటు మరో స్టూడెంట్ వచ్చాడు.
''మన లెక్కల మాస్టారు వీడి ఇంటిపక్కనే ఉంటారు సార్'' అన్నది సైన్స్ టీచర్.
చెప్పమన్నట్లు చూశాడు హెడ్మాస్టర్.
''మన ఆంజనేయులు సార్ ఇంటికి రాత్రి మూడు గంటలకే పదికార్లు వచ్చాయి. దాదాపు యాభైమంది ఇంటి లోపలికి వెళ్ళారు సార్! అప్పటి నుండి ఎవరూ బయటకు రాలేదు. పాల పాకెట్ కూడా కార్లలో వచ్చినవారే తీసుకుని పోయారు సార్!'' అన్నాడు ఆ స్టూడెంట్.
హెడ్ మాస్టర్ సృహతప్పి పడిపోయాడు. సైన్సు టీచర్ నీళ్ళు చల్లటంతో తేరుకుని లేచి కూర్చున్నాడు.
''సార్!'' అంటూ చెయ్యి ఎత్తాడు సురేష్.
ఏమిటన్నట్లు చూశాడు. హెడ్ మాస్టర్.
''నిన్న మన తెలుగు, సోషల్, లెక్కల మాస్టార్లు రమేష్గాడిని తిట్టారు సార్!'' ఇంటికి పోయెటప్పుడు వీళ్ళకి సినిమా చూపిస్తానని రమేష్ అన్నాడు సార్!'' అన్నాడు సురేష్.
అది విన్న హెడ్ మాస్టర్‌కి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే లేచి మూడవ తరగతికి వెళ్ళాడు. రమేష్‌ని లేపాడు.
''ఏమిరా! చదవటం చేతకాదు! పాఠాలు చెప్పేటీచర్లకి సినిమా చూపిస్తానంటావా? టీసీ ఇచ్చి పంపిస్తా వెధవా!'' అంటూ తిట్టి బయటకి వచ్చాడు.
హెడ్ మాస్టర్ వెనకే అటెండర్ ఆఫీసులోకి వచ్చాడు.
''సార్! ఆ రమేష్ గాడిని ఎందుకు తిట్టారు! వాడసలే మంచోడు కాదు సార్!'' అన్నాడు అటెండర్.
''మన టీచర్లను అన్ని మాటలంటే తిట్టక ముద్దుపెట్టుకోమంటావా? ఏం మాట్లాడుతున్నావయ్యా!'' అన్నాడు హెడ్ మాస్టర్ కోపంగా.
''ఆ రమేష్గాడి తండ్రి పువ్వుగుర్తు పార్టీలో చిన్నపాటి లీడర్సార్!'' అన్నాడు అటెండర్.
''లీడర్ అయితే ఏంటి?'' హెడ్ మాస్టర్ మాట పూర్తికాక ముందే బయట శబ్దమైంది! అందరూ అటు చూశారు. దాదాపు ఇరవైకి పైగా కార్లు స్కూలులోకి వచ్చాయి. కొన్ని బయటే ఆగాయి!
దాదాపు వందమందికి పైగా ఆఫీసర్లు వచ్చారు.
''మేము ఈడీ నుండి వచ్చాం!'' అన్నారు కొందరు.
''మేము ఐటీ నుండి వచ్చాం!'' అన్నారు మరికొందరు.
''మేము సీబీఐ నుండి వచ్చాం!'' అన్నారు ఇంకొందరు.
''మేమంతా మిమ్మల్ని సోదా చేయటానికి వచ్చాము!'' అన్నారు హెడ్ మాస్టర్ ఫోను గుంజుకుంటూ!
''ఇంకో వందమంది మీ ఇంటికి వెళ్ళి సోదా చేస్తున్నారు!'' అన్నాడు ఒక ఆఫీసర్.
అంతే హెడ్మాస్టర్తో పాటు అక్కడున్న వారందరికీ సృహ తప్పింది.
- ఉషా కిరణ్.