Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచవ్యాప్తంగా 5లక్షలకుపైగా జనాభా కలిగిన 990పట్టణాల జనాభా విశ్లేషణ, జనసాంద్రత, భవిష్యత్తు పట్టణీకరణ అంచనాలు లాంటి పలు ఆసక్తికర అంశాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవల విడుదల చేసింది. 'డెమొగ్రఫియా వరల్డ్ అర్బన్ ఏరియాస్-2022 (ప్రపంచ పట్టణ ప్రాంత జనాభా-2022)' పేరుతో వెలువరించిన నివేదిక ప్రకారం నేడు ప్రపంచ పట్టణ జనాభా దాదాపు 2.36 బిలియన్లు (236 కోట్లు)ఉంది.
ప్రపంచ మెగాసిటీస్
ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల జనాభా దాటిన 44 నగరాలను మెగాసిటీస్గా నామకరణం చేశారు. గతంలో 36 మెగాసిటీస్ ఉండగా నేడు 44వరకు పెరగడం గమనించారు. చైనాకు చెందిన 11నగరాలు, ఇండియాకు చెందిన 6నగరాలు, బ్రెజిల్, జపాన్, పాకిస్థాన్, యూయస్ దేశాల్లో 2 చొప్పున మెగాసిటీస్ ఉన్నాయి. ఐదు మిలియన్లకు పైగా జనాభా కలిగిన 97 ప్రపంచ నగరాలను గుర్తించారు. అత్యధిక జనాభా కలిగిన 10 ప్రపంచ మెగాసిటీల జాబితాలో టోక్యో-యొకోహామా, జకార్తా, ఢిల్లీ, గ్వాంజావ్-ఫోషాన్, ముంబ యి, మనీలా, షాంఘై, సావ్ పాలో, సియోల్, మెక్సికో పట్టణాలు ఉన్నాయి.
అత్యధిక జనాభా కలిగిన భారత నగరాలు
అత్యధిక జనాభా కలిగిన ప్రపంచ నగరాల జాబితాలో 3వ స్థానంలో ఢిల్లీ, 5వ స్థానంలో ముంబయి మహానగరాలతో పాటు 15వ స్థానంలో కోల్‌కతా, 23వ స్థానంలో బెంగుళూరు, 33వ స్థానంలో చెన్నై , 40వ స్థానంలో హైదరాబాదు మహానగరాలు ఉన్నాయి. వీటితో పాటు పూనె (52వ స్థానం), అహ్మదాబాదు (53), సూరత్(71), లక్నో (99) జైపూర్(111), కాన్పూర్(133), ఇండోర్(156), వారణాసి(161), నాగపూర్(164), పాట్నా (165), అల్లహా బాదు (169), ఆగ్రా (1191), చండీఘర్(22), భోపాల్(226), కొచ్చీ(227), తిరువనంత పురం(268), విశాఖపట్నం(235), వడోదరా(236), మీరట్(238), కోజీకోడ ్(243), కోయంబత్తోర్(246), మధురై(247), నాసిక్(248), జంషెడ్పూర్(271), అలీఘడ్(282), రాంచీ(297), లుధియానా(300), ఔరంగాహాదు(302), జబల్పూర్ (306), గ్వాలియర్(308), జోద్పూర్(309), కన్నూర్(317), బెరైలీ(323), రాజ్‌కోట్(325), గోరక్‌పూర్(328), రారుపూర్(329), విజయవాడ (331), అసన్సోల్(334), మైసూర్(337), తిరుప్పూర్(367), డెహ్రడూన్(388), సహరన్పూర్(395), మలప్పురం(401), అమత్సర్(403), కోటా(411), గౌహతి (430), శ్రీనగర్(431), దుర్గ్-బిలారునగర్(443), మొరాదాబాదు(448), తిరుచు రాపల్లి(461), భువనేశ్వర్ (464), ధన్బాదు(468), హుబ్లీ-దార్వాడ్ (472), జలంధర్(473), కెల్లమ్(481), సోలాపూర్(490) పట్టణాలు తొలి 500 నగరాల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన గుంటూరు (580వ స్థానం), వరంగల్(607), నెల్లూరు(674), తిరుపతి(762), కర్నూలు (785), రాజమండ్రి(912వ స్థానం) పట్టణాలు జాబితాలో చోటు చేసుకున్నాయి.
అల్పాదాయ దేశాల్లో పెరగనున్న పట్టణ జనాభా
అభివృద్ధి చెందిన అధిక ఆదాయ దేశాల జనాభాతో పోల్చితే అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో పట్టణ జనాభా అధికంగా పెరుగుతుందని అంచనా వేశారు. పల్లెను వదిలి పట్నం బాటను పట్టనున్న వలస బతుకులతో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు మసకబారి ఆహార అభద్రత రాజ్యమేల వచ్చు. నగరాల వెలుగున ఆకర్షణలతో పట్టణాల చుట్టు మురికి కూపాలు వెలుస్తున్నాయి. నగరాల ఆకాశహర్మ్యాల పునాదుల్లో శ్రామికవర్గ చెమట చుక్కల వాసన వస్తున్నది. పని, పిల్లల చదువులు, చిరు వ్యాపారం, పండ్ల బండి, నిర్మాణ రంగం, పరిశ్రమల్లో కూలీలు, అసంఘటిత రంగ శ్రమలు, వీధి వ్యాపారాలు లాంటి కారణాలతో గ్రామీణ భారతం పట్టణాలకు పయనం అవుతున్నది. రాబోయే రోజుల్లో పల్లెలు అంతరిస్తూ పట్టణ విస్తీర్ణాలు పెరగనున్నాయి. గ్రామ నగర సమతుల్యత దెబ్బతిన్నపుడు సుస్థిరాభివృద్ధి కుంటుపడి, సమాజంలో అశాంతి రెక్కలు విప్పవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(ఇటీవల ఐరాస విడుదల చేసిన 'ప్రపంచ పట్టణ ప్రాంతాల జనాభా-2022' నివేదిక ఆధారంగా)
డా: బుర్ర మధుసూదన్‌రెడ్డి, సెల్: 9949700037