Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది మాయల మార్కెట్టు
దీని మీద మన్ను బోతు...
ఈ దళాదరి రాజ్యంలో
వ్యవసాయమెట్ల సేతు...
కార్పొరేటు సర్పము పడగ విప్పుతున్నది
పాలు పోసిన రైతు పానం తీస్తున్నది....
చెమటబొట్టు చిందించి పంట నేను పండిస్తే
కార్పొరేటు కంపెనొడు అగ్గువకు పంట కొని
పాకెట్లు కట్టుకొని వాని పేరు పెట్టుకొని
వరిజనల్ సీడని వజ్రాల రేటు పెట్టి
దున్ని ఇతునమేసినట్టు కలుపు వాడె తీసినట్టు
పాలింకిన కంకులకు పాలు వాడె తాపినట్టు
కంపెని సీడని సెప్పి కంట్లో కారం కొట్టే...
ఆలుగడ్డ ఉల్లిగడ్డ అల్లం ఎల్లిపాయే
టమాటా బెండకాయ కందిపప్పు సెనగపప్పు
సూపర్ మార్కెట్లు కట్టి ఏసీలో దాసిపెట్టి
ఆక్సీజను ఇచ్చివాడు పంటను బతికిచ్చినట్టు
వెండి తూకమేసినట్టు బంగారం తూసినట్టు
పావు కేజీ చొప్పునమ్మి ప్రజల సొమ్ము దండుకుని
కోట్లకు పడిగేత్తుతుండు రైతు నిండ మునుగుతుండు...
తాతలకాలం నుండి భూమి వాడే దున్నినట్టు
పోడు కొట్టి చెట్టు నరికి మడి వాడే కట్టినట్టు
కార్పొరేటు సెద్యమని చెవ్వుల్లో పూలు పెట్టి
రైతు చేతుల భూమి గుంజుకోను చూస్తున్నడు
విత్తనాలు అమ్మేకాడ మందుల తయారీ కాడ
ధాన్యము కొనుగోలుకాడ అప్పులిచ్చే బాంకుకాడ
కార్పొరేటు భూతం కాసుకోని కూసున్నది...
దళారి రాజ్యములోన విసిగీవేసారిన
కష్టాల కడలిలో ఇన్నాళ్లు ఈదిన
పాలకులే కార్పొరేట్ల ఏజెంట్లని తెలుసుకున్న
దలారీవ్యాపారుల దోపిడీ పసిగట్టిన
ఎదిరించగ నేనిప్పుడు ముళ్ళు కర్ర ఎత్తిన
రైతు సంఘం నీడన పోరుబాట పట్టిన
- కాకం అంజన్న, సెల్:9701747407