Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 11 నిముషాలకు ఒక మహిళ లేదా బాలిక తన జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతోందంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ ఇటీవల గగుర్పొడిచే వాస్తవాల నివేదిక (ఫ్యాక్ట్ షీట్)ను వెలువరించారు. ఆ తర్వాత... నవంబరు 25ను మహిళలపై హింస నిర్మూలనా దినంగా అంతర్జాతీయ స్థాయిలో పాటించాలని ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపునకు మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం లభించింది. మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘనగా ఆయన వ్యాఖ్యానించారు.
గృహ హింస అనేది మహిళలపై అప్రకటిత యుద్ధంగా ఉంది. ఏండ్ల తరబడి చూసినట్లైతే మరే ఇతర సాంప్రదాయ యుద్ధం కన్నా కూడా గృహ హింస బాధితులు అధికంగా ఉంటున్నారు. సంపన్న దేశాలుగా పిలిచే దేశాల్లో, పెట్టుబడిదారీ విధానానికి కేంద్రాలైన ఈ దేశాల్లో ఇందుకు సంబంధించి అత్యంత అధ్వాన్నమైన రికార్డు ఉంది. ఐక్యరాజ్య సమితి వెబ్సైట్లో దేశాలవారీగా అందుబాటులో ఉన్న డేటాను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
భారతదేశంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నేషనల్ క్రైమ్ బ్యూరో 2021 ప్రకారం, సగటున ప్రతి రోజూ 86మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. పైగా ఇవన్నీ నమోదైన కేసులే. ప్రతి గంటకూ మహిళలపై జరుగుతున్న 49 నేరాలు ఐపిసి కింద నమోదు అవుతున్నాయి. ప్రతి రోజూ వరకట్న వేధింపుల కింద సగటున 18మంది మహిళలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఏడాది కాలంలో 6,589 వరకట్న మరణాలు నమోదయ్యాయి. తాము గృహ హింస లేదా లైంగిక హింసను ఎదుర్కొంటున్నామని, సర్వే చేసిన వారిలో మూడో వంతు మంది మహిళలు వెల్లడించారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తెలియచేసింది.
ఏ దేశమైనా సిగ్గుతో తల వంచుకోవాల్సిన గణాంకాలు ఇవి. కానీ, భారతదేశంలో మాత్రం ప్రభుత్వం కనీసం ఒక్క మాట కూడా మాట్లాడదు. కొంతమంది దీన్నొక మహమ్మారిగా పిలుస్తారు. కానీ వాస్తవానికి, మహిళలపై హింస అనేది మన సామాజిక వ్యవస్థల్లో పాతుకుపోయింది. విపరీతమైన కులతత్వ పద్ధతుల కారణంగా దళిత మహిళలు అత్యంత దారుణమైన హింసను ఎదుర్కొంటున్నారు.
హింసకు పాల్పడేవారికి కులతత్వ, పితృస్వామ్య వ్యవస్థ కల్పించిన రక్షణ కూడా ఇందుకు ఒక కారణంగా ఉంది. దీనివల్ల మహిళలపై హింసకు పాల్పడే వారిలో 75శాతం మంది శిక్ష పడకుండానే తప్పించుకుంటున్నారు. నేరం చేసిన వారికి శిక్ష పడే రేటు ఇంత తక్కువగా ఉండడానికి, పోలీసులు పక్షపాతంతో జరిపే దర్యాప్తులు, న్యాయ వ్యవస్థలో సుదీర్ఘమైన జాప్యాలు, హింసకు గురైన బాధితులపై రాజీకి రావాలంటూ వచ్చే సామాజిక పరమైన ఒత్తిళ్ళు వంటివి ఇతర కారణాలుగా వున్నాయి.
గృహ హింసను సాధారణ విషయంగా చేసే సంస్కృతికి ప్రస్తుత ప్రభుత్వంలో కొత్త ఊపు, ఉత్సాహం లభిస్తోంది. తన భర్త లేదా ఆయన తరపు బంధువులు ఎవరైనా హింసకు పాల్పడినా సర్దుకుపోవడాన్ని మంచి మహిళ నడవడికలో భాగంగా పేర్కొంటూ ఆదర్శ మహిళ ఇలా ఉండాలనే భావాలను ప్రచారం చేస్తున్నారు. వైవాహిక బంధంలో అత్యాచారాన్ని నేరంగా గుర్తించడానికి కూడా ప్రభుత్వం తిరస్కరిస్తోంది. దీనివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయంటూ కారణాలు పేర్కొనడంలోనే ఆ మనస్తత్వం కనిపిస్తోంది. కుటుంబ సంబంధాలను ప్రజాస్వామీకరించడానికి, మహిళల సమానత్వాన్ని రక్షించడానికి ఈ మనువాదీ సంస్కృతి పెద్ద అవరోధంగా ఉంది.
ప్రతి అత్యాచార కేసుకు బాధితురాలు, నిందితుడి మతాలను బట్టి మతం రంగు పులమడమనేది అంతకన్నా ప్రమాదకరమైన అంశంగా ఉంది. బిల్కిస్ బానో కేసులో గ్యాంగ్ రేపిస్టులు, హంతకుల విడుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై గుజరాత్ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర హౌం మంత్రిత్వశాఖ ముందుగానే అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. మరో మాటలో చెప్పాలంటే, అత్యంత హేయమైన ఈ నేరంలో ఈ హంతకులను, రేపిస్టులను విడుదల చేయడంలో హౌం మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారంటే నిందితుల మతం, వారి రాజకీయ సంబంధాలే ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అదే సమయంలో, ముస్లింలు నిందితులైతే అప్పుడు పాలక పార్టీకి, వారి సంఫ్‌ు సహచరులకు, మహిళలకు న్యాయం జరగాల్సిన విషయం గుర్తుకు వస్తుంది.
ఇటీవల సంచలనం రేకెత్తించిన శ్రద్ధా వాకర్ హత్య కేసును ప్రస్తావిస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించదగిన రీతిలో చేసిన ప్రకటనతో ఈ విషయం స్పష్టమైంది. ప్రతి నగరంలో అఫ్తాబ్ వంటి వాళ్ళను నివారించాలంటే ఉక్కు మనిషి మోడీకి ఓటు వేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. శ్రద్ధాను దారుణంగా హత్య చేసి పైగా ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేలా ముక్కలుగా చేసి అడవిలో విసిరివేసిన దురాగతానికి పాల్పడింది ఆమె ముస్లిం భాగస్వామి. అత్యంత విషపూరితమైన మతోన్మాద ప్రచారాన్ని చేపట్టడానికి, లవ్ జిహాద్ గురించి మాట్లాడేందుకు ఈ సంఘటనను వారు ఉపయోగించుకుంటున్నారు. ఢిల్లీలో ఈ ఘాతుకం బయటపడే సమయానికి ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో ఒక యువతిని చంపేసి ఆరు ముక్కలు చేశారు. సీతాపూర్ జిల్లాలో మరో మహిళను ఆమె భర్తే హత్య చేసి ముక్కలుగా చేసి పొలంలో పడేశాడు. ఈ రెండు కేసుల్లోనూ నిందితులు, బాధితులు హిందూ మతానికి చెందినవారు కనుక బీజేపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అగ్ర కులానికి చెందిన వారు దళిత బాలికలపై అత్యాచారానికి పాల్పడినా లేదా హత్యచేసినా ఒక్కమాట కూడా రాలేదు. భారతదేశంలో మహిళలపై హింసకు ఇలా మతం రంగు పులమడం అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా ఉంది. దీనివల్ల న్యాయ క్రమం మరింత దెబ్బ తింటుంది. న్యాయం అందడం ప్రశ్నార్థకమవుతుంది.
చవకగా మహిళా శ్రామిక శక్తిని దోచుకునేందుకు మహిళలు అణిగివుండే పరిస్థితు లను పెంపొందించే సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ ప్రాతిపదికగా... ప్రపంచవ్యాప్తంగా పితృస్వామ్య భావజాలం, పద్ధతులు పెరిగేందుకు... పెట్టుబడిదారీ విధానం, దాని సామాజిక వ్యవస్థలు మద్దతుగా నిలుస్తున్నాయని, సాయపడుతున్నాయని స్పష్టమైంది. ఈ ఛాందసవాద పునాది కారణంగానే పెట్టుబడిదారీ ప్రపంచంలో మహిళలు ఇతర దేశాల్లోని వారి కన్నా కొంత ఎక్కువగా వివక్షను, హింసను ఎదుర్కొంటున్నారు. మితవాద హిందూత్వ శక్తులు కుల వ్యవస్థలను, మనుస్మృతిని బాహాటంగానే సమర్థించడం వల్ల భారతదేశంలో స్త్రీ ద్వేషం, పితృస్వామ్య ధోరణులు మరింత బలంగా పాతుకుపోతున్నాయి. దాంతో, మైనారిటీ కమ్యూనిటీల్లో మహిళలను మరింత అణచివేసే శక్తులను ఇది బలోపేతం చేస్తోంది.
రాజ్యాంగంలో మహిళలకు హామీ కల్పించిన హక్కుల కోసం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా చేసిన చట్టాలను అమలు చేయడం కోసం మరింత ఉత్తేజంతో పోరాటం సాగించాలి. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు తమ కార్యాచరణ వేదికలో దీన్నొక కీలకమైన భాగంగా చేసుకోవాల్సి ఉంది.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)