Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను తెలుపుతుంది. 1946లో రాజ్యాంగ పరిషత్లో జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన 'రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం' పీఠికకు ఆధారంగా పనిచేసింది. గ్రాన్ విల్లే ఆస్టిన్ తన 'ది కార్నర్ స్టోన్ ఆఫ్ ఎ నేషన్: ఇండియన్ కాన్స్టిట్యూషన్' గ్రంథంలో పేర్కొన్నట్లు రాజ్యాంగ పీఠిక భారత రాజ్యాంగ విశిష్ట లక్షణంగా చెప్పవచ్చు. ఏ రాజ్యాంగానికైనా పీఠిక ప్రాణం వంటిది. రాజ్యాంగానికి గల వివిధ లక్ష్యాలను, ఆశయాలను రాజ్యాంగంలో చెప్పబడిన అంశాలను పీఠిక స్పష్టంగా తెలియ చేస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాతలు వివిధ ఆదర్శాల సమ్మేళనంగా పీఠికను తయారుచేశారు. ఉదాహరణకు పీఠికను రూపొందించడంలో ఐక్యరాజ్య సమితి చార్టర్ను, ఐరిష్ రాజ్యాంగంలోని అంశాలను, ఫ్రెంచి విప్లవ నినాదాలను, అమెరికా రాజ్యాంగంలోని కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. రాజ్యాంగ నిర్మాతల మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి పీఠిక పని చేస్తుందని, రాజ్యాంగంలో అన్ని అంశాలు ఎందుకు చేర్చబడ్డాయో విశద పరుస్తుందని బెరుబారి కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 'మనం ఎంతో కాలం ఏమి కలగన్నామో పీఠిక తెలియజేస్తుంది' అని అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అభిప్రాయపడ్డారు. 'పీఠికకు రాజ్యాంగ నిర్మాతలు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఇచ్చారని, బ్రిటిష్ పాలనలో ఏ ఆశయాల కోసం, ఏ వాంఛల కోసం జాతి పోరాడిందో వాటన్నింటి ప్రతిరూపమే పీఠిక' అని జస్టిస్ షెలాత్, జస్టిస్ గ్రోవర్ అభిప్రాయపడ్డారు.
'భారత ప్రజలమైన మేము భారత దేశాన్ని ఒక సర్వసత్తాక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగంగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయులమై ఉన్నాం. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని, భావాల్లో, భావ ప్రకటనలో, మత విశ్వాసంలో, ఆరాధనలో స్వాతంత్య్రాన్ని, వ్యక్తిగత హౌదాలో అవకాశాల విషయంలో సమానత్వాన్ని చేకూర్చి, ప్రజల మధ్య సౌభ్రాతత్వాన్ని పెంపొందిస్తామని తీర్మానిస్తూ, వ్యక్తి గౌరవానికి, జాతి సమగ్రతకూ రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తూ, 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఈ రాజ్యాంగాన్ని చర్చించి ఆమోదించి మనకు మనం సమర్పించుకుంటున్నాం' అని పీఠిక చెబుతోంది.
భారతదేశం 1947కు ముందు సార్వభౌమాధికారం గల రాజ్యం కాదు. పీఠిక ద్వారా భారతదేశం సర్వసత్తాక రాజ్యంగా ప్రకటించుకుంటూ, బాహ్యంగా తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకుంటూ, అంతరంగికంగా వ్యక్తులపైన, సంస్థలపైన తన సంపూర్ణాధికారాన్ని నిలబెట్టుకుంటుంది. కామన్వెల్త్ సభ్య దేశంగా ఉన్నా దాని సార్వభౌమాధికారానికి ఎలాంటి భంగమూ వాటిల్లదు.
ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో భారతదేశం పెద్దది. రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థను చేపట్టి... 21ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించింది. ప్రజల్లో ఎక్కువశాతం నిరక్షరాస్యులైనా ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా నడుస్తున్నది.
లౌకిక, సామ్యవాద పదాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. లౌకికం అంటే మత వ్యతిరేకత అని అర్థం కాదు. భారతరాజ్యంలో ఏ మతమూ రాజమతంగా ప్రకటించబడదు అని, అన్ని మతాల వారికి సమానమైన అవకాశాలు, స్వాతంత్య్రాలు కల్పించాలి అని. ఒక్క మాటలో చెప్పాలంటే మతానికి రాజ్యంతో సంబంధం లేదు అని, అది పౌరుని సొంత విషయం అని అర్థం. సామ్యవాదానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చారు. పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు, సమన్యాయాన్ని అందించడంలో రాజ్యమే కీలక పాత్ర నిర్వహించాలి అని దానికర్ధం.
గణతంత్రం అంటే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవితో సహా ప్రభుత్వంలో అన్ని పదవులు ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులే నిర్వహిస్తారు. స్వదేశీ సంస్థానాలన్నీ భారత రాజ్యంలో విలీనం కావడంతో రాజరికం పూర్తిగా రద్దయింది. అందువల్ల భారతదేశం పీఠిక ద్వారా రిపబ్లిక్గా ప్రకటించుకుంది.
భారత రిపబ్లిక్ ప్రజలందరికీ ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయం సమకూరుస్తామని చెప్పింది. దానికోసమే రాజ్యాంగం నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాలను ప్రవేశపెట్టారు. అనేక విషయాల్లో స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పింది. దానికనుగుణంగానే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ప్రవేశపెట్టారు. ప్రజలందరికీ ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో సమాన అవకాశాల కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి.
రాజ్యాంగ సవరణ
పీఠిక గురించి ఇప్పటికి ఒక్క రాజ్యాంగ సవరణ మాత్రమే చేయబడింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు.
పీఠిక గురించి కేసులు
పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని 1960లో బెరుబారి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బెరుబారి అనేది భారత్, పాకిస్థాన్ మధ్య ఒక ప్రాంతం. ఈ భాగంపై భారత్, పాకిస్థాన్ మధ్య మార్పిడి విషయమై వచ్చిన వివాదంలో రాష్ట్రపతి 143వ నిబంధన ప్రకారం సుప్రీం కోర్టు సలహాను కోరారు. అందులో భాగంగా సుప్రీంకోర్టు 1960 మార్చి 14న పీఠిక రాజ్యాంగంలో భాగం కాదని తీర్పు చెప్పింది. ప్రసిద్ధి చెందిన కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో... పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని జస్టిస్ ఎస్.ఎం.సిక్రి ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ కన్జూమర్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్ కేసులో సుప్రీం కోర్టు... పీఠికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పేర్కొంది.
డి.ఎస్ నకరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1982 కేసులో సుప్రీం కోర్టు సామ్యవాద లక్ష్యాన్ని వివరించింది. సామ్యవాదం యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక, సామాజిక జీవన ప్రమాణాలను పెంచడం, అసమానతలను రూపుమాపడం, కార్మికులకు, ఉద్యోగులకు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సరైన జీవన ప్రమాణాలను సమకూర్చడమేనని తెలిపింది.
ఎక్సల్ వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని సామ్యవాద ప్రాముఖ్యతను వివరించి పరిశ్రమలను ప్రభుత్వ పరం చేయడం, జాతీయీకరణ చేయడం ద్వారా సామ్యవాదాన్ని సాధించవచ్చని పేర్కొంది. ఎస్.ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ 'లౌకికతత్వం' భారత రాజ్యాంగ మౌలిక లక్షణంగా పేర్కొంది.
- కె.ఎస్.లక్ష్మణరావు