Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మహిళలు పోరాటం చేస్తే ఇండ్ల జాగాలొస్తాయా? అధికారంలో మేమున్నాం ఎర్రజెండాను నమ్ము కుంటే పోలీస్ కేసులవుతాయి. జైలుకెళతారు'' అంటూ అధికార పార్టీ నాయకుల బెదిరింపులను ఒకవైపు... ''అర్థరాత్రి బుల్డోజర్లతో మీ గుడిసెలను కూల కొడతాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తామ''ంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల బెదిరింపులు మరొకవైపు... వీటికి తోడు అనేక నిర్బంధాలను, దౌర్జన్యాలను అనునిత్యం ఎదుర్కొంటూ రెక్కాడితేగాని డొక్కాడని పేద ప్రజలు మొక్కవోని దీక్షతో పోరాడారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎనిమిది నెలలు రాత్రి, పగలు తేడా లేకుండా కొనసాగించిన అసాధారణమైన ఈ గుడిసెల పోరాటం అపూర్వ విజయం సాధించింది. నవంబర్ 22న భాజ భజంత్రీలు, కోలాటాలు, పూల హారతుల వంటి కోలాహాలాలతో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు ఇతర నాయకులతో కలిసి పేదలు గృహప్రవేశాలు చేశారు. మహనీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌గా కాలనీకి నామకరణం చేశారు.
ఫలించిన పదేండ్ల ఒంటరి మహిళల పోరాటం
ఎల్కతుర్తి మండల కేంద్రంలో సర్వే నెంబర్ 294లో ఉన్న ఎకరం ఇరవై గుంటల ప్రభుత్వ స్థలాన్ని పేదల ఇండ్ల స్థలాలకు ఇవ్వాలని గత పదేండ్ల నుండి పోరాటం కొనసాగుతున్నది. గతంలో అంబాల స్వరూప, లోకిని స్వరూప నాయకత్వంలో పేదలు గుడిసెలు వేశారు. గ్రామంలో ఉన్న భూస్వామ్య పెత్తందారులు అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైలుకు పంపారు. మిగతా వారిని బెదిరించి, ఆ భూమిని పక్కనే ఉన్న తమ పట్టా భూముల్లో కలుపుకున్నారు. ఏ రాజకీయ నాయకుల దగ్గరకి వెళ్ళినా ఒంటరి మహిళలుగా ఉన్న వీరికి సహాయ నిరాకరణే ఎదురైంది తప్ప ఆదరణ దొరకలేదు. చివరికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఇచ్చిన ధైర్యంతో భూస్వాములు ఆక్రమించిన భూముల్లో తిరిగి ఎర్రజెండాలు పాతి గుడిసెలు వేసారు. ఇందులో 190 కుటుంబాలు ఉంటే వీరిలో 40 కుటుంబాలకు పైగా ఒంటరి మహిళలవి కావడం గమనించదగిన అంశం. మండల కేంద్రంలోని హౌటల్లలో రోజువారి కూలీతో పాటు పాచి పనులు, ప్రయివేట్ దవాఖానా, విద్యా సంస్థలలో స్వీపర్లుగా పనిచేసే ఈ ఒంటరి మహిళలంతా అట్టడుగు వర్గాలకు చెందిన వారే. చిన్న వయసులోనే వివిధ కారణాలతో తమ భర్తలను కోల్పోయిన వీరిలో భారమైన కిరాయిలు తట్టుకోలేక పిల్లలతో పగటిపూట హౌటల్లో పని చేసి, రాత్రిపూట స్థానిక బస్టాండ్‌లో బస చేస్తున్న వారే అధికంగా ఉన్నారు. చదువురాని నిరక్షరాస్యులైన వీరి ఒకే ఒక్క కోరిక తమ నివాసానికి ఓ ఇల్లు కావాలని. ఈ కోరికే అనేక బెదిరింపులను, నిర్బంధాలను ఎదుర్కొని నిలబడేటట్లు చేసింది. పనికి పోతే ఇండ్ల జాగా పోతుందేమో అనే భయంతో ఒక్క పూట భోజనం చేసి పోరాటంలో పాల్గొన్నవారు అనేక మంది ఉన్నారు.
పుస్తెలతాడు అమ్మి ఇండ్లు కట్టిన పేదలు -
సంఘీభావంగా కదిలి వచ్చిన గుడిసె వాసులు
20మందితో ప్రారంభమైన ఈ భూపోరాటం 190 కుటుంబాలకు విస్తరించింది. పక్కా ఇండ్లు కట్టాలనే సంఘం నిర్ణయం మేరకు తమ మెడలో ఉన్న పుస్తెల తాళ్లు అమ్మి ఇండ్లు కట్టిన వారే అధికంగా ఉన్నారు. కొద్దిమంది గిరి గిరి బ్యాంకుల దగ్గర వడ్డీలకు అదనంగా కొంత నగదును తెచ్చుకొని ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఈ పోరాట స్ఫూర్తి ఆధారంగా ఐదు మండలాలకు ''ఇండ్ల స్థలాల భూ అక్రమణ పోరాటం'' ఎగబాకింది. భీమదేవరపల్లి మండలం, వేలేరు మండలం, ఐలోని మండలం, హసన్‌పర్తి మండలం, హన్మకొండ అర్బన్ మండలాలలో వేలాదిమంది సంఘం ఆధ్వర్యంలో గుడిసెలు వేశారు. వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో పోరాడి నిర్మించుకున్న పేదల గృహప్రవేశాలకు సంఘీభావంగా ఇతర మండ లాలలోని గుడిసె వాసులు వేలాది మంది కదిలి రావడం చూసిన రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు... స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు నిర్బంధం ప్రయోగించైనా గృహప్రవేశాలను ఆపాలని చూసారు. అయినా పేదల ప్రతిఘటన ముందు వారు వెనక్కి తగ్గక తప్పలేదు. రానున్న కాలంలో కరెంటు, తాగు నీరు, డ్రైనేజీ, రహదారులు వంటి కనీస సౌకర్యాల కోసం ఇదే ఐక్యతతో పోరాటాన్ని కొనసాగించాలని పోరాట కమిటీ నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వానికి కనువిప్పు కావాలి
దసరాకు లక్ష డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం, వచ్చే సంక్రాంతికి కట్టిన ఇండ్లు లబ్ధిదారులకు అందిస్తాం అనే పాలకుల మాటలను ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇందుకు ఈ పోరాటమే ఓ నిదర్శనం. మరొకవైపు ''డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టడం సాధ్యం కాదు, ఇంటి స్థలం ఉంటే మూడున్నర లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామ''ని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన ఇండ్ల స్థలాలు లేని పేదలను మరింత అభద్రతాభావంలోకి నెట్టింది. సంవత్సరానికి లక్ష ఇండ్లు చొప్పున ఎనిమిది లక్షల ఇండ్లు ప్రభుత్వం ఈపాటికే నిర్మించి పేదలకు ఇవ్వాలి. ఆ పని చేయకపోగా కట్టిన ఇండ్లను కూడా పేదలకు ఇవ్వకుండా తాళాలు వేసి ఉంచడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నది. తక్షణమే కట్టిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలి. పేదల ఆక్రమణలో ఉన్న భూములను గుర్తించి పట్టాలు ఇవ్వాలి. లేదంటే ప్రజలే పోరాడి సాధించుకుంటారని నిరూపిస్తోందీ ప్రజా విజయం. ఈ విజయానికి జేజేలు పలుకుదాం.
- బుర్రి ప్రసాద్
సెల్:9490098901