Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలకు వ్యతిరేకంగా అన్ని రూపాల్లో జరుగుతున్న హింసను నిర్మూలించడానికి ఏర్పడిన అంతర్జాతీయ దినోత్సవానికి (నవంబర్, 25) కొన్ని రోజుల ముందు ఒక యువతిని తన జీవిత భాగస్వామి అనాగరికంగా హత్య చేసి, అవయవ విహీనురాలిని చేశాడు. ఈ సంఘటన, 'ఆప్తుడైన భాగస్వామి హింస' వైపు దృష్టిని మరల్చింది. ''ప్రొటెక్షన్ ఆఫ్ విమన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్ 2005'' (పీడబ్ల్యూడీవీఏ)చట్టం వర్తించే గృహ హింసగా కూడా దీనిని గుర్తించారు. ఆమె అతడ్ని ఎందుకు ఎంపిక చేసుకుంది? అతడ్ని ఎందుకు వదిలేయలేదు? లాంటి అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె, సహాయాన్ని కోరుతూ చేసిన ప్రయత్నాల రుజువు బయట పడడంతో ఈ చట్టాలు ఎందుకు అమల్లో లేవని అడుగుతాం.
భారతీయ చట్టాల నిబంధనల ప్రకారం గృహహింస శిక్షార్హమైన నేరం. ఇది మానవహక్కుల ఉల్లంఘన కూడా. అయినప్పటికీ, 18-49 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 32శాతం మంది వివాహిత మహిళలకు వ్యతిరేకంగా హింస కొనసాగుతున్న సమాజంలో మనం బతుకుతున్నామని ఇటీవల జరిగిన ''నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5'' నివేదిక తెలియజేస్తుంది. ఈ మహిళలు, వారి భర్తలు పాల్పడుతున్న భావోద్వేగపూరితమైన, భౌతిక, లైంగిక హింసలకు గురవుతున్నారు. ఈ గృహహింసలను అనుభవిస్తున్న వారిలో పట్టణ ప్రాంత మహిళల కంటే గ్రామీణ ప్రాంత మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఈ సర్వే ఇతర కుటుంబ సభ్యులు పాల్పడే హింసపై దృష్టిని కేంద్రీకరించడంలేదు.
పదిహేడు సంవత్సరాల క్రితం, ప్రగతిశీల చట్టమైన పీడబ్ల్యూడీవీఏను ఆమోదించారు. భర్తల నుండి మాత్రమే కాక ఇతర కుటుంబ సభ్యుల హింస నుంచి కూడా మహిళలకు మద్దతుగా, రక్షణగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ చట్టం హామీ ఇచ్చింది. కానీ, ఈ చట్టం కాగితాలపై ఉన్నప్పటికీ, ఇప్పటికీ మహిళలు ఆ చట్టం అమలుకు చేరువలో ఉండలేకపోతున్నారు. దాని హామీలు, నిబంధనలు అసమానం గా అమలవుతూ, భారతీయ మహిళలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. అత్యంత నిరుత్సాహమైన వాస్తవమేమంటే, మూడింట ఒక వంతు మహిళలు గృహహింస కారణంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ, గృహహింసను అనుభవిస్తున్న వారిలో కేవలం 14శాతం మంది మాత్రమే సహాయాన్ని కోరుతున్నారు. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా తక్కువగా ఉంటుందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (2019-21) నివేదిక తెలుపుతుంది. గృహహింసను నేరంగా పరిగణించే ఒక దేశంలో, హింసను అనుభవిస్తున్న మహిళలను రక్షించేందుకు అనేక చట్టాలను రూపొందించిన దేశంలో, గృహహింసను అనుభవించి, ప్రాణాలతో బయటపడిన మహిళలు అనేక మంది ఎందుకు సహాయాన్ని కోరడం లేదు?
ప్రశ్నలు,స్పందనలు
తాము అనుభవించిన హింసను ఇతరులతో పంచుకునే, తెలియచేసే సందర్భంలో మహిళల భయాలు, రోజువారీ నిజాలు, ఆటంకాలు, సహాయం కోరే అంశాలను బాగా అవగాహన చేసే లక్ష్యంతోనే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మా పరిశోధన సాగింది. ''నీవు ముందే ఎందుకు అతడ్ని వదిలెయ్య లేదు?'', ''ఇంతకు ముందే ఎందుకు గహహింస గురించి ఎవరికైనా ఎందుకు చెప్పలేదు?'' లాంటి సదుద్దేశంతో వేసిన మామూలు ప్రశ్నలకు చాలా సంక్లిష్టమైన, పరస్పర విరుద్ధమైన సమాధానాలు రావచ్చు.
పరిస్థితులు మారుతాయి, ఆ పరిస్థితులు వారి భర్తల ప్రవర్తనలను మార్చుతాయనీ, అప్పుడు వారు, వీరు చెప్పినట్లు వింటారని, మహిళలు ఆశించారు. ప్రధానంగా మహిళలు, ఇతరులకు ముఖ్యంగా వారి కుటుంబాలకు 'భారం' కావడానికి ఇష్టపడలేదు. ''మా అమ్మకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆమెకంటూ స్వంత జీవితం ఉంటుంది కాబట్టి ఆమె ఇబ్బందులకు నా ఇబ్బందులు తోడవడం నాకిష్టం లేదు.'' వారనుభవించిన హింసను నిర్దిష్టంగా చెప్పడం ద్వారా, వారి కుటుంబాలకు ఒక 'సమస్య'గా లేదా మానసిక 'ఆందోళన'కు వనరుగా మారకూడదని, వారి కుటుంబాలకు తలవంపులు లేదా అగౌరవం తేకూడదని, గృహహింస నుండి బయటపడిన మహిళ విద్యా స్థాయి, కులం, వర్గంతో నిమిత్తం లేకుండా విశ్వసించింది. వలస మహిళలు, ట్రాన్స్ జెండర్లు, లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తల్లిదండ్రుల విషయంలో, నేరస్థుల హింసకు సంబంధించిన సమస్యలను పరిష్కరించు కునే బాధ్యత కూడా వారిదే.
సహాయం కోరడంపై
సహాయం కోరే విషయానికి వస్తే, రెండు రకాల మహిళా సమూహాలు ఉన్నాయని గుర్తించాం -మొదటిది, హింసను అనుభవించిన ఆరు నెలల్లోపు చెప్పేవారు, రెండవది హింసను అనుభవించిన ఐదు సంవత్సరాలు లేదా ఆ తర్వాత చెప్పేవారు. మొదటి సమూహానికి చెందిన మహిళలు సహాయం కోసం తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళారు. వారి భర్తల అవసరాలను తీర్చడం ద్వారా లేదా వారితో సర్దుకుని పోవడం ద్వారా కుటుంబ పరిస్థితులను కాపాడాలని వారి కూతుళ్ళను ఒత్తిడి చేసిన కేసులు అనేకం. 'కుటుంబ సంతోషం' కంటే కూతురు సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిన కేసులు తక్కువగా నమోదయ్యాయి. అలాంటి కేసుల్లో మధ్య వర్తిత్వం వహించే చర్యలు చేపట్టడం లేదా తెగతెంపులు చేసుకోవడం లేదా (చాలా అరుదుగా) సమస్య పరిష్కారానికి పోలీసులు, లాయర్లను కలవడం లాంటివి జరిగాయి.
సుదీర్ఘకాలం తరువాత గృహహింసను అనుభవించి దాని నుండి బయటపడిన వారు సహాయం కోరే వారి విషయానికి వస్తే, హింసకు సాక్షులుగా ఉన్న బంధువులు, ఇరుగుపొరుగు వారి చర్యలు (పరిస్థితులను మార్చడంలో) చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. బాధితురాలి పిల్లల సంరక్షణ, భర్త వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడనే విషయం కనుగొనడంలో, హింస తీవ్రస్థాయిలో ఉండడం, వైద్య సహాయం అవసరమవడం లాంటి సందర్భాల్లో వారి చర్యలు చాలా కీలకమయ్యాయి. సహాయం కోరడానికి ముందు, ఆస్తి యాజమాన్యానికి సంబంధించిన పితృస్వామిక నిబంధనలు లేదా ఆర్థిక అభద్రత కారణంగా తెగతెంపులు చేసుకునే విషయంలో అనేక ఊహలతో మానసిక సంఘర్షణకు గురైన బాధితురాల్లు బహుశా అందుకే అంతకాలం ఎదురుచూసి ఉంటారు.
లింగ అసమానతల విషయంలో సామాజిక నియమాలు ఎంత గాఢంగా పాతుకుపోయాయంటే, భార్యను కొట్టే విషయాన్ని అంగీకరించే సందర్భంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సమర్థిస్తారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 నివేదిక తెలియజేస్తుంది. ''మాకు ఎలాంటి షరతులు విధిస్తారంటే, మేము ఎలాంటి బాధను గురించైనా ఫిర్యాదు చెయ్యలేనంత కష్టంగా ఉంటాయని'' ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహిళ చెప్పింది. మిత్రులు, బంధువులకు గృహహింస గురించి రహస్యాలను చెప్పిన బాధిత మహిళలు, 'ఉపశమనం' పొందినట్లు, 'భారమంతా తగ్గినట్లు' పరిస్థితులు మారిపోతాయానే ఒక కొత్త 'ఆశ' కలిగిన భావన పొందినట్లు చెప్పారు.
మహిళలు గృహహింస అనుభవాలను పంచుకోవడం, ఎవ్వరూ నమ్మలేని విధంగా వారు తీసుకునే అత్యంత శక్తివంతమైన నిర్ణయం. సేవలు, మద్దతు పొందడంలో అనిశ్చితి, భయం, నిరాశ, నిస్పృహలకు లోనుకావాల్సి వచ్చింది. భారతదేశంలో ఉన్న వాస్తవ పరిస్థితి ఏమంటే, అనేకమంది మహిళలు తమ గోడును వెళ్ళబోసుకోడానికి ఏ వేదిక లేదు. కేవలం ధనవంతులైన కొందరు మహిళలు, ప్రభుత్వేతర సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న కొద్దిమంది స్వతంత్ర మహిళలు మాత్రమే కోర్టుల ద్వారా న్యాయం కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి, అనేకమంది గృహహింస బాధితులు వారి పరిస్థితులను మార్చుకోవడం అనేది కొత్త నైపుణ్యాలను, జీవనాధార అవకాశాలను సాధించడం ద్వారా ఆర్థిక స్వావలంబన పొందడం పైనే ఆధారపడి ఉంటుంది.
పోలీసుల పాత్ర
పోలీసులకు తాము అనుభవించిన గృహహింసను చెప్పిన మహిళలు, వారు స్పందించిన తీరు పట్ల చిరచిరలాడారు. ఏదో కొద్దిమంది అనుకూలమైన ఫలితాలు పొందినప్పటికీ, మేము ఇంటర్వ్యూ చేసిన మెజారిటీ మహిళలు, 'హింసకు పరిష్కారం చూపడం కంటే కూడా అసలు సమస్యలో పోలీసుల పాత్ర ఎక్కువ అయిందని' చెప్పారు. పోలీసులే బాధిత మహిళలను హింసాత్మక కుటుంబాలకు తిప్పి పంపిస్తూ హింసకు పాల్పడిన వారితో రాజీచేశారు. అధికారికంగా ఫిర్యాదు నమోదు చెయ్యకుండా లేదా పీడబ్ల్యూడీవీఏ మార్గదర్శకాల ప్రకారం సంరక్షణ అధికారులకు అప్పజెప్పకుండా హింసకు పాల్పడిన వారిపై హింసను ప్రయోగించినట్లు మేము అనేక రాష్ట్రాల్లో విన్నాం. అనేక రాష్ట్రాలు ఇంకా సంరక్షణ అధికారుల బాధ్యతలను అమలు చేయాల్సిఉంది. ఏ ప్రాంతాల్లో పని చేస్తున్నా, తక్కువ సిబ్బందితో, ఉన్న సిబ్బంది కూడా నైపుణ్యం లేకుండా, సౌకర్యాల లేమితో పని చేయాల్సి వస్తుంది.
పితృస్వామిక, వైవిధ్యమైన లైంగిక చర్యల ప్రయోజనాలనే ప్రభుత్వం నెరవేరుస్తుందన్న విషయం మహిళలందరికీ కూడా తెలుసు. ప్రభుత్వం మహిళలకు సహాయపడకుండా వారిని నిరుత్సాహానికి గురి చేస్తున్నది. గృహహింస నేరానికి, సంరక్షణా ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ పరిష్కారాలు కూడా ఉనికిలో ఉన్నాయనే విషయం ప్రభుత్వ చట్టాలు గుర్తించినప్పటికీ, గృహహింస వల్ల కలిగే దుష్ప్రభావాల పరిష్కారం ఇంకా బాధిత మహిళలకు, వారి కుటుంబాలకే అప్పజెప్పుతున్నారు. ఇది, నేడు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న అతిపెద్ద నేరం.
(''ద హిందూ'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451