Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందూత్వ శక్తులకు ఒక ప్రయోగశా లగా గుజరాత్ ఎలా మారింది? గుజరాత్ నమూనాగా తదనంతర కాలంలో అందరికీ తెలిసిన కార్పొరేట్- మతోన్మాద శక్తుల సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? అన్న అంశాలపై అంతర్గత నిజాలను, అంతరార్ధాలను తెలుసుకోగల వెసులుబాటును గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జరుపుతున్న ప్రచారం ఇస్తోంది. తన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా చెబుతున్న కొన్ని విషయాలు చూస్తుంటే గుజరాత్ వెలుపల ఉన్న చాలామందికి ఆశ్చర్యం కలుగుతోంది. అయితే, వాస్తవాన్ని వక్రీకరించడంలో, తప్పుడు కథనాలను రూపొందించడంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ కూటమి ఎలా విజయవంతమైందో అవి తెలియచెపు తున్నాయి. అమిత్ షా 2002లో ముస్లింలపై జరిగిన హింసాకాండను ప్రస్తావిస్తూ... వారిని అల్లరి మూకలుగా అభివర్ణించడమేగాక, వారికి అప్పుడే బుద్ధి చెప్పామని వ్యాఖ్యానించారు. షా ప్రకారం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ వారిని కఠినంగా అణచివేశారు. అప్పటి నుండి గుజరాత్లో 'శాశ్వత శాంతి' నెలకొంది. కానీ, ముస్లింలకు సంబంధించి నంతవరకు అక్కడ శ్మశాన నిశ్శబ్దం నెలకొంది.
గత కాంగ్రెస్ ప్రభుత్వాలు (1995కి ముం దున్న) మతోన్మాద ఘర్షణలకు పాల్పడేవారిపై మెతక ధోరణి అవలంబించాయని కూడా షా ఆరోపించారు. ఆ రకంగా, స్వాతంత్య్రం లభించిన తర్వాత మైనారిటీవాదంపై జరిగిన అతి పెద్ద హింస, ఇప్పుడు ముస్లింలుగా భావించే అల్లరి మూకలను అణచివేయడంగా చిత్రీకరించబడింది. ఈ రకంగా వక్రీకరించ బడిన ఆలోచనా ధోరణే బిల్కిస్ బానో, ఆమె కుటుంబ సభ్యులపై దారుణాలకు పాల్పడిన రేపిస్ట్లు, హంతకులు జైలు నుండి విడుదల కావడానికి దారి తీసింది. వారి యావజ్జీవ శిక్షలను తగ్గించడం ద్వారా విడిచిపెట్టారు. గుజరాత్ ప్రభుత్వం, అమిత్ షా హౌం మంత్రి త్వ శాఖలే శిక్ష తగ్గింపును ఆమోదించాయి.
జాతి వ్యతిరేక లేదా గుజరాత్ వ్యతిరేక శక్తులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతిస్తున్నాయంటూ స్వయంగా మోడీనే చెప్పడం బీజేపీ ప్రచారంలో మరో అంశం. తీవ్రవాదాన్ని ఓటు బ్యాంకులు, బుజ్జగింపు కోణం నుండి కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలు చూస్తున్నాయంటూ మోడీ ఘాటుగా విమర్శలు చేశారు. అంటే లౌకికవాదాన్ని పరిరక్షించడం, మైనారిటీల హక్కులను కాపాడడం వంటి వాటిని తీవ్రవాదంపై మెతక ధోరణిగా, జాతి వ్యతిరేక చర్యలుగా ముద్ర వేశారు.
మత హింస బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ న్యాయ మార్గాన్ని ఆశ్రయించినందుకు తీస్తా సెతల్వాద్, మాజీ డిజిపి ఆర్.బి.శ్రీకుమార్‌లను అరెస్టు చేసి, జైలు పాల్జేయడానికి ఈ రకమైన మతోన్మాద దృక్పథమే కారణమైంది. ముఖ్యమంత్రిగా మోడీ మొత్తం పదవీకాలంలో కొనసాగిన ఇదే ధోరణి ప్రస్తుత ఎన్నికల ప్రచారంలోనూ ప్రతిబింబిస్తోంది. పాకిస్థాన్‌ను, తీవ్రవాదాన్ని మైనారిటీలతో కలిపి చూసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అలాగే మైనారిటీలను బుజ్జగించే వారుగా సెక్యులర్ పార్టీలను ఆరోపిస్తూ, తద్వారా వారు తీవ్రవాదానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. ఈ కథనాలను ప్రశ్నించే వారిని జాతి వ్యతిరేకులుగా, గుజరాత్ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు.
కార్పొరేట్-మతోన్మాద శక్తులతో కూడిన ప్రభుత్వం ఆవిర్భవించడానికి గుజరాత్‌లోని అభివృద్ధి కథనం చాలా విలక్షణంగా ఉపయోగపడింది. మొత్తంగా కార్పొరేట్ రంగం, పెట్టుబడిదారీ వర్గం అన్నీ మోడీ వెనుక, బీజేపీ వెనుకే నిలబడ్డాయి. బడా వ్యాపారవేత్తల, వాణిజ్య సంస్థల చేతుల్లో పెద్ద ఎత్తున ఆస్తులు పోగుపడడం ద్వారా పారిశ్రామిక రంగం పురోగమించింది. మరోవైపు దేశంలోకెల్లా అత్యంత తక్కువ స్థాయిలో పట్టణ, గ్రామీణ కార్మికులకు వేతనాలు చెల్లించబడుతున్నాయి. ఒకవైపు అధిక స్థాయిలో ఉన్న రాష్ట్ర అభివఋద్ధి, స్థూల దేశీయోత్పత్తి... మరోవైపు కింది స్థాయిలో ఉన్న సామాజిక సూచికల మధ్య వైరుధ్యమనేది చాలా తీవ్రంగా, ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ధరల పెరుగుల, నిరుద్యోగం, విద్యా, ఆరోగ్య సదుపాయాల లేమి, వీటన్నింటి కారణంగా నిరుపేద వర్గ్లాల్లో, సామాజికంగా అణచివేతకు గురైన గ్రూపుల్లో తీవ్రంగా నెలకొన్న అసంతృప్తి ఎన్నికల ప్రచారంలో కనిపిస్తోంది. అయితే, గతంలో మాదిరిగానే, లోతుగా పాతుకుపోయిన ప్రస్తుత మతోన్మాద పోకడలను... ఇటువంటి కోపాలను, ఆగ్రహాలను చెదరగొట్టడానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
మతోన్మాద ప్రచార లక్ష్యమైన ముస్లింలు చాలా దుర్భరమైన, దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. నగరాల్లో, ఈ విభజన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముస్లింలు ఉండే ప్రాంతాలు సరైన మౌలిక వసతులు లేక దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే, విషపూరితమైన హిందూత్వ ప్రచారం, దానితో పాటు లబ్ధిదారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తామన్న హామీల వల్ల తమకు ఓట్లు వస్తాయన్న ధీమాతో బీజేపీ ఉంది.
ఈ విషపూరితమైన మతోన్మాద ప్రచారాన్ని కట్టడి చేసే చర్యలే లేవు. 2019లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో... ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదే పదే ఉల్లంఘించి నరేంద్ర మోడీ, అమిత్ షాలు దోషులుగా తేలినప్పటికీ... ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగా ఈ మతోన్మాద ప్రచారమనేది సాధారణ అంశంగా మారిపోయింది. గుజరాత్లో ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా, రిటైర్డ్ సీనియర్ సివిల్ సర్వెంట్ ఇ.ఎ.ఎస్.శర్మ ఎన్నికల కమిషన్‌కు ఒక లేఖ రాశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై ఇ.సి నుండి ఎలాంటి స్పందన లేదు. అదంతా పక్కనబెడితే, ఇప్పుడు ఇటువంటి విషయాల్లో చట్టాలను రూపొందించే స్థాయిలో షా హౌం మంత్రిగా ఉన్నారు.
-పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం