Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''బీజేపీ పాలనలో రానున్నవి మరింత చీకటి రోజులేనని భయమేస్తుంది!'' అంటున్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ ఖట్టూ... ఎందుకంటే? 2016లో నోట్ల రద్దు, 2017 నుండి జీఎస్టీ బాదుడు ద్వారా ఐదులక్షల పరిశ్రమలు మూతబడి, కోట్లాది మంది ఉద్యోగాలనూ, ఉపాధినీ కోల్పోయారు. అలా 2018 నుండి పతనమార్గం పట్టిన భారత వృద్ధిరేటు 2022 నాటికి బంగ్లాదేశ్ వృద్ధిరేటుకన్నా కనిష్టస్థాయికి పడిపోయిందని అంతర్జాతీయ నివేదికలు గణాంకాలతో సహా వివరిస్తున్నాయి.
రుణ మాఫీలు, పన్ను రాయితీల ద్వారా కార్పొరేట్లకు లక్షలకోట్లు కట్టబెట్టి, నిత్యావసరాలూ, ఇంధన ధరల పెంపు ద్వారా ప్రజల నడ్డివిరిచింది కాక, ఇంకా లోటు పూడక లక్షల కోట్లు అప్పు చేసింది మోడీ ప్రభుత్వం! గత 70ఏండ్లలో చేసిన అప్పు 52లక్షల కోట్లు కాగా, ఈ ఏడేండ్లలో అది 152లక్షల కోట్లకు చేరింది! ఇది మన జీడీపీలో 62శాతంగా ఉందని, ఆర్థికశాఖ 2022 నివేదికలో ప్రకటించింది.
కాంగ్రెస్ అవినీతిలో మునిగింది, నాకవకాశమివ్వండి, ''నేను తినను - తిననివ్వను - ప్రజల సంపదకు కాపలాదారుగా ఉంటాను'' అంటూ గద్దెనెక్కిన మోడీ దేశ సంపదనంతా తన మిత్రులైన కార్పొరేట్లకు తినిపిస్తూ ప్రపంచ కుబేరులుగా ఎక్కదీస్తున్నాడన్నది జగమెరిగిన సత్యం! అంతేగాదు 'కేంద్ర నిఘా సంస్థ' ఇచ్చిన 2021 నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖలన్నింటా వెల్లువెత్తిన 'అవినీతి ఫిర్యాదులు' అక్షరాలా 'లక్షా తొమ్మివేదివేల రెండొందల పద్నాలుగు (1,09,214). ఇక వీరు అవినీతిని అడ్డుకుందెక్కడా, దేశ సంపదకు కాపలా కాసిందెక్కడీ భారత్‌లో ఏటా కార్పొరేట్లు 85వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొడుతున్నట్లు బ్రిటన్‌కు చెందిన 'రుబిక్ సంస్థ' ప్రకటించింది. అంతే కాదు, భారత్‌లో సగటున రోజుకు 100కోట్ల బ్యాంకు రుణాలు ఎగవేస్తున్నది కూడా ఈ కార్పొరేట్లేనని మరికొన్ని అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ''రఫెల్‌ను మించిన భారీ స్కాం పంటల భీమా పథకమనీ, తద్వారా 'రిలయన్స్' - ఎస్సార్' వంటి భీమా సంస్థలకు వేలకోట్ల లబ్ధిని చేకూర్చింది మోడీ ప్రభుత్వమని'' ప్రముఖ సామాజిక వేత్త 'పాలగుమ్మి పద్మసాయి' ప్రకటించారు. ''అవినీతి నిర్మూల నావతారం''గా బీజేపీ చెబుతున్న మోడీ హయాంలో... 'అవినీతి వామనావతారంలా విస్తరిస్తుంది' అనటానికి ఇంతకన్నా నిదర్శనాలేం కావాలంటున్నారు విశ్లేషకులు!
'థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్' అను ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ ''వరల్డ్ మోస్ట్ డేంజరస్ కంట్రీస్ ఫర్ వుమెన్'అను 2018 నివేదికలో భారత్‌ను మొదటిస్థానంలో, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, సిరియా, సౌదీ అరేబియాలను ప్రకటించింది. 'బేటీ బచావో' అంటున్న మోడీ పాలనలో ఆయన స్వరాష్ట్రంలో గర్భిణీ యువతితో సహా ఒక ముస్లిం కుటుంబ స్త్రీలందరినీ అత్యాచారం చేసి, హత్యగావించిన మూకలను క్షమాభిక్ష పేరిట విడుదల చేయటమేగాక, పూలదండలు, వీరతిలాకలు, మంగళహారతులతో స్వాగతించిన దృశ్యాలు సదరు నివేదిక అక్షర సత్యమని రుజువు చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే 'మన్మోహన్ ప్రభుత్వం అనే పెనం మీంచి, మోడీ ప్రభుత్వం అనే పొయ్యిలో పడ్డారు భారతీయులు' అనిపిస్తుంది.
అయితే మోడీ విధానాలు చేసిన గాయాల బాధ తెలియకుండా జనానికి 'ద్వేషరాజకీయమత్తు'ను ఇంజెక్టు చేస్తున్నది బీజేపీ! నాడు హిట్లర్ జాతి విద్వేషానికి యూదులనెంచుకున్నట్లు నేడు మత ద్వేషానికి ముస్లింలను - కుల ద్వేషానికి దళితులను బలిపశువులను చేస్తోంది బీజేపీ! అగ్రరాజ్యాల పట్ల భయంతో 'క్రైస్తవుల' పట్ల బహిరంగ ద్వేషాన్ని ప్రదర్శించలేక పోతున్నారు..!
ముస్లింలను ద్వేషింపజేయటం ద్వారా మెజారిటీ హిందువుల ఓట్లు కొల్లగొట్టాలన్నదే వీరి వ్యూహం. అంతే తప్ప హిందువులను ఉద్దరించాలన్న ప్రేమగానీ, బాధ్యతగానీ వీరికి లేవుగాక లేవు! ప్రజలు కూడ 'మత విద్వేషం అనే మత్తు'లో మునిగి తేలుతూ, తమ బాధలకు మోడీ విధానాలే కారణమన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారని సామాజిక, మానసిక నిపుణులు వక్కాణిస్తున్నారు!
ఇదంతా చూస్తుంటే నాకు బాల్యనుభవం ఒకటి గుర్తుకొస్తోంది. ''ఆఫీసర్ చివాట్లు పెట్టినప్పుడల్లా ఇంటికొస్తూనే అమ్మను చెడతిట్టాక గాని శాంతించేవాడు నాన్న! నాన్నమీద కోపంతో నన్ను రెండుపీకి, నేనేడుస్తుంటే ఊరటపొందేది అమ్మ! ఆ కోపంతో బయటికెళ్ళి వాకిట్లో పడుకున్న కుక్కపిల్లను కర్రతో ఒక్కటేసేవాణ్ణి... కుయ్యో, కుయ్యో మంటూ అది పరుగెడుతుంటే అప్పుడు ఉపశమనం కలిగేది నాకు. బీజేపీ ద్వేషరాజకీయ రహస్యాన్ని, ఇలాంటి మన బాల్యానుభవంతో చక్కగా గ్రహించవచ్చు.
- పాతూరి వెంకటేశ్వరరావు
సెల్: 9849081889