Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎలుకలు పైకి కనబడకపోయినా లోలోపల ఇల్లును మాత్రం గుల్ల చేస్తాయి. పొలాలను సైతం నాశనం చేస్తాయి. ఇబ్బంది కలిగిస్తాయి. ఎన్నో ప్రయత్నలు చేసినప్పటికీ అవి దొరకవు. బోన్లు పెట్టి వాటిని బంధించాలంటే, ఒక్కటి రెండు మాత్రమే అందులో పడతాయి. ఇలా కన్నంలోంచి వాటిని బయటకు రప్పించాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు ఎదురు నిలవాలి. అయినా అంత ఈజీగా అవి బయటకు రావు. అన్ని ఎలుకలు బయటకు రావాలంటే పొగ పెట్టాల్సిందే. అవినీతి ఎలుకల విషయంలో కూడా ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ అదే జరుగుతున్నది. దీని ఫలితంగా రాజకీయ ఎలుకలు సైతం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇన్నాళ్లూ ఆ ఎలుకలు దొరికినంత దోచుకుని తిన్నాయి. ఎవరెక్కువ తిన్నారనేది పక్కన పెడితే, ఒకరికొకరు పొగ పెట్టుకుంటున్నాయి. దీంతో ఇరు వర్గాలకు చెందిన అవినీతి బండారం బొక్కలోంచి రరు మంటూ బయటకు పరుగెత్తుకుంటూ వస్తున్నది. రాజకీయాలు ఎలా ఉన్నా... ఎవరు ఎంత అవినీతికి పాల్పడ్డారనేది మాత్రం బహిర్గతం అవుతోంది. ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన భేదాభిప్రాయాలతో బొక్కలో ఉన్న అవినీతి సామాజ్య్రాల గురించి బయట ప్రపంచానికి తెలుస్తున్నది. పోర్తు ఎస్టేట్ కూడా పసిగట్టని అనకొండ లాంటి అవినీతి చాపకింద నీరులా విచ్చలవిడిగా జరుగుతుందనేది ఇప్పుడు రుజువు అవుతున్నది. ఒకవేళ తెలిసినా మాకెందుకులే అనేలా గతంలో మేనేజ్ చేశారు. అయితే రెండు పిల్లుల తగాదాను కోతి తీర్చినట్టు ఒకవైపు సీబీఐ, మరోవైపు సీట్ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఇది రాజకీయ కక్ష అంటూ ఒకరికొకరు దూషించు కుంటున్నా... తప్పుడు ఆరోపణలు, ఎదురుడాది చేసుకుంటున్నా... అవినీతి జరిగిందనేది సత్యం. అవినీతి, అక్రమాలు ఎలా జరుగుతాయో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలా ధనార్జన చేయవచ్చనేది ఒలా ఒకరికొకరు పొగ పెట్టుకోవడం వల్లే మరోసారి తెరపైకి వచ్చింది. కొంత మందికి ఈ విషయం ఆందోళన కలిగిస్తున్నా... ఇది మంచి పరిణామంగా భావించాల్సి ఉంటుందని పాతకాలపు రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద కేసుల్లోంచి కడిగి ముత్యంలా ఎవరు బయటకు వస్తారో వేచి చూద్దాం..
-గుడిగ రఘు