Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిసెంబర్ 6... ముప్పై సంవత్సరాల కిందట బాబ్రీ మసీదుపై మనువాద ముష్కరులు దాడి చేసి దౌర్జన్యంగా అయోధ్యలోని ఆ చారిత్రక కట్టడాన్ని కూల్చివేసిన రోజు. లౌకికవాద రాజ్యాంగానికి ఆరోజు జరిగిన గాయం ప్రతి సంవత్సరం గుర్తుకొస్తూనే ఉంటుంది. అదే రోజు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్థంతి కూడా. బాబ్రీ మసీదు పైనే కాకుండా అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దాడి చేయడానికిగాను బహుశా అదే తేదీని ఇందుకు ఎంపిక చేసుకున్నారేమో. మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ మన లౌకిక రాజ్యాంగంపై దాడి నేటికీ కొనసాగుతూనే ఉన్నది. కాశీలోని జ్ఞానవాపి మసీదును, మధురలోని షాహి ఈద్గానూ స్వాధీనం చేసుకుంటామని సంఫ్‌ు పరివార్ శక్తులు ప్రతిరోజూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. ప్రాచీన కట్టడాల పరిరక్షణకై కట్టుబడి ఉంటామని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం పదే పదే హామీలిచ్చినా, పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసినా... సంఫ్‌ు పరివార్ శక్తులు వాటిని లెక్క చేయకుండా ప్రతి చారిత్రక కట్టడానికి మతం రంగును పులుముతూ...ఇది తమ ఆత్మగౌరవ సమస్యగా చిత్రీకరించి ఒక మతం ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత భారత రాజ్యాంగానికి ప్రమాదం రోజు రోజుకు పెరుగుతూ ఉంది.
బీజేపీ మాతృకైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు ఏ రోజూ భారత రాజ్యాంగాన్ని తమదిగా భావించింది లేదు. రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం, లౌకికతత్వం అనే పదాలు పాశ్చాత్య దేశాల ప్రభావంతో చేర్చబడినవిగా ఆర్.ఎస్.ఎస్ భావిస్తోంది. భారత దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థ పనికి రాదనీ, కొందరు నిబద్ధులైన, దేశం పట్ల అంకిత భావం కలిగిన ధర్మకర్తలు ఈ దేశాన్ని పరిపాలించాలనీ వారి భావన. అందుకే గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ లాంటి శత సహస్ర కోటీశ్వరులకు దేశ ఆర్థిక వ్యవస్థను అప్పజెప్పడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయివేటీకరణ, ద్రవ్యీకరణ లాంటి అందమైన పదాలను జోడించి ప్రజా సంపదనంతా కట్టబెట్టడానికి, ప్రకృతి వనరులు యథేచ్ఛ గా కొల్లగొట్టడానికి అనుమతు లిస్తున్నారు. కార్పొరేట్లకు లొంగిపోయి వీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలు గమనించకుండా ఉండేందుకు మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య మతాల పేర్లతో వైషమ్యాలను సృష్టిస్తూ భౌతికంగా దాడులు చేసుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నారు. రాజ్యాధికారాన్ని ఉపయోగించుకుని ఆర్.ఎస్.ఎస్ ఎజెండాను అమలు జరిపే ఈ కార్యక్రమాన్ని మోడీ సర్కార్ వేగవంతం చేస్తోంది.
భారతదేశం బ్రిటిష్ పాలన కంటే ముందు ఒక దేశంగా లేదు. అనేక దేశాల సమూహంగా ఉన్నది. అనేక భాషల ప్రజలు, అనేక మత విశ్వాసాలతో ఉన్నవారంతా కలసి మెలసి ఒకే రాజ్యంలో సహజీవనం చేసే సత్ సాంప్రదాయం వందల సంవత్సరాలుగా భారత ప్రజల మధ్య ఉన్నది. హిందూ రాజుల వద్ద ఇతర మతాలకు చెందిన సైనిక అధికారులు, మంత్రులు, ముస్లిం రాజుల వద్ద హిందూ మతానికి చెందిన మంత్రులు, సైనిక అధికారులు ఉండేవారు. ఆధిపత్యం కోసం రాజ్య కాంక్షతో యుద్ధాలు తప్ప... ఆనాడు జరిగిన యుద్ధాలేవీ మత యుద్ధాలు కావు. బ్రిటిష్ ప్రభుత్వం జాతీయోద్యమంలో చీలిక తెచ్చి తమ పాలనను కొనసాగించడం కోసం 'విభజించి పాలించు' సూత్రంలో భాగంగా హిందూ, ముస్లిం మతాల పేరుతో ప్రజల్ని విభజించే కార్యక్రమం చేసింది. బాబ్రీ మసీదు వివాదం కూడా బ్రిటిష్ కుట్రలో భాగమే. దేశ విభజన జరిగిన సందర్భంలో జరిగిన మారణహోమానికి కూడా బ్రిటిష్ నాటిన మత విభజన విషబీజమే కారణం. అందుకే స్వాతంత్య్రానంతరం రాజ్యాంగాన్ని లిఖించడానికై ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ సమావేశంలో నాటి జాతీయోద్యమ నాయకులందరూ ప్రజల మధ్య ఐక్యత, దేశ సమగ్రత కాపాడుకోవడానికై అన్ని మతాలను సమ భావనతో చూసేలా, అన్ని విశ్వాసాలను సమానంగా గౌరవించేలా రాజ్యాంగం ఉండాలని భావించారు. అందుకే రాజ్యాంగ పీఠికలో ఈ విషయాన్ని ఇలా ప్రస్తావించారు. ''భారత పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, భావము, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన స్వాతంత్య్రం, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వ మును చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవం, జాతి ఐక్యతను, అఖండతను, సౌభాతృత్వమును, పెంపొందిం చుటకు, సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించడమైనది.''
రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఆయన అనుయాయులు ప్రారంభం నుండి మత విద్వేషాన్ని పెంచడానికి తమ పాలనను వినియోగిస్తున్నారు. గో రక్షణ పేరుతో ముస్లింలు, దళితుల పైన దేశవ్యాప్తంగా దాడులు జరిగాయి. అనేక మంది అమాయకులు గో మాంసాన్ని తిన్నారనో, అమ్మారనో ఆరోపణలకు గురై సామూహిక హత్యలకు బలయ్యారు. శాంతి భద్రతలు కాపాడాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలిచ్చినా, ఆ ఆదేశాలను పట్టించు కోనవసరంలేదని, గోరక్షకులు చేస్తున్న పవిత్ర కార్యక్రమాన్ని కొనసాగించమని ఆర్.ఎస్.ఎస్ అధినేత మోహన్ భగవత్ బహిరంగంగానే పిలుపునిచ్చారు. దీన్నిబట్టే భారత రాజ్యాంగంపై వీరికున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా లవ్ జిహాద్, ఘర్ వాపసీ లాంటి పిలుపులతో ముస్లీం మైనార్టీలపై విద్వేషాన్ని పెంచడం, దాడులు నిర్వహించడం చేస్తూనే ఉన్నారు. ముస్లిం పర్సనల్ లాను పూర్తిగా మార్చివేస్తామని హెచ్చరిస్తూనే ఉన్నారు. మత విద్వేషాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా పౌరసత్వ చట్టాన్ని సవరించి భారతదేశంలో ఉంటున్న ముస్లింలు మినహా ఇతర మతాల వారికి మాత్రమే పౌరసత్వాన్ని ఇస్తామని చట్టంచేయడం, దానికి పునాదిగా ఎన్.ఆర్.సీ, ఎన్.పీ.ఆర్‌లను ముందుకు తెచ్చి ముస్లింలను దేశం నుంచి పంపేస్తామని బెదిరించడం, హిజాబ్, హలాల్ పేర్లతో అల్లర్లు సృష్టించడం ఇవన్నీ ఆర్.ఎస్.ఎస్ ఎజెండాలో భాగమే. హిందీ - హిందూ - హిందూస్థాన్ అన్నది ఆర్.ఎస్.ఎస్ నినాదం. దేశంలో గుర్తింపు కలిగి కోట్లాది మంది ప్రజలు మాట్లాడే భాషలు 26కు పైగానే ఉన్నాయి. ఇవి కాక చిన్న చిన్న సమూహాల ప్రజానీకం మాట్లాడే భాషలు, గిరిజనులు మాట్లాడే భాషలు కలిపితే వందల భాషలు భారత ప్రజానీకం మాట్లాడుతున్నారు. కానీ హిందీ భాష తప్ప మిగతా భాషలన్నింటినీ ధ్వంసం చేయాలని ఆర్.ఎస్.ఎస్ ప్రయత్నం. అలాగే భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు, జైన, జొరాస్ట్రియన్ లాంటి మతాలకు చెందిన ప్రజలతో పాటు పై మతాలకు చెందకుండా ప్రకృతి శక్తులను ఆరాధిస్తూ, పూజిస్తూ ఉండే గిరిజన తెగలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ మతాలన్నింటినీ అణచివేసి హిందూ మతాధిక్యతను స్థాపించాలనేది ఆర్.ఎస్.ఎస్ లక్ష్యం. దేశ విభజన తరువాత పాకిస్థాన్ ఒక మత రాజ్యంగా ఏర్పడినందున తమకు కూడా హిందూస్థాన్ అనే హిందూ మత రాజ్యం స్థాపించాలని ఆర్.ఎస్.ఎస్ ప్రయత్నిస్తున్నది.
ఎప్పుడో మధ్యయుగాల్లో తప్ప ఆధునిక యుగంలో మత రాజ్యాలు మనుగడ సాగించలేవు. ఐరోపా దేశాల్లో, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో అత్యధికులు క్రైస్తవ మత విశ్వాసులే అయినా ఆ రాజ్యాలు మత రాజ్యాలుగా లేవు. వాటి రాజ్యాంగంలో సెక్యులర్ వ్యవస్థను నెలకొల్పుతామని రాసుకున్నారు. అమలు చేస్తున్నారు. అరబిక్ దేశాల్లో కొన్ని మత రాజ్యాలుగా చెప్పుకుంటున్నా వాటిలో కూడా క్రమేపీ మార్పులొస్తున్నాయి. పరమత సహనం ఒక విధానంగానే అమలు చేస్తున్నారు. ఆప్ఘనిస్తాన్ లాంటి మతోన్మాద ప్రభుత్వాలు గల దేశాలు ఏ అభివృద్ధికి నోచుకోక పతనం వైపు ప్రయాణం చేస్తున్నాయి. భారతదేశంలో మెజార్టీ మతానికి చెందిన ప్రజలతో పాటు ఇతర మతాల ప్రజలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒక మతం ఆధిపత్యంలో రాజ్య స్థాపన చేసి ఆ మత ధర్మాలను బలవంతంగా అమలు చేయాలని చూస్తే దేశ సమగ్రత ప్రమాదంలో పడుతుంది. దేశంలో ఉండే వందల భాషలను రూపుమాపి ఒక భాష ఆధిపత్యం తేవాలని ప్రయత్నిస్తే కోట్ల మంది ప్రజలు ఈ రాజ్యం యొక్క అస్థిత్వాన్నే ప్రశ్నిస్తారు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు జాతీయోద్యమ వారసత్వాన్ని కొనసాగించడానికి మన దేశం ఒక లౌకిక రాజ్యంగా ఉండాలని, సర్వమత సమానత్వాన్ని పాటించాలని, అన్ని భాషలను గుర్తించి గౌరవించాలని రాజ్యాంగంలో ఆ అంశాలను చేర్చారు. అయితే సంఫ్‌ుపరివార్ చేతిలో నేడు రాజ్యాంగం అపహాస్యానికి గురికాబడుతున్నది. ఇతర మతాల ప్రజలందరూ భయం భయంగా బతికే వాతావరణం కల్పించి ప్రజల మధ్య విభజన తేవాలని సంఫ్‌ు పరివార్ భావిస్తున్నది. బాబ్రీ మసీదు కూల్చివేత ఒక గాయమైతే, సంఫ్‌ు పరివార్ చేతిలో భారత రాజ్యాంగం మరెన్నో గాయాలకు గురికావాల్సిన పరిస్థితులు నేడు ఉన్నాయి. లౌకిక వాదులు, ప్రజాస్వామ్య ప్రియులు భారత దేశ సమగ్రతను, సమ భావాన్ని గౌరవించే వాళ్ళందరూ ఏకోన్ముఖంగా రాజ్యాంగ విలువల పరిరక్షణకు, లౌకిక వాదాన్ని కాపాడుకోవడానికి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైనది.
విస్మరిస్తే మరెన్నో ప్రార్థనా స్థలాలు నేలమట్టం కావడం, మరెన్నో భౌతిక దాడులు మైనార్టీ, దళిత, క్రైస్తవ సోదరులపై జరగడం, ఎందరో అమాయకులు హత్యాకాండకు గురికావడం చూడాల్సి వస్తుందని గమనించాలి.
- ఎం.ఎ.గపూర్