Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 14 అక్టోబర్ 1956న నాగపూర్‌లో లక్షల మంది అనుచరులతో హిందూ మతాన్ని వదిలి, బౌద్ధం స్వీకరించారు. నాగపూర్ నాగజాతి ప్రజలు జీవించిన భూమి గనక, వారంతా బౌద్ధులు గనక, తాను బౌద్ధం స్వీకరించడానికి నాగపూర్‌ను ఎంచుకున్నానని ప్రకటించారు. అంతేగాని, నాగపూర్‌లో అరెస్సెస్ వారి ప్రధాన కార్యాలయం ఉంది గనక, వారి ప్రాముఖ్యం తగ్గించడానికి తను ఆ పట్టణాన్ని ఎంచుకోలేదనీ వివరణ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత 52రోజులకే 6 డిసెంబర్ 1956న అంబేద్కర్ కన్నుమూశారు. ఆయన మరణం వెనుక ఓ కుట్ర ఉందని, ఆయన మరణించిన నాటి నుండి నేటి దాకా ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ నిజం కాదని అటు భారత ప్రభుత్వం గానీ, ఇటు ఆరోపించబడిన వర్గాలు గానీ ఆధారాలు - వివరణలు ప్రజల ముందు పెట్టలేదు. అందువల్ల అనుమానాలు అనుమానాల్లాగే ప్రజల మనసుల్లో సజీవంగా ఉన్నాయి.
ఆ రోజుల్లో జీవించి ఉన్న ఇ.వి.ఆర్. పెరియార్, తన వార్తా పత్రిక 'విడుతలై'లో ఇలా రాశారు... ''డాక్టర్ అంబేద్కర్ చనిపోయారని అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తోంది. గాంధీ మరణం వెనుక ఏ కారణం, ఏ కుట్ర ఉన్నాయో అలాంటివే అంబేద్కర్ చనిపోవడం వెనక ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను'' అంటూ చాలా వివరంగా రాశారు. మొత్తం మీద ఆయన వెలిబుచ్చిన ఆవేదనలోని సారాంశం ఏమిటంటే... గాంధీ మరణానికి కారకులెవరో, వారే అంబేద్కర్ మరణానికి కూడా కారకులని ఆయన నిర్ధారించారు. అందుకు అవకాశమిచ్చే పలు అంశాలు కూడా ఆరోజుల్లో చాలా బయటికి వచ్చాయి. ''తన తండ్రికి విషమిచ్చి తెలియకుండా చంపేశారని'' స్వయాన అంబేద్కర్ కుమారుడు యశ్వంత్ ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. అంబేద్కర్ అభిమానులంతా యశ్వంత్‌ను బలపరిచారు. అంబేద్కర్ మరణవార్త ఈ దేశ ప్రజలకు అనుమానాస్పదమైన వార్త అయ్యింది. 'తన తండ్రిది సహజమరణం కాదని, హత్య అని, దోషులెవరో తేల్చాలని' అంబేద్కర్ కుమారుడు యశ్వంత్ ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేశాడు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబేద్కర్ మరణం తర్వాత పదకొండవ రోజున ఆయన అనుయాయులు ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ప్రధానికి, రాష్ట్రపతికి నివేదికలు అందజేశారు. అంబేద్కర్ మరణం వెనక ఏం జరిగిందో తేల్చాలన్నది వారి డిమాండ్.
నాటి ప్రధాని నెహ్రూ స్పందించి 'సక్సేనా నిజ నిర్థారణ కమిటీ'ని నియమించారు. కమిటీ భారత ప్రభుత్వానికి అందజేసిన రిపోర్టు ఆనాటి నుండి ఈ నాటి వరకు ప్రజల ముందు పెట్టలేదు. ఒకవేళ రహస్యాలేవీ లేకపోతే, అది బయటపెడితే అన్ని అనుమానాలకూ తెరపడిపోయేది కదా? ఢిల్లీ పోలీస్ ఐజి ఇచ్చిన వివరణను మాత్రం 27 నవంబర్ 1957 నాడు... అంటే దాదాపు సంవత్సరం తర్వాత, అప్పటి గృహమంత్రి గోవింద్ వల్లభ్ పంత్‌తో పార్లమెంట్లో ప్రకటింపజేసారు. ''అంబేద్కర్ మరణం సహజమైనదని'' ఆ ప్రకటన సారాంశం! అదొక కంటి తుడుపు ప్రకటన అని దేశ ప్రజలు భావించారు. అసంతృప్తితో రగిలిపోయారు. నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వ్యాసాలు, పుస్తకాలు ప్రచురింపబడుతూనే ఉన్నాయి. తాజాగా 26 జనవరి 2021 నాడు నాగపూర్ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు అంబేద్కర్ ఎలా చనిపోయారో తేటతెల్లం చేయాలని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. 26వ జనవరినే ఎందుకు ఎంచుకున్నారంటే... ఆ తేదీన అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది గనుక!
అంబేద్కర్ మరణానికి ముందు ఆయన కార్యకలాపాలు ఎలా జరిగాయో చూద్దాం... 3 డిసెంబర్ 1956న అంబేద్కర్ రెండో భార్య సవితా కబీర్, ఆమె సోదరుడు బాలు కబీర్, తండ్రి కె.బి.కబీర్, ఫ్యామిలీ డాక్టర్ డా.మాల్వాంకర్లు అంబేద్కర్‌తో కలిసి గ్రూప్ ఫొటోలు దిగారు. తమ మధ్య భేదాభిప్రాయాలు లేవని, తమది సంతోషకరమైన కుటుంబమని ప్రపంచానికి చెప్పడానికే డాక్టర్ శ్రీమతి సవిత ఆ ఫొటోషూట్ ఏర్పాటు చేసిందని ఒక అభిప్రాయం ఉంది.
4 డిసెంబర్ 1956న రాజ్యసభ మెంబర్‌గా ఉన్న అంబేద్కర్ ఆరోజు రాజ్యసభకు వెళ్ళారు. పార్లమెంట్లో మిత్రులతో సరదాగా, చలాకీగా మాట్లాడారు. అదే రోజు సాయంత్రం శ్రీమతి సవిత బంధువులు తండ్రి, సోదరుడు అందరూ ముంబాయి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళే ముందు వారు ఆమెకు నిబ్బరంగా ఉండమనీ, ధైర్యంగా అనుకున్న పని చేయమని ప్రోత్సహించి వెళ్ళారు. దీనికి కేవలం రెండు రోజుల (డిసెంబర్ 6న) తర్వాత ఆయన మరణవార్త విని అందరూ ఆశ్చర్యపోయారు. ''ఇంత అకస్మాత్తుగా ఎలా చనిపోయారూ?'' అంటూ ఆవేదనకు గురై, విషయం జీర్ణించుకోలేకపోయారు.
5 డిసెంబర్ 1956న అంబేద్కర్ రెండో భార్య సవిత, ఫ్యామిలీ డాక్టర్ మాల్యాంకర్లు కలిసి కావల్సిన వస్తువులేవో తేవడానికి బయటికి వెళ్ళారు. వాళ్ళు సాయంత్రం దాకా తిరిగి రాలేదు. ఇంతసేపు ఎటు వెళ్ళారని అంబేద్కర్ టైపిస్టు రట్టూను విసుగ్గా అడిగారు. తనకు తెలియదన్నాడు రట్టూ. టైప్ చేయాల్సిన కొన్ని ఉత్తరాలు అంబేద్కర్ డిక్టేట్ చేశారు. సాయంత్రం 8 గంటలకి జైనుల బృందం ఒకటి ఆయనను కలవడానికి వచ్చింది. ఆ మరునాడు డిసెంబర్ 6న ఒక కార్యక్రమానికి రావల్సిందిగా ఆహ్వానించింది. అంబేద్కర్ వస్తానని ఒప్పుకున్నారు కూడా! ఆ బృందం వెళుతూ వెళుతూ ఆయనకి ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చి వెళ్ళింది. అది బుద్ధుడిపై రాసిన పుస్తకం. జైనుల బృందంతో మాట్లాడుతున్నప్పుడే ఫ్యామిలీ డాక్టర్ వచ్చి జనరల్ చెకప్ చేసి, తను ముంబాయి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికి అంబేద్కర్ రచన ''బుద్ధ అండ్ హిజ్ ద్దమ్మ'' కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి కొన్ని విషయాలు టైపిస్ట్ రట్టూతో టైప్ చేయించారు. టైపిస్ట్ వెళ్ళిపోయిన కొంత సేపవటికి అంబేద్కర్ రాత్రి భోజనం ముగించుకుని పడక గదిలోకి వెళ్ళిపోయారు. అంతే!!
ఆ మరునాడే అనూహ్యంగా ఆయన మరణవార్త బయటి కొచ్చింది. సజావుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న వ్యక్తి, ఆరోగ్యం ప్రమాదకరంగా లేని వ్యక్తి ఎలా మరణించారన్న అనుమానం దేశ ప్రజలకు కలిగింది. విషప్రయోగం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎవరు విష ప్రయోగం చేశారూ అన్నది అధికారికంగా బయటికి రాలేదు. మామూలుగా అయితే సరుకులు తీసుకురావడానికి శ్రీమతి సవితకు ఫ్యామిలీ డాక్టర్‌ను తీసుకుని వెళ్ళాల్సిన పనిలేదు. తీసుకు వెళ్ళారంటే అతని సహాయంతో కొనవల్సిన వస్తువేదో ఉండి ఉంటుంది. పైగా ఆ ఫ్యామిలీ డాక్టరు ఉన్న ఫళంగా ఊరు విడిచి వెళ్ళాల్సిన అవసరమేమొచ్చింది? వెళితే సవిత కుటుంబ సభ్యులతో పాటే ముంబాయి వెళ్ళిపోవాల్సింది. ఒక రోజు ఆగి ఆయన నిర్వహించిన పాత్ర ఏమిటీ? అంబేద్కర్ రెండో భార్య సవితది బ్రాహ్మణ కుటుంబం. ఫ్యామిలీ డాక్టరు బ్రాహ్మణుడు. ఆనాటి ప్రముఖ రాజకీయ నాయకులంతా బ్రాహ్మణలు. అందరూ కలిసి ఓ బ్రాహ్మణాధిపత్య సంస్థకు సహకరించారా? అంబేద్కర్ ఎదుగుదలని జీర్ణించుకోలేకపోయారా? ఇలా దేశ ప్రజల్లో వ్యక్తమైన సందేహాలు అనేకం.
వీటికి నేపథ్యంగా కొన్ని విషయాల్ని గమనించాల్సి ఉంటుంది. 1. బౌద్ధం స్వీకరించిన లక్షలాది మందిని ఉద్దేశించి అంబేద్కర్ 15 అక్టోబర్ 1956న నాగపూర్‌లో రెండు గంటలపాటు ఉపన్యసించడం. 2. బుద్ధుడు - కార్ల్‌మార్క్స్ శీర్షికన 4వ బుద్దిస్ట్ కాన్ఫరెన్స్ - 20 నవంబర్ 1956న అంబేద్కర్ నేపాల్‌లో ఉపన్యసించడం. 3. ప్రాచీన భారతంలో హిందూమతంలోని లొసుగులు-శీర్షికన అంబేద్కర్ గ్రంథ రచనకు పూనుకోవడం. 4. బౌద్ధంలోకి భారతదేశ ప్రజల్ని అధిక సంఖ్యలో మార్చాలని తలపెట్టడం - వీటన్నిటి కారణంగా హిందూత్వవాదులు అంబేద్కర్‌పై ద్వేషం పెంచుకున్నారా? వారి ఆలోచనా ధోరణికి అంబేద్కర్ చాలా ప్రమాదకారి కాబోతున్నాడని గ్రహించి అడ్డుతొలగించుకున్నారా - బహుశా! ఒకవైపు రాజకీయంగా... మరొక వైపు ఆధ్యాత్మికంగా దేశంలో తిరుగులేని నాయకుడైన అంబేద్కర్‌తో తమకు ఎప్పటికైనా ప్రమాదమే.. అని అనుకున్నారా! ఇవన్నీ ఆనాటి జన సందేహాలు.
అంబేద్కర్ ఇంకొంత కాలం బతికి ఉంటే దేశంలో బౌద్ధం వ్యాపించేది. మనువాదుల కుట్రలు బట్టబయలయ్యేవి. వీరు కల్పించిన హిందూ దేవీ దేవతల మాయలు మంత్రాలు నిర్వీర్యమై పోయేవి. అభ్యుదయం కొత్తపుంతలు తొక్కేది. కనీసం మత సామరస్యం కొనసాగేది. మతకలహాల పేరిట అఘాయిత్యాలు, మారణకాండలు ఆగేవి. ఎటు నుండి ఏ రకంగా చూసినా అంబేద్కర్ మరణం ఎవరికి లాభిస్తుంది? కేవలం మనువాదులకే - వారిచే నడపబడే అనేక సంస్థలకే. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్న వారి కోరిక స్వాతంత్య్రం రాకముందు నుండే ఉంది. దేశ విభజన జరిగినప్పుడు అటు ముస్లింల రాజ్యం పాకిస్థాన్ ఏర్పడింది గనుక, ఇటు హిందూ రాజ్యం ఏర్పడాలనే కదా వారు కోరుకున్నది? నెహ్రూ తొలి ప్రధాని అయ్యారు కాబట్టి, సోషలిజానికి, వైజ్ఞానిక ప్రగతికి ఆయన ప్రాముఖ్య మిస్తూ వచ్చారు కాబట్టి - వీరి ఆటలు సాగలేదు. అయినా ఆశ వదులుకోకుండా వారు వారి లక్ష్యసాధనకు నిరంతరం కృషి చేస్తూనే వస్తున్నారు. దాని ఫలితాలను నేడు కూడా మనం చూస్తూనే ఉన్నాం..!
డాక్టర్ అంబేద్కర్‌ది సహజ మరణమా లేక హత్యా? అనేది ఆ రోజుల్లో బయటికి రాలేదు. 66ఏండ్ల తర్వాత, ఆధారాలన్నీ చెదిరిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో బయటికి వస్తుందన్న నమ్మకం లేదు కానీ, గతంలో జరిగిన కొన్ని వాస్తవాలు ఈ తరానికి పరిచయం కావడం అవసరం! అయితే బాబా సాహెబ్ అర్థంతరంగా వదిలేసిన కర్తవ్యాలను రాజ్యాంగ బద్ధమైన హక్కుల సాధనని ఈ తరం యువతీ యువకులు ముందుకు తీసుకుపోవాల్సి ఉంది. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూ ఉండాల్సిందే.
(Ref: 1st Jan 1818 REVOLT OF INDEPENDENCE: By VILAS KHARAT - BAMCEF 2003 Rediff.com, India News / 2016 hindi.one India.com / 2017 BAMCEF 2019 bameef 2014 jaibheem. Blogspot. com/Ambedkar’s Last days. Allisweby.com, Ambedkar www.columbia. edu/222.mea.gov.in)
(నేడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 66వ వర్థంతి)
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు