Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ముఖ్యంగా యూరప్‌లోని సంపన్న పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాలు ఆనాడు సోవియట్ యూనియన్‌లో అమలు జరుగుతున్న సంక్షేమ విధానాలను తామూ అనుసరించడం మొదలుబెట్టాయి. నిజానికి అటువంటి విధానాలకు పెట్టుబడిదారీ విధానం పూర్తిగా వ్యతిరేకం. అయినా వాటిని అవి ఆమోదించక తప్పలేదు. కారణం ఆ దేశాలు యుద్ధం కారణంగా బలహీనపడివున్నాయి. పైగా కార్మికవర్గ ఆగ్రహం పెల్లుబుకుతోంది. అంతేగాక తూర్పు యూరప్ వైపు నుండి సోషలిజం ప్రభావం విస్తరిస్తోంది. ఇన్ని విధాలుగా ప్రమాదంలో పడిన తన ఉనికిని కాపాడుకోడానికి ఆ సంపన్న పెట్టుబడిదారీ దేశాలు సంక్షేమ విధానాలను అనుసరించవలసి వచ్చింది. ఒకసారి పరిస్థితి మళ్ళీ పుంజుకున్న తర్వాత సంక్షేమ విధానాల పట్ల వాటికున్న వ్యతిరేకత మళ్ళీ బాహాటంగా బైటపడింది. ఆ సంక్షేమ చర్యలనన్నింటినీ రద్దు చేయడానికి ప్రయత్నించినా, కార్మికుల ప్రతిఘటన కారణంగా ఆ విషయంలో పెట్టుబడిదారీ వర్గం ఆశించిన మేరకు సంక్షేమ చర్యలను రద్దు చేయలేకపోయింది. మార్గరెట్ థాచర్ వంటి నాయకురాలు సైతం ఎంత ప్రయత్నించినా, బ్రిటన్‌లోని జాతీయ ఆరోగ్య సేవల వ్యవస్థను రద్దు చేయలేకపోయింది. నిజానికి తాను ఏ చర్యలనైతే రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నదో, సరిగ్గా ఆ చర్యల కారణంగానే పెట్టుబడిదారీ వ్యవస్థ తన అసలైన, కొల్లగొట్టే స్వభావాన్ని కప్పిపుచ్చి, ప్రజల సంక్షేమం గురించి పాటుపడే వ్యవస్థగా తన ఉనికిని సమర్ధించుకోగలిగింది. అదే విచిత్రం.
ఒకసారి సంక్షేమ విధానాలను అమలు చేయడం మొదలుపెట్టాక, వాటిని అమలు చేయడం కోసం అంతకు ముందరి కాలంలో కన్నా, ఎక్కువ శాతం పన్నులు విధించాల్సి వచ్చింది. యూరప్‌లోని దేశాలు విధించే పన్నులు ఆ దేశాల జీడీపీలతో పోల్చి చూసినప్పుడు తక్కిన ప్రపంచంలోని దేశాలకన్నా అధికంగా ఉన్నాయి. ఒక్క క్యూబాలో మాత్రమే అంతకన్నా అధికంగా పన్నులు ఉన్నాయి. ఆ దేశంలో అమలు జరిగే సంక్షేమ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయి.
కమ్యూనిస్టు దేశాలు సంక్షేమం కోసం అధిక పన్నులు వసూలు చేయడం ఎవరికీ ఆశ్యర్యం కలిగించదు. కాని ఇప్పటికీ పశ్చిమ యూరప్ దేశాలు అధిక శాతం పన్ను వసూలు చేయడం చెప్పుకోదగ్గ విషయం. పన్ను-జీడీపీ నిష్పత్తి రీత్యా అందరికన్నా అధికంగా 46.2శాతంతో ఫ్రాన్స్ ముందున్నది. డెన్మార్క్ (46.0), బెల్జియం (44.6), స్వీడెన్ (44.0), ఫిన్లాండ్ (43.3), ఇటలీ (42.4), ఆస్ట్రియా (41.8) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రాజ్యంలో సంక్షేమం నడవాలంటే భారీగా పన్నులు విధించక తప్పదు. అంటే మార్కెట్ ద్వారా జరిగే ఆదాయ పంపిణీ క్రమంలో ప్రభుత్వం బలంగా జోక్యం చేసుకోవలసిందే.
ఈ రోజు ప్రపంచంలో జీడీపీ రేటు వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల సరసన ఈ యూరప్ దేశాలు ఏవీ లేవు. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ వేగంగా పెరుగుతూ వచ్చిన ఆ ''పెట్టుబడిదారీ స్వర్ణయుగం'' కాలంలో సైతం ఈ యూరప్ దేశాల జీడీపీ అంత గొప్పగా వృద్ధి చెందినదేమీ లేదు. పైగా 2008లో హౌసింగ్ బబుల్ పేలిపోయిన తర్వాత ఈ దేశాల జీడీపీ మరీ కనిష్ట స్థాయికి పడిపోయింది. అయినప్పటికీ, పన్ను-జీడీపీ నిష్పత్తి తక్కిన దేశాల కన్నా అధికంగా కొనసాగుతోంది.
మనం చాలా వేగంగా వృద్ధి చెందుతున్న దేశం అని అధికారులు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. కాని ఇక్కడ ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ చర్యలు చాలా హీన స్థాయిలోనే కొనసాగుతున్నాయి. నిజానికి మన దేశానికి సంబంధించి పన్ను-జీడీపీ నిష్పత్తి కేవలం 18.08మాత్రమే. అంటే సంక్షేమం అమలు చేసే దేశాలలో చాలా దిగువన మనం ఉన్నాం.
పై వివరాలన్నీ పరిశీలిస్తే మూడు సంగతులు స్పష్టం అవుతున్నాయి. మొదటిది: జీడీపీ వృద్ధి రేటు బాగా ఎక్కువగా ఉంటే దాని కారణంగా పోగుబడే సంపద దిగువకు ప్రవహిస్తుంది అన్న సిద్ధాంతం పూర్తిగా డొల్ల అని తేలిపోయింది. ఏ విధమైన నియంత్రణా లేకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగితే దాని వలన అత్యధిక ప్రజానీకపు సంక్షేమం ఏ విధంగానూ మెరుగుపడదు. పెట్టుబడిదారీ వ్యవస్థ తన మనుగడ కొసాగించాలంటే అందుకు కార్మికుల రిజర్వు సైన్యం - అంటే నిరుద్యోగులు- ఉండడం తప్పనిసరి. నిరుద్యోగం ఉంటేనే కార్మికుల జీతాలను తక్కువ స్థాయిలో ఉంచవచ్చు. వేతనాలు ఎంత తక్కువ స్థాయిలో ఉంటే పెట్టుబడిదారులకు దక్కే అదనపు విలువ అంత ఎక్కువగా ఉంటుంది. శ్రామికవర్గ ఉత్పాదకత ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ వాటా పెట్టుబడిదారులకూ, వారి తాబేదారులకూ అందుతుంది. ఆ ఉత్పాదకతకు కారణమైన కార్మికవర్గానికి దక్కే వాటా మాత్రం తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా కార్మికవర్గం బలంగా పోరాడి మెరుగైన వేతనాలను సాధించుకుంటే అక్కడ ప్రభుత్వాలు ఆ వేతనాలను చెల్లించడానికి తాము విధించే పన్నుల శాతాన్ని పెంచడం అనివార్యం అవుతుంది. అంటే ఎక్కడైనా కార్మికవర్గం పోరాడి మెరుగైన వేతనాలను సాధించుకోవలసిందే తప్ప జీడీపీ వృద్ధి బాగా ఉండినందువలన వారి వేతనాలు వాటంతట అవే పెరగడం అనేది ఎక్కడా జరగదు.
పన్ను-జీడీపీ నిష్పత్తి బాగా తక్కువగా ఉన్నప్పటికీ, ఆ దేశంలో జీడీపీ వృద్ధి రేటు గనుక బాగా ఎక్కువగా ఉంటే అప్పుడు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయని, వాటితో సంక్షేమ చర్యలు చేపట్టవచ్చునని కొందరు నమ్ముతారు. ఇది పూర్తిగా పొరపాటు. ఒక దేశం సంక్షేమ రాజ్యంగా మారడం అనేది గుట్టుచప్పుడు కాకుండా జరిగేదీ కాదు, ఎవరో కొందరి దయా గుణాల ప్రదర్శన ఫలితమూ కాదు. అది ఒక విధాన మార్పు ఫలితంగా మాత్రమే సాధ్యం. సంక్షేమానికి అవసరమైన మేరకు పన్నులను పెంచే వైఖరి అందులో ఒక భాగమే.
ఇక రెండవ సంగతి: జీడీపీ వృద్ధి దానంతట అదే సంక్షేమ చర్యల వైపు దారి తీయదు సరికదా, జీడీపీ వృద్ధి రేటు పట్ల ఆరాధనా భావం కలిగివుండడం వలన అది సంక్షేమ రాజ్యంగా మారడానికి ఆటంకంగా ఉంటుంది. పెట్టుబడిదారులకు ఆర్థిక వనరులను ఎక్కువగా అందిస్తే వాళ్ళు భారీగా పెట్టుబడులు పెడతారని, అప్పుడు ఆర్థికవృద్ధి మరింత ఎక్కువగా జరుగుతుందని ఈ ఆరాధకులు ప్రచారం చేస్తారు. పెట్టుబడిదారులకు ఇచ్చేబదులు సంక్షేమ చర్యలకు ఖర్చు చేయడం వలన ఆర్థికవృద్ధి కుంటుబడుతుందని వారు అంటారు. కేవలం ప్రచారం కోసం పాటుపడేవారు సంక్షేమ చర్యలకు పూనుకుంటారని, ''ఉచితాలు'' ప్రజలకు పంచిపెడతారని, ఆ విధంగా చేయడం ఆర్థిక వనరులను వృధా చేయడమే అవుతుందని, కొందరి తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్థిక వృద్ధిని బలి చేయడమేనని వారు విమర్శిస్తూంటారు. జీడీపీ వృద్ధి పట్ల ఈ విధంగా ఆరాధనాభావం ప్రదర్శించేవారు పన్ను-జీడీపీ నిష్పత్తిని బాగా తక్కువగా ఉంచాలని, అలా గనుక చేయలేకపోతే, అది పెట్టుబడిదారుల ''చొరవ''ను దెబ్బ తీస్తుందని, అప్పుడు వారు పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడతారని, దాని ఫలితంగా జిజీడీపీ వృద్ధి దెబ్బ తింటుందని వారు వాదిస్తారు.
ఈ తరహా వాదన పూర్తిగా తప్పు. తమ వద్ద ఎక్కువగా ఆర్థిక వనరులు ఉన్నంతమాత్రాన పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి సిద్ధం కారు. మార్కెట్ ఏ మేరకు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న అంచనాపై ఆధారపడి వారు పెట్టుబడులు పెట్టడానికి పూనుకుంటారు. కాని మన గుడ్డి ''ఆరాధకులు'' దీనిని వేరేగా ప్రచారం చేస్తారు.
''ఉచితాల''కు ఎక్కువగా ఖర్చు చేస్తే దాని వలన పెట్టుబడిదారులు అక్కడి నుండి తరలిపోతారని వారు వాదిస్తారు. కాని ప్రపంచవ్యాప్తంగా సంక్షేమ విధానాలను అమలు చేసే దేశాల అనుభవాలను పరిశీలిస్తే పన్ను-జీడీపీ నిష్పత్తిని గణనీయంగా పెంచి పెట్టుబడిదారుల నుండి అదనంగా పన్నులను వసూలు చేసినప్పుడే సంక్షేమం సాధ్యపడింది. అందుచేత సంక్షేమ విధానాలను అమలు చేయడాన్ని సమర్ధించేవారు పెట్టుబడిదారుల మీద అధికంగా పన్నులు విధించి వసూలు చేయాలన్న విధానాన్ని కూడా సమర్ధ్థిచాల్సిందే.
ఇక మూడవ అంశం: నయా ఉదారవాదం అంటేనే ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుగుణంగా, వారి కొల్లగొట్టే విధానాలకు అనుగుణంగా వ్యవహరించడం. కాని ఆ విధానాలను ''వృద్ధి'' అనే నాటకం ద్వారా అమలు చేస్తారు. అందుకే ప్రభుత్వ బడ్జెట్ నుండి నేరుగా పెట్టుబడిదారులకు వనరులను బదలాయిస్తారు. ''ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం'' అనే పేరుతో అటువంటి బదిలీలను సమర్థించుకుంటారు. ఆర్థిక మాంద్యం నెలకొని పరిశ్రమలు మూతపడడం పెరుగుతున్నకొద్దీ ఈ విధంగా ఆర్థిక వనరులను పెట్టుబడిదారులకు బదలాయించడం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అందువలన సంక్షేమ చర్యలను అమలు చేయడానికి అవసరమైన వనరులు రాను రాను తగ్గిపోతూవుంటాయి. అందువల్లనే విద్య, వైద్యం తదితర ముఖ్యమైన సేవలన్నీ ప్రయివేటీకరించడం జరుగుతుంది. దాని ఫలితంగా శ్రామిక ప్రజలకు ఆ సేవలు మరింతగా అందుబాటులోకి రాకుండా పోతాయి. మాంద్యం నెలకొని ఉన్నందున పెట్టుబడిదారులకు బదలాయించిన సొమ్ము వారివద్దే ఉండిపోతుంది తప్ప మార్కెట్లోకి పెట్టుబడి రూపంలో తిరిగి రాదు. ఇటు సంక్షేమం కోసం చేసే ఖర్చు తగ్గిపోయింది గనుక ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అంటే స్థూల డిమాండ్ తగ్గిపోతుంది. దాని ఫలితంగా జీడీపీ వృద్ధి రేటు మరింత తగ్గిపోతుంది. ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం కోసమే పెట్టుబడిదారులకు సంపద అదనంగా అప్పగించామని చెప్పినా, చివరికి జరిగింది మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే, తగ్గిపోయిన వృద్ధిరేటును సాకుగా చూపించి పాలకులు మరింతగా పెట్టుబడిదారులకు ఆర్థిక వనరులను మళ్ళీ బదలాయించడానికి పూనుకుంటారు. ఆ విధంగా మనం అంతకంతకూ సంక్షేమ విధానాలకు మరింత దూరంగా జరుగుతూ పోతాం.
ప్రస్తుతం భారతదేశంలో పాలకులు అనుసరిస్తున్న తర్కం ఇదే. ఈ విధానం వలన ప్రభుత్వం వద్ద ఉండే ఆర్థిక వనరులు ఎంత తగ్గిపోతున్నాయంటే చివరికి గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉపయోగపడుతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని సైతం నిలిపివేయాలనే యోచన చేస్తున్నది ప్రభుత్వం.
జీడీపీ వృద్ధి రేటు పట్ల అమిత వ్యామోహంతో పన్ను-జీడీపీ నిష్పత్తిని తక్కువ మోతాదులో కొనసాగిస్తే చివరికి ఆర్థిక వృద్ధీ సాధ్యం కాదు, ప్రజల సంక్షేమమూ దెబ్బ తింటుంది. సంక్షేమ విధానాలు అమలు జరగాలంటే పెట్టుబడిదారుల నుండి అధిక పన్నులు వసూలు చేయాల్సిందే. ప్రపంచవ్యాప్త అనుభవం ఇదే.
(స్వేచ్ఛానువాదం)
- ప్రభాత్ పట్నాయక్