Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్వాసితులు, ముంపు రైతుల కన్నీళ్ళ దృశ్యం తప్ప ''కాళేశ్వర జల దృశ్యం'' మెల్లగా మసకబారుతున్నది. మిడ్ మానేరు మొదలు మల్లన్న సాగర్ వరకూ నిర్వాసితులైన వారిలో కనీసం పది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వేలాది కుటుంబాలు చిన్నాభిన్న మయ్యాయి. ఇంకా అవుతున్నాయి. ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే వారికంటే నష్టపోయే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ జాబితాలో కొత్తగా తెలంగాణలో అదనపు ముంపు బాధిత రైతులూ, మహారాష్ట్రలో భూములు కోల్పోయీ పరిహారం అందని సిరొంచా తాలుకా రైతులూ చేరారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ రిజర్వాయర్ల నిర్మాణం కోసం పరిసర మండలాల రైతులు వేలాది ఎకరాల వ్యవసాయ భూములు కోల్పోయారు. బ్యారేజీల నిర్మాణం పూర్తవటంతో కాళేశ్వరం నీళ్లు పైకి లిఫ్టు చేసినా, చేయకపోయినా గేట్లు మూసి ఉంచితే పై నుండి వచ్చే ప్రవాహంతో ఏ కాలంలోనైనా ఈ మూడు రిజర్వాయర్లు నిండి ఉంటాయి. వర్షాకాలంలో రెండు, మూడు రోజుల పాటు అకస్మాత్తుగా వచ్చి చేరే వరద నీరు గేట్లు మొత్తం ఎత్తి ఉంచినా బ్యారేజి పిల్లర్లు వరద ప్రవాహానికి అడ్డు ఉండటంతో వరద నీరు ఒక్కసారిగా పైకి పెరుగుతోంది. అసాధారణ వర్షాలకే కాక, సాదారణ వర్షాలతోనూ గోదావరి పైకీ, పక్కలకూ వ్యాపిస్తోంది. ఇలా గోదావరి ప్రవాహమే విస్తరిస్తూ పరిసరాల్లోని వ్యవసాయ భూములపైకి చేరి పంట భూములను ముంచుతున్నది. ఈ ముంపు సమస్య బ్యారేజీ నిర్మాణానికి ముందు ప్రభుత్వ అంచనా ప్రకారం సేకరించిన భూ పరిధి దాటి కరకట్టలకు అవతల, కరకట్టలకు మీదా విస్తరిస్తున్నది. ప్రభుత్వం సేకరించని, రైతులు పంటలు పండించుకునే వేలాది ఎకరాల వ్యవసాయ భూమి ఇలా ప్రతీ ఏడూ ప్రహావ వ్యాప్తిలో మునుగుతున్నది. వరద తగ్గిన కొన్ని రోజులకు మునిగిన పంటను తొలగించి మళ్ళీ పంట వేస్తే రెండోసారీ మునుగుతోంది. ఇలా ఏటా పంటలు మునిగిపోతున్న భూములు తెలంగాణలో ప్రధానంగా భూపాల్ పల్లి జిల్లా మహదేవ్ పూర్, కాటారం మండలాల్లోనూ, మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి మండలాల్లోనూ ఉన్నాయి. మహదేవ్ పూర్ మండలంలో పదిహేను గ్రామాలూ, కాటారం మండలంలో ఎనిమిది గ్రామాలూ, చెన్నూరు మండలంలో పది గ్రామాలూ, కోటపల్లి మండలంలో ఏడు గ్రామాలూ ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో వంద నుండి ఎనిమిది వందల ఎకరాల చొప్పున పంట భూములు వరదకు బలి అవుతున్నాయి. దామెరకుంట గ్రామశివారులో రెండువేలా నాలుగు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో మూడువందల డెబ్బై ఎకరాలను ప్రోజెక్టు కోసం ప్రభుత్వం తీసుకున్నది. మిగిలిన భూమి ప్రతీ వరదలో ముంపునకు గురవుతున్నది. అన్నారం గ్రామ శివారులో ఎనిమిది వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది. అందులో మూడు వందల ఎకరాలు ప్రభుత్వం తీసుకోగా మిగిలిన అయిదు వందల ఎకరాలదీ అదే పరిస్థితి. ఆ అయిదు వందల ఎకరాల్లో తొంబైశాతం పత్తే పండిస్తామంటున్నారు. చుట్టూ అన్ని నీళ్ళున్నప్పుడు ఎవరైనా వరి పండిస్తారు కదా అంటే గోదావరి వరద వచ్చినప్పుడు మునగటమే గానీ, మాకు ప్రాజెక్టు కాలువ నీళ్ళిచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేయలేదని భాదపడ్డారు. స్థానిక పంటలకు నీళ్ళివ్వని ఈ రిజర్వాయర్లు స్థానికంగా వేలాది ఎకరాల పంట భూములను మాత్రం ధ్వంసం చేస్తున్నాయి. గత నాలుగేండ్లుగా వరుస ముంపులతో ఒక్కొక్క రైతు ఏటా లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. కొన్ని ఊర్ల చుట్టూ నీళ్ళు చేరి కొద్ది రోజుల దాకా బయట ప్రపంచంతో సంబందాలే తెగిపోతున్నాయి. కరెంటు వ్యవస్థ ధ్వంసం అవుతున్నది. చండ్రుపల్లి గ్రామంలో అయితే వారాల తరబడి గ్రామం చీకటిమయం అవటంతో పాటు, తాగటానికి జీపీ నీళ్ళు రాక, తెచ్చుకోవటానికి దారీ లేక ప్రజలు పళ్ళాలల్లో వర్షం నీళ్లను పట్టుకుని తాగారు. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. వరుసగా పంటలు మునుగు తుండటంతో రైతులు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. పాలకులకు వారి బాధలు వినాలనే ధ్యాసలేదు. అధికార యంత్రాంగం ఉండీ ప్రయోజనం లేదు. విసుగెత్తిపోతున్న కొన్ని గ్రామాల రైతులు ఏటా తప్పనిసరిగా మునుగు తున్న తమ భూములను ప్రభుత్వమే కోనుగోలు చేసి, తమకు 'ఆర్ అండ్ ఆర్' ఇచ్చయినా ఈ గ్రామాలనుంచి వెళ్లగొట్టుమని అడుగుతున్నారు. పాక్షికంగా మునిగే శివారు గల గ్రామాల రైతులు మునిగే పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు నలభై వేల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల్లో మునిగే పంటలకు సైతం నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వ మే నిర్మించిన ప్రాజెక్టుతో మునిగే పంట లకు పరిహారం ఇవ్వకపోవటం బాధ్యత గల వైఖరికాదు.
ఇక మహరాష్ట్రలోని సిరోంచా తాలుకా రైతులది మరో విషాద గాథ. ప్రాజెక్టు ప్రారంభంలో మహరాష్ట్ర వైపు ముంపును అంచానా వేస్తూ 373 హెక్టార్ల (921 ఎకరాల) భూమి ప్రాజెక్టులో పోతుందని అందరికీ పరిహారం ఇస్తామన్నారు. ప్రాజెక్టు సివిల్ వర్క్స్ జరగటానికి కావాల్సిన 580ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్వాదీనం చేసుకోవటానికి రైతులకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన రేటుకు మూడున్నర రెట్లు ఎక్కువ (ఎకరాకు పదిన్నర లక్షల రూపాయల చొప్పున) ఇచ్చి స్వాధీనం చేసుకున్నది. అలా కట్ట, ఇతర నిర్మాణాలకవసరమైన భూమిని మాత్రం కొని పని పూర్తి చేశారు. మిగతా 341 ఎకరాల భూమి మేడిగడ్డ కట్ట పూర్తయితే ఏర్పడే రిజర్వాయర్లో మునిగే భూమి. ఆ భూమిని రైతుల నుండి కోనుగోలు చేయకుండా మామూలుగా నీళ్ళు నింపేశారు. రైతులు గగ్గోలు పెడితే చట్ట ప్రకారం ఆ భూమికి ఎకరా మూడున్నర లక్షల కంటే ఎక్కువ రాదు కాబట్టి ఆ మొత్తాన్ని మీ మహరాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు పంపేశాం అన్నారు. దీనికి సిరొంచ రైతులు ఖంగు తిన్నారు. మాలోనే తోటి రైతులకు ఒక న్యాయం, మాకొక న్యాయమా అని అమాయకంగా అడిగే మహరాష్ట్ర రైతులకు సమాధానం చెప్పే మానవుడే లేడు. ఇంతకాలం అనేక అర్జీల అనుభవం పూర్తిచేసుకున్న రైతులు నవంబరు ఏడు నుండి సిరోంచ తహశీల్దార్ ఆఫీస్ ముందు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నో ఆరోపణలున్నాయి. ఇప్పుడు కొత్తగా, నీటిని ఎత్తి పోయాల్సిన వేల కోట్ల రూపాయల పంపు హౌజ్లే వరదనీటిలో మునిగి, పనికి రాకుండాపోయాయి. ఇది అధనపు భారం. ఇలా ఎన్ని సార్లు జరుగుతుందో తెలియదు. భవిష్యత్తు లో ప్రాజెక్టును నడపటం కంటే ఆపేయటమే మేలనుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యంలేదు. ఇటువంటి సంక్లిష్టమైన, రిస్కీ ప్రాజెక్టు ప్రతిపాదనా, నిర్మాణం, నిర్వహణా అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామికంగా ఉండాలి. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడటమే కాక తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలూ నవ్వుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రాజెక్టు స్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి. తెలంగాణ సమాజం ప్రాజెక్టు భవిష్యత్తును మొత్తంగా పునఃసమీక్షించి, వ్యవస్థను గాడిలోకి తీసుకురావాలి.
- డాక్టర్ ఎస్. తిరుపతయ్య