Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం అసంబద్దమనీ, ఆ మహాకవి ఆశయాలకు విరుద్ధమనీ అభ్యుదయ వాదులు ఘోషించారు. ఆధ్యాత్మిక వాదులూ కొంతమంది అన్నారు. అభ్యుదయ ముద్రగల కొందరు అటూ ఇటూ ఝంఝాట పడ్డారు పాపం. అయినా చాగంటివారు నిరభ్యంతరంగా తీసేసుకున్నారు. ఇదే సమయంలో దేశంలో మరో చోట గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది. సంఫ్‌ుపరివార్ భావజాలాన్ని కూరి మరీ నిర్మించి, కాసులు పోసుకున్న కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని అక్కడ పోటీ విభాగంలో మరో పద్నాలుగు చిత్రాలతో పాటు ప్రదర్శించారు. సదరు పోటీకి న్యాయనిర్ణేతల బృందం అధ్యక్షుడుగా వ్యవహరించిన ఇజ్రాయిల్ దర్శకుడు నడవ్ లాపిడ్... ప్రదర్శించిన చిత్రాలలో కాశ్మీర్ ఫైల్స్ ఒక్కటే ప్రచార ప్రధానమైన చవకబారు చిత్రంగా ఉందని ముగింపు ప్రసంగంలో కుండబద్దలు కొట్టారు. సృజనాత్మకతకు వేదిక కావాల్సిన ఈ గొప్ప ఉత్సవంలో ఇలాంటి రాజకీయ ప్రచార చిత్రాన్ని చూసి తామంతా దిగ్భ్రాంతి చెందామని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఇలా అన్నందుకు ఆయనపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ రెండు ఉదంతాలలో ఉమ్మడి అంశంగా పురస్కారాలు తిరస్కారాలు. వాటి పట్ల ద్వంద్వ ప్రమాణాలు దేశంలో నడుస్తున్న తలకిందులు రాజకీయ తర్కాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
గురజాడ పురస్కారం విషయానికి వస్తే చాగంటికి ఆ పురస్కార ప్రదానానికి కారణమైన గురజాడ నామకృత కమిటీ గాక సమర్థించిన ప్రముఖులు ఇద్దరే. ఒకరు సోము వీర్రాజు, మరొకరు జీవిఎల్ నరసింహారావు. తనకు గురజాడ పట్ల గొప్ప గౌరవం, భక్తి అని చెప్పిన చాగంటి వారు కూడా ఆయన భావాలపై, ఆశయాలపై అపారమైన నమ్మకం అనలేదు. తన ప్రవచనాలు చేయడం తప్ప ఇతర విషయాలు స్పృశించనని భావించేవారి కోసం వినదగు నెవ్వరు చెప్పిన శీర్షిక కింద అబ్రహం లింకన్, గురజాడ వంటి వారి గురించి చెప్పానని గుర్తు చేశారు. తన నిత్య ప్రవచన పరంపరలో గురజాడ ప్రసక్తి ఉందనీ గాని తాను తరచూ ప్రస్తావిస్తుంటానని గాని చెప్పలేదు. పైగా ఆ కమిటీ వారు కూడా సాక్షాత్తూ జ్ఞాన సరస్వతి ఆలయంలో పురస్కారం అందించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారే గాని గురజాడ ఇంట్లోనో లేక మహారాజా వారి కోటలోనో ఈ పని పెట్టుకోలేదు. పైపెచ్చు గురజాడ వారు సంప్రదాయవాది అని కూడా సెలవిచ్చేశారు. చాగంటి వారికి గురజాడ పురస్కార ప్రదానం కన్నా దారుణమైన అపచారమిది. సంస్కార రహితమైన మానవతా విర్ధుమైన మూఢాచారాలన్నిటినీ నిష్కర్షగా తిరస్కరించిన గురజాడ స్మృతికి ఇంతటి కళంకం తెచ్చిన మాటలకు పాపము శమించుగాక అనుకోవడం తప్ప చేయగలిగింది లేదు. ''మంచి గతమున కొంచెమేనోరు'' అన్న గురజాడ భావాలకు పూర్తి విరుద్ధమైన చాగంటి ప్రతి మాట ప్రాచీన కాలాన్ని సనాతన ధర్మాలను కీర్తించేందుకు ఉద్దేశించినవే. ఆధునిక సదుపాయాలన్నీ అనుభవిస్తూనే కాలం చెల్లిన భావాలను కీర్తించడం, లౌక్యంగా సమర్థించడం, చాదస్తాలు రుద్దడం ఆయన నిత్యకృత్యం. అందులోనూ అధిక భాగం మహిళలపై కుమ్మరిస్తుంటారు. అయినా ఈ మహావ్యక్తి గురజాడ పురస్కార గ్రహీత కాగలగడం ఈనాటి వికృత రాజకీయ సామాజిక పరిస్థితికి ప్రతిబింబం. పురస్కారం గురించి కాదు సమస్య, గురజాడ ఆశయాలకు కలిగే అపచారం గురించి బాధ. వ్యవహార భాషకు గురజాడ చేసిన మహౌపకారం అంటూ 'దేశమనియెడు దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోరు' అని చరణాలు చెప్పిన చాగంటి వారు దాన్ని వివరించడం కోసం వాల్మీకి శ్లోక స్మరణ చేసి సంస్కృతాంధ్ర వివరణ చేయడం కన్నా హాస్యం గిరీశం కూడా చేయలేడేమో. ఏం చేస్తాం! మనవాళ్లు వట్టి వెధవాయిలోరు అనుకోవడం తప్ప. అడుగుజాడ గురజాడది అది భావికి బాట అన్న శ్రీశ్రీ స్ఫూర్తి వీరికి ఎలా అర్థమవుతుంది? కొయ్యబొమ్మలు మెచ్చు కళ్లకు కోమలుల సౌరెక్కునా? తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్టు అంతా అయిపోయింది గనక వదిలేద్దాం. స్వస్తి.
ఇప్పుడు గోవా ఉత్సవం. ఎప్పుడైనా సరే గొప్పవారినే న్యాయ నిర్ణేతలుగా ఎంపిక చేస్తారు. వారి మాట అంతిమం. ఆ ప్రకారమే బహుమతులివ్వాలి. పోటీలకు వచ్చిన ఎంట్రీల నాణ్యత లోపాలోపాలు ఆ కమిటీ అధ్యక్షులు వివరించడం ఆనవాయితీ. ఆ ప్రకారమే లాపిడ్ తన నివేదిక నిచ్చారు. నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పారు. వివేక్ అగ్నిహౌత్రి కాశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ విజయం ఎంతైనా దానివెనక ఉన్న సంఫ్‌ు పరివార్ భావజాలాన్ని, కాశ్మీర్ 370 రద్దుకు సమర్థనగా వచ్చే ఎన్నికలలో బీజేపీ కోసం ప్రచారం చేసిపెట్టే ప్రయత్నాన్ని భారతీయ మేధావి వర్గం చలనచిత్ర పరిశ్రమ ఇప్పటికే గుర్తించాయి (దానికి ముందు తాష్కెంట్ ఫైల్స్ తీసిన వివేక్ గురించీ, తెలుగులో కార్తికేయ-2 తీసిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ ఈ బృందంతో చేతులు కలపడం అనేక ప్రశ్నలకు అవకాశమిస్తోంది). బాధ్యతను బట్టి ఇజ్రాయిల్ దర్శకుడు ఆ మాటే చెప్పడం అపరాధమై పోయింది. అంటే అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్ మర్యాదలు మంటకలిపి మరీ ఆయనను తిట్టి తిట్టిస్తున్నారు. జ్యూరీ సభ్యులు కూడా ఆయనపై ధ్వజమెత్తారు, వారంతా అంతర్గత చర్చలలో ఇదే మాట చెప్పి ఇప్పుడు ఒత్తిళ్లకు లోబడిపోయారని లాపిడ్ వెల్లడించారు. అంటే ఇక్కడ పురస్కార నిర్ణేతకు, నిపుణతకూ విలువే లేదన్నమాట. ఇంతా చేసి ఇజ్రాయిల్ జాత్యహంకారంతో బలమైన బంధం పెట్టుకున్నది బీజేపీనే. ఆ దేశ దర్శకుడు కూడా భరించలేనంత మతతత్వం కాశ్మీర్ఫైల్స్లో తాండవ మాడిందన్న మాట. ఇదంతా చూసి రెచ్చిపోయిన వివేక్ అగ్నిహౌత్రి కాశ్మీర్‌ఫైల్స్ అన్‌రిపోర్టెడ్ అంటూ మరో భాగం తీసేస్తానని బెదిరిస్తున్నాడు. అదో సాకు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే అగ్నిహౌత్రావధాన్లకు అగ్రపీఠం వేయడంలో గురజాడ సాంస్కృతీ సమాఖ్య అనౌచిత్యంగానీ, అతిథి దేవోభవ అంటూనే అత్యున్నతమైన చిత్రోత్సవ జ్యూరీ చైర్మన్ పైనే దారుణంగా దాడి చేసిన చిత్రోత్సవ ఆహ్వాన సంఘం అమర్యాదగానీ నాణానికి బొమ్మ, బొరుసు మాత్రమే తప్ప వేరే కాదు. ఒకప్పుడు సాహిత్యంలో నవ్య సంప్రదాయవాదులు అనేవారు వెలసినట్టు నేటి ప్రపంచంలో నియోకాన్స్ (నియో కన్జర్వేటివ్స్) అనే నూతన మితవాదులు పుట్టుకొచ్చారు. వీరు మతవాదాన్నీ ఆవాహన చేయడం సర్వసాధారణం. సవాలు దాన్ని ఎలా ఎదుర్కో వాలన్నదే. ఇదొక భావ సంఘర్షణ, ఆశయాల సమరం తప్ప అవార్డుల ముచ్చట కాదు.
- తెర