Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్య, లౌకిక భారత చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోయిన బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి 30 సంవత్సరాలు. ఒక పథకం ప్రకారం సంఘ్ పరివార్ గూండాలు 30ఏండ్ల క్రితం డిసెంబర్ ఆరున బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. ఆ స్థలంలో కొంత ప్రాంతంలో రామాలయాన్ని నిర్మించుకోవచ్చునని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. అదే సమయంలో అక్కడ కూలగొట్టిన మసీదు గురించి ఏ విధమైన ప్రస్తావనా ఆ తీర్పులో లేదు. న్యాయ వ్యవస్థ మతపరమైన విశ్వాసాల విషయంలో హిందూత్వ, ఛాందసవాద శక్తులకు అనుకూలంగా తీర్పునివ్వడం లౌకిక భారతంలో నెలకొన్న దుస్థితిని సూచిస్తుంది. ఆ తర్వాత కాలంలో కూడా (శబరిమలైలోకి మహిళలు రాకూడదన్న తీర్పు ఉదాహరణ) మెజారిటీ ప్రజల మత విశ్వాసాల ప్రాతిపదికన తీర్పులిచ్చే ధోరణి కొనసాగింది. ఇది రాజ్యాంగం మీద సంఫ్‌ు పరివార్ ఆధ్వర్యంలో జరుగుతున్న దాడిని పరోక్షంగా బలపరచడమే. పౌర హక్కుల కోసం, మైనారిటీల హక్కుల కోసం పోరాడే లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు ఇదొక సవాలు. మరోవైపు అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం మరోసారి ఆరెస్సెస్ దేశ వ్యాప్తంగా నిధుల సేకరణకు పూనుకుంది. విదేశాలనుండి కూడా నిధులు పెద్దఎత్తున సేకరించారు. ఆలయ నిర్మాణం ఇంకా కొనసాగుతూనేవుంది. బహుశా 2024 ఎన్నికల నాటికి పూర్తి చేసి ''అయోధ్యలో పని పూర్తి చేశాం. వారణాసి, మథుర సంగతి తేల్చడానికి మరోసారి అధికారం ఇవ్వండి'' అని ప్రజలదగ్గరికి పోవాలన్నది వ్యూహం కావచ్చు.
మత విద్వేష ఎజెండా రాజకీయంగా ఫలితాలను ఇవ్వాలంటే అందులో హింస ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒకసారి మత కల్లోలాలు జరిగిన చోట ప్రజలలో పరస్పరం ద్వేషం గూడుకట్టుకుపోయి మెజారిటీ, మైనారిటీగానే ఆలోచిస్తారు, స్పందిస్తారు. అద్వానీ రథయాత్రతో తలెత్తిన మత హింస, ఘర్షణలు ఆ తర్వాత దేశంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయి. యూపీ, బీహార్లలో రామాలయ వివాదం పేరుతో జరిగితే, 1993లో ముంబాయిలో, ఆ తర్వాత గుజరాత్లో, కర్నాటకలో జరిగాయి. 2012 నుంచీ 2014 ఎన్నికల వరకూ ఒక్క యూపీలోనే దాదాపు 70చోట్ల మత ఘర్షణలు జరిగాయి. సీఏఏ ఆందోళన సందర్భంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ లోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కాశ్మీర్లో సైన్యాన్ని ఉపయోగించుకుని మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. చివరికి జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి రాష్ట్ర హౌదాను లేకుండా చేసినా దేశంలో వామపక్షాలు మినహా ఖండించినవారు లేరు. ఈ విధమైన ఆధిపత్యం రావడానికి బీజేపీకి కార్పొరేట్ల నుండి వస్తున్న మద్దతు, ధన ప్రవాహం, కార్పొరేట్ మీడియా ఇస్తున్న కవరేజి చాలా వరకు తోడ్పడింది. బీజేపీ మతతత్వ భావజాలం ప్రజల ఆలోచనలపై ఆధిపత్యాన్ని సాధించింది. అందుకే మోడీ ప్రభుత్వం మొదట గుజరాత్లో గాని, తర్వాత దేశం మొత్తం మీద కాని ప్రజల సమస్యల పరిష్కారంలో అత్యంత ఘోరంగా విఫలమైనా, పబ్లిక్‌గా కార్పొరేట్లకు దోచిపెడుతున్నా, ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. రాజ్యాంగ వ్యవస్థలనన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకునే దిశగా వేగంగా సాగుతోంది. రాజ్యాంగ మౌలిక విలువలనన్నింటినీ నాశనం చేయడం లక్ష్యంగా పెట్టుకుని వ్యవహరిస్తోంది. ఏకపార్టీ. ఏకవ్యక్తి పాలన దిశగా నడుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో పోలీసు యంత్రాంగం సైతం మత విద్వేష రాజకీయాలను తలకెక్కించుకుంది. ప్రభుత్వమే మైనారిటీలమీద ప్రత్యక్షంగా దాడులకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు.
ఆప్, కాంగ్రెస్ వంటి పార్టీలు ఇప్పుడు కూడా హిందూ సెంటిమెంటును ఎన్నికలలో తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలా అన్నదానికే ప్రాధాన్యతనిస్తున్నాయి. వైసీపీ, టీడీపీి, జనసేన, బీజేడీ మరికొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీ మతోన్మాద వైఖరి పట్ల చాలా మెతకగా వ్యవహరిస్తున్నాయి. ఈ వైఖరి దేశంలో వివిధ ప్రాంతాల్లో హిందూత్వ భావజాలం వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేకపోవచ్చు. కాని బీజేపీ మత విద్వేష రాజకీయాలకు పాల్పడినప్పుడు గట్టిగా గొంతెత్తేవి వామపక్షాలు మినహా మరో పార్టీ లేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి మారాలంటే బీజేపీని ఎన్నికలలో ఓడించాలి. అయితే, కేవలం ఎన్నికల ఎత్తుగడలతోటే బీజేపీని ఓడించడం సాధ్యం కాదు. ఒకవేళ ఒకసారి ఎన్నికల్లో ఓడించగలిగినా దేశంలోని అన్ని పాలనాంగాలలోకీ, విద్యా వ్యవస్థలోకీ చొచ్చుకుపోయిన హిందూత్వ భావజాలం అలానే విస్తరిస్తూనే ఉంటుంది. ఆ భావజాలాన్ని కూడా పూర్తిగా ఓడించాల్సి ఉంది. అప్పటివరకు ఆ ప్రమాదం అలానే ఉంటుంది. అనునిత్యమూ ప్రజలను, వారి ఆలోచనలను ప్రభావితం చేస్తున్న మతతత్వ భావజాలాన్ని సైద్ధాంతికంగా, సాంస్కృతికంగా ఎదుర్కోవాలి. భారత జాతీయోద్యమ కాలంలో వెల్లువెత్తిన లౌకిక, సామ్యవాద, అభ్యుదయ భావజాల వారసత్వాన్ని ప్రగతిశీల శక్తులు స్వీకరించాలి. దానిని ఆయుధంగా చేబూని జన జీవనంలోని అన్ని పార్శ్వాలలోకీ చొచ్చుకుపోవాలి. బీజేపీ హిందూ జాతీయ దురహంకార, విద్వేష, హింసాయుత రాజకీయాన్ని నిజమైన భారతీయ జాతీయతావాదం బలంతో ఎదుర్కొనాలి. కష్టజీవులను చీల్చే విద్వేషపూరిత రాజకీయాలను భిన్నత్వంలో ఏకత్వం ప్రాతిపదికన తిప్పికొట్టాలి.
భారతదేశంలో లౌకిక భావనలు, లౌకిక సాంప్రదాయాలు ఇంకా బలంగానే ఉన్నాయి. వాటన్నింటినీ ఒక దగ్గర పోగు చేయడం అవసరం. సంఫ్‌ు పరివార్ ఇచ్చే విద్వేష నినాదాలకు, సాగించే హింసకు దేశంలో ప్రజలనుండి వ్యతిరేకత పలు సందర్భాలలో వ్యక్తం అయింది. బాబ్రీ మసీదును కూల్చిన తర్వాతే కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికలలో బీజేపీ ఓడిపోయింది. ముంబాయిలో మతఘర్షణలు జరిగినా, అక్కడి కార్మికవర్గం, సామాన్య ప్రజలు ఎంతో లౌకికస్ఫూర్తితో వ్యవహరించారు. గుజరాత్లో మారణహౌమం జరిగినప్పుడు దేశం యావత్తూ తీవ్రంగా నిరసించింది. అయితే, ఈ లౌకిక స్పందన ఇంకా సంఘటితం కావాల్సి ఉంది. అలా జరగాలంటే దానిలో కార్మిక, కర్షక, తరగతులు, శ్రమజీవులు, లౌకిక ప్రజాస్వామ్యవాదులు కీలక పాత్ర పోషించాలి. ఇటీవల ఢిల్లీలో జరిగిన రైతుల పోరాటం మతోన్మాదుల కుట్రలను అన్నింటినీ తిప్పికొట్టి విజయం సాధించగలిగింది. అంతకు ముందు పరస్పరం శత్రువులుగా ఒకరినొకరు చూసుకున్న హిందూ, ముస్లిం రైతులు ఆ విద్వేషాన్ని అధిగమించి అన్నదమ్ముల్లా కలిసి పోరాడారు. ఆధిపత్య కులాలకు చెందిన రైతులు, నిమ్నకులాల రైతులు భుజం భుజం కలిపి ఉద్యమించారు. ఈ అనుభవం మనకు బలమైన వర్గ, ప్రజా పోరాటాలను నిర్మించగలిగితే మత విద్వేష రాజకీయాలను తిప్పికొట్టడం సాధ్యమే అన్న పాఠాన్ని నేర్పుతోంది.
పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ స్థితిలో కార్పొరేట్లకు మితవాద రాజకీయాల అవసరం చాలా ఎక్కువ. అందుకే కార్పొరేట్లు, వారి ఆధిపత్యంలోని మీడియా, వారి పెంపుడు జంతువుల వంటి మేధావులు మతవాద, మితవాద రాజకీయాలవైపే ఉంటారు. నయా ఉదారవాద వినిమయ తత్వం, హిందూత్వ మతోన్మాదం కలగలిసే వ్యవహరిస్తున్నాయి. అయితే 30 సంవత్సరాల క్రితం నయా ఉదారవాద విధానాలను ప్రజానీకం అంగీకరించినట్టు ఇప్పుడు అంగీకరించడం లేదు. పైగా సంక్షోభ భారాలు వారి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అందుచేత రానున్న రోజుల్లో ప్రజల నుండి ఈ విధానాలకు ప్రతిఘటన తప్పదు. బ్రెజిల్లో జరిగిన పరిణామాల వంటివి ఇతర దేశాల్లో కూడా సంభవిస్తాయి. అంటే వివిధ తరగతుల, ప్రజానీకం కలిసివచ్చే అవకాశాలు పెరుగుతాయి. కార్పొరేట్ల దోపిడీకి నలిగిపోతున్న చిన్న వ్యాపారులు, కార్పొరేట్ వ్యవసాయాన్ని వ్యతిరేకించే వివిధ తరగతుల రైతాంగం, చితికిపోతున్న వృత్తిదారులు అందరూ కలిసివస్తారు. లాటిన్ అమెరికా దేశాల అనుభవాలతో అభ్యదయ శక్తులు వీరందరితో కలిసి నడవాలి. నయా ఉదారవాద విధానాలు ప్రారంభం అయిన తొలి నాళ్ళలో రేగిన బాబ్రీ మసీదు వివాదం మతవాద, మితవాద శక్తుల ఆధిపత్యాన్ని పెంచడానికి ఉపయోగపడింది. ఇంకా ఉపయోగపడుతుంది కూడా. అందుచేత వామపక్ష, అభ్యుదయ శక్తులు గత ముప్పై ఏండ్ల అనుభవాలనూ పరిశీలించాలి. ఇప్పుడు ఆ నయా ఉదారవాద విధానాలే సంక్షోభంలో పడ్డాయి గనుక, హిందూత్వ శక్తులకు అధికారమిస్తే ఏం జరుగుతుందో ప్రజలకు స్వీయానుభవం అవుతున్నది గనుక వామపక్ష, అభ్యుదయ శక్తులు వేగంగా పుంజుకోడానికి అవకాశాలు పెరిగాయి.
- ఎం.వి.ఎస్.శర్మ