Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సలికాలం వస్తే నేను అక్కడ లేకున్న
నులక మంచంలో గొంగడి కప్పుకొని
ముడుసుకున్న ఊరు గుర్తొస్తది.
కోడియంగనే లేచి
గడ్డిగుంజబోయే మా నాయిన నాయినతోటి దోస్తులు
కళ్ళల్లో మెదులుతుంటారు.
ఒక్కొక్కప్పుడు వాళ్ళకి సద్దులు మోసిన
నేనుకూడా నాకే గుర్తొస్తుంటాను.
పొద్దున్నే రోడ్లెమ్మటి చెత్తతెచ్చి
మంటేసి చేతుల్ని కాపుకొనే కొందరు.
ఇగంకి తలచుట్టు అరికట్టంకట్టి
అలుకుజల్లిన చేతుల్ని కాపుకొనే అమ్మలు.
ఆ సలిమంటల్లోంచే చుట్టకి నిప్పుబెట్టుకొనే తాతలు..
సలికాగడం కోసమే పోద్దున్నే లేచే చిన్నపిల్లల మాటలే
చుట్టూ తిరుగుతునట్టు ఉంటుంది.
సలికాలం మంటే
పొలాలెమ్మటి గండ్లు తొక్కుకుంటూ పోతూ
మంచుతడిని వెంటేసుకొని తడిచి రావడం.
మిరప తోటలో నీళ్ళు కడుతూ
కాల్వల వెంట వెచ్చగా పారడం.
సలికాలమోస్తే
చాలా భయం భయంగా అనిపిస్తుంటుంది.
నగరం రోడ్ల పక్కన ఒణుకుతూ ముడుసుకోవడానికి
అలవాటు పడిన శంఖాలు...
ముడతలు పడి రాలిన ఆకులూ...
తెగిబోయి కూర్చున్న ఒంటరి ఆకాశాలు...
గుర్తొచ్చినప్పుడు
రాత్రంతా నాలో నన్ను మిషన్లలాగా కిందికి మీదికి
తిప్పేసుకునట్లు అవుతాను.
సలికాలమంటే
బూట్లేసుకొని రోడ్లెమ్మటి
గ్రౌండ్ల ఎమ్మటి మొసబోస్తూ
తడుస్తూ ఉరకడం కూడా...
సలికాలమంటే
మనుషులు మాత్రమే ఒణుకుడు కాదు
మనుషులతో పాటు రాత్రుళ్ళు ఒణకడం...
చెట్లు, గుట్టలు ఊగడం.
గడియారం ముల్లులు ఒణకడం
పూస్తున్న పువ్వులు ఇగం పట్టడం
చేపలలాగే కాసింత వెచ్చదనం కోసం
నిక్కినిక్కి చూడడం.
ఉడుకుడుకు ముద్దలకోసం
నెమ్మదిగా... మనుషులకు దగ్గరగా ప్రయాణించడం!.
- పేర్ల రాము, 9642570294