Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాబ్రీ మసీదును సంఫ్‌ు పరివార్ సంస్థలు విధ్వంసం చేయడంలో విషాదం మరోకోణం ఏమంటే డిసెంబరు 6 అంబేద్కర్ వర్థంతి రోజు కావడం. ఈ దేశానికి లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడి వర్థంతి రోజునే ఆ దురంతానికి పాల్పడ్డం సంఫ్‌ు పరివార్ వాస్తవ రూపాన్ని తెలిపే మరో సందర్భం. ఈ ముప్పైఏండ్ల చరిత్రను తేరిపార చూసేప్పుడు అంబేద్కర్‌ను స్మరించుకోవడం, మతతత్వ రాజకీయాలపై ఆయన నిశిత విమర్శలను గుర్తు చేసుకోవడం అవసరం.
జీవితమంతా సామాజిక న్యాయం కోసం పరితపించిన అంబేద్కర్ హిందూత్వ రాజకీయాలను, హింద్రాజ్ ఏర్పాటు చేయాలనే పిలుపులను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. వాస్తవానికి అది అగ్రవర్ణాల భావజాలమనీ వర్ణ వ్యవస్థ ద్వారా అత్యధిక ప్రజానీకాన్ని అణచివేసి దోపిడీ పీడన సాగించినట్టే అల్ప సంఖ్యాక మతాల విషయంలోనూ చేయడం వారి స్వభావమని ఆయన స్పష్టీకరించారు. ఆయన అధికార వాణిగా పరిగణించబడిన జనతా పత్రికలో తరచూ ఈ అభిప్రాయాలు ప్రకటిస్తూవచ్చారు. బహిష్కృత్ భారత్, ప్రబుద్ధ భారత్‌లలోనూ అనేకసార్లు ఈ విషయాలు రాశారు. 1934లో ఆరెస్సెస్ విషయంలో తన విమర్శ వెలువరించారు. 1940లో పాకిస్థాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా అన్న పుస్తకం రాస్తూ హిందూ రాష్ట్ర భావనను తోసిపుచ్చారు. హిందూత్వ రాష్ట్ర ప్రాతిపదికన దేశమే ఏర్పడేట్టయితే అంతకంటే విపత్తు మరొకటి ఉండదని స్పష్టం చేశారు. అందుకే ఎట్టి పరిస్థితులలోనూ హిందూత్వ ప్రాతిపదికన ఏర్పడే రాజ్యాన్ని నిరోధించాల్సిందేనని హెచ్చరించారు. వీరసావర్కార్, మహ్మదాలీ జిన్నా ఒకే నాణేనికి బొమ్మ బొరుసు వంటి వారిని తేల్చిచెప్పారు. ఇద్దరూ మరో మతం అస్తిత్వాన్ని, హక్కును గుర్తిస్తామంటూనే దేశాన్ని రెండు చేయాలని పట్టుపట్టడం ఇందుకు నిదర్శనమన్నారు. 1950లో అంబేద్కర్ న్యాయశాఖా మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా ఈ హిందూత్వ శక్తులే కారణం. హిందూ కోడ్ బిల్లు మతానికి హాని చేస్తుందని వారు గగ్గోలు పెట్టడాన్ని ఆయన ఆమోదించలేదు. ఆ సమయంలో జనసంఫ్‌ు వ్యవస్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటివారు పనికట్టుకుని దాడిచేశారు. 1956లో బౌద్ధాన్ని స్వీకరించడంలోనే అంబేద్కర్ కులదొంతరలతో కూడిన హిందూ వర్ణ వ్యవస్థను తిరస్కరిస్తూ బయిటకు నడిచారు. అది ఆయన ఎంచుకున్న మార్గమైనప్పటికీ ఆయన అభిప్రాయాలు మరింత విస్తృతమైనవని గుర్తించాల్సి ఉంది. మతతత్వాన్ని నిష్కర్షగా ఖండించిన వ్యక్తి ఆయన.
విచిత్రమేమంటే ఇదే అంబేద్కర్‌ను హిందూత్వ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు ఆరెస్సెస్ 1980లోనే ప్రారంభించింది. సంఫ్‌ు స్థాపకులైన గోల్వార్కర్, సావర్కార్ వంటి వారితో ఆయనకు చాలా సాన్నిహిత్య ముందనే పాటెత్తుకుంది. ఆయన చేపట్టిన బౌద్ధం హిందూ మతంలో శాఖ తప్ప మరోటి కాదని ప్రచారం మొదలెట్టింది. 2014లో మోడీ వచ్చిన కొద్ది రోజుల్లోనే అంబేద్కర్ ఆశయాల ప్రకారమే తాము నడుస్తున్నామనే రాతలు ప్రారంభించారు. 2017లో మోడీ ఢిల్లీలో అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం ప్రారంభించారు. అలాంటివి తర్వాత చాలా వచ్చాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో భారీ స్మారక చిహ్నాలు నిర్మిస్తున్నారు. వీటిని 2023కు పూర్తి చేస్తే ఎన్నికలకు ఉపయోగపడుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి చేయడమూ అందుకోసమేనన్నారు. అసలు ఆరెస్సెస్ మరింతగా విస్తరిస్తేనే హిందూ సమాజం ఐక్యత పెరుగుతుందని అంబేద్కర్ తనతో చెప్పినట్టు దత్తోపత్ తెంగ్డే రాసుకున్నారని కొందరు విమర్శిస్తుంటారు. అంబేద్కర్ భావనలకు ఆయన రూపొందించిన రాజ్యాంగ విలువలకూ పూర్తి వ్యతిరేకంగా బాబ్రీ విధ్వంసానికి మత కలహాలకూ కారణమైన వారే ఆయనను తమకు అనుకూలుడుగా చిత్రించుకోవడం చారిత్రిక వైపరీత్యం. అటూ ఇటూ కూడా దెబ్బ తీసే చక్రబంధం వక్రవ్యూహం. దీనిపై ప్రత్యేకంగా అనేక పుస్తకాలు వెలువడ్డాయి. మతతత్వ రాజకీయాలపై పోరాటానికి ప్రతినబూనే సందర్భంలో మహనీయుడు అంబేద్కర్ నిజమైన బోధనలను అధ్యయనం చేయడం, విస్తృతంగా ప్రచారంలో పెట్టడం మరింత అవసరమవుతుంది.
- పీపీ