Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినాయక్ దామోదర్ సావర్కర్ చరిత్ర అంతా చీకటి చరిత్ర. విష చరిత్ర, కుట్రలు కుతంత్రాల చరిత్ర. అతను స్వాతంత్య్ర పోరాటాన్ని అడ్డుకుని, బ్రిటిష్ వారికి సహకరించినవాడు. పైగా సెల్యూలార్ జైలులో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎనిమిది సార్లు వినతిపత్రాలు సమర్పించి క్షమాపణలు కోరిన వ్యక్తి. అంతకు ముందు అతను బ్రిటన్‌లో ఉండగా ఒక రేప్ కేసులో దొరికిపోయి, తప్పు ఒప్పుకుని, శిక్ష అనుభవించినవాడు. ఇలాంటి వాణ్ణి గాంధీజీకి ప్రత్యామ్నాయంగా నిలబెడతారా? ఆ ఆలోచనే సిగ్గుపడాల్సిందిగా ఉంది. ఆనాటి హిందువుల్ని ముఖ్యంగా ఆర్యబ్రాహ్మణుల్ని ఏకం చేయడానికి ఇతర మతస్థుల మీద, ఇతర కులస్థుల మీద విషం చిమ్మిన వ్యక్తి... సావర్కర్! దేశంలో కేవలం ఆర్య బ్రాహ్మణులు మాత్రమే ఉండాలని తాపత్రయ పడినవాడు. శత్రువులు బ్రిటిష్‌వారు కాదు, అంతర్గత శత్రువులు దేశంలోనే ఉన్నారని ప్రకటించిన వాడు. ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు, బౌద్ధులు, జైనుల వంటి ఇతర మతస్థుల్ని చంపేయాలని తన అనుచరులకు పిలుపు నిచ్చినవాడు. వారి ఇండ్లలోని తల్లులు, భార్యలు, అక్కా చెల్లెళ్ళు. ఎవరైనా సరే గర్భిణులు ఉంటే, వారి పొట్టల్ని చీల్చి, పుట్టబోయే పిల్లల్ని కూడా చంపేయాలని పిలుపునిచ్చిన- 'మహనీయుడు' ఈ విషయాలన్నీ సావర్కర్ పర్సనల్ అసిస్టెంట్ (పి.ఎ.) లిబయ రాస్తే బయటికొచ్చినవే! అందువల్ల సావర్కర్‌ను విమర్శించడం నేరం కాదు, ప్రతి భారతీయుడి హక్కు -
ఏ ప్రభుత్వమూ, ఏ సంస్థా ఇవ్వకపోయినా తనకు తానే 'వీర్' అనే పదం తన పేరుకు ముందు తగిలించుకుని, 'వీర్ సావర్కర్'గా ప్రాచుర్యం పొందిన నీచ ప్రవృత్తి గలవాడు సావర్కర్. తొలి దశలో దేశభక్తుడిగా నటించినా, తర్వాత కొంత కాలానికే అతని అనైతికత ఈ దేశ ప్రజలకు అర్థమైంది. అంతే కాదు, ఆనాటి బ్రిటిషు ప్రభుత్వానికి ఇంకా బాగా అర్థమైంది. అందుకే జైలు పాలయ్యాడు. బయటికి వచ్చి గాడ్సేను తయారుచేసి, ప్రోత్సహించి, గాంధీహత్యకు దోహదం చేశాడు. ఇలాంటివాణ్ణి గాంధీజీకి ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలని ప్రస్థుత బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జాతిపిత స్థానాన్ని ఒక దేశద్రోహికి అంటగట్టాలని చూస్తోంది. అందువల్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ కుతంత్రాల్ని బట్టబయలు చేయాలి. ఆధునిక భారతీయ చరిత్రలో నీచాతి చీచుడుగా మిగిలిపోయినవాడు ఎవరూ? అంటే.. దేశ ప్రజలంతా ఏకకంఠంతో 'సావర్కర్' అని నినదించాల్సిన అవసరం ఉంది. అందుకు అతనికి అన్ని అర్హతలూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ చాలామంది చెప్పినవే. మరీ ముఖ్యంగా ముంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి సావర్కర్ నైతికతను దుయ్యబడుతూ, ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియోలో మాట్లాడారు. ఆనాటి విషయాలు నేటి తరానికి అందించాలన్న తపన కొద్దీ ఆయన మాట్లాడారు. విషయ పరిజ్ఞానం ఉన్న ఆ న్యాయమూర్తి జస్టిస్ కె.పాటిల్‌ను ఈ దేశ ప్రజలు నమ్ముతారు.
ఇటీవల గుజరాత్ ఎన్నికల ర్యాలీలలో తన స్థాయి మరిచి ప్రతి గల్లీ తిరుగుతూ మాట్లాడారు. భారత ప్రధాని - ఆ సందర్భంలో ఆవును గురించి తన ఆవేదన వ్యక్తం చేశారు. ''గోవు గురించి మాట్లాడటం ఏమైనా అపరాధమా? పవిత్రమైన గోమాత గురించి ఎవరైనా మాట్లాడొచ్చు..'' అని అన్నారాయన. అయితే ఆయన తెలుసుకోవల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. 1930లో కూడా ఇప్పటి వలెనే గోవును గూర్చి చర్చలు జరిగాయి. ఆ రోజుల్లో మహారాష్ట్రలో 'భాలా' పేరుతో ఒక పత్రిక వెలువడేది. అందులో 'ప్రశ్నోత్తరాల' శీర్షిక ఒకటి నడిచేది. అందులో ఒకసారి ఒక ప్రశ్న వచ్చింది. ''నిజమైన హిందువు ఎవరూ?'' అని! ''ఎవరైతే గోవును పూజిస్తారో, సంరక్షిస్తారో వారే నిజమైన హిందువులు'' అని కొంత మంది జవాబు రాశారు. అవన్నీ చదివి సావర్కర్ సుదీర్ఘమైన లేఖరాశాడు. ఆ తర్వాత ఒక పుస్తకమే రాశాడు. దానిపేరు ''విజ్ఞాన్ నిష్ట్ నిబంధ్''. ఆ పుస్తకాన్ని స్వాతంత్య్రవీర్ సావర్కర్ స్మారక సమితి- ప్రచురించింది. సావర్కర్ ఆలోచనల్ని ఈ దేశ ప్రజలు చాలా నిశితంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ''దేశద్రోహ-దేశభక్తుడు'' నేటి మోడీ-యోగీల జోడీకి ఆరాధ్యుడు. వారి దృష్టిలో మహానాయకుడు. ఒక దశలో ఆరెస్సెస్ నాయకత్వం సావర్కర్ పేరు ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పటి నాయకులు ఆయనను నెత్తికెక్కించుకుని, జాతిపిత స్థానాన్ని ఇవ్వాలని చూస్తున్నారు. అయితే అది అయ్యే పనికాదు. దేశ ప్రజలు చేతులు ముడుచుకుని ఏమీ కూర్చోరు.
సావర్కర్ ఎంతటి దేశద్రోహానికి తలపడ్డా, తన పుస్తకం- ''విజ్ఞాన్ నిష్ట్ నిబంధ్''లో ఆవును గురించి కొన్ని వాస్తవాలు రాశాడు. వాటిని నేటి ప్రభుత్వ పెద్దలు శ్రద్దగా మళ్ళీ మళ్ళీ చదువుకోవడం అవసరం. ఎందుకంటే ఆ రాసినవాడు వారి దృష్టిలో మహానాయకుడు గనక! సావర్కర్ తన పుస్తకంలో ఇలా రాశాడు... '' ఎవరైతే గోవును పూజిస్తారో వారు మానవ జాతి స్థాయి నుండి కిందికి దిగజారిన వారవుతారు... ఇంకా గోవు ఒక జంతువని, దానికి లేని పవిత్రతను ఆపాదించి పూజించడం అంటే అది మూర్ఖత్వమవుతుందనీ' స్పష్టంగా రాశాడు- వినాయక్ దామోదర్ సావర్కర్! 'ఆవు ఎంతటి నికృష్టపు జంతువంటే... అది తన మలంలోనే అది పొర్లుతుంది. దానికి బుద్దీ జ్ఞానం ఉండవు గనకనే తను వేసిన పేడలో అది బొర్లుతుంది' అని కూడా రాశాడు. ఇది కాక, సావర్కర్ మరొక ముఖ్యమైన విషయం వెలుగులోకి తెచ్చాడు. మొఘులులు లేక ఇతర విదేశీయులు దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు వారిని ఎదిరించి యుద్ధం చేయకుండా హిందువులు గోవులను పూజిస్తూ కూర్చున్నారనీ, దాని మహిమతో విజయం తమనే వరిస్తుందన్న భ్రమలో ఉండిపోయారనీ, అదెంతో సిగ్గుచేటనీ కూడా రాశాడు సావర్కర్! సైనికులూ పౌరులూ అందరూ గోపూజ చేస్తూ కూర్చున్నందువల్ల యుద్ధం చేయగల ధైర్యం, నైపుణ్యం పోగొట్టుకున్నారని- యుద్ధకౌశలం పోగొట్టుకున్నాక విజయాలెలా సాధిస్తారనీ- ఒకరకంగా ఈదేశాన్ని విదేశీయులు ఆక్రమించుకోవడానికి కారణం నిస్సందేహం గా -గోవే!' అని సావర్కర్ విశ్లేషించారు. దుర్గం, ఖిల్లా, కోట- ఏదైనా సరే రక్షించుకోవడం ఈ''గోపూజారు''ల వల్ల కాలేదు - అని తీర్మానించాడు. 'ఒకవేళ సైనికులకు యుద్ధ సమయంలో ఆహారం కొరత ఏర్పడితే, గోవుల్ని కోసుకుని తినాల్సింది. అలా చేసైనా తమ తమ రాజ్యాల్ని తాము కాపాడుకోవాల్సింది' - అన్నది సావర్కర్ అభిప్రాయం!
''గోపాలన్ హవే గో పూజన్ నభే'' (మరాఠీ శీర్షిక) గోవుల పాలన అవసరమే కానీ, గోపూజ వద్దు- అనేది ఆ మరాఠీ శీర్షికకు అర్థం. ఈ శీర్షికతో సావర్కర్ ఏమి చెప్పారంటే... గోవు పాలిస్తుంది గనుక, మనుషులు దాన్ని పోషించుకోవాలి. కానీ, వాటిని పూజించడం ఎందుకూ? అన్నది ఆయన ప్రశ్న! ఆయనలాగే గోవుల్ని పూజించడం ఎందుకూ? అని ఈ దేశ ప్రజల్లో కొందరు అనుకుంటే అది పొరపాటు కాదు. తప్పిదం కాదు. గోవుకు ఏ పవిత్రతాలేదు అంటే అది నేరమూ కాదు - ఈ విషయం నేటి ప్రధాని అతని అనుచర గణం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ దేశంలో శ్వేత విప్లవం కురియన్ నేతృత్వంలో గతంలో జరిగింది. పాల ఉత్పత్తిలో ఈ దేశం చాలా ముందుంది. ఇందులో ఇప్పటి ప్రభుత్వ పెద్దల కృషి ఏమీలేదు. వీరు అధికారంలోకి రాకముందే ఆ పని జరిగిపోయింది. ఇకపోతే గో మాంసం ఎగుమతులు ఎవరు చేస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. బీజేపీ పెద్ద నాయకులే కదా ఆ పని చేస్తున్నదీ? వీరిలో ముస్లింలు లేరు. అల్ కబీర్ - అల్ దువాఁ - అంటూ ఉరుదూ పేర్లు పెట్టుకుని హిందువులే గోమాంసం ఎగుమతి చేస్తున్నారు. గోమాంసం ఎగుమతిలో ప్రపంచంలోనే మన దేశం మొదటి రెండు స్థానాల్లో ఉంది. ప్రపంచ స్థాయి గోమాంస విక్రేతల్లో మొదటి 20 మంది హిందువులేనన్నది అధికారంలో ఉన్నవారు కావాలనే చెప్పరు. ఆ పని ముస్లింలు చేస్తున్నారనే భ్రమను దేశ ప్రజలకు కలిగిస్తారు. 'చాలా తక్కువ ధరకు గోమాంసం అందిస్తామని' ఇదే బీజేపీ నేతలు ఎన్నికల సందర్భంలో గోవా ఓటర్లకు హామీలిస్తారు! అది కూడా పక్కన గల కర్నాటక నుండి తెప్పిస్తామంటారు. కర్నాటకలో ఎవరి ప్రభుత్వం ఉందో మనకు తెలుసు.
17 జనవరి 1948న చివరిసారి సావర్కర్‌ను దర్శించుకోవడానికి నాధూరామ్ గాడ్సే, ఆప్టే, బాడ్గే, శంకర్లు వెళ్ళారు. నాధూరాం, ఆప్టేలు లోపలికి వెళ్ళారు. మిగిలిన ఇద్దరు బయట కాపలా కాశారు. సావర్కర్‌ను కలిసి, నాధూరాం, ఆప్టేలు బయటికి రాగానే - ఆప్టే, బాడ్గేతో ఓ మాట చెప్పాడు. ''యశస్విహౌ ఉన్యా'' - విజయుడవై తిరిగిరమ్మని సావర్కర్, నాధూరామ్ను దీవించారని - గాంధీకి నూరేండ్లు పూర్తయ్యాయనీ - అనుకున్న ప్రకారం పథకం పూర్తవుతుందని సావర్కర్ ఆశగా ఉన్నాడన్న విషయం - ఆప్టే బయట ఉన్న సహచరులకి చెప్పాడు. గాంధీజీ హత్య కేసులో సరైన ఆధారాలు దొరకక శిక్ష పడలేదు కానీ, ఒకరకంగా సావర్కర్ నిత్య నూతన క్రిమినల్. అతని పేరు ముందు 'వీర్' అని రాయడం, పలకడం పెద్ద తప్పిదం అవుతుంది. ఒక్కోసారి దేశభక్తుడిగా, హేతువాదిగా కనిపించినా, ఎక్కువ శాతం ద్రేశద్రోహిగా, హిందూ మత ఛాందసుడిగా అనిపిస్తాడు. ఈ దేశ ప్రజలు సావర్కర్ నుండి ఏం నేర్చుకోవాలీ? ఏ విషయంలో అతను ఆదర్శప్రాయుడవుతాడూ? విశ్లేషించు కుంటున్న ఈ దేశ ప్రజలు, ప్రస్థుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకుల నిర్ణయాల్ని అసహ్యించు కుంటున్నారు. సావర్కర్‌కు వీరు ఇస్తున్న ప్రాముఖ్యాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు.
చంద్రనాథ్ బసు అనే అతను 'హిందూత్వ' అనే పదాన్ని రూపొందిస్తే, దాన్ని విరివిగా వాడుకుని, ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు సావర్కర్. ఒక దశలో సిక్కులు పంజాబ్‌ను సిక్కిస్థాన్గా చేసుకోవాలని, అందుకు తను సహకరిస్తాననీ అన్నాడు. పాకిస్థాన్, సిక్కిస్థాన్లు విడిపోతే, ఇక హిందూరాష్ట్ర (హిందూస్థాన్) మిగులుతుందని కలలు గన్నాడు. ఒకనాడు ఒక క్రిమినల్ కన్న కలల్ని నేటి ఈ కేంద్ర ప్రభుత్వం నిజం చేయాలనుకుంటోంది. దేశంలో అదే 'హిందూత్వ' సెంటిమెంట్‌ను విస్తృత ప్రచారం లోకి తెచ్చి... ఎలాగైనా దొడ్డిదారిన మళ్ళీ గెలవాలన్నదే వీరి ప్రయత్నం! ఉపాధి, అభివృద్ధి, ధరల తగ్గింపు వంటివాటి గురించి వీరు ఏమాత్రమూ మాట్లాడరు. ఆవు మూత్రం, ఆవుపేడల దగ్గర ఆగిపోయిన ఈ దేశనాయకుల మెదళ్ళు - బహుశా వాటితోనే నింపుకున్నారేమో! అందుకే ఇతర అంశాల గూర్చి మాట్లాడలేక పోతున్నారేమో! అని - నేటి యువతరం అను కుంటూవుంది. ఏమైనా, ఈ దేశ ప్రజలు నాయకులను అనుసరిం చకుండా, స్వతంత్రంగా ఆలోచించడం అన్ని విధాలా మంచిది.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.