Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమర యోధురాలు, మహాత్మాగాంధీ ప్రియ శిష్యురాలైన స్వర్గీయ శ్రీమతి కమలా చటోపాధ్యాయ భారతీయ చేనేత హస్తకళల పట్ల చూపిన ఆదరణ, అంకితభావాలను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏట డిసెంబర్ 8-14 తేదీల్లో ''అఖిల భారత హస్తకళల వారోత్యవాలు'' పెద్ద ఎత్తున నిర్వహించుట ఆనవాయితీగా మారింది. చేనేత, హస్తకళల పట్ల ప్రజలకు ఆదరణ, అవగాహన, ప్రోత్సాహం, చేయూత, బహుళ ప్రచారం, కళాకారులను ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను ఈ వారోత్సవాల వేదికగా నిర్వహించుట జరుగుతున్నది. భారతీయ హస్తకళల ఉత్పత్తులకు విదేశాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తున్న కారణంగా దాదాపు 67,000 ఎగుమతి కేంద్రాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. హస్తకళల వారోత్సవాలలో భాగంగా మహానగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో హస్తకళా ప్రదర్శనలు నిర్వహించడం, నైపుణ్యం కలిగిన కళాకారుల్ని గుర్తించడం, ఉత్పత్తులను కొనడం, ఉత్సాహపరచడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. హస్తకళల కళాకారులలో ఉచిత నైపుణ్య శిక్షణలు, ఉత్పత్తుల మార్కెటింగ్, ఆర్థిక చేయూత, సాంకేతిక వనరుల కల్పన, కళాకారుల ఉత్పత్తులకు సరైన ధరలను కలిపించడం లాంటి చర్యలు తీసుకోవడానికి 1952లో ''అఖిల భారత హస్తకళల బోర్డు''ను కూడా ఏర్పాటు చేశారు.
హస్త కళలకు నైపుణ్య రంగులు
కానీ, అనాదిగా భారత దేశంలో అసంఘటిత హస్తకళల రంగాన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. ఆధునిక నైపుణ్య శిక్షణలు అందుబాటులోకి లేకపోవడం, మార్కెటింగ్ వసతులు కల్పించక పోవడం, సరైన ధరలు పలకక పోవడం, గిరాకీ లేకపోవడం లాంటి పలు సమస్యలు ఈ రంగాన్ని పట్టి పీడిస్తున్నాయి. దేశ హస్త కళారంగంలో 7 మిలియన్ల శ్రామికులు, కళాకారులు పని చేస్తున్నారు. ఈ హస్తకళా నిపుణుల్లో 56శాతం మహిళలు, 44శాతం పురుషులు, అందులో 21శాతం యస్సీలు, 8శాతం యస్టీలు, 52శాతం ఓబీసీలు దేశవ్యాప్తంగా విస్తరించబడి ఉన్నారు. హస్తకళల్లో చేనేత వస్త్రాలు, లెదర్, కలప, లోహాలు, బంక మట్టి, ఎముకలు, కొమ్ములు, గవ్వలు, గాజులు, శిల్పాలు, కార్పెట్లు, జరీ ఉత్పత్తులు, పేయింటింగ్లు, నార వస్తువులు, వెదురు, కేక్ డెకరేషన్, కొవ్వొత్తులు, పేపర్, వ్యర్థ పదార్థాలు లాంటి వస్తువుల మాద్యమంగా కళాత్మక కళాఖండాల అద్భుతాలు ఆవిష్కరించబడతాయి.
విదేశీ గిరాకీ
మన దేశ కర్ర, ఎంబ్రాయిడరీ, చేనేత, ఇమిటేషన్ ఆభరణాలు, లోహ కళాఖండాలకు అమెరికా, యుకె, యూఏఈ, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నెదర్లాండ్ లాంటి పలు దేశాల్లో మంచి ఆదరణ ఉండటం హర్షదాయకం. ప్రపంచ హస్తకళల వ్యాపారంలో ఇండియా 1.2శాతం మాత్రమే ఉండడం విచారకరం. దేశ విభిన్న సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం, జీవన వైవిధ్యం నెలవుగా ఉన్నందున భారతీయ హస్తకళల్లో అద్వితీయ విలక్షణత కనిపిస్తుంది. దేశీయ మార్కెట్లో తీవ్రమైన పోటీ, డిమాండ్-సప్లయి వ్యత్యాసం, నాణ్యతలో విదేశీ వస్తువులతో పోటీ, ఈ-ప్రభంజనాన్ని తట్టుకోలేక పోవడం, విదేశీ ఆధునిక సాంకేతికను సత్వరమే అందిపుచ్చుకోలేక పోవడం లాంటి సమస్యలు మన హస్తకళల రంగాన్ని వెంటాడుతున్నాయి. విదేశీ యంత్ర ఉత్పత్తుల కన్న భారత హస్తకళలకు మంచి గిరాకీ ఉండటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నది. బ్రాండ్ ఇమేజింగ్ కలిపించడం, క్రాఫ్ట్ ఫెస్టివల్స్/రోడ్డు షోల నిర్వహణ, పబ్లిసిటీ, ఆకర్షణీయ ప్యాకేజింగ్, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయం, ఆధునిక సాంకేతిక శిక్షణ ఇవ్వడం, సృజనను ప్రోత్సహించడం, ప్రధాన కూడళ్లలో దుకాణాలు తెరవడం లాంటి చర్యలు హస్తకళల కళాకారుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతాయి.
ఒక జిల్లా, ఒక ఉత్పత్తి, ఒక ఎగుమతి కేంద్రం
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా గ్రామీణ కళలకు ఊతం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖ రూపొందించిన ''వన్ డిస్ట్రిక్ వన్ ప్రాడక్ట్''తో పాటు ''జిల్లాను ఎక్స్పోర్ట్ హబ్''గా మార్చే పథకాల ద్వారా ప్రతి జిల్లాలోని తమవైన స్థానిక ఉత్పత్తులను తయారు చేయడం, ఉద్యోగ ఉపాధులు కల్పించడం, ఆర్థిక-సామాజిక-సంస్కతిక చైతన్యం తీసుకురావడం లాంటి లక్ష్యాలను అధిగమించవచ్చని అనుకున్నాం. కానీ ఆచరణ అందుకు వీలుగా లేకపోవడం నిరుత్సాహమే మిగిల్చింది. పర్యావరణ హిత ఉత్పత్తులను తయారు చేయడం, వ్యర్థాలు లేకుండా చూడడం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, విదేశీ ఉత్పత్తుల ఖరీదును తట్టుకోవడం, ఉత్పత్తిదారులకు ఆర్థిక చేయూత ఇవ్వడం, ముడి సరుకులను అందించడం లాంటి సమస్యల నడుమ మన హస్తకళలు కొట్టుమిట్టాడు తున్నాయి. ఈ సమస్యలను పరితరతష్కరించి ఈ రంగాన్ని ప్రోత్సహించడంలో భారత ప్రభుత్వం అలసత్వం వీడకపోవడం విచారకరం.
(డిసెంబర్ 8-14 ''అఖిల భారత హస్తకళల వారోత్సవాలు'')
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037