Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వాసం, పెళ్లి వంటి వాటికి రాజ్యం దూరంగా ఉంటేనే మత స్వేచ్ఛ రక్షించబడుతుంది. బలవంతపు మత మార్పిడులను ఎదుర్కొనడం అనే పేరుతో నడుస్తున్న సుదీర్ఘమైన వ్యాజ్యాలు న్యాయస్థానాల విలువైన సమయాన్ని హరించి వేస్తున్నాయి. దేశంలో మోసపూరితంగా జరుగుతున్న మత మార్పిడిని అణచివేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై సుప్రీం కోర్టు విచారిస్తోంది. ఈ విషయంలో వెనుకబడకూడ దనుకుంటున్న గుజరాత్ ప్రభుత్వం కూడా తాము తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టంలోని నిబంధనపై స్టే ఎత్తివేయాలని కోరుతోంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ మత మార్పిడైనా జరగడానికి ముందుగా జిల్లా మేజిస్ట్రేట్ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆ నిబంధన కోరుతోంది. గుజరాత్ మత స్వేచ్ఛా చట్టం-2003 (వివాహం ద్వారా మత మార్పిడిని పొందుపరిచేందుకు 2021లో సవరించారు) లోని సెక్షన్ 5పై గుజరాత్ హైకోర్టు సరిగానే స్టే విధించింది. మతాంతర వివాహాలను చట్ట విరుద్ధమైన మత మార్పిడులకు ఉదాహరణలుగా పేర్కొంటూ వాటిని కవర్ చేయాలని కోరుతున్న ఇతర నిబంధనల అమలుపై కూడా స్టే విధించింది. ముందస్తు అనుమతి తప్పనిసరనే ఈ నిబంధన వల్ల ఎవరైనా తమ మతాన్ని లేదా విశ్వాసాన్ని మార్చుకోవాలనుకుంటే దాన్ని ముందుగానే వెల్లడించాల్సి రావడం వారిపై ఒత్తిడిని పెంచుతుందని హైకోర్టు పేర్కొంది. వివాహం, నమ్మకం అనేవి ఒక వ్యక్తి స్వంత ఎంపికగా ఉండాలని పేర్కొంటున్న సుప్రీం కోర్టు గత రూలింగ్‌లకు ఈ నిబంధన విరుద్ధంగా ఉందని పేర్కొంది. సెక్షన్ 5పై విధించిన స్టే ఎలాంటి మోసం లేదా బలవంతంలేని వాస్తవమైన మతాంతర వివాహాలను కూడా దెబ్బ తీస్తోందంటూ గుజరాత్ వాదించడం ఇక్కడ ఆశ్చర్యకరం. మతాంతర వివాహం పర్యవసానాలు ఏమైనా ఉన్నట్లైతే ఈ ముందస్తు అనుమతి తప్పనిసరి నిబంధన వల్ల మత మార్పిడి నిజమైన స్వభావాన్ని ప్రశ్నించాల్సిన అవసరం రాదు. స్వచ్ఛంద మత మార్పిడికి ఈ నిబంధన వెసులుబాటు కల్పిస్తోందని ఏ ఒక్కరూ పేర్కొనడం లేదు. కేవలం మతాంతర వివాహం జరిగిందనే వాస్తవం ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు తలెత్తనప్పుడు లేదా ఎలాంటి అనుమానాలకు తావివ్వనప్పుడు మాత్రమే మత స్వేచ్ఛకు రక్షణ కల్పించబడుతుంది. తన విశ్వాసాన్ని మార్చుకోవాలనే ఉద్దేశ్యాన్ని వెల్లడించాలని ఒకరిపై ఒత్తిడి చేయడమంటేనే అది వారి మనస్సాక్షికి సంబంధించిన స్వేచ్ఛను, గోప్యతా హక్కును ఉల్లంఘిస్తుందనేది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన అంశం. అలాగే, ఈ నిబంధనలపై స్టే విధిస్తూ హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా చేసిన అప్పీల్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండగా... మత మార్పిడులకు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌పై ప్రస్తుతం జరుగుతున్న విచారణలో భాగంగా ముందస్తు అనుమతి తప్పనిసరనే నిబంధనను పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ అవసరంలేదు. ఇక విస్తృతాంశానికి సంబంధించి చూసినట్లైతే, ప్రలోభాల ద్వారా లేదా దాతృత్వ కార్యక్రమాల ద్వారా మత మార్పిడి అనేది చాలా తీవ్రమైన సమస్య అంటూ జస్టిస్ ఎం.ఆర్.షా నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు... జాతీయ స్థాయిలో మత మార్పిడి నిరోధక చర్యలు తీసుకురావడానికి ప్రభుత్వాన్ని ప్రేరేపించడానికి ఆసక్తిని సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా విశంఖలంగా, మోసపూరితంగా మత మార్పిడులు జరుగుతున్నాయంటూ వస్తున్న అతిశయోక్తితో కూడిన ఆరోపణలపై న్యాయస్థానాలు విచారించాలా అనేది ఇక్కడ ప్రశ్నార్ధకమే. దానికి బదులుగా, సమస్య ఏదైనా వుంటే దాని తీవ్రత ఎంత ఉందో గుర్తించేందుకు వాటిని రాష్ట్రాలకు వదిలిపెట్టి, మత స్వేచ్ఛ, మత సామరస్యతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
-'హిందూ' సంపాదకీయం