Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రపంచంలో మనుషులందరూ స్వేచ్ఛగా, సమాన హౌదా కలిగిన హక్కులతోనే జన్మిస్తారు. జాతి, వర్ణం, లింగం, భాష, మతం, జాతీయత, పుట్టుక, సంపద, హౌదాలు, రాజకీయ అభిమతాలు మొదలైన తేడాలు ఏమీలేకుండా ప్రతి ఒక్కరికీ మానవ హక్కులు ఉన్నాయి. అనేది విశ్వమానవ హక్కుల ప్రకటన సారాంశం.
ఐక్య రాజ్య సమితి సాధారణసభ ద్వారా 1948 డిసెంబరు 10న ఈ మానవ హక్కుల తీర్మానాన్ని ఆమోదించింది. అందువలన అప్పటి నుండి ప్రతిఏటా డిసెంబరు 10ని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితులు, అవకాశాలు లేకుండా మానవుల మనుగడ, అభివృద్ధి సాధ్యం కాదో, ఆయా పరిస్థితులు, అవకాశాలు కల్పించేవే మానవ హక్కులు అని పరిశీలకుల అభిప్రాయం. మనిషిగా పుట్టిన తర్వాత స్వభావ సిద్ధంగా ఆ మనిషికి లభించే హౌదాకు, జీవితానికి, ఏమాత్రం భంగం కలగని రీతిలో ఆయా దేశాల్లో పాలన సాగాలని, పరిస్థితులను తదనుగుణంగా మలచుకోవాలనేది తీర్మానం ఉద్దేశ్యం.
'మానవీయత' అనే తాత్విక భూమికపై రూపొందిన ఈ హక్కులను మానవజీవన విధానం నుండి ఎవ్వరూ విడదీయలేరు. మానవ సమగ్రాభివృద్ధిని మానవ హక్కుల సాధన, స్థాయి ప్రాతిపదికనే లెక్కకట్టడం ఆధునిక కొలమానం పద్ధతి కూడా. అయితే ఇటీవల భారత్‌లో మానవ హక్కులు ప్రమాదంలో పడ్డాయని అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ అయిన అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ (ఐ.ఆర్.ఎఫ్.) తెలిపింది.
'లౌకిక పునాదులపై ఉన్న భారతదేశాన్ని అక్కడ బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వానికి చెందిన జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయి నేతలు కొందరు కుల, మత, రాజకీయ విధానాలను ముందుకు తీసుకువెళుతూ హిందూ దేశంగా మార్చే పనిలో ఉన్నారు. ఫలితంగా భారత్‌లో మతపరంగా మైనార్టీలుగా ఉన్నవారు ప్రమాదంలో పడ్డారు' అని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. ఇది ఎంత వాస్తవమో ఇక్కడి పౌరులకు అనుభవమే అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఈ నివేదిక నేడు సంచలనం రేకెత్తించింది. భారత ప్రజల మానవ హక్కులకు సంబంధించి చర్చను లేవనెత్తింది.
అంతేకాదు, సామాజిక మాద్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ మైనార్టీలపై విద్వేష భావాన్ని రగిలిస్తున్నట్టుకూడా ఆ నివేదిక వక్కాణించింది. ఉదాహరణగా కర్నాటక ప్రభుత్వం ముస్లిం బాలికలు, యువతుల వస్త్రధారణ హిజాబ్‌ను పేర్కొంటూ, ఆ కారణంగా వారి చదువును, ఎదుగుదలను, అభివృద్ధిని ఆటంక పరుస్తున్న వైనాన్ని ఎండగట్టింది.
భారతదేశం వంటి లౌకిక దేశంలో సర్వమత సామరస్యమే శాంతి భద్రతలకు మూలకారణం అని తెలుపుతూ, మతస్వేచ్ఛకు, మైనార్టీల భద్రతకు ప్రమాదం వాటిల్లితే, అంతిమంగా మానవ హక్కులకు, ప్రాణాలకు ముప్పుతప్పదని హెచ్చరించింది.
అయితే, మానవ హక్కులను కొందరు రాజకీయ దృక్కోణంలో నుంచి చూస్తున్నారని, అందువల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటున్నదని ఆ మధ్యన ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యను ఎవ్వరూ మరచిపోలేదు. ఎక్కడో ఓ చోట చిన్న ఘటన జరిగినా మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించే కొందరు ఆ మాదిరి ఘటనలే మరోచోట జరిగితే మౌనం వహిస్తున్నారనేది మోడీగారి అభిప్రాయం. కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు మైనార్టీల, దళిత హక్కుల ఛాంపియన్లుగా చెప్పుకుంటారని, కానీ వారిపార్టీ ఏలుబడిలోని రాజస్థాన్‌లో దళితులపై జరుగుతున్న దాడులపట్ల వారు మౌనం వహిస్తున్నారనేది ప్రధాని మోడీ అభిప్రాయంగా బీజేపీ అధికార ప్రతినిధి సింబిత్ పాత్ర అప్పుడు చెప్పుకొచ్చారు.
కాగా ఢిల్లీ కిసాన్ ఉద్యమం సందర్భంగా... లఖింపూర్ ఖేరీ ఘటనలో ఉద్యమనేతలను పట్టపగలు వాహనంతో ఢకొీట్టి హతమార్చిన విషయాన్ని బీజేపీ ఇలాంటి ప్రత్యారోపణలతో మరుగుపరుచుకోవడం సాధ్యం కాదనే విషయం తెలుసుకోలేకపోతున్నది. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి (కేంద్రమంత్రి కుమారుడు) పట్ల ఇప్పటికీ పక్షపాత వైఖరినే ప్రదర్శిస్తున్నది. ప్రజల హక్కులను కాలరాస్తూ, అత్యాచారాలకు, హత్యలకు నిస్సిగ్గుగా, బహిరంగంగా పాల్పడుతున్న స్వపక్ష కార్యకర్తలపట్ల ఉదాసీన వైఖరేకాదు, రక్షించే వైఖరిని కూడా బీజేపీ అనుసరించడం కండ్ల ముందున్న కఠోర వాస్తవం. అందుకు తార్కాణం, బిల్సిస్ బానో కేసు. ఆ నేరస్థులకు క్షమాభిక్ష పెట్టి స్వాగత సత్కారాలతో జైళ్ళనుండి తీసుకురావడం భరించలేనిది.
సాటి మనిషిని మనిషిగా చూడటం అంటేనే ఆ మనిషికి గల హక్కులను గౌరవించడం అని అర్థం చేసుకోవాలి. ఇదే అత్యున్నత సంస్కారం. ఇదే ఆధునిక మానవీయ సంస్కృతిగా నేడు ఎల్లెడలా విలసిల్లుతున్నది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు 'మానవ హక్కులు' అనేవి కేవలం రాజకీయ పరిభాష మాత్రమే కాదని, మానవహక్కులకు - మానవ సంస్కృతికి విడదీయలేని సంబంధం ఉన్నట్టు గమనించగలం.
నీవెలా నీ కనీస అవసరాలు తీర్చుకుంటూ సుఖ సంతోషాలతో, ప్రమాణాలతో జీవిస్తున్నావో, నీ సాటి మనిషి కూడా (కుల, మత, ప్రాంత, లింగ, బాషా, జాతి బేదాలు ఏవైనా) నీలాగనే సమంగా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకోవడమే నిజమైన సంస్కారం. అందుకే మానవులందరం సమానంగా జీవించే హక్కుకై పోరాడదాం అనే నినాదం నేడు సర్వత్రా ప్రపంచ నినాదమైంది. కాగా మహిళా హక్కులు మానవహక్కులే అనే స్పృహ ఇప్పటికీ చాలా దేశాల్లో పాలకులకు లేకుండా పోయింది. మనం జీవిస్తున్నది పురుషాధిక్య ప్రపంచంలో కదా!
ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే ఇరాన్ దేశంలో ఇటీవల మహిళల నిర్బంధ హిజాబ్ వస్త్రధారణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పాల్గొన్న పదిహేనువేల మంది ప్రజానీకానికి (ఆడ, మగ) ఆ దేశ ప్రభుత్వం 'నిర్ణయాత్మక శిక్ష' విధించింది. గుణపాఠం పేరుతో ఉద్యమకారులకు మరణశిక్షలు సైతం అమలయ్యాయి. ఈ మధ్యకాలంలో ఉద్యమాన్ని ఊచకోత కోసిన సందర్భమిది.
దీనిని ఐక్యరాజ్యసమితికి సంబంధించిన 16మంది మానవహక్కుల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. శిక్షలను ఖరారుచేస్తూ ఆదేశ పార్లమెంటే తీర్మానం చేయడం గమనార్హం. దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసినందుకు ఆ 'దైవ ద్రోహులకు' శిక్ష విధించినట్టు తీర్మానం తెలిపింది. ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో దేవుని పేరిట ఇలా ఉద్యమకారులపై శిక్షలు వేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న ఉత్పన్నమయింది.
'ఒక్క ఇరాన్‌లోనే కాదు, చాలా దేశాల్లో మత రాజ్యాల్లో ఇప్పటికీ ఇలా దేవుని పేరిట, మతం పేరిట ప్రభుత్వాలు సాధారణ ప్రజల జీవితాల్లోకి, అలవాట్లలోకి అక్రమంగా చొరపడుతున్నాయి. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తు న్నాయి' అని ఆ ప్రతినిధులు వాపోయారు.
ఒక పక్క మానవహక్కులకు భంగం కలిగించే విధి విధానాలు రూపకల్పన చేస్తూ, మరో పక్క వాటికి వ్యతిరేకంగా సాగే ప్రజా ఉద్యమాలను హననం చేసే చర్యలు చేపట్టడం మానవ హక్కులకు ప్రాణాంతకమని వారు హెచ్చరించారు. ఇది నాణానికి ఒకవైపే. మరోవైపు మనిషి స్వేచ్ఛా జీవితం స్త్రీ-పురుషులందరికీ ఒకేలా ఉంటుందని, వేర్వేరుగా ఉండవని, ఇరాన్ మహిళ ఈ ఉద్యమం ద్వారా మరోసారి లోకానికి చాటింది.
మానవ హక్కులు ఎలా మనుగడ సాగిస్తున్నాయనే దానిని బట్టే రాజ్యం స్వభావాన్ని మనం అంచనా వేయగలం అంటాడు అంటోని గ్రాంసీ. ఉత్పత్తి సంబంధాల ద్వారా నెలకొనే మానవ సంబందాలు దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు సజీవంగా, సమిష్టిగా పటిష్టమొనర్చడంలోనే మానవ హక్కుల ఉద్యమం పురుడు పోసుకుంటుందని చెబుతాడు. ఆధిపత్య పాలకులు రాజ్యాన్ని ప్రధానశక్తిగా సమాజాన్ని ద్వితీయశక్తిగా నిలుపుతారని, జీవితాన్ని తలక్రిందులు చేయడం అంటే ఇదేనని వ్యంగ్యంగా చమత్కరిస్తాడు. మానవహక్కులకు ఎప్పుడూ సమాజమే కేంద్రం తప్ప రాజ్యం కానేకాదని గ్రాంసీ నిర్ద్వందంగా ప్రకటిస్తాడు. కనుకనే మానవహక్కుల ఉద్యమకార్యకర్తలు నిరంతరం మానవ సమాజానికి కాపుకొస్తూ రాజ్యంపై ధిక్కార స్వరం వినిపిస్తూంటారు.
(నేడు మానవహక్కుల దినం)
- కె. శాంతారావు
సెల్:9959745723