Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికార్:-యూఎన్ హెచ్ఆర్సీ మిమ్మల్ని సమకాలీన జాతి అహంకారంపై ప్రత్యేక విచారణ అధికారిణిగా నియమించింది. మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
అశ్విని:-ప్రత్యేక విచారణాధికారులు స్వతంత్ర నిపుణులు. జాత్యహంకారం గురించి మాట్లాడితే, అది జాతి, వర్ణం, వంశం, జాతికి సంబంధించిన మూలాలపై ఆధారపడే వివక్ష దృక్పథాన్ని బట్టి ఉంటుంది. నా అధికారిక దృష్టంతా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన జాత్యహంకారం పైనే ఉంటుంది. ఈ కారణంగా నేను ఆఫ్రికన్లు, ఆఫ్రికన్ పూర్వీకులు, వలస వచ్చిన వారితో పాటు యూరప్, ఉత్తరమెరికాలో ఆసియా వలసదారులు, ప్రపంచ వ్యాప్తంగా వారి సామాజిక, మత అస్థిత్వం కారణంగా గురవుతున్న అసహనం లేదా వివక్షపై నా దృష్టిని కేంద్రీకరిస్తాను.
వికార్:-మీరు ఆసియాలో ముఖ్య పాత్రను పోషిస్తున్న మొట్టమొదటి వ్యక్తి. మీ లింగ, కులాల వల్ల ఏర్పడ్డ చరిత్ర ద్వారా ఉపశ్రేణీకృత(మార్జినలైజ్డ్) వర్గంగా ఉన్న ఒక గ్రూపునకు దళిత మహిళగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాతినిధ్య రాజకీయాల్లో మీ నియామకం యొక్క అర్థం ఏమిటి?
అశ్విని:-ఒక కార్యకర్తగా, ఒక విద్యావేత్తగా సామాజిక మినహాయింపు(సోషల్ ఎక్స్‌క్లూజన్)ను అధ్యయనం చేస్తున్న వ్యక్తిగా, ముఖ్యంగా ప్రపంచ వేదికపై విధాన నిర్ణయాలు చేయడం లాంటి అంశాలను గుర్తించే విషయంలో ప్రాతినిధ్యం చాలా ముఖ్యమని నేను భావిస్తాను. ఉపశ్రేణీకృత వర్గాల నుంచి ముఖ్యంగా దక్షిణాసియా నుండి వచ్చే ప్రాతినిధ్యాన్ని మనం చాలా అరుదుగా చూస్తాం. జాత్యహంకారం, విదేశీజనభీతి అనేవి విద్య, ఇతర అవకాశాలను వినియోగించుకోవడంలో ఒక వ్యక్తి లేదా సమూహంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో నేను అర్థం చేసుకోగలను. కాబట్టి ఒక దళిత మహిళగా నా వ్యక్తిగత అనుభవం ఇక్కడ సందర్భోచితంగా ఉంటుంది. ప్రగతిశీలమైన స్వేచ్ఛలలో నేను కుల వివక్షతను ఎదుర్కొన్నాను కాబట్టి ఆ అనుభవాలు జాతి సమస్యల్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయనుకుంటాను. ఒక దళిత మహిళ ప్రాతినిధ్యం సమస్యలను గురించి ఆలోచించే తీరును మార్చుతుంది.
వికార్:-ప్రత్యేక విచారణాధికారి పాత్రల్లో జాత్యహంకారం, విదేశీ జనభీతి, అసహనంపై వచ్చే ఆరోపణలను వివరంగా పరిశీలించే అవకాశాలలో ''నిజనిర్ధారణ దేశ సందర్శన'' ఒకటి. మీరు సందర్శించబోయే దేశం, అక్కడ మీరు విచారించబోయే సమస్యలేమైనా గుర్తించారా?
అశ్విని:-నేను ప్రత్యేక విచారణాధికారిగా ఒక దేశం సందర్శించాలంటే, మేము పౌరసమాజంతో లేదా ప్రభుత్వ ప్రతినిధులతో స్వేచ్ఛగా కలిసే అవకాశాన్ని కల్పిస్తూ సంబంధిత ప్రభుత్వం అధికారికంగా నన్ను ఆహ్వానించాల్సి ఉంటుంది. కాబట్టి మేమింకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఉత్తర, దక్షిణమెరికా లేదా యూరోప్ దేశాల్లో పరిస్థితిని సూక్ష్మంగా పరిశీలించాల్సి ఉంది. ఈ దేశాల్లో ఇటీవలి కాలంలో ఉపశ్రేణీకృత వర్గానికి చెందిన ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని విధించిన అనేక సంఘటనలున్నాయి. దాంతోపాటు మా పని ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్ డీజీ)కి అనుసంధానంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
వికార్:- ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సదస్సు జాతి వివక్షతను చాలా విస్తృతంగా నిర్వచించింది... ''జాతి, వర్ణం, జాతి మూలాల పై ఆధారపడే ఎటువంటి ప్రత్యేకత, మినహాయింపు, అదుపు, లేదా ప్రాధాన్యత ఇవ్వడం, అదే విధంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక లేదా ప్రజాజీవితంలో ఏ రంగంలోనైనా మానవ హక్కులకు, ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించడం.'' అంటే, భారతదేశంలో దళితులకు వ్యతిరేకంగా జరుగు తున్న క్రూరమైన, హింసాత్మక చర్యలను పరిశీలించే అధికారం మీరు కలిగి ఉంటారని అనుకోవచ్చా?
అశ్విని:- దళిత సమాజాన్ని లేదా అంటరాని సమాజాన్ని (ముఖ్యంగా ఉపశ్రేణీకృత వర్గాన్ని) చూస్తే, ఇది కేవలం దక్షిణ ఆసియాకు మాత్రమే పరిమితమై లేదు. ఎందుకంటే, కులమనేది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి, స్వదేశంలోనే కాక విదేశాల్లో పనిచేస్తున్న ప్రజల్లో కూడా చాలా సమర్థవంతంగా పని చేస్తున్నది. ఈ విషయాన్ని ఇంతకు ముందున్న జాంబియాకు చెందిన ప్రత్యేక విచారణాధికారి కూడా ఉదహరించారు. నాకుండే అధికారంతో పాటు, జాతి ఆధారంగా సాగుతున్న వివక్షకు సంబంధించిన సమస్యల గురించి ఆలోచించే ఇతర యంత్రాంగాలు కూడా ఐక్యరాజ్యసమితిలో ఉన్నాయి. దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న మినహాయింపు(ఎక్స్ క్లూజన్) ఆచారాల్ని కూడా నేనుదహరిస్తాను.
వికార్:- ఒక దేశం లేదా రాష్ట్రమంటూ లేకుండా రోహింగ్యాలు బాధపడుతుండటం చాలా విచారకరం. దీర్ఘకాలంగా సంక్షోభంలో ఉన్న వీరికోసం మీ పదవీకాలంలో ఏవైనా పరిష్కారమార్గాలను వెతికే ఆలోచనలేమైనా చేస్తారా?
అశ్విని:-రోహింగ్యా సమస్య చూస్తే, వారూ ముస్లింలే అనే భావన వారిని మరింత బలహీనుల్ని చేస్తుంది. వలస ప్రజానీకం ఎదుర్కొంటున్న వివక్షను పరిగణలోకి తీసుకునే అధికారం ఉంటుంది కానీ, రోహింగ్యాల సమస్య చాలా సంక్లిష్టమైనది. రోహింగ్యాల సమస్య తీసుకుంటే అది ఒక నిర్దిష్టమైన దేశానికి సంబంధించిన సమస్య. ఒకవేళ మయన్మార్‌ను సందర్శిస్తే, ప్రజల దృష్టిని మరల్చే విధంగా నేనా సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. ఈ సమస్య గురించి ఐక్యరాజ్యసమితి కూడా చాలా కాలంగా ఆలోచిస్తూ ఉంది. నాకవకాశం ఇస్తే సమస్య పరిష్కారానికి పని చేయడం సంతోషం.
వికార్:-ప్రత్యేక విచారణాధికారిగా మీ పదవీకాలంలో కేంద్రీకరించే ప్రధాన సమస్యలేంటి?
అశ్విని:-జాతి అహంకారం, విదేశీ జనభీతి, ఇతర అసహనాలు ఉపశ్రేణీకృత వర్గంలోని మహిళలపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయనే దానిపై నేను కేంద్రీకరిస్తాను. అదేవిధంగా లెస్బియన్లు, స్వలింగ సంపర్కులు, ద్విలింగా త్మకమైన వారు (బై సెక్సువల్), ట్రాన్స్ జెండర్లు వివక్షకు గురవుతున్నారు. కానీ లింగవివక్ష గురించి మాట్లాడాల్సినంతగా మాట్లాడ్డం లేదు.
వికార్:- కులవివక్ష కూడా జాతివివక్షకు సమానమైందని దళిత కార్యకర్తలు వాదించిన తరువాత దర్బన్‌లో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరిగిన 2001 ప్రపంచ మహాసభ కులం, జాతి గురించి ఒక పాత చర్చను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై మీ దృష్టికోణం ఏమిటి? జాత్యహంకార రూపంగానే కులవ్యవస్థ యొక్క శ్రేణీగత వ్యవస్థను లేదా అంతస్థుల దొంతరను చూడొచ్చా?
అశ్విని:- కులం, జాతి ఈ రెండూ ఒకటి కాదు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రెంటినీ చూసినప్పుడు వాటిని వివక్ష యొక్క అధ్వాన్నమైన రూపాలుగా గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. జాతి సమస్యను పరిష్కరించే విధంగానే కులసమస్యనూ పరిష్కరించాలి. నేడున్న పరి స్థితులు (ముఖ్యంగా దర్బన్ మహాసభ తర్వాత) మారాయి.
కులం అనే పదాన్ని ఉదహరించే సదస్సు ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో లేనప్పటికీ, దాన్ని పూర్తిగా కొట్టిపారేయలేదు. దాన్ని నేను నిర్దిష్టంగా ఉదహరించాలను కుంటున్నాను. ఎందుకంటే, అనేక సదస్సులు, కార్మిక సమూహాలు దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసను గురించి ఆందోళన చెందుతున్నాయి కాబట్టి సాంకేతికంగా కులం, జాతి భిన్నమైనవి. ఈ రెండు సమస్యల సమాన పరిష్కారం కోసం ఒక ప్రపంచ వేదికపై ప్రస్తావించడం సరైందని భావిస్తున్నాను.
వికార్:- మీ విద్యావిషయక పరిశోధన, వృత్తిపరమైన పనిలో ఎక్కువ భాగం దళిత క్రియాశీలత పైనే జరిగింది. కులవివక్షకు సంబంధించి అనేక సందర్భాల్లో దళితక్రియాశీలత ప్రధాన పాత్రను పోషించింది కానీ, భారతదేశంలో అంబేద్కర్ వాదాన్ని దళితుల్లో వ్యాప్తి చెయ్యలేదు. దీన్ని గురించి ఏమంటారు?
అశ్విని:-అంబేద్కర్ వాద భావజాలాన్ని చూస్తే, భిన్నమైన వ్యక్తులు అంబేద్కర్‌ను చూసే దృష్టి భిన్నంగా ఉందనుకుంటున్నాను. అది ఆయన భావజాలంలో భిన్నమైన దృష్టికోణాలకు దారి తీసింది. ఒక నిర్దిష్టమైన మార్గంలో మాత్రమే అంబేద్కర్‌ను చూడాలనే భావాన్ని విధించడం మాకు చాలా కష్టమైన విషయం. కొందరు ఆయనను ఒక మేథావిగా చూస్తే, కొందరు ఆథ్యాత్మికవాదిగా (ఆయన బౌద్ధమత భావనల ప్రకారం), సంఘ సంస్కర్తగా, న్యాయకోవిదునిగా, రాజ్యాంగ నిర్మాతగా చూస్తున్నారు. ఆయన్ను చూసే దృష్టికోణం రాష్ట్రాల మధ్య కూడా భిన్నంగా ఉంది.
మహారాష్ట్రలో దళిత ఉద్యమం చాలా శక్తివంతమైనది. ద్రవిడ ఉద్యమ ప్రభావం ఉన్న తమిళనాడులో అంబేద్కర్‌ను చూసే దృష్టికోణం భిన్నంగా ఉంటుంది. రాజకీయంగా వామపక్షం, అంబేద్కర్ వాదులు కలిసి పని చేస్తున్న ఉద్యమాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి.
లింగ వివక్ష విషయంలో అంబేద్కర్ తత్వశాస్త్రాన్ని అవగాహన చేసుకోవాల్సిన వర్గాలున్నాయని నేనిప్పటికీ నమ్ముతాను. లింగ వివక్షపై అంబేద్కర్ దృష్టికోణాన్ని తెలిసో, తెలియకో ఇంకా అనేక వర్గాలు పరిగణలోకి తీసుకోవడం లేదు కాబట్టి దానిపై ఒత్తిడి చేయాలనుకుంటున్నాను. లింగ సాధికారతపై అంబేద్కర్ సిద్ధాంతం అత్యంత ప్రగతిశీలమైన సిద్ధాంతాలలో ఒకటి, కానీ చాలా మంది ఆయన సిద్ధాంతాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు.
వికార్:-అంబేద్కర్ జీవితం, పని విధానం మీ ప్రేరణకు వనరని మీరింతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సమకాలీన జాత్యహంకార వివక్షపై ప్రత్యేక విచార ణాధికారిణిగా అంబేద్కర్ భావాలనెలా ఉపయోగిస్తారు?
అశ్విని:-చిన్నతనం నుండి అంబేద్కర్‌ను ఆరాధించిన వ్యక్తిగా, ఆయన సమానత్వ, సౌభ్రాతృత్వ భావనలు నాకు బాగా తెలుసు. ఈ ధోరణులు స్వాతంత్య్ర భారతదేశంలో దళితులు, ఇతర అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. బాబాసాహెబ్ ఆలోచనలతో ప్రభావితమైన వ్యక్తిగా నేనీ ప్రపంచాన్ని మారుస్తానని చెప్పను కాన్ని ప్రయోజనాలు సాధించవచ్చు.
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్, 9848412451