Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాకు రేపు సెలవు కావాలి సార్...' అన్నాడట ఓ విద్యార్థి. ఎందుకురా..? అని మాష్టారు అడిగితే... 'నాకు రేపు జ్వరం వస్తుంది సార్...' అన్నాడట ఆ కొంటె పోరడు. ఇటీవల రాష్ట్ర రాజకీయ పరిణామాలు సైతం ఇదే తరహాలో కొంటెకొంటెగా సాగుతున్నాయి. నేతల విన్యాసాలు, విచిత్ర వ్యాఖ్యానాలతో రంజుగా అవి కొనసాగుతున్నాయి. ఎప్పుడో ఎనిమిదేండ్ల కిందట ఏర్పడ్డ తెలంగాణ గురించి పొరుగు రాష్ట్ర నేత సజ్జల రామకృష్ణారెడ్డి అసందర్భంగా మాట్లాడటం, అంతకు కొద్ది రోజుల ముందే జగనన్న మోడీతో భేటీ కావటం, ఆ వెంటనే అధికార టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన వ్యాఖ్యలను ఖండ ఖండాలుగా ఖండించటాన్నిబట్టి 'ఎక్కడో ఏదో జరుగుతున్నది...' అనే సంకేతాలు వెలువడక మానటం లేదు. మరోవైపు ఎందుకోసం చేస్తున్నారో..? ఎవరి కోసం చేస్తున్నారో తెలియకుండా షర్మిలక్క తన పాదయాత్ర ప్రహసనాన్ని, ఆ క్రమంలో దీక్షలతో కూడిన ఉపవాసాన్ని చేస్తూ టీఆర్ఎస్పై... సారీ సారీ, బీఆర్ఎస్పై అదే పనిగా 'బాణాలు' ఎక్కుపెడు తున్నారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బీఆర్ఎస్కు ఆమోదముద్ర పడిన క్షణాల వ్యవధిలోనే గులాబీ బాస్... దాని ఆవిర్భావానికి ముహూర్తం ఖరారు చేయటం, అది కూడా గంటలు, నిమిషాలతో సహా ప్రకటించటం నిజంగా ఆశ్చర్యంతో కూడిన 'హా'శ్చర్యమే. మరోవైపు ఈడీ విచారణను ఎదుర్కోబోతున్న ముఖ్యమంత్రి తనయ... రోజూ కార్యకర్తలకు విజయ సంకేతాలు చూపటం, ఆమె ఇంటికి తండోపతండాలుగా జనం రావటం (రప్పించటం) గమ్మత్తైన పరిణామాలే. ఈ పరిమాణాలన్ని చూస్తున్న సామాన్యుడు మాత్రం... లోగుట్టు పెరుమాళ్లకే ఎరుకంటూ సణుగుతూ... అపరిష్కృత సమస్యలతో సర్దుకుపోతూ ఉన్నాడు. పాపం...
-బి.వి.యన్.పద్మరాజు