Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు వార్తలు రాజకీయాలను మలుపుతిప్పేవి. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకొచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మరో అద్భుతం. వాటికి ఆ తర్వాత పాపులారిటీ విపరీతంగా పెరిగింది. ప్రజలను సైతం అవి బాగా ప్రభావితం చేశాయి. ఈ పరిణామాలను గమనించిన పాలవర్గాలు... క్రమేణా ఎలక్ట్రానిక్ మీడియాను, ఛానళ్లను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. సొంతంగా మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే వాటి యాజమానులే రాజకీయాల్లోకి రావడం, ఏదో ఒక పార్టీకి అనుబంధంగా విభాగంగా మారడం... 24 గంటల వార్తలు ప్రసారం చేయడం మొదలైంది. దీంతో వార్తను వార్తగా ప్రసారం చేయకుండా కౌంటర్ ఇచ్చే అధికార ప్రతినిధులుగా అవి మారాయి. ఇలాంటి విపరీత పరిస్థితులే వాటిని జనం అసహ్యించుకునేలా చేశాయి. ఎక్కడైనా ఓ క్రైమ్ జరిగితే, ఇగ జూసుకో నా సామిరంగ... చెవుల్లోంచి రక్తం చిమ్మేలా బ్రేకింగ్ న్యూస్లు, వ్యూస్లు పెడతారు. ఇలా క్రైమ్ వార్తలు శృతి మించడంతో వాటి పట్ల అనాసక్తి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సోషల్మీడియా రాకెట్లా దూసుకొచ్చింది. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాఫ్, ఇన్స్ట్రాగ్రామ్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలు సంచనాలు సృష్టిస్తున్నాయి. ఇందులో నిరుద్యోగ యువత, రాజకీయ నేతలు ఎవరికి వారే యూట్యూబ్ ఛానళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. తమకు నచ్చిందే వార్త, రాసిందే వార్త అనే రీతిలో వాస్తవాలతో సంబంధం లేకుండా అదే పనిగా దంచికొడుతున్నారు. ఈ క్రమంలో నిక్కచ్చిగా వార్తలు రాసే మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉన్నది. రేటింగులు, వ్యూస్ల భ్రమలకు గురి కాకుండా వాస్తవమేదో, అవాస్తవమేదో గుర్తించాల్సిన అవసరం ఉన్నది.
-గుడిగ రఘు