Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోజు ఆదివారం. శేఖర్ తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుతున్నాడు. ఇంతలో బయట గేటు వద్ద అలికిడి కావటంతో బయటకు వచ్చి చూశాడు. ఆనందంతో కెవ్వుమని కేకవేయబోయి తాను పెద్దవాడినయ్యానని గుర్తొచ్చి ఆగిపోయాడు. గేటు వద్ద కన్పించింది తన స్కూలు మిత్రులు, ఇంకా సరిగ్గా చెప్పాలంటే బెంచిమెట్స్.
''రండిరా లోపలికి!'' అంటూ సాదరంగా ఆహ్వానించాడు తన బెంచ్మెట్సయిన రాజేష్, సురేష్లను. వీరు ముగ్గురూ కరోనా తగ్గిన తర్వాత ఇదే కలవడం. ముగ్గురూ మాటల్లో పడ్డారు. శేఖర్ భార్య లక్ష్మి అందరికి చాయి తెచ్చి ఇచ్చింది. సాదరంగా పలకరించింది.
మిత్రులు చాలాకాలం తర్వాత కలిసినందున రకరకాల విషయాలు చర్చించుకుంటున్నారు. అనుకోకుండా చర్చ ప్రవచనాల వైపు మళ్ళింది.
''రేరు! మీరు ఎన్నైనా చెప్పండి! శర్మగారి ప్రవచనాలు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతత వస్తుంది! ఆఫీసులో పడ్డ కష్టమంతా ఇట్టే మాయమైపోతుంది. మనుషుల మధ్య మనం ఎలా మెలగాలో కర్తవ్యబోధ చేసినట్లుంటుంది!'' అన్నాడు రాజేష్.
''నిజమే! కాని రావుగారి ప్రవచనాలు నాకు బాగా నచ్చుతాయి! ఎందుకంటే సమకాలీన అంశాలను, చాలా తేలికగా ఆధునికంగానే సుతిమెత్తగా నొక్కి చెబుతారు! నిర్మిహమాటంగా కూడా ఉంటారు. అందుకు నేను ఆయన ఆభిమానిగా మారిపోయాను!'' అన్నాడు సురేష్.
''ఏదేమయినా ఇలాంటి ప్రవచనకారులు నేటి సమాజానికి ఎంతో అవసరం! సమాజాన్ని మార్చగల శక్తి, సామర్థ్యాలు మన ప్రవచనకారుల సొంతం!'' అన్నాడు భక్తి భావంతో రాజేష్
''మన ప్రవచనకారుల అనర్గళ ఉపన్యాసాలు, సమయోచిత వ్యాఖ్యలు... మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులను ఆలవోకగా, ఎంతో అర్థవంతంగా సందర్భానుసారంగా ఉల్లేఖించటం మానవ మాత్రులకు సాధ్యం కాదు! మన ప్రవచన కారులు సాక్షాత్తూ సరస్వతీ పుత్రులు!'' అన్నాడు సురేష్ తన్మయత్వంతో.
''ఎంట్రాబాబు! ప్రవచనకారులను తెగ మోసేస్తున్నారు!'' అన్నాడు శేఖర్ నవ్వుతూ.
''రేరు నువ్వు ఎప్పుడైనా ఆ ఇద్దరు ప్రవచనాలు చెబుతుంటే విన్నావా? కనీసం ఒక్కరి ప్రవచనమైనా విన్నావా! అయినా వారి ప్రవచనాలు వినాలంటే అదృష్టం కావాలి!'' అన్నాడు సురేష్.
''ప్రత్యక్షంగా వినలేకపోయినా, కనీసం యూట్యూబ్‌లోనైనా వినరా! కనీసం నీలో కొంతైనా మార్పు వస్తుంది!'' అన్నాడు రాజేష్.
''నిజమా! ప్రవచనాలు వింటే మనుషులు మారుతారా?'' అనుమానంగా అడిగాడు శేఖర్.
''వారి ప్రవచనాలు వింటే తప్పక మారతారు!'' నమ్మకంగా చెప్పాడు సురేష్.
''ప్రవచనాలు విని మారిన వారెందరో ఉన్నారు. అందుకు కారణం ప్రవచనకారుల గొప్పతనమే కాక, మన సంస్కృతీ, సంప్రదా యా ల గొప్పతనం కూడా కారణం!'' అన్నాడు రాజేష్.
''నిజమా! సమాజంలో ఈనాడు కొన్నైనా నైతిక విలువలు నిలిచి ఉన్నాయంటే దానికి కారణం ఇలాంటి ప్రవచనకారులే!'' అన్నాడు సురేష్.
''అదే నిజమయితే! మీరు సగం సగం బట్టలు వేసుకోకండమ్మా, మాలాంటి వాళ్ళమే ఆగలేకపోతున్నామని ఒక ప్రవచన కారుడు ప్రవచనం చెబుతూనే అన్నట్లు నేను యూట్యూబ్‌లో చూశాను. ఇది కూడా నైతిక విలువలు నెలకొల్పే భాగమేనా?'' అమాయకంగా అడిగాడు శేఖర్.
రాజేష్, సురేష్ గందరగోళపడ్డారు. యూట్యూబ్‌లో చెక్ చేశారు. శేఖర్ చెప్పింది నిజమే!
''అవున్రా నిజమే! ఆయన చెప్పింది నిజమే! అది కూడా మన సంస్కృతీ, సంప్రదాయ పరంపరలో భాగమే!'' అన్నాడు రాజేష్... శేఖర్‌కి తలగిర్రున తిరిగింది!
''దైవాంశ సంభూతుల్లా చూడబడుతున్న ప్రవచనకారులు, ఆగలేకపోతున్నామని చెప్పటం మన సంస్కృతీ, సంప్రదాయం అవుతుందా?'' ప్రశ్నించాడు శేఖర్.
''అదంతా మన పురాణాల్లోనే ఉంది! మేనకను చూసి విశ్వామిత్రుడు, జగన్మోహినిని చూసి మహాశివుడూ ఆగలేకపోయారు. అదే కోవకు చెందిన వారు మన ప్రవచనకారులు. అందుకే ఆగలేకపోతున్నామని చెప్పారు! అందులో తప్పేముంది?'' ఎదురు ప్రశ్నించాడు సురేష్.
ఈసారి శేఖర్ గింగిరాలు తిరిగి కిందపడబోయి తమాయించుకున్నాడు! ఏమిటిది ప్రవచనకారులు ఇంతగా ప్రభావం చూపుతున్నారా? ఏం మాట్లాడాలో అర్థం కాలేదు! అటూ ఇటూ చూశాడు. తన జీవితభాగస్వామి కనబడింది! ఆదుకోమన్నట్లు అర్థింపుగా చూశాడు.
మిత్రుల మాటలు మొదటి నుండీ వింటున్న లక్ష్మి, చిన్నగా నవ్వింది!
''ఎందుకమ్మా! నవ్వుతున్నావు! మేము మాట్లాడుతున్న మాటలు నీకు నవ్వు తెప్పించాయా?'' అన్నాడు సురేష్.
''అందుకే కదన్నా నువ్వుతున్నాను!'' నవ్వుతూనే అన్నది లక్ష్మి.
ముగ్గురు మిత్రులకీ లక్ష్మి మాట్లాడుతున్న దేమిటో అర్థం కాలేదు! గందరగోళంగా చూశారు.
''ఇందులో గందరగోళమేమీ లేదు! ప్రవచనకారులను, దైవాంశ సంభూతులుగా మీరు చూస్తున్నారు! కాని వారేమో మానవ మాత్రులకు ఉండే ఇంద్రియ నిగ్రహాన్ని కూడా పాటించటం లేదు! పైగా వారి బలహీనతలకు, పురాణాల్లోని, వేదాల్లోని సంఘటనలను, పాత్రలను ఉటంకిస్తున్నారు! ఇదేనా వారి గొప్పతనం! ఇలాంటి పద్ధతులు సమాజంలో నైతిక విలువలు నిలబెడుతాయా?'' ప్రశ్నించింది లక్ష్మి అంతటితో ఆగకుండా...
''మరి మగవాళ్ళు సగం బట్టలు కట్టుకోవచ్చా!'' టక్కున ప్రశ్నించింది లక్ష్మి.
''రాజేష్, సురేష్‌లకు పొలమారింది! మంచినీళ్ళ కోసం వెదుక్కున్నారు!
''మగవాళ్ళు అర్థనగంగా కనబడితే అశ్లీలతకాదు! కాని మహిళలు పంజాబ్ డ్రెస్ వేసుకుంటే అశ్లీలత అవుతుందా? ఇది స్త్రీ, పురుష సమానత్వమా? లేకపోతే మాట్లాడేవారి పుర్రెలకు పట్టిన బూచి ఫలితమా?'' మిత్రులకు నీళ్ళు అందిస్తూనే ప్రశ్నించింది లక్ష్మి.
ఆదరాబాదరాగా నీళ్ళు తాగేశారు మిత్రులు.
''ప్రవచనకారులు లేకపోతే సమాజం చెడిపోతుందనుకోవటం మన మూర్ఖత్వం! ఈ ప్రవచనకారుల వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు! కాలం చెల్లిన ఆచార, సాంప్రదాయాలను, సామాజిక అంతరాలను, అణిచివేతను సమర్థించే ఈ ప్రవచనాలు సమాజాన్ని వెనక్కి నడిపిస్తున్నాయి! మన పెద్దలు స్వాతంత్ర పోరాటం చేసి, తెల్లవారిని దేశం నుండి తరిమికొట్టినప్పుడు ఇలాంటి ప్రవచనాలు ఎవరైనా చెప్పారా? ప్రవచనాలు స్వాతంత్య్ర యోధులను తయారు చేశాయా?'' ప్రశ్నించింది లక్ష్మి.
లేదన్నట్లు తలూపారు మిత్రులు.
''మార్కొని రేడియో కనిపెట్టినప్పుడు, గ్రహంబెల్ టెలిఫోన్ కనిపెట్టినప్పుడు, భారతీయులు సున్నాను, చదరంగాన్ని కనిపెట్టినప్పుడు వారంతా ఈ ప్రవచనాలు విని కొత్త అంశాలు కనిపెట్టలేదు! స్వాతంత్రద్యో మానికి, శాస్త్రీయ ప్రగతికి ప్రవచనాలు ఏనాడూ స్ఫూర్తికాలేదు! అంటే సూటిగా చెప్పాలంటే ఈ ప్రవచనాలు వట్టి మాటలు మాత్రమే! అందుకే మహాకవి గురజాడ మాటలు ఆచరణీయం!''
వట్టిమాటలు కట్టిపెట్టోరు! గట్టిమేలు తలపెట్టవోరు! అంటూ ముగించింది లక్ష్మి.
ముగ్గురు మిత్రులు అభినందనగా చప్పట్లు కొట్టారు.
- ఉషాకిరణ్