Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుజరాత్లో బీజేపీ సాధించిన పెద్ద విజయంతో దేశంలో మరోసారి బీజేపీ మోత పెంచే ప్రయత్నం కనిపిస్తుంది. బీజేపీ అనుకూల శక్తులైన కొందరు మేధావులూ, మీడియా కూడా ప్రధాని మోడీకి జేజేలు పలికి అలిసిపోతున్నారు. ముప్పై ఏండ్ల కాలంలో అక్కడ ఎవరికీ రానన్ని స్థానాలు సాధించి ఏడోసారి పీఠమెక్కనుండటం పెద్ద విషయమే. ఇప్పటికీ బీజేపీ బెంగాల్లో సీపీఐ(ఎం) లెప్ట్‌ఫ్రంట్ సాధించిన రికార్డును అధిగమించవలసే ఉంది. కేంద్రంలో రెండోసారి మోడీ తిరిగివచ్చిన మాటా నిజమే. కాని మన్మోహన్సింగ్ ప్రభుత్వం కూడా రెండోసారి ఎన్నికవడం ఇటీవలి చరిత్రే. అన్నిటినీ మించి గుజరాత్‌తో పాటు ఎన్నికలకు వెళ్లిన హిమచల్‌ప్రదేశ్‌లో మోడీ మ్యాజిక్ పనిచేయలేదు. ఒకనాటి కంచుకోట లాంటి ఢిల్లీలో పదిహేనేండ్లుగా ఏలుతున్న నగరపాలక సంస్థ చేజారిపోయింది. వీటితో పాటు జరిగిన ఉప ఎన్నికలలోనూ బీజేపీ వ్యతిరేకుల విజయాలే ఎక్కువ. మూడుచోట్ల మూడురకాల ఫలితాలు వచ్చినా గుజరాత్‌నే లెక్కలోకి తీసుకుని మోడీ 2024లోనూ రాబోతున్నారన్నట్టు చిత్రించడం మైండ్‌గేమ్ అనుకోవాలి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ ముందైనా ఏ దశలోనూ గుజరాత్లో బీజేపీ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, మరీ ముఖ్యంగా దాని అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో గుజరాత్‌ను లైట్ తీసుకున్నప్పుడే వారి అంచనా అర్థమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని చోట్లా పోటీపెడతానని ప్రకటించినప్పుడే ఓట్ల చీలిక బీజేపీకే మేలుచేస్తుందని ఖాయమైంది. మరో వైపున ఏడాది ముందునుంచే మోడీ గుజరాత్ ప్రధాని అవతారమెత్తారు. గుజరాత్ అస్మిత, గుజరాతీ ఆత్మగౌరవం నినాదాలెత్తుకున్నారు. అయినా తమ వాస్తవ పరిస్థితీ తెలుసు గనక చివరి నిముషంలో ముఖ్యమంత్రి విజయరూపానిని మార్చి భూపేంద్ర పటేల్‌ను తెచ్చారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎంఎల్ఎలనూ సామాజిక వర్గాలనేతలనూ చేర్చుకుంటూ వచ్చారు. హార్దిక్ పటేల్, అల్పేష్ టాగూర్ తదితరుల జాబితా చాలాపెద్దది. తమ వాళ్లలో మూడోవంతు మంది అభ్యర్థులనూ మార్చారు.
పాచికల ప్రయోగం, విద్వేష విహారం
బీజేపీకి రెండు మూల స్తంభాలాంటి హిందూత్వ వ్యూహాలు, కార్పొరేట్ శక్తుల నిధుల వానలు అత్యధిక స్థాయిలో నడిచాయి. ఎన్నికల బాండ్ల విడుదల సమయం మార్చి ప్రత్యేకంగా ఒకవారం అవకాశమిచ్చారు. చేతులెత్తేసిన కాంగ్రెస్, ఓట్లు చీల్చడానికి సిద్ధంగా ఆప్ ఉంటే బీజేపీ నేతలు సామదాన భేద దండోపాయాలను ప్రయోగించారు. 2002లో గోద్రాఘటనలకు ప్రతీకారం తీర్చుకున్నామని సాక్షాత్తూ హోంమంత్రి అమిత్ షా వచ్చి చెప్పారు. కాంగ్రెస్ నేతల ప్రచారాలకు సమాధానంటూ రాముడినీ ఎన్నికల ప్రచారంలో దింపారు. గత ఇరవైఏండ్లుగా మారుమూలవాడలలో బెరుకుబెరుకుగా బతుకున్న ముస్లిం బాహుళ్యాన్ని పూర్తి భయోత్పాతానికి గురిచేశారు. ఒక్క ముస్లిం అభ్యర్థినీ నిలబెట్టలేదు. ఎన్నికలకు ముందే కేంద్రరాష్ట్రాలు కూడబలుక్కుని బల్కిస్బాసో సామూహిక అత్యాచారం కేసు నిందితులను విడుదల చేశారు. కేంద్రం ఈ కాలంలో లక్షా ముప్పై వేల కోట్లు గుజరాత్‌కే కేటాయించింది. దీర్ఘకాల పునాది, అధికారబలం, విస్తారమైన ఎన్నికల యంత్రాంగం, ప్రధాని హోంమంత్రి మార్గనిర్దేశం కలిశాక 156కు చేరడంలో ఆశ్చర్యం ఏముంది? ఉదాహరణకు సౌరాష్ట్రలో తాము బలహీనం గనక కాంగ్రెస్‌నుంచి చేరిన ఇరవైమందికి అక్కడే టికెట్లిచ్చి గెలిపించుకున్నారు. ఆప్ ఓట్ల చీలిక కారణంగా మరో ఇరవై స్థానాల దాకా తెచ్చుకున్నారు. ఫలితంగా కాంగ్రెస్ గతంలో వచ్చిన 77స్థానాల బదులు ఇప్పుడు 17, 40శాతం ఓట్లబదులు 26శాతం మాత్రమే తెచ్చుకోగలిగింది. 188 చోట్ల పోటీ చేసిన ఆప్ అయిదుస్థానాలకే పరిమితమైనా 13శాతం ఓట్లు తెచ్చుకుని జాతీయ పార్టీగా మారింది. దానివల్ల బీజేపీకి యాభై స్థానాలు అదనంగా వచ్చాయి. ఎన్నికల్లో ఎవరైనా ఎత్తులు పైఎత్తులు వేస్తారు కదా! అని ఎదురు ప్రశ్న రావచ్చు. మత రాజకీయాలు, కార్పొరేట్ వత్తాసు, కేంద్రనిధుల గుమ్మరింతలో పక్షపాతం రాజ్యాంగబద్దమేనా?
సంక్షేమానికీ అభివృద్ధికీ పోటీనా?
గుజరాత్లో మంచిపాలనకే ఓటు వేశారనీ, సంక్షేమం అబివృద్ధి మధ్య పోటీ అని అమిత్ షా దీన్ని వర్ణించారు. ఉచితాలకు గుణపాఠం చెప్పామన్నారు. మాతో పాటు మీడియా చర్చలలో పాల్గొన్న మేధావులు కొందరు ఇదే వాదన నెత్తినెత్తుకోవడం ఆశ్చర్యం కలిగించింది. కేంద్ర రాష్ట్ర పథకాలను ఎన్నికలలో గొప్పగా ప్రచారం చేసుకోవడమే గాక కొత్త వాగ్దానాలు కూడా చేశారని ఇంగ్లీషు పత్రికలు రాశాయి. వాస్తవానికి గుజరాత్లో గత ఐదేండ్ల పాలన చాలా కాలంగా ఘోరంగా నడిచింది. గనకే చివరిదశలో ముఖ్యమంత్రిని మార్చారు. 1960లో రాష్ట్రంగా ఏర్పడక ముందు నుంచే గుజరాత్ సంపన్న పారిశ్రామిక ప్రాంతం. అయితే బీజేపీ పాలనతో రాష్ట్రం సామాజిక సూచికల్లో దారుణంగా వెనకబడివుంది. జాతీయ సగటు వేతనం, ఆయుర్ధాయం, ఉపాధి కల్పన, కార్మిక భద్రత వంటివన్నీ అక్కడ దిగువనే ఉన్నాయి. కరోనాలో లక్షమంది ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రమది. 87వేల మందికి పైగా మరణించారని ఆ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో చెప్పింది. మోర్బీలో వంతెన కూలి 135మంది మరణించడం దేశాన్ని కలవరపర్చింది, గిరిజనుల ఉపాధికి గండిపడింది. గుజరాత్ మహారాష్ట్రల మధ్య నర్మది పర్ తపి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై జరిగిన ఆందోళన ఫలితంగా ప్రభుత్వం దాన్ని వదలివేసుకుంది. గో రక్షణ ముసుగులో ఆమోదించిన బిల్లు విస్తారమైన పశులకాపరుల ఆందోళన వల్ల ఆఖరిరోజున ఉపసంహరించుకోవలసి వచ్చింది. పైన చెప్పినట్టు సామాజిక వర్గాల నాయకులుగా ముందుకొచ్చిన యువనేతల ఆందోళన ఒక దశలో తీవ్ర సవాలు విసిరింది. జీతభత్యాలు ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వోద్యోగలు అనేక అందోళనలు చేశారు. రైతాంగసమస్యల తీవ్రతపై వారికి అనుకూలమైన భారతీయ కిసాన్ యూనియన్ కూడా ఉద్యమించవలసి వచ్చింది. హిందూత్వ పేర దాడులు, విషప్రచారాలు సరేసరి. అయితే ఆప్ కాంగ్రెస్‌లకు తమ తమ స్థానాన్ని కాపాడుకోవడం తప్ప బీజేపీని ఓడించడం లక్ష్యంగా లేదు. కనుకనే అన్నిచోట్లా పోటీ పడి రాష్ట్రాన్ని ఆ పార్టీకి సమర్పణ చేశారు. ఇప్పటి వరకూ మతతత్వ రాజకీయాలు, నిరంకుశ పోకడల గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సూటిగా మాట్లాడింది లేదు. తమకు రాజకీయాల కన్నా ప్రజల సమస్యలే ముఖ్యమని అంటుంటారు. ఆప్ పోటీ కాంగ్రెస్ స్థానాన్ని కైవశం చేసుకోవడానికి తప్ప తమపైన కాదని బీజేపీ నేతలే కుండబద్దలు కొట్టిచెబుతున్నారు. ఇలాగే అన్ని చోట్లో ఆ పార్టీ పోటీలో ఉండాలని కోరుకుంటున్నారు. ఏతావాతా గుజరాత్ ఎన్నికలు లౌకికశక్తుల ఓట్ల చీలిక వల్ల కలిగే ముప్పు గురించి హెచ్చరిస్తున్నాయి. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌పార్టీల మధ్య ఓట్ల చీలిక ఇలాగే బీజేపీ నెత్తిన పాలుపోసిందని గుర్తుంచుకోవాలి.
హిమాచల తీర్పు
ఇదే సమయంలో జరిగిన హిమచల్‌ప్రదేశ్ చిన్న రాష్ట్రమైనా కాంగ్రెస్ గెలుపు ఏకపక్ష నిర్ధారణలకు పగ్గాలు వేసింది. ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వం మారే ఆనవాయితీ అక్కడ ఉన్నా ఈ సారి ఆ ఆనవాయితీని మార్చేస్తామని(రివాజ్ బదలే) బీజేపీ గొప్పలు పోయి భంగపడింది. ఆ పార్టీ అధ్యక్షుడైన నడ్డా స్వరాష్ట్రంలో శాంతకుమార్ ప్రేమ్ కుమార్ ధమాల్ వంటివారు మోడీకి భిన్నంగా వాజ్‌పేయి తరహాలో ప్రచ్చన్న రాజకీయాలనే అమలు చేస్తూ వచ్చారు. కాశ్మీరియత్ అన్నట్టు హిమాచలియత్ అంటూ స్థానికాంశాలపైనే పోటీ సాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దిగిపోతున్న ముఖ్యమంత్రి జైర్రామ్ ఠాగూర్ ఆరెస్సెస్ నేపథ్యంలో అచ్చంగా ఆ ఎజెండానే నెత్తినెత్తుకున్నారు. రాష్ట్రంలో అవినీతిబెడద, అగ్నిపథ్‌పై అలజడి, రైతాంగం ముఖ్యంగా ఆపిల్ రైతుల సమస్యల వంటివి తీవ్ర ప్రభావం చూపించాయి. గుజరాత్‌ను పూర్తిగా వదలేసిన కాంగ్రెస్ హిమచల్‌లో మాత్రం ప్రియాంకను ప్రచారానికి తీసుకొచ్చింది. ఒక దశలో పోటాపోటీగా కనిపించినా చివరకు కాంగ్రెస్ మంచి అధిక్యతతో గెలవగలిగింది. ఆప్ ప్రభావం నామమాత్రమే అయింది. 68మంది సభ్యులున్న అసెంబ్లీలో 40 గెల్చుకున్న కాంగ్రెస్ వారిని మరోచోటికి తరలించాల్సి రావడం అభద్రతనే గాక బీజేపీ తరహా కుటిల రాజకీయాలను కూడా చెబుతోంది.
ఢిల్లీ కార్పొరేషన్ డిటో
ఈ ఫలితాలకు ఒక రోజు ముందే వచ్చిన ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలలో ఆప్ తొలిసారి ఘన విజయం సాధించింది. సంప్రదాయకంగా బీజేపీకి ఢిల్లీ కంచుకోట. షీలాదీక్షిత్ మూడుసార్లు గెలిచిన నేపథ్యంలో వారు ఢిల్లీ అసెంబ్లీని కోల్పోయారు. తర్వాత నుంచి ఆప్ హవా సాగుతున్నది. అయితే మునిసిపల్ కౌన్సిల్ మాత్రం వారి ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇప్పుడు అదీ చేజారి పోయింది. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో ప్రచారం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఢిల్లీ ప్రభుత్వం కన్నా ఈ మునిసిపాలిటీకే ఎక్కువ అధికారాలు నిధులు ఉండటం ఆప్‌కు కలసివచ్చే అంశం. ఇక ఈ సందర్భంగా ఉప ఎన్నికలు జరిగిన యూపీ, ఒరిస్సా, రాజస్థాన్‌లోనూ బీజేపీ ఓడిపోయిందే ఎక్కువ.
రాష్ట్రాలవారీ వ్యూహాలు
గతంలో కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడం గాని, బీజేపీని నిలవరించం గాని వామపక్షాలు లౌకికపార్టీల ఉమ్మడి పోరాటంతోనే సాధ్యమైంది. ఈ దేశంలో బహుళత్వ ప్రధానమైనది. బీజేపీని పాన్ ఇండియా పార్టీగా చిత్రిస్తున్నా అందులో పెద్దవి యూపీ, గుజరాత్ సుమారైనవి అస్సాం, త్రిపుర మాత్రమే. సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్ చిన్నవి. మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర లాంటివి ఎలాగో ఫిరాయింపుదార్లతో నెట్టుకువస్తున్నది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, బెంగాల్, ఒరిస్సా, బీహార్, పంజాబ్, ఢిల్లీ రాజస్థాన్, జార్ఖండ్, చత్తీస్‌ఘర్, కేరళ వంటి అనేకం ఇతరపక్షాల పాలనలో ఉన్నాయి. బీజేపీ అనురించే హిందూత్వ మతరాజకీయాలు, అదానీ అంబానీ కార్పొరేట్ విధానాలు తీవ్ర సవాలుగానే ఉన్నాయనడంలో సందేహం లేదు. పైగా ఇప్పుడు గుజరాత్ విజయాన్నీ రాబోయే జి20 అధ్యక్షత ప్రచారాన్నీ కలగలిపి పెద్దఎత్తునే హడావుడి మొదలైపోయిది. బీజేపీ కూటమి దాడిని ఎదుర్కొంటూనే విస్తారమైన ఈ లౌకిక ప్రజాస్వామిక శక్తుల పట్టును పెంచుకోవడం, మతతత్వ రాజకీయాలపై ఏకోన్ముఖ పోరాటంగా మలచడం ఈ ఎన్నికలు ఇస్తున్న గుణపాఠం. ఆయా రాష్ట్రాలకు తగిన ఎత్తుగదలు అనుసరిస్తూ లౌకిక పార్టీలు ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలి. 2023 పొడుగునా జరిగే వివిధ ఎన్నికలలో ఆ విధంగా బీజేపీని ఎదుర్కోవలసి ఉంటుంది. అంతిమంగా 2024 ఎన్నికల పోరాటం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీ చుట్టూ తిరుగుతుంటే, తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి బీజేపీతో తలపడతానంటుంటే, కాంగ్రెస్ పునరుద్ధరణకు పెనుగు లాడుతుంటే, వామపక్షాలు బీజేపీపై రాజీలేని పోరాటం చేస్తున్నాయి.
- తెలకపల్లి రవి