Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత ఎనిమిది సంవత్సరాల కాలంగా మోడీ ప్రభుత్వం దేశంలో కార్పొరేట్ రంగానికి ఏకపక్షంగా అంకితమై సేవలందిస్తున్నది. పెట్టుబడిదారుల కోసం ఇంత నిస్సిగ్గుగా పనిచేసిన ప్రభుత్వాన్ని బ్రిటిష్ వలస పాలకుల నుంచి అధికార బదిలీ జరిగిన తర్వాత మనమెన్నడూ చూడలేదు. మోడీ విధానాలతో దేశ ఆర్థికవ్యవస్థ చరిత్రలో చూడనంత వేగంగా పతానవస్థకు చేరుకున్నది. జీడీపీ వృద్ధిరేటు అధఃపాతాళానికి పడిపోయింది. విదేశీ మారక నిల్వలు కరిగి పోతున్నాయి. ద్రవ్యోల్భణం ఎనిమిదేండ్ల గరిష్టానికి చేరింది. పారిశ్రామికాభివృద్ధి తిరోగమనంలో ఉంది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. నిరుద్యోగం 45ఏండ్ల గరిష్టానికి చేరింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా ప్రజానీకం ఏడాది ఎన్ని బాధలు పడుతున్నా మోడీ ప్రభుత్వం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం మాత్రం తన దేశంలోని ధనవంతుల సేవలోనే తరిస్తోంది. వారికి బంగారు పంట పండిస్తోంది. ప్రతిపక్షాలు, విశ్లేషుకులు, పలు అంతర్జాతీయ నివేదికలే కాదు, ఇప్పుడు సాక్షాత్తూ ఫోర్బ్స్ పత్రిక సైతం ఇదే చెపుతోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కోట్లకు పడగలెత్తిన ఆయన కార్పొరేట్ మిత్రుడు గౌతమ్ అదానీ ఆస్తులు ఈ ఏడాది ఎంతగా పెరిగాయంటే ఆయన ఈ భూమి మీదనే అత్యధిక ధనవంతుల్లో రెండో స్థానం ఆక్రమించారు. అంతే కాదు బీజేపీ ప్రభుత్వ హయాంలో 2022లో దేశంలోని 100మంది అత్యంత ధనికులు మరింత ధనవంతులయ్యారని ఫోర్బ్స్ పత్రిక వివరాలతో సహా నవంబర్ సంచికలో ప్రకటించింది. భారతదేశంలోని అత్యంత ధనికుల ఆస్తులలో 30శాతం గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల వద్ద పోగుపడ్డాయని పత్రిక తెలిపింది. 100 మంది అత్యంత ధనికుల ఆస్తి 2022లో 2 లక్షల కోట్ల రూపాయలు పెరిగి మొత్తం 65లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నది. దేశంలోని తొలి 10 మంది ధనికుల ఆస్తి 31.70 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. 2021లో గౌతమ్ అదానీ ఆస్తి మూడు రెట్లు పెరిగి క్రమంగా ఆయన దేశంలోనే అత్యధిక ధనవంతు డయ్యాడు. 2022లో ఆయన ఆస్తి రెట్టింపై 12.3లక్షల కోట్ల రూపాయలకు చేరింది. దేశంలో రెండవ అతిపెద్ద ధనవంతుడైన ముఖేశ్ అంబానీ ఆస్తి విలువ 7.21లక్షల కోట్ల రూపాయలు. డీమార్ట్ సూపర్ మార్కెట్ చైన్ యజమాని రాధాకృష్ణ దాల్మియా 1.76లక్షల కోట్ల రూపాయలతో ధనవంతుల లిస్టులో మూడో స్థానంలోనూ, జిందాల్ గ్రూప్ ఛైర్ పర్సన్ సావిత్రి జిందాల్ 1.34లక్షల కోట్ల రూపాయలతో నాల్గవ స్థానంలోనూ ఉన్నారు. బజాజ్ కుటుంబం ఈ జాబితాలో పదో స్థానంలో ఉంది. ఈ ఎనిమిదేండ్లలో మోడీ ప్రభుత్వం వంద లక్షల కోట్ల అప్పు చేసింది. దేశాన్ని ఇంతగా అప్పుల ఊబిలో దించిన ఆయన పాలన ప్రజలకు ఏమి చేసిందంటే నిజానికి గుండుసున్నాయే. మోడీ ప్రజా వ్యతిరేక విధానాల వలన 84శాతం ప్రజల రాబడి తగ్గిపోయింది. ఇదే సమయంలో 12కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 60లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, దుకాణాలు మూతపడ్డాయి. కోవిడ్ విపత్తుతో ప్రజలు నానా బాధలు పడుతున్నప్పుడు దేశంలో ఆదానీ, అంబానీల సంపద రోజుకు 1000కోట్లు పెరిగింది. అధిక ధరలతో, ఉపాధులులేక కొనుగోలుశక్తి కోల్పోయి ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే దేశంలో శతకోటీశ్వరుల ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. మరోవైపు దేశంలో బహుళత్వ స్ఫూర్తికి బీజేపీ విఘాతం కలిగిస్తున్నది. ప్రజల మధ్య కుల, మత వైషమ్యాలను రెచ్చగొడుతూ దేశాన్ని ఆర్థిక పరాధీన దిశకు తీసుకువెళ్తున్నది. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చు కోవటానికి ప్రజల దృష్టిని భావోద్వేగ, యుద్ధకాంక్షల వైపు మళ్లిస్తున్నది.
ప్రజలను మతోన్మాద మత్తులోకి నెట్టి, ప్రజా ఆస్తులైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుకు చవకగా కట్టబెట్టే పనిని చాకచక్యంగా అమలు చేస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానిదే. ప్రజలను కొల్లగొట్టి పండగ చేసుకోవడమంటే ఇదే. ప్రశ్నించే గళాలను, కలాలను అణచి వేయడానికి, తమకు నచ్చని వారిని కష్టాల పాలు చేయడానికి ఎన్ని కుయుక్తులు పన్నుతారో, చట్టాలను ఎలా తుంగలో తొక్కుతున్నారో చెప్పడానికి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు అమలుచేస్తున్న బుల్డోజర్ రాజ్యమే నిదర్శనం. ఈ విద్వేష విషానికి ఎక్కువగా బలయ్యేది మైనారిటీలే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇలా ఎవరైనాసరే బుల్డోజర్లను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. బుల్డోజర్ అంటే ఇప్పుడు యంత్రం మాత్రమే కాదు. అది ఇప్పుడు విద్వేషానికి, విధ్వంసానికి చిహ్నం. హిందు మతోన్మాదుల చేతుల్లో ఆయుధం. ప్రజాస్వామ్యానికి లౌకికత్వానికి శత్రువు.
దేశంలో ప్రజల జీవన విధ్వంసం, నిరుద్యోగిత, పేదరికం, ద్రవ్యోల్బణం, తగ్గుతున్న కరెన్సీ విలువ అన్నింటినీ నిర్ణయించేది క్యాపిటల్, కొనసాగుతున్న సామ్రాజ్యవాద దోపిడీ. అందుకు నయా ఉదారవాద విధానాల ద్వారా మన ప్రభుత్వం అందిస్తున్న బలమైన మద్దతు. ఈ కారణాలతో మెజారిటీ ప్రజల జీవితాలే అభావం అవుతున్నాయి. ధనవంతులు సంపన్నులు కావటానికి సహాయం చేస్తే తద్వారా పెరిగిన సంపదలో కొంత భాగం సాధ్యమైనంత త్వరగా జల్లెడ బొట్ల లాగా పేదలకు చేరుతుందని నయా ఉదారవాద సిద్ధాంతం బోధిస్తోంది. ఈ సిద్ధాంతం ముసుగులోనే కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వనరులు, ప్రభుత్వ వనరులను కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోంది. కానీ గత రెండు దశాబ్దాల పాటు ఈ విధానాలు అమలు చేసిన తర్వాత పేదల పట్ల సంపన్నుల ఏహ్య భావం, అవమానాలు, చెరబాట్లు తప్ప ఏమీ కిందకు చేరటం లేదు. నయా ఉదారవాద వ్యవస్థలో సంపన్నులు మహా సంపన్నులవుతారు. పేదలు నిరుపేదలవుతారు. ఎందుకంటే ఈ వ్యవస్థ పన్నిన వ్యూహమే అటువంటిది. కాబట్టి ఈ బోగస్ జల్లెడ బొట్ల సిద్ధాంతాన్ని తిరగదోడి దీన్ని వెనక్కు కొట్టాలంటే కార్పొరేట్ దోపిడీకి స్వస్తి చెప్పగలిగే ప్రభుత్వం భారతదేశానికి కావాలి. సంపన్నులపై పన్నులు విధించే శక్తి గల ప్రభుత్వం కావాలి. ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గించి ప్రజలందరికీ సమన్యాయం అందుబాటులోకి తేగలిగిన ప్రభుత్వం కావాలి. ఉపాధి కల్పన లక్ష్యంగా అభివృద్ధి వ్యూహాలను రూపొందించే ప్రభుత్వం కావాలి. ప్రజారోగ్యం, ప్రభుత్వ విద్య, ఆహార భద్రత, ప్రజోపయోగమైన మౌలిక వసతుల నిర్మాణం వంటి విధానాలు అమలు చేయగల ప్రభుత్వం కావాలి. తద్వారా ఆర్థికా భివృద్ధి, సమానత్వం రెండూ ఒకే విధాన లక్ష్యాలుగా మార్చగలిగిన ప్రభుత్వాన్ని సాకారం చేసుకోవాలి. అందుకు లౌకిక, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవడమే నేడు దేశ ప్రజలు ముందున్న ప్రథమ కర్తవ్యం.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140