Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామ్రేడ్ బండారు చందర్రావు(బిసిఆర్) 1974లో నేను భద్రాచలం హాస్టల్లో 8వ తరగతి చదువుతున్నప్పుడు పరిచయం అయ్యారు. అప్పట్లో చందర్రావు ప్రోత్సాహంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో చేరటానికి వచ్చే విద్యార్థులకు నేను, నా మిత్రులు సహాయం చేస్తుండే వాళ్లం. చందర్రావు పంపించారని చెప్పి వాళ్ల తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చి హాస్టల్లో చేర్పించేవాళ్లు. తూరుబాక నుండి హాస్టల్లో చేరే ఒక విద్యార్థి సర్టిఫికెట్స్ కోసం తిరిగే సమయంలో ఆయన సహాయం కోసం వెళ్లి కలిసాం. అప్పుడే నేను మొదటి సారిగా చందర్రావుని చూశాను. అప్పుడు అనేక గ్రామాల గురించి, అక్కడ పాఠశాలల గురించి, ఉన్నత తరగతులు లేక చదువు మానేస్తున్న విద్యార్థుల గురించి మాకు వివరించారు. ఇన్ని గ్రామాల పాఠశాలల విద్యార్థులు ఆయనకి ఎలా తెలుసో! అని ఆశ్చర్యపోయాను. ఆయన అప్పటికప్పుడు గ్రామాల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పాఠశాలల్లో విద్యార్థుల పేర్లు నోటితో చెప్పి మాతో లిస్టులో రాయించారు. అప్పటి నుంచి విద్యార్థులకేదైనా సహాయం (సర్టిఫికెట్లు, సీట్ల ఎంపిక వగైరా) నిమిత్తం తరచుగా చందర్రావుని కలిస్తూ, విద్యార్థి సంఘంలో పనిచేస్తూ ఆయనకు మరింత దగ్గరగా పని చేయగలగడం నాకో గొప్ప అవకాశం.
విషయ పరిజ్ఞానం మేథోసంపత్తి
చందర్రావుకి డిగ్రీ సర్టిఫికెట్లు లేకపోయినా అపారమైన మేథోసంపత్తి కలవాడని మాత్రం చెప్పగలను. ఆయన దగ్గర పుస్తకాలు పెద్ద లైబ్రరీగానే ఉండేవి. నేను, నా మిత్రులు కొందరు సిద్ధాంతపరమైన విషయాలు అడిగినప్పుడు మాకు పుస్తకాలు ఇచ్చి చదవమని చెప్పేవారు. మేము ఏదైనా చర్చ పెడితే పుస్తకాల్లోని ఆ సందర్భాలను పేజీలతో సహా మాముందు పెట్టేవారు. అన్ని పుస్తకాలు ఆయన ఎప్పుడు చదివారో అని ఆశ్చర్యపోవడమే మా వంతు అయ్యేది. ఒకసారి ఒక ఇంగ్లీషు లెటర్ నాకు ఇచ్చి ట్రాన్స్‌లేట్ చేయమన్నారు. అప్పుడు నా ఇంగ్లీషు అంతంత మాత్రమే! అయినా అది సింపుల్ గానే ఉంది కదా! అని హడావిడిగా ట్రాన్స్‌లేట్ చేసి ఇచ్చాను. అందులో చీవవస శీట ్‌ష్ట్రవ ష్ట్రశీబతీ అనే మాటకు ''గంటలో అవసరం'' అని రాశాను. అది చదివిన ఆయన చిరునవ్వుతో ఈ గంట ఏమిటి అని అడిగారు. నేను ఏమి చెప్పలేక తత్తర పడుతుంటే ఆయన నా భుజం తట్టి ఇక్కడ ''తక్షణవసరం'' అని పెడ దామా కామ్రేడ్ అన్నారు. దాంతో ఆయన నాకు సింపుల్‌గా ఎంత పాఠం నేర్పారో అర్థమయింది. అలా ఎన్నో లేఖలు, పిటీషన్లు, అర్జీలు, పోలీస్ కంప్లైంట్లు రాయడంలో చాలా మెళుకువలు నేర్పేవారు. ఇలా అనేకమందిని తీర్చిదిద్దిన ఘనత ఆయనది.
సదా సంక్షేమ దృష్టి
ప్రజల జీవన పరిస్థితులపై కూడా ఆయన అవగాహన అమోఘమనిపించేది. ఏ గ్రామం వెళ్లినా ఆ గ్రామంలో ప్రజలకు ఎట్లా గడుస్తుందీ, వాళ్ళ జీవన స్థితి గతులు ఏమిటీ అనే సమస్త సమాచారం, సమగ్ర అవగాహన ఆయన సొంతం. వాళ్ళకు మంచినీళ్ళు ఉన్నాయా, పంటలు ఏమి పండుతున్నాయి, పని దొరుకుతుందా ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడుఎంక్వైరీ చేసి తగు ప్రతిపాదనలు తయారు చేసి అధికారులకు అందించేవారు. అడవి పనులు ఇతర కాంట్రాక్టు పనులకు వెళ్ళేవారికి కూలి గిట్టుబాటు అవుతుందా అని విచారించి తగిన ప్రోత్సాహం ఇచ్చేవారు. అమాయకులైన పేదలను, గిరిజనులను మోసగించే వారిని అడ్డుకొని, న్యాయం కోసం వారిని వెంట ఉండి నడిపించేవారు. ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేయడం, కరెంట్ సరఫరాకు లైన్లు వేయించడం వగైరా విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకునేవారు. అనారోగ్యంతో ఉన్నవారిని ఆసు పత్రులకు తరలించి మూఢ నమ్మకాలపై ఆధారపడ కుండా వైద్య సహాయం అందించటానికి కృషి చేసేవారు. కేవలం ఆసుపత్రికి వచ్చే రోగుల కోసమే ప్రత్యేకంగా కార్యకర్తలను నియమించి పర్యవేక్షించే వారు. భూమి తగాదాలు, ఇతర వివాదాలు జరిగిన సందర్భాల్లో పేదల పక్షాన, న్యాయ సహాయం కోసం లాయర్లను సంప్రదించి కోర్టు కేసులు నడపటం కోసం కూడా మాలాంటి కార్యకర్తలను పురమాయించి పరిశీలనకు శ్రద్ధ తీసుకునేవారు. ఇలా అనేక విషయాలలో పేదలు, బలహీన వర్గాల ప్రజలపై ఆయనది అపారమైన ప్రేమ.
కార్యకర్తల పట్ల ఆప్యాయత
పార్టీలో, ప్రజా సంఘాల్లో పని చేసే కార్యకర్తల పని విధానాన్ని చక్కదిద్దుతూనే, వారి పట్ల అపారమైన ప్రేమ, ఔదార్యం, ఆప్యాయతను కనబర్చేవారు. నేను ఒక సారి పార్టీ పని మీద కూనవరం వెళ్ళి తిరిగి వచ్చే సరికి రాత్రి 11గంటలు అయింది. నేను తిరిగి వచ్చానో లేదో తెలుసు కోవటానికి మరొకర్ని నియమించి నాకోసం చూస్తూ అరుగుమీద కూర్చొని అలాగే ఉన్నారు. నేను తిన్నానా లేదా అని అడిగితే తిన్నానని అబద్ధం చెప్పాను. నువ్వు భోజనం చేయలేదు కామ్రేడ్! అబద్ధం చెబుతున్నావు అన్నారు. వెంటనే ఇంట్లో వంట చేయించి భోజనం పెట్టించారు. అలాంటి సందర్భాలు చాలా జరిగాయి. కార్యకర్తలందరినీ తన సొంత వారిలాగే చూసుకునేవారు. ఆ రోజుల్లో తెనాలి హౌటల్ టోకెన్లు కొన్ని దగ్గరుంచుకొని ఎవరు ఆకలితో వచ్చినా టోకెన్ ఇచ్చి హౌటల్‌కు పంపేవారు. ఎవరైనా దిగులుగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా ఇట్టే కనిపెట్టేవారు. అవసరమైన సహాయం చేసేవారు.
అసమాన ధైర్య సాహసాలు
చందర్రావు దేనికి భయపడేవారు కాదు. తాను చేయదల్చుకున్న పనికి ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా ధైర్యంగా పూర్తి చేసేవారు. అధికారుల ముందు నిర్భీతిగా వ్యవహరించేవారు. ప్రాణాన్ని కూడా లెక్కచేయని సాహసం ఆయనది. ఒకసారి 1982లో... అంటే సుమారు 40ఏండ్ల క్రితం బండిరేవు గ్రామంలో రైతు సంఘం పనిమీద మకాం వేశాం. చందర్రావు, బొల్లి రాంబాబు నేను ముగ్గురం ఉన్నాం. అప్పటికే డివిజన్లలో అనేక ప్రాంతాలకు బయటి నుండి వచ్చిన నక్సలైట్ దళాలు సంచరిస్తూ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. మేము ఒక వీధిలోని ఒక రైతు ఇంటి దగ్గర ఉన్నాం. నక్సలైట్ల దళం కూడా అదే ఊరికి వచ్చి ఇంకో చివరి వీధిలో మకాంవేశారు. గ్రామస్తులు మాకు సమాచారం ఇచ్చారు. ముందు నాకే తెలిసింది. విషయం నేను రాంబాబుతో చెప్పాను. రాంబాబు చందర్రావుకి చెప్పారు. ఆయన చాలా మామూలుగా ''వాళ్ళొస్తే మనకేంటి, మన పని మనం చేసుకుందాం'' అన్నారు. నేను చాలా భయపడుతూ మేము అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండునని మనస్సులో అనుకుంటున్నాను. అంతలో చందర్రావు ఏం చేసారో తెలియదు గానీ రెండు గంటల్లో గ్రామస్తులంతా మా చుట్టూ చేరారు. చివరికి వాళ్ళతో మాట్లాడేవారు కూడా లేక నక్సల్స్ వెళ్లిపోయారు. మా కోసం అక్కడే వంట చేసి భోజనాలు పెడితే మేము తిని బయలుదేరే సరికి దాదాపు అర్ధరాత్రి అయింది. ఆ సమయంలో చందర్రావు గురించి నేను అంత టెన్షన్ పడ్డాను కానీ ఆయనలో ఇసుమంతైనా ఆందోళన కనిపించ లేదు. ఇలాంటి ఘటనలు మన్నెంలో మరికొన్ని చోట్ల జరిగాయి. ఆయన మాత్రం ''జనం మనతో ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు'' అని అనేవారు.
తర్వాత రోజుల్లో నక్సలైట్లు మన పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులుచేసే క్రమంలో నేను రాసిన ''ఎవడు పిరికివాడు రా, ఏది మార్క్సిజం రా'' అనే పాటను కనకయ్య దళం (ప్రజా నాట్యమండలి) చేత పాడిస్తూ, గ్రామాల్లో మకాం వేసి సంచరించే వారే తప్ప ఏ మాత్రం భయపడే వారు కాదు. నేను కూడా అనేక సందర్భాల్లో, సంఘటనల్లో ప్రాణాలకు తెగించి పాల్గొన్నాను. దానికి కామ్రేడ్ చందర్రావు స్ఫూర్తే కారణం అని ఖచ్చితంగా చెప్పగలను. ఆశయాలు, కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా బోధించేవారు కాదు. కేవలం ఆయన్ను చూడటం, అనుకరించడం వల్లే అన్నీ బోధపడేవి. అలాంటి వర్చస్సు, ఆచరణ ఆయనది. అలాంటి నాయకుల స్ఫూర్తి వల్లనే పోరాడే యువతరం నేడు ముందుకు వస్తున్నది.
కామ్రేడ్ బండారు చందర్రావుకి విప్లవ జోహార్లు.. లాల్ సలామ్..
(నేడు కామ్రేడ్ బండారు చందర్రావు 37వ వర్థంతి)
- బి.జె.ఎల్.పి.దాస్
సెల్:990896096