Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో అనేక మతాలు, సంఖ్యాధిక వైదిక (హిందు) మతంలో పలు కులాలు, ఉప కులాలు, ఇతర మతాలలో తెగోపతెగలు ఉన్నాయి. ఆధిపత్య అగ్ర కులాల తెంపరితనం బరితెగించింది. మత మార్పిళ్ళు జరిగినా పూర్వ మతాల కులాలు, తెగలు, పరమతకుల అసహనం, సనాతన పితృస్వామ్య భావజాలం మొదలగునవి కొనసాగుతున్నాయి. 2002 గుజరాత్ ఉన్మాద హిందుత్వవాద ప్రయోగం గత 9 ఏండ్లలో దేశవ్యాపితమయింది. ఈ ప్రాతిపదికలతో, విభిన్న తరగతుల ప్రజల మధ్య జరిగే సహజ ప్రేమలు, ఇతర సంఘటనలతో మనదేశంలో కుల దురహంకార హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటికి ''పరువు'' హత్యలని ముద్దుపేరు! అమాయక స్త్రీలు తమకు తెలియకుండానే సంప్రదాయం పేరుతో ఆధిపత్య మత భావజాలానికి బానిసలయ్యారు. ప్రత్యామ్నాయ తాత్వికత అభివృద్ధిచెందని పరిస్థితులలో గత్యంతరంలేక వీరు ఈ అమానవీయ హత్యలకు నిశ్శబ్దంగా మద్దతు పలుకుతున్నారు.
పాశ్చాత్య దేశాలలో ఇన్ని మౌఢ్య ఛాందసాలు లేవు. అయినా ప్రపంచ వ్యాపితంగా, కుటుంబ గౌరవం, అవమానాల సాకుతో మగవారు మహిళలను హత్యచేస్తున్నారు. జాతి మత మూఢులు వీటిని ప్రోత్సహిస్తున్నారు. వీటికి కూడా 'పరువు' హత్యలని వినసొంపయిన ముద్దు పేరు పెట్టారు. అసలు హత్యలలో పరువు ఉంటుందా? మమ్ములను రెచ్చగొట్టారని, మేమంటే అసూయపడ్డారని అందుకే మా భార్యలను చంపామని పాశ్చాత్య దేశాల పురుష అహంకారులు అంటారు. ఆసియా, మధ్య ప్రాచ్య స్త్రీహంతకులు మాత్రం స్వకుటుంబ, స్వజాతి సముదాయాల గౌరవం కోసం ఈ హత్యలు అనివార్యమని ప్రచారంచేస్తున్నారు. ప్రతి ఏడాది పరువు పేరుతో ప్రపంచ వ్యాపితంగా 5,000 మంది స్త్రీలు హత్యకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి గణాంకాలు తెలుపుతున్నాయి. కానీ జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచ వ్యాపితంగా పరువు సాకుతో చేసే స్త్రీ హత్యలు 20,000 ఉంటాయని స్త్రీవాదుల అంచనా. దాచిన స్త్రీహత్యలు, స్వీయహత్యలుగా చిత్రించిన స్త్రీహత్యలు, ఆడవాళ్ల అదృశ్యాలు ఈ లెక్కలలో లేవు.
ప్రపంచమంతా పితృస్వామ్యవాదులు ఆడువారు అణిగిమణిగిలేరని, అవిధేయులుగా ఉన్నారని పురుషహంకార అపరాధభావనతో స్త్రీలను, బాలికలను చంపుతారు. ఇలా హత్యకు గురయినవారి సమాధులపై పేర్లు నమోదుచేయరు. ఆ అభాగిణుల తల్లులు తమ కుమార్తెల సమాధులను రహస్యంగా దర్శించి రోదిస్తారు. ఈ బాధితులకు న్యాయం కోరుతూ 1990లో బ్రిటన్‌లో 'స్త్రీలకు న్యాయం' (జస్టిస్ ఫార్ విమెన్) అన్న వేదికను ప్రారంభించారు. బ్రిటన్‌లో మునుపటి లేదా ప్రస్తుత జీవిత భాగస్వామి చేతిలో మూడు రోజులకు ఒక మహిళ మరిణిస్తున్నారు. 2020లో పోలండ్‌లో 400, జర్మనీలో 117, ఇటలీలో 102, హంగేరీలో 99 స్త్రీహత్యలు జరిగాయని యూరోపియన్ యూనియన్ లెక్కలు తెలుపుతున్నాయి. ఈ దేశాల చట్టాలు బాధిత మహిళల కంటే నేరస్తులయిన మగవారిని దయాదృక్పథంతో చూస్తాయి. బ్రిటన్‌లో అవమాన సాకు రక్షణవాదం 17వ శతాబ్దానికి ముందు నుండే అమలులో ఉంది. అక్కడ ఇటీవలి వరకు తమ జీవిత భాగస్వామిణులను చంపిన మగాళ్ళు ఆడువారు తమను అవమానించారని, బాధితురాలు తమను అగౌరవపరిచిందని, అవమానించిందని, వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకుని, తమ మగతనాన్ని సవాలుచేసిందని అభాండించారు. ఈ నిందలు రుజువైతే స్త్రీహత్యా నేరం సాధారణ హత్యా నేరంగా మారుతుంది. స్త్రీవాదుల సుదీర్ఘ పోరాటం తర్వాత 2008లో ఈ రక్షణవాదాన్ని చట్టాల నుంచి తొలగించారు. కాని ఆచరణలో ఈ తొలగింపు ప్రభావం లేదు. పదేండ్లు కలిసి జీవించిన తన భార్యను జోసఫ్ మెక్ గ్రెయిల్ అన్న వ్యక్తి ఆమె నిద్రమాత్రలు మింగిన, సారా తాగిన నేరానికి చంపానని కోర్టులో చెప్పాడు. నిజానికి ఆమె నిద్రమాత్రల, పాశ్చాత్య సమాజపు సహజమయిన తాగుడు అలవాట్లకు కారణం భర్త పెట్టిన మానసిక హింస, వత్తిళ్ళే. 1991 నాటి ఈ కేసులో గౌరవ న్యాయమూర్తి ఆలివర్ పాపుల్వెల్ ఆమె ఒక సాధువు సహనాన్ని పరీక్షిందని వ్యాఖ్యానించారు. ఆ నేరస్తునికి రెండేండ్ల సాధారణ జైలు శిక్ష వేశారు. ఇంగ్లండ్‌లో లెస్ హ్యూమ్స్, ఎలిజబెత్ డేవిస్‌లకు 15ఏండ్ల దాంపత్యంలో నలుగురు పిల్లలున్నారు. వివాహేతర సంబంధంతో తనతో విడిపోబో తోందన్న నెపంతో హ్యూమ్స్ 36 ఏండ్ల డేవిస్‌ను అతి దారుణంగా చంపాడు. న్యాయమూర్తి అతనికి కేవలం ఏడేండ్ల సాధారణ జైలు శిక్ష విధించారు. స్త్రీలపై ఘోర లైంగిక వేధిం పులు, తీవ్ర గృహ హింస, అమానవీయ హత్యల కంటే మగాళ్ళ గౌరవం ప్రధానమని న్యాయమూర్తులు పరిగణించారు.
భార్యను బానిసగా, ఒక వినోద వస్తువుగా పరిగణిం చటం, మగానికే కాని మహిళకు గౌరవం అక్కరలేదన్న దురభిప్రాయం, పెళ్ళాడిన స్త్రీ మగని ఆస్తి అన్న చిరకాల సనాతన ఛాందస భావన నుండి పుట్టాయి. ప్రపంచ వ్యాపితంగా మహిళలను ద్వితీయ శ్రేణి జీవులుగా చూశారు. సాటి మానవులుగా పరిగణించలేదు.
- ఎస్. హనుమంతరెడ్డి
సెల్:9490204545