Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీశాఖ గిరిజన రైతులపై దాడులను ముమ్మరం చేసింది. కేసులు పెట్టడం, జైళ్ళకు పంపడం, పోలీసులతో కలిసి దాడులు చేయడం, గ్రామాల్లో కవాతులు నిర్వహించడం, చేతులకు బేడీలువేసివున్న బొమ్మలతో పోస్టర్లు వేసి ప్రచారం చేయడం లాంటి చర్యల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అయితే అడవి బిడ్డలు సీపీఐ(ఎం) నాయకత్వంలో తమ భూములను కాపాడుకోవడానికి ప్రతిఘటనా పోరాటానికి సిద్ధమవుతున్నారు.
వామపక్షాల చొరవతో యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో ''గిరిజన తెగల అటవీహక్కుల గుర్తింపు చట్టం-2006'' పార్లమెంట్లో ఆమోదించబడింది. పార్లమెంట్లో చట్టం రూపుదిద్దుకొనే సమయంలో కూడా అనేక బాలారిష్టాలు ఎదురయ్యాయి. కానీ పార్లమెంట్లో బృందాకరత్, మిడియం బాబూరావు లాంటి సీపీఐ(ఎం)పార్టీ ఎంపీలు ఆనాడు గట్టిగా కృషిచేశారు. అనేక గిరిజన అనుకూల అంశాలు చట్టంలో చేర్చగలిగారు. అయినా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్డు ఫారెస్ట్ ఉన్నతాధికారులతో కోర్టులో చట్టానికి వ్యతిరేకంగా పిటీషన్లు వేయించి రెండు, మూడేండ్లపాటు అమలును ఆపగలిగారు. అంతిమంగా పార్లమెంట్ చేసిన చట్టానికి మోకాలడ్డటం సరికాదని రాష్ట్ర హైకోర్టు 2009 మే 1న స్టే ఎత్తివేసి పిటీషన్లను కొట్టివేసింది.
అటవీహక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి సాగులో ఉన్న గిరిజన సాగుదార్లందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి. నాలుగు హెక్టార్ల (10ఎకరాల) విస్తీర్ణం తగ్గకుండా హక్కు పత్రాలు ఇవ్వాలి. కానీ ఆచరణలో అడుగు ముందుకు కదిలింది లేదు. అరకొరగా పత్రాలు పంచామని చెప్పినచోట్ల కూడా ఎకరాలకు బదులుగా సెంట్ల లెక్కన మొక్కుబడిగా పంచిపెట్టారు. దీనిని ప్రశ్నిస్తే అడవి బిడ్డలను అటవీ విధ్వంసకారులుగా చిత్రించడానికి ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గం.
అటవీహక్కుల చట్టం ఏమి చెబుతున్నది?
2005 డిసెంబర్ 13 వరకూ సాగులో ఉన్న 1. పోడు భూములు 2. ఇంటి స్థలాలు 3. గ్రామస్తులు వాడుకుంటున్న నీటి వనరులు 4. అటవీ ఫలసాయం 5. చేపలవేట, వనరులు 6. ఔషధ మొక్కలు 7. పశువులు మేపు భూములు 8. దారులు-బాటలు 9. మత, సాంస్కృతికపరమైన సంస్థలు మొదలైన వాటిపై వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ శాశ్వత అనుభవ హక్కులు గిరిజన ప్రజలకు లభిస్తాయి. అయితే క్రయ, విక్రయాలకు మాత్రం అనుమతి ఉండదు.
అంతే కాదు, అడవుల్లో అంతర్భాగంగా ఉన్న గ్రామాలు, సర్వే చేయని జనావాసాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చుకోవచ్చు. దీని ప్రకారం ఆదిమ గిరిజన జాతులు ఇంకా వ్యవసాయం చేయడం తెలియనివారు ఎవరైనా ఉన్నా సరే వారు రిజర్వ్ ఫారెస్టులో ఆవాసం ఏర్పాటు చేసుకుంటే వాటిని కూడా రెవెన్యూ గ్రామాలుగా మార్చవచ్చు. కానీ, పై అంశాలు అమలైన దాఖలాలు ఎక్కడా కనపడవు. చిన్నతరహా అటవీ ఉత్పత్తులను ఎటువంటి భయంలేకుండా చట్టపరమైన హక్కుతో సేకరించుకోవచ్చు. ''ఈ చట్టం అమలు విషయంలో గ్రామసభ అత్యున్నత పరిష్కార వేదికగా ఉండాలనే'' కీలకమైన నిబంధన అటవీహక్కుల చట్టంలో ఉంది. అలాగే గ్రామసభ నిర్వహించుకొని 'ఫారెస్ట్ రైట్స్ కమిటీ' (ఎఫ్.ఆర్.సి.)ని గిరిజనులు ఎన్నుకోవాలి. అందుబాటులో ఉన్న అటవీ భూమిని గుర్తించడం, లబ్దిదారుల జాబితా తయారుచేయడం, అభ్యంతరాలను పరిశీలించడం, దీనికి సంబంధించిన ఫారాలను స్వీకరించడం, సామూహిక హక్కుల అర్జీలను పరిశీలించి, హక్కు పత్రం ఇవ్వాలని పైకమిటీలకు సిఫార్సు చేయటం, ఎఫ్ఆర్సీల పని. దీనికి అవసరమైన సర్వే, భూమి పటాలను గీయడం మొదలైన పనులకు సహకరించటం, రెవెన్యూ, ఫారెస్ట్, గిరిజన సంక్షేమ విభాగాల పనిగా ఉండాలి. కానీ ఎఫ్ఆర్సీ సమావేశాలు, గ్రామ సభలను నిర్వహించడం, చట్టం గురించి ఎఫ్ఆర్సీలకు, గ్రామ సభలకు అవగాహన కల్పించడంవంటివి లేనేలేవు. అన్నింటా అధికారుల పెత్తనమే ఎక్కువైంది. ఫలితంగా అన్ని కోణాల్లో ఎఫ్ఆర్సీ చట్టం నీరుగార్చబడింది.
ఇప్పటికైనా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌వారు గిరిజనుల సాగులో ఉన్న భూమి విషయంలో వక్రభాష్యాలు చెప్పడం మానుకోవాలి. ఎఫ్ఆర్సీ, గ్రామ సభలే అత్యున్నత పరిష్కార వేదికలనే విషయాన్ని గుర్తించాలి. పంటలను ధ్వంసం చేసినా, గిరిజనులపై దాడిచేసినా ఐటిడిఎ అధికారులు గిరిజనులకు అండగా నిలబడాలి. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రయోగిస్తామని చెప్పాలి. అటవీశాఖకు వంతపాడటం, అది తానా అంటే తందానా అనడం ఐటిడిఎ, రెవెన్యూ శాఖలు మానుకోవాలి.
అటవీహక్కుల చట్టం వల్ల అడవికి ముప్పు ఏర్పడిందని కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రెండేండ్ల క్రితం ఖమ్మం జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి (డిఆర్సి.) మీటింగ్‌లో ఒక టీడీపీ శాసనసభ్యుడు ఫారెస్ట్ అధికారులను రెచ్చగొట్టారు. అయినా మిగిలిన ఎంఎల్ఎలు, బూర్జువాపార్టీల గిరిజన ఎంఎల్ఎలు కూడా నోరు మెదపలేదు. దీంతో రెచ్చిపోయిన అటవీశాఖ వారు దాడులకు రంగం సిద్ధం చేశారు. పి.డి.యాక్ట్‌ను అన్ని గ్రామాల్లో భూపోరాట నేతలపై, గిరిజన రైతులపై పెడతామని చెప్పారు. గిరిజన సంఘం ఈ విషయమై జిల్లా అంతటా రాజకీయనాయకుల వైఖరిని ఎండగట్టింది. 'దీంతో మా ఉద్ధేశ్యం అది కాదంటూ' వెనక్కితగ్గారు.
ఒక పక్క జంగల్, జల్, జమీన్ (అడవి, నీరు, భూమి) లాంటి వనరుల నుండి ఆదివాసీలను దూరం చేస్తూ మరో ప్రక్క ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు వాటిని అప్పనంగా కట్టబెడుతున్నా ఈ పెద్దలు పట్టించుకోరు. మూడు జిల్లాలోని 9 గిరిజన మండలాల్లోని మొత్తం 2 లక్షల ఎకరాల అడవి పోలవరం బ్యాక్‌వాటర్‌లో జలసమాధి అవుతుంటే మాట్లాడనివారు, గనుల త్రవ్వకం, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పారీశ్రామికీకరణ, రోడ్లు, ఇతర రవాణా సౌకర్యాల విస్తరణ, నివాసప్రాంతాల విస్తరణ, రియల్ఎస్టేట్, ఇలా పేరు ఏదైతేనేం ''ఆధునిక అభివృద్ధి ప్రక్రియ'' పేరుతో గిరిజనులను లక్షలాదిగా దేశమంతా నిర్వాసితులను చేస్తుంటే గుర్తించనివారు, గిరిజనులపైనే నిందాపూర్వక ప్రచారానికి పూనుకుంటున్నారు. అడవి దొంగలు, స్మగ్లర్లల ఆగడాలను పట్టించుకోరు. పైగా పాలకవర్గ పార్టీల నేతలే వారితో కలిసి వ్యాపారం చేస్తారు. కానీ ప్రకృతితల్లి ఒడిలో జీవించడం అలవాటైన గిరిజనులు మాత్రం తాము అనుభవించే సహజ వనరులకే దూరం కావాలా? వారి జీవితాలు మరింత దుర్భరం కావాలా?
అందుకే గిరిజన ప్రజలపై దాడులను ప్రతిఘటించాలని, గిరిజనానికి అండగా నిలవాలని అక్టోబర్ 10, 11 తేదీల్లో జరిగిన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించింది. అటవీహక్కుల గుర్తింపుచట్టాన్ని అమలు చేయించడంలో నేరపూరిత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, అందుకు పేదలనందరినీ కదిలించాలని నిర్ణయం జరిగింది.
బడా కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు లాభం చేకూర్చే నిర్ణయాలు, చట్టాలు రాత్రికిరాత్రే అమల్లోకి వస్తాయి. కానీ గత్యంతరం లేని స్థితిలో పాలకులు ప్రజల వత్తిడికి తలొగ్గి తెచ్చిన అతికొద్ది ప్రజానుకూల చట్టాలు మాత్రం సంవత్సరాలైనా అమలు కావు. వాటి అమలు కోసం కూడా ఎన్నో పోరాటాలు చేయక తప్పటం లేదు. ఇందులో భాగంగా సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ గురువారంనాడు ఖమ్మంలో జరిగే బహిరంగ సభ, కలెక్టరేట్ ధర్నాకు హాజరవుతున్నారు. ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకూ అన్ని ఏజెన్సీ జిల్లాల్లోని అన్ని గిరిజన తెగల ప్రజలంతా ఏకం కావాలి. తద్వారా రానున్న కాలంలో తమ ఆధీనంలోని సాగుభూములను రక్షించుకోవటానికి పోరాటాలకు సిద్దం కావాలి.
- బండారు రవికుమార్
సెల్:9490098090