Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి 4సెకన్లకో ఆకలి చావు..
ప్రతి 11నిమిషాలకో మహిళ మృతి
ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరిపై భౌతిక హింస
ప్రతి 24గంటలకు 3700లకుపైగా రాదారి చావులు
ప్రతి ఏటా 3.03లక్షల ప్రసూతి మరణాలు
ప్రతి నిత్యం 1,130కి పైగా హత్యలు
రోజుకి 1.90 డాలర్ల సంపాదనా లేని
70కోట్ల దారిద్య్ర నారాయణులు
ప్రతి ఏటా కరవు కాటకాలతో 9,27,810 చావులు..
నవంబర్ 15, 2022 నాటికి ప్రపంచ జనాభా 800కోట్లు
ఇందులో 8.23శాతం మంది పేదలు
ఇండియా జనాభా సుమారు 142కోట్లు
ఇందులో 25.6కోట్ల మంది పేదలు
ఏమిటివన్నీ.. ఎందుకనుకుంటున్నారా?
ఇవన్నీ లెక్కలు కాదు, హక్కులు... అవును, ఇవన్నీ మానవ హక్కుల లెక్కలు... ఇటీవలే డిసెంబర్ 10న ప్రపంచ మానవహక్కుల దినోత్సవం జరుపుకున్నాం. భారతదేశానికి స్వాతంత్య్రం 1947లో వస్తే 1948లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల డిక్లరేషన్‌ను ప్రకటించింది. మన స్వాతంత్య్రంలాగే ఈ హక్కుల దినోత్సవమూ 75వ వార్షికోత్సవాలకు సిద్ధమైంది.
ఈ 75ఏండ్ల తర్వాత కూడా అంతర్జాతీయ మానవ హక్కుల ఉద్యమంపై రకరకాల వాదనలు, భిన్నాభిప్రాయాలూ ఉన్నాయి. సంపన్న దేశాల కపటవేషమే ఈ హక్కుల ఉద్యమం అన్నవారూ ఉన్నారు. ధనిక దేశాల హక్కులకు ఇస్తున్న ప్రాధాన్యత పేద దేశాలకు ఎందుకివ్వరన్న విమర్శా ఉంది. ఏదైతేం, ఈ రెండు ప్రపంచాల (ధనిక, పేద) హక్కుల ఉద్యమాల మధ్య అగాధమైతే ఉంది. ప్రధాన స్రవంతి ఉద్యమం వొంటినిండా పక్షపాతమేననే వారూ ఉన్నారు. వీళ్ల వాదన ప్రకారం... మానవ హక్కుల్ని తుంగలో తొక్కేదీ వారే (సంపన్న దేశాలు), ఏమీ ఎరగనట్టు నంగనాచి మాటలు చెప్పేదీ వారే. హక్కుల్ని హరించేలా ఆర్థిక పరిస్థితులను సృష్టించడంలో వాళ్లు దిట్టలు. నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలతో మానవ హక్కుల్ని కుళ్లబొడవడంలో ఈ దేశాల పాత్ర ఎక్కువ. పేద దేశాల స్థితిగతులను పట్టించుకోకుండా ఆధిపత్య మానవహక్కుల ఉద్యమం గుడ్డిగా నడుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే పేదదేశాలు తమ దారి తాము వెతుక్కోవాల్సి వస్తుందన్న హెచ్చరికలూ ఉన్నాయి. ఇలా అయితే హక్కుల ఉద్యమం మనజాలదని తృతీయ ప్రపంచ దేశాల ఆవేదన.
మానవ హక్కుల ప్రాతిపదికన సమస్యల చిట్టాలు తయారైతే ఇక అయినట్టే అని పెదవి విరిచే వారూ ఉన్నారు. హక్కుల్ని సాధించడం కన్నా బాధితుల్ని అడ్డం పెట్టుకుని లబ్ధిపొందుతున్న వారి సంఖ్య ఎక్కువని, ఇది మానవ హక్కుల ఉద్యమాన్ని దుర్వినియోగం చేయడమేనన్న వాదనా ఉంది. అయితే, ఈ వాదన మానవహక్కుల అణచివేతను తక్కువ చేయడానికేనని, సద్విమర్శ కాదని పౌరహక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన మాత్రం అనేక హక్కుల పోరాటాలను పటిష్టం చేసేందుకు ఉపయోగపడింది. అంతర్జాతీయ గుర్తింపునకు తోడ్పడింది.
ఈ ప్రపంచంలో వ్యక్తిగత ఆస్తితో పాటే అణచివేతా పుట్టింది. దాని పక్కనే ప్రశ్నించే గుణమూ పెరిగింది. ఇది ఒక్కో కాలంలో ఒక్కో రకం. మనిషి మబ్బుల్ని ఆవాసం చేసుకుంటున్నా పక్కోణ్ణి అణగదొక్కే తీరు మాత్రం ఇప్పటికీ ఆగలేదు. ఏ యుద్ధం ఎందుకు జరిగిందో ప్రజలకు తెలియదు. సుమారు 5కోట్ల మందిని పొట్టనబెట్టుకున్న రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఐరోపా, అమెరికా సహా అనేక దేశాలు జాతి, మత ఘర్షణలతో అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, హక్కులు తెరపైకివచ్చాయి. ఐక్యరాజ్య సమితికీ ఓ రూపొచ్చింది. అందరూ సమ్మతించే మానవ హక్కుల పత్రం తయారీ అనివార్యమైంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ భార్య ఎలియనోర్ రూజ్వెల్ట్ కమిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛైర్పర్సన్. ఏడాదికిపైగా చర్చలు, బోలెడన్ని సూచనలు, అనేక సవరణల తరువాత 1948 డిసెంబర్ 10న ఈ చారిత్రాత్మక అంతర్జాతీయ మానవ హక్కుల పత్రాన్ని పారిస్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితీ జనరల్ కౌన్సిల్ ఆమోదించింది.
ఏమిటీ హక్కులు, ఎవరి హక్కులు?
మానవ హక్కులు సార్వత్రికం. వారెవరైనా సరే ప్రతిఒక్కర్నీ సమానంగా, గౌరవంగా చూడాలి. ఎటువంటి పక్షపాతం ఉండకూడదు. జాతి, మతం, ప్రాంతం, రంగు, స్త్రీ, పురుష భేదాలతో నిమిత్తం లేకుండా ఉండాలన్నది మానవ హక్కుల ప్రకటన ఉద్దేశం. బైబిల్ తర్వాత అంత ఎక్కువగా 560కి పైగా భాషల్లోకి ఈ హక్కుల పత్రం అనువాదమైంది. అత్యధికంగా డౌన్లోడ్ అయిన పత్రమూ ఇదే. ఐక్య రాజ్యసమితిలోని అన్ని దేశాలకూ ఇదో ప్రమాణపత్రం.
సాధారణంగా మానవ హక్కులనడంతోనే ఇవేవో ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు), హక్కుల సంఘాల పనిగానో, ప్రభుత్వేతర సామాజిక ఉద్యమ సంకేతంగానో భావిస్తుంటాం. కానీ ప్రపంచ మానవహక్కుల ఉద్యమ పునాదులు దీనికి భిన్నం. వలసవాదం, సామ్రాజ్యవాదం, బానిసత్వం, జాత్యహంకారం, విభజించి పాలించడం, పితృస్వామ్యం, స్థానికుల అణచివేత పునాదులపై ప్రపంచ మానవ హక్కులపత్రం తయారైంది. ఈ విశాల విశ్వంలోని సకల జనుల సుఖసంతోషాలు, కనీస జీవన స్థితిగతుల మెరుగు కోసం ప్రపంచ ప్రజలందరూ భుజం భుజం కలిపి పోరాడాలనే ఆలోచన ఈ ప్రకటనకు ప్రాతిపదిక. ఆ విధంగా ప్రపంచ చరిత్రలో 1948 డిసెంబర్ 10న ప్రకటించిన మానవ హక్కుల పత్రం ఓ నూతన అధ్యాయం.
ఎందుకంటే అన్యాయం జరిగిందని చెప్పేందుకు ఇది ఓ వేదికయింది. న్యాయం కావాలని అరిచేందుకో అవకాశమయింది. హక్కుల్ని హరించవద్దని నినదించే వీలు కల్పించింది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మిగతా ప్రపంచం నన్నెందుకు సమానంగా చూడదని నిలదీసే శిక్తినిచ్చింది. ఇదంతా నాణానికి ఓ వైపు. మరోపక్క, బాలకార్మిక వ్యవస్థ రద్దును ఆయా దేశాల చట్టాల్లోకి చేర్చింది. వర్ణవివక్ష, బానిసత్వంపై గొంతెత్తింది. ఉరిశిక్ష రద్దును అంతర్జాతీయ చిత్రపటంపైకి తెచ్చి సుమారు 60 దేశాల్లో రద్దు చేయించిన చరిత్రా ఉంది. విమర్శలున్నప్పటికీ స్థానిక హక్కుల కార్యకర్తల వాదనలకు వీలైన పదజాలాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇవేవీ సరిపోవు. చేసింది గోరంతే. చేయాల్సినది కొండంత మిగిలే ఉంది.
2030 నాటికి పేదరికం పారిపోతుందా?
2030 నాటికి ప్రపంచ సుస్థిరాభివృద్ధికి 170 దేశాలు కంకణం కట్టుకున్నాయి. అర్జంటుగా 17లక్ష్యాలను ముందుపెట్టుకున్నాయి. మరో 167 అంశాలపై దృష్టి సారించాలనుకున్నాయి. వీటిలో తొలిది పేదరికం. కానీ తరగాల్సిన పేదరికం అంతకంతకూ పెరుగుతోంది. మానవ హక్కుల ఉద్యమం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇది. ప్రపంచంలో పేదరికం ఎక్కడున్నా పారదోలి ఆకలికి తావులేని సమాజాల్ని నిర్మించాలన్న లక్ష్యం మంచిదేకానీ అందుకు ఆచరణే ప్రధానం. అభివృద్ధి మానవ హక్కుల్లో ఒకటి. కాని అది కొందరికే పరిమితమైంది.
నెరవేరని మార్టిన్ లూథర్ కింగ్ కల...
1963 ఆగస్టు 28... వాషింగ్టన్ డీసీ... అప్పటికి అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన వచ్చి 15ఏండ్లు దాటింది. అమెరికా నల్లజాతీయులు కదం తొక్కుతున్నారు. విద్యా, ఉద్యోగం, స్వేచ్ఛ స్వాతంత్య్రం నాటి నినాదం. సుమారు 2.5లక్షల మంది హజరై ఉంటారు. ఆ వేదిక నుంచి 4 నిమిషాలు ప్రసంగించేందుకు డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్‌కు సమయమిచ్చారు. ప్రసంగం మొదలు పెట్టిన తర్వాత ఆయన్ను ఆపడం ఎవ్వరి తరం కాకపోయింది. 16 నిమిషాలు సాగిన ఆ ప్రసంగమే ''నాకో కల ఉంది (ఐ హావ్ ఏ డ్రీమ్).'' నిజానికి ఆ ఉపన్యాసానికి పెట్టిన పేరు ది నీగ్రో అండ్ ది అమెరికన్ డ్రీమ్. కానీ చరిత్రలో మాత్రం ఐ హావ్ ది డ్రీమ్‌గా సుప్రసిద్ధమైంది. పౌరహక్కుల ఉద్యమంటే ఏమిటో నిర్వచించిన ప్రసంగమది. అందులోని ప్రతి ఆంశమూ నేటికీ విలువైందే. అందులో ప్రధానమైన డ్రీమ్ ఆఫ్ ఈక్వాలిటీ (సమానత్వం) నేటికీ కలగానే మిగిలివుంది.
జ్ఞానంతోనే సాధ్యం...
హక్కు... ఓసుదీర్ఘ పోరాటం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆ క్షణాన్ని కనిపెట్టి, 'నేను మాత్రమే అన్నీ పరిష్కరించగలను' అంటే నమ్మాల్సిన పని లేదు. ఈతి బాధలకు చిన్న చిన్న పరిష్కారాలు దొరకవచ్చు. కానీ, మానవ అభ్యున్నతి అతి పెద్ద సమస్య, అతిపెద్ద హక్కు. ఏ ఒక్కరితోనో అయ్యే పని కాదు. ముందుతరాలు నడిచిన ముళ్లబాటపై సాగాలి. వారందించిన కాగడాను ఎత్తిపట్టుకు ముందుకురకాలి. అలా చేయాలంటే ముందు మన హక్కులేమిటో తెలియాలి. మన పిల్లల గురించి ఆలోచించాలి. చుట్టూ ముప్పిరిగొన్న సమస్యల్ని గుర్తెరగాలి. ''మనిషికి అన్నింటికంటే గొప్ప వేదన జీవితం కలిగించే గాయాల నుంచి కాక జ్ఞానం నుంచే'' అంటాడు ప్రముఖ రష్యన్ రచయిత డోస్ట్రోవిస్కీ. మన అంబేడ్కర్ కూడా దాదాపు అదేమాట చెప్పారు. అజ్ఞానం ఎల్లకాలం పెట్టుబడి కాదంటారాయన. హక్కులపై అవగాహన పెరిగేకొద్ది అవస్థలూ పెరుగుతాయి. బడుగు, బలహీన, అణగారిన వర్గాలు, అసమానతలు, ఆకలి, పేదరికం ఉండే ఈ భూతలాన్ని మనిషిని మనిషిగా చూసే సమతాలోకంగా, అందరికీ అన్నీ అనే సమన్యాయం దిశగా నడిపించాలంటే రక్తాలు రగిలించి రాజ్యాలు కదిపి కుదిపే వీరులు, శూరులు, చెదిరిన గుండెలనదిమి పట్టుకుని ముందుకురికే పౌరులు కావాలి.
అమరయ్య ఆకుల, సీనియర్ జర్నలిస్ట్
9347921291