Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొలస చేపలు గోదావరి స్పెషలేం కాదు! ''పొలస'' ఒక విధానమని, ఒక 'ధర్మ'మని అందరూ అర్థం చేసుకోవాలని ముఖ్యంగా వామపక్ష మీడియా శ్రేణుల స్పృహలోకి రావాలని ఇదిరాశాను. వాస్తవానికి, ఇది నాలో ఒక ధారగా ఊరింది అనడం కరెక్టేమో! ఒక నాలుగైదు గంటలు 'ఎదురీత' చేసిన తర్వాత మొదట చూపుకు అడ్డొచిన కన్నీటిపొర ఆవిరైంది. సముద్రం లేనిచోట, దానిలో నది కలవని చోట, ఆ ప్రవాహానికి ఎదురీదుకుంటూ పొలస చేపలు రావల్సిన స్థితిలేదు. పక్కా మెట్ట ప్రాంతంలో పుట్టి దాదాపు అరవయ్యేండ్లుగా ఊతకర్రలతో, వీల్‌చైర్‌లో మీల్కాసింగ్వలె, ఉస్సేన్ బోల్ట్‌లాగా జీవిత హర్డిల్స్‌ని దాటడం, దూకడం సాధ్యమేనా? అది సాధ్యం! అది తథ్యం!! ''మనిషినై అన్ని వంసతాలూ కోల్పోయాన''ని వగచక్కల్లేదు. కామ్రేడ్ వున్నం వెంకటేశ్వర్లు (వి.వి.)ని చూస్తే, ఆయన రాసిన 'ఎదురీత' చదివితే వైకల్యం తలదించుకుంటుంది.
శైలి నడిపిన కథనం
'పూదోట' కన్నుల విందు చేయని దెవరికి? అయితే 'ఎదురీత' ప్రత్యేకతేమంటే ఇది కడుపునింపుతుంది. ప్రత్యేకంగా జర్నలిస్టుల పనిపై ఒకదారి చూపుతుంది. 'ఎదురీత' అందమైన 'పూదోట' కావడానికి కారణం దానిశైలి. ఎంచుకున్న 'వస్తువు'. ''నేనప్పుడు నాలుగు కాళ్ళ జంతువునయ్యాన''న్న వాక్యం చదివి నా వరకు నాకు కళ్ళు చెమ్మగిల్లినాయి. వివి గారితో నాకున్న పరిచయంలో ఆ వాక్యం నన్ను కకావికలు చేసింది. ''గోడలు పట్టుకు పాకడం, మంచం పట్టెలు ఊతంగా గెంతడం... సవ్యంగా పడని అడుగును చూసి నా నిస్సహాయత నన్నెక్కిరించింది'' వంటివి మనసున్న మనుషుల్ని కరిగిస్తాయి! అక్కడితో ఆగిపోతే వివిపై 'జాలి' మిగులుతుంది. 'విధి' ఆయన యెడల కర్కశంగా ప్రవర్తించిందన్న కొందరు పెద్ద 'మారాజు'ల మాటలే మూటలుగా మిగులుతాయి.
హైస్కూల్ స్థాయిలో కబడ్డీ టీమ్‌లో చేరతానని అడగడమేమిటీ? వాళ్లు చేర్చుకోవడమేమిటి? కార్నర్ క్యాచర్‌గా స్థిరపడి బహుమతులు గెలవడమేమిటి? పోలియోతో రెండుకాళ్ళూ చచ్చుపడిపోయిన వ్యక్తి కబడ్డీలో పాల్గొనడమే వింత అయితే బహుమతులు గెలవడం వింతల్లో కెల్లా వింతే కదా! ఒక మనిషిలోవుండే పోరాట తత్వానికి ఇంతకంటే ఏం రుజువులు కావాలి? నికొలారు ఆస్ట్రోవ్స్కీ రాసిన ''హౌ ది స్టీల్ వజ్ టెంపర్డ్'' హీరో పావెల్ గుర్తుకురాడా?
ఈ 'ఎదురీత'లో కీలకాంశం కామ్రేడ్ వివి మార్క్సిస్టుగా పరిణామం చెందిన క్రమం. ఆయనే రాసినట్లు ఆయన మొదట నాస్తికుడు. ఆ రకంగా ప్రశ్నించడం నేర్చుకున్నాడు. అది చివరికి 'ఉన్న', 'లేని', పెట్టుబడి - శ్రమ చరిత్ర... అంటే... అధికులపై అల్ప సంఖ్యాకుల అణిచివేత' అర్థమయ్యేలా చేసింది. మార్క్సిజంలో కీలకమైన ''శ్రీమంతుల ధనదాహం బావుల చేదడంతో వదలక మోటార్లతో తోడినట్టు తోడేయగ యంత్ర వేగంతో చాకిరి పెంచుతూ'' అనే యాంత్రీకరణ మూలాల్ని ఎత్తిచూపారు. చదువుతూ ట్యూషన్లు చెప్పే అలవాటు తర్వాతి దశలో ప్రజాశక్తి జర్నలిజం కాలేజీలో ఆ కామ్రేడ్‌కి బాగా ఉపయోగపడి ఉంటుంది. ఆయన సి.ఇ.సి. గ్రూపు అర్థశాస్త్రంలో ప్రవేశానికి, ప్రావీణ్యానికి ఉపయోగపడింది. పైగా కామ్రేడ్ జక్కా వెంకయ్య వంటి నిష్ణాతుల ఆధ్వర్యంలో మరింత మెరుగుదిద్దబడ్డారు. అది సమాజ గమనాన్ని, దోపిడీ స్వభావాన్ని అవగాహన చేసుకునేందుకు ఉపయోగపడింది.
పార్టీ నాయకత్వం కార్యకర్తల యెడల ప్రదర్శించే దృష్టి, వారి బాగోగులు ఆలోచించే తీరు తన వ్యక్తిగత అనుభవంలో నుండి కామ్రేడ్ వి.వి. గుర్తించిన తీరు అద్భుతం. తన శారీరక ఇబ్బంది రీత్యా పార్టీ నాయకత్వం ప్రత్యేకించి కామ్రేడ్ పి.ఎస్. తనని ప్రజాశక్తిలోకి మార్చిన తీరు రాస్తూ... తాను ''పని రాక్షసుడై''న తీరు వివరించడమే కాదు, సగం పుస్తకంలో ఆయన అనుభవాలు చదివితే అర్థమవుతుంది. ఇది రాసే సందర్భంలో ఒకరిద్దరు కామ్రేడ్స్ చెప్పిన విషయమేమంటే జర్నలిజం కాలేజీ ప్రిన్సిపాల్‌గా రాత్రి రోడ్లూడ్చేవారి బాధల్ని తెలుసుకోవడానికి తెల్లవారి 2 గంటలకు, రోడ్లపై నిద్రించేవారి విషయాలు అర్థంచేసుకు నేందుకు వారి దగ్గరికి పంపేవాడని, దానికోసం ఆరోజుల్లో ఆయన్ని తిట్టుకునేవాళ్ళని చెప్పారు. నిజమే! పనిరాక్షసుడా! మజాకానా?!
వివిధ డిపార్ట్మెంట్లు ఏమిచేయాలో, ముఖ్యంగా సంపాదక విభాగం చేయాల్సిన పనుల గురించి ఈ వందపేజీల్లో వెదజల్లిన అంశాలు చాలా ఉన్నాయి. న్యూస్ ఎడిటర్ చేయాల్సిన పని, ఆయన లేనప్పుడు రాజకీయ పరిణతి కలిగిన తర్వాతి కార్యకర్తల శ్రేణి ఏమిచేయాలో కామ్రేడ్ పి.ఎస్. మరణించిన సందర్భం మనకి తెలియచేస్తుంది. సింపుల్‌గా వార్తల్ని పోగేయడం, వాటిని గుదిగుచ్చి కుమ్మరిస్తే ప్రయోజనం ఉండదని రాశారు. 'పోరాటాల్లో ప్రజల పాత్ర' గురించీ, ఉద్యమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా అనుసరించే పోరాట పద్ధతులు ఆకట్టుకునేలా రాయాలని కామ్రేడ్ వి.వి. రాసింది అక్షర సత్యం. ఇప్పటికీ ఇటువంటి పద్ధతుల కోసం మేము బ్యూరో మీటింగుల్లో, మొఫిసిల్ సమావేశాల్లో చర్చిస్తున్నాం. ప్రజా పోరాటాలు, ఎంత చిన్నవైనా, తోటి వామపక్ష పార్టీ నడిపినవైనా వాటిని ప్రముఖంగా ఇస్తున్నాం. వారం వారం నిర్ణయించే మొఫిసిల్, బ్యూరో కథనాల్లో సంబంధిత రిపోర్టర్లు చేసిన ఫీల్డుస్టడీనే ప్రామాణికంగా తీసుకుని, మొదటి ప్రైజ్ నిర్ణయిస్తున్నాం. ఇతర సీనియర్లు ఈ కోణంలో తమ అనుభవాలను రాస్తే కొత్తవారికి, రిపోర్టర్ల అనుభవాలను 'తూచే' నాబోటి వాండ్లకు ఉపయుక్తంగా ఉంటుంది.
మన క్యాడర్‌ను పార్టీ నాయకత్వం ఏవిధంగా అంచనా కడుతుందో, వారి బాగోగుల కోసం ఎంత తపిస్తుందో వంటి విషయాలు వివి కండ్లకు కట్టినట్టు రాశారు. ఈయనకు డివైఎఫ్ఐ పూర్తికాలం కార్యకర్త నుండి ప్రజాశక్తికి పంపడం వరకు కామ్రేడ్ పి.ఎస్. స్వయంగా చూసినా తర్వాతి పనులను ఎల్బిజి గారు, ఎంహెచ్గారు, కొరటాలగార్లు చూసిన విధానం చక్కగా వివరించారు. కొరటాల గారు (86, 87 పేజీల్లో) మూడు చక్రాల లూనా కోసం ఎంహెచ్గారితో కలసి నిర్ణయించిన తీరు, దానికి స్పాన్సరర్ల ద్వారా జరిగిన ప్రయత్నం ముచ్చటగొల్పుతుంది. కార్యకర్తల అవసరమే కాదు, సంస్థ నిధుల వినియోగం గురించి కూడా ఇది మనకు తెలుపుతుంది. లూనా తీసిస్తే సంబంధిత కార్యకర్త పెట్రోలు ఖర్చులు భరించుకోగలడా అని ఎంహెచ్గారు అడగడం ముఖ్యమైన విషయం.
పార్టీలో సుదీర్ఘకాలం పనిలో నుండి పూర్తికాలం కార్యకర్తగా రావడం వల్ల జనరల్‌గా సభ్యుల్లో ఉండే అవలక్షణాలు కామ్రేడ్ వి.వి.కి బాగా తెలుసు. గుసగుసలు, చెవులు కొరకడాలు అనేక సందర్భాల్లో చూస్తూంటాం. దీన్నే ''చెవులు చేతగానివి అయితే చెప్పుడు మాటలు చెప్పులేసుకుని దేహమంతా పాకుతాయ''ని ఒకింత వ్యంగ్యంగా కవిత రూపంలో చెప్పారు. ఏమైనా 'ఎదురీత' టైటిల్ బాగుంది. కవర్‌పేజీ డిజైన్ ఇంకా బాగుంది. తన కొచ్చిన శారీరక సమస్యని పక్కకి నెట్టేసి, కమ్యూనిస్టు కార్యకర్తగా ముందుకి సాగిన వ్యక్తి ఉన్నం వెంకటేశ్వర్లు.
''లక్ష్యాల కక్ష్యలు ఛేదించడానికి నా ఎదురీతకు నావికుణ్ణి నేనే అయి
కొత్త బతుకు పథసారథి అయ్యా'' అని డిక్లేర్ చేయడానికి గుండెల నిండా ధైర్యం ఉండాలి!
- ఆర్. సుధాభాస్కర్