Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసంతృప్తి మానవ సహజ లక్షణం. ప్రజా స్వామ్యంలో అసంతృప్తి అంతర్లీన అధికార వ్యతిరేకతను నిర్వచిస్తుంది. ఎన్నికల్లో ఓటర్ల రక్తరహిత తిరుగుబాటుకు దారితీస్తుంది. కానీ తర్కాన్ని తిరస్కరిస్తుంది. విద్య, ఆరోగ్యం, పేదరికం వగైరా మానవాభివృద్ధి సూచీలలో గుజరాత్ బాగా వెనుకబడివుంది. రైతుల, వ్యవసాయ కార్మికుల, గ్రామీణ ప్రజల అసంతృప్తి, నిత్యావసర వస్తుసేవల ధరలు, వర్గ వ్యత్యాసాలు, కుల మత తెగల ద్వేషాలు పెరిగాయి. పేదల ఆదాయం తగ్గింది. బీజేపీ మార్కెట్ పార్టీగా మారింది. ప్రజాప్రాతినిధ్య చిన్న సంతలను చిదిమేసింది. వాణిజ్యవేత్తలను ప్రోత్సహించింది. పరిశ్రమాధిపతులే సంపద సృష్టికర్తలని, ఉపాధి బ్రహ్మలని ప్రధాని ప్రవచించారు. కేరళ, పశ్చిమ బెంగాల్ లలో లాగా భూసంస్కరణలు జరగలేదు. విద్య వైద్యాల్లో విలువలు పెరగలేదు. అడుగడుగునా మతాధార పక్షపాతాలు చోటుచేసుకున్నాయి. పెద్ద నోట్ల ప్రవేశం గుజరాత్లో అవినీతిని మరింత పెంచింది. ఆశ్రిత పక్షపాతంతో ప్రపంచ స్థాయి సంపన్నులు తయారయ్యారు. అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం, లోకనీతి జరిపిన ఎన్నికల ముందు సర్వేలో గజరాత్‌లో అవినీతి మితిమీరిందని, ధరలు, నిరుద్యోగం పెరిగాయని 70శాతం గుజరాతి ఓటర్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోలాగే గుజరాత్ బీజేపీలోనూ ముఠాతత్వం పెరిగింది. బతికిన రోజుల్లో కాంగ్రెస్ ముఠాతత్వం లాగే ఈ రోజు బీజేపీలో కూడా ముఠాతత్వం వ్యవస్థాపిత మయింది. నిజానికి మోడీయే పెద్ద ముఠా నాయకుడు. హిమాచల్ పాలనాధికార లోపాలు గుజరాత్‌లోనూ ఉన్నాయి. మరి బీజేపీని హిమాచల్‌లో ఓడిన బీజేపీ గుజరాత్లో ఎలా గెలిచింది?
ఎన్నికల సంఘాలు నమ్మదగని నిర్ణయాలతో బీజేపీకి అనేక అనుకూలతలను అందించాయి. బీజేపీ మతోన్మాద రాజకీయాలను ఎదుర్కోడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ వైదికవిధానాలనే ఎంచుకున్నాయి. ఆప్ వల్ల కాంగ్రెస్ 33స్థానాలు కోల్పోయింది. గుజరాత్లో కాంగ్రెస్ స్పష్టమైన ఎన్నికల సందేశాన్ని ప్రచారంచేయ లేదు. బీజేపీని ఎదుర్కోడానికి సమర్థుడైన ముఖ్యమంత్రిని సూచించలేదు. ఎన్నికల్లో గంభీరంగా పనిచేయలేదు. పాటిదార్ల ప్రముఖ నాయకుడు, ఖోదాల్ధాం ట్రస్ట్ ఛైర్మన్ నరేశ్ పటేల్ కాంగ్రెస్‌తో కలిసిపనిచేస్తానని దిల్లీలో రాహుల్‌ను కలిసినా గాంధీ ఆయన్ను పట్టించు కోలేదు. తర్వాత పటేల్ మోడీకి ఫోన్ చెయ్యగానే మోడీ పాటిదార్లను కలుపుకున్నారు. ఎం.ఐ.ఎం. కాంగ్రెస్‌ను విమర్శించింది. బీజేపీ జోలికి పోలేదు. అంతిమంగా బీజేపీ వైదికమే శ్రేష్టమైందిగా భావించే దుస్థితికి ప్రజలు నెట్టబడ్డారు. భౌతిక ప్రయోజనాల కంటే భావజాల ఉద్రేకతలతో ప్రభావితమయ్యారు. వాగాడంబర వక్రీకరణలనే సక్రమాలని నమ్మారు. సమస్యల పరిష్కార ఆలోచనల నుండి దూరం జరిగారు. కొత్త ''దేవత'' కంటే పాత దయ్యం మేలనుకున్నారు. దయ్యాన్ని అసహ్యించు కునేవారు విడిపోయారు. బలహీనపడ్డారు. మోడీ సర్కార్ కొన్న ఎలెక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ (ఇవిఎం)లలో 19 లక్షల ఇవిఎంలు గల్లంతయ్యాయి. ఈ సమాచారం తన వద్ద లేదని సమాచార హక్కు ప్రశ్నకు ఎన్నికల సంఘం జవాబిచ్చింది. ఇవిఎంల గల్లంతును కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ 30.3.2022న ప్రస్తావించారు. కర్నాటక శాసనసభ కాంగ్రెస్ సభ్యుడు హెచ్‌కె పాటిల్ గల్లంతైన 19 లక్షల ఇవిఎంల సంగతి తేల్చమని 8.5.2022న కర్నాటక స్పీకర్‌ను కోరారు. ఇవి గాక మరో 5లక్షల ఇవిఎంల ఆచూకీ లేదు. వీటన్నిటిని దురుపయోగ పరుస్తున్నారని అనుమానం. గుజరాత్ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత 12/13శాతం ఓట్లు నమోద య్యాయి. 20/25 నియోజకవర్గాలలో 31వేల ఓట్లకు పైగా పోలయ్యాయి. వడోదర నియోజకవర్గంలో 35,700 ఓట్లు, అకోటాలో 28,873 ఓట్లు పోలయ్యాయి. ఇంతటి వేగవంత మైన వోటింగ్ బలవంతమా? సహజమా?
మూడుసార్ల గుజరాత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాధవ్ సింఫ్‌ు సోలంకి 1985లో 149 సీట్లు తెచ్చారు. ఈ రికార్డును బద్దలుకొట్టాలని మోడీ చిరకాల కోరిక. దాన్ని నెరవేర్చుకోడానికే కుంభకోణాలకు పాల్పడ్డారు. ఫలితమే 156 సీట్లు. సిసిటివి వీడియోలను ఇమ్మని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఇసి ఈ వీడియోలను ఇస్తుందా? అక్రమ పద్ధతుల్లో నియమించబడిన కమిషనర్లు, మోడీ సర్కారుకు లొంగి పనిచేసే ఎన్నికల సంఘం విధులను సరిగా నిర్వహిస్తుందా? ఎన్నికల సంఘం దృతరాష్ట్ర పాత్ర పోషించిందని పలువురు గుజరాతీయులు అన్నారు. ఇది గుజరాత్ కొత్తప్రయోగం. ఎన్నికల సంఘం అనుసరించిన మోడీ ప్రభుత్వ ప్రాయోజిత పథకం. గుజరాత్ ఎన్నికలను మోడీ ప్రతిష్టాత్మకంగా పరిగణించారు. ఎందుకంటే మోడీ గుజరాత్ నమూనాను ఊదరగొట్టి 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నియమించబడ్డారు. ఆ బూచినే ప్రచారం చేసి ప్రధాని అయ్యారు. గుజరాత్లో ఓడితే గుజరాత్ నమూనా మోసమని, మోడీ అబద్దాలకోరని తేలుతుంది.
పోలింగ్ తర్వాత పార్టీల ప్రతినిధులందరూ వెళ్ళగానే బూత్‌లలో వినియోగించిన ఈవిఎంల స్థానంలో తాము ఓట్లేసిన కొత్త ఇవిఎంలను ఉంచారని, ఇవి 20/30శాతం ఉండచ్చని అనధికార సమాచారం. సాయంత్రం 5గంటల తర్వాత పోలింగ్ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ జరిగాయని ఆరోపణలున్నాయి. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవిఎంల గుర్తింపు సంఖ్యలను ధృవీకరించలేదు. ఈవిఎంలో ఒక ఓటు నమోదుకు 12 సెకన్లు పడుతుంది. గుజరాత్ ఎన్నికల్లో చివరి గంటలో సగటున 3 సెకన్లకు ఒక ఓటు నమోదయింది. ఇలా పోలయిన ఓట్లే పలువురు బీజేపీ అభ్యర్థుల విజయానికి కారణమనే అభిప్రాయాలు తక్కువేం కాదు. ఎన్నికల ఫలితాల రోజు ఉదయం పది గంటలకే 53 శాతం ఓట్లతో బీజేపీ ఆధిక్యతలో ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. 2శాతం ఈవిఎంలలో, నియోజకవర్గంలో 5 కేంద్రాల్లో పోలైన ఓట్ల సంఖ్యను ఈవిఎం ధృవీకరణ పత్రాలతో (వివిపాట్) సరిపోల్చాలి. తర్వాతే ఫలితాలు ప్రకటించాలి. ఇలా జరిగిందో లేదో తెలియదు.
భవిష్యత్తు ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకంకావాలి. ప్రజాస్వామ్య విలువలతో బీజేపీ ముక్త భారత్‌ను సాధించాలి. కుతంత్రాలు, మోసాలతో మోడీ సంపాదించ గల ఓట్లను మించి ఓట్లు సంపాదించటానికి ప్రజల్ని చైతన్యం చేయాలి.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్:9490204545