Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ ప్రఖ్యాత రచయిత మార్క్‌ట్విన్ ఒక చిన్న ప్రయోగం చేసి చూడమన్నాడు. ఒక గాజు సీసాలో కొన్ని నల్ల చీమల్ని, మరికొన్ని ఎర్ర చీమల్ని వేసి పరిశీలించమన్నాడు. అవి వేటికవే నింపాదిగా తిరుగుతుంటాయి. కొంత సేపటికి ఆ గాజు సీసాను పైకీ కిందికీ కదిలించి చూడమన్నాడు. దానివల్ల చీమలు ఒకదాని మీద ఒకటి కుప్పలుగా పడిపోతాయి. దాంతో చీమల ప్రవర్తనలో మార్పువస్తుంది. నల్లచీమలు-ఎర్రచీమలే తమని చంపుతున్నాయి అని అనుకుంటాయి. అలాగే ఎర్రచీమలు తమను నల్లచీమలే చంపుతున్నాయి అనుకుంటాయి. గమనిస్తే నల్ల చీమలు- ఎర్ర చీమలు చంపుకోవడం ప్రారంభిస్తాయి. నిజానికి అక్కడ అసలు శత్రువు ఎవరూ అంటే... గాజు సీసాను పైకి కిందికీ ఊపి, చీమల ప్రశాంతతను చెడగొట్టినవారు. ఆ రెండు రకాల చీమల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి-వాటి మధ్య అంతర్యుద్ధానికి కారణమైనవారు - వారే అసలు దోషులు! ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నదీ అదే. ఇక్కడి ప్రజలు ఒకరికొకరు శత్రువులు కారు. ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషిస్తున్నది పాలకులేనన్నది బహిరంగ రహస్యం. తెల్లరంగుకూ నల్లరంగుకూ మధ్య, పురుషులకూ స్త్రీలకూ మధ్య, ధనిక పేద వర్గాల మధ్య, అగ్ర, నిమ్న వర్ణాల మధ్య వివిధ జాతుల మధ్య, మతాల మధ్య నిరంతరం ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నది దెవరు? ఎప్పుడో మార్క్‌ట్విన్ చెప్పిన ప్రయోగం ఈ దేశంలో శతాబ్దాలుగా జరుగుతూనే ఉంది. సమకాలీనంలో మరీ ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ సమాజపు గాజు సీసాను కుదుపు తున్నది ఎవరో వివేకవంతులైన సామాన్య ప్రజలు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండాలి!
పాఠశాలల్లో పిల్లలతో పాఠాలు వల్లె వేయించడం, పూజలల్లో అవే అవే మంత్రాలు మళ్ళీ జపించడం, నోములూ, వ్రతాలూ చేయిస్తూ ఉండడం, వీటితో మనుషుల మెదళ్ళలో ఒక ''సూచన''ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దైవభక్తి, వాస్తు, జ్యోతిషం లాంటివి కూడా ఇలాంటి ''సూచన''నే ప్రవేశపెడతాయి. ఎవరైతే మానసికంగా వీటికి అధిక ప్రాధాన్యతనిచ్చి, విశ్వసిస్తూ ఉంటారో, వారు మరొక అడుగు ముందుకు వేసి, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి స్వంత బిడ్డల్ని సైతం చంపుకునే వరకు వెళుతున్నారు. మనుషుల్ని నరికి వండుకుతినే వరకు వెళుతున్నారు. దీన్ని మరి భక్తి అందామా? మానసిక రోగమందామా? ఇందులో విద్యావంతులు అవునా కాదా అనే దానికి ప్రాధాన్యత లేదు. ఆటవికులా? గ్రామీణులా? నగరవాసులా? అనే దానికి కూడా ప్రాధాన్యత లేదు. వారు, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల నుండి పూర్తిగా బయటపడి మొమిన్లు, ఫాదర్లు, పూజారులు చెప్పే మాటలకు... అంటే వారు చేసే ''సూచన''లకు పూర్తిగా లొంగిపోతున్నారు. క్రమంగా వివేకాన్ని కోల్పోయి అమానవీయ చర్యలకు పాలుపడుతున్నారు. దేవుణ్ణీ, దయ్యాన్నీ నమ్మడం కూడా మూఢ విశ్వాసమే. ఒక రకంగా అన్ని రకాల అందరు భక్తులూ మానసిక రోగులే! ఎందుకంటే తమ వ్యక్తిగత భక్తితో తమకు తాము, తమ వారికి తామూ ఏమీ చేసుకోలేరు. ఇక సమాజ శ్రేయస్సుకు ఏం చేయగలుగుతారూ? ఏమీ చేయలేరు.
పాఠశాలల్లో, కళాశాలల్లో కొత్త ప్రశ్నలు అడిగే విధంగా విద్యార్థుల్ని తయారు చేయరు. ప్రశ్నలకు జవాబులు బట్టీ కొట్టి పరీక్షల్లో ర్యాంకులు సంపాదించే వారిగా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. విశేషయమైన కృషి చేసిన మహానుభావులు ఏ రంగం వారినైనా తీసుకోండి వారంతా ర్యాంకులు సంపాదించిన వారేమీ కాదు. ర్యాంకులు వేరు. ఆలోచనా విధానం వేరు, గొప్ప ర్యాంకు సాధించినంత మాత్రాన వారు గొప్ప వ్యక్తులు అవుతారని కాదు. సరే, మళ్ళీ అది వేరే విషయం. సమాజంలో మత పెద్దలు కూడా ప్రజల్ని దేవుడు, దయ్యం, ఆత్మ, పునర్జన్మల మాయలో పడేసి వారితో అనేక రకాల తంతులు, కర్మకాండలు చేయిస్తూ వారి మెదడులో మూఢ నమ్మకాల్ని జొప్పిస్తున్నారు. ఉదాహరణకు రామకోటి రాయమనో, ఉపవాసాలుండమనో, ముడుపులు కట్టమనో, వ్రతాలు చేయమనో చెపుతారు. అంధవిశ్వాసాలు ప్రజల జీవితాల్లో ప్రధాన భాగమై ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. అలా జనాన్ని నిస్సహాయులుగా తయారు చేసి, వారిపై తమ పట్టు బిగిస్తారు. జనం కొంత కాలానికి తమ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి, ఒక్కోసారి అమానవీయంగా కూడా ప్రవర్తిస్తుంటారు. నిత్యం మనం అలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. మెదడులో జరిగే ఈ పరివర్తనల్ని మానసిక శాస్త్రం పూర్తిగా వివరిస్తుంది. నేటి యువతీ యువకులు అలాంటి విషయాలు అధ్యయనం చేయడం అవసరం. ఎవరి మెదుడును వారు అదుపులో ఉంచుకుంటే చాలు విద్యావంతులు కూడా అవసరమైన సైన్సు, తర్కం, విశ్వ పరిజ్ఞానం, చరిత్ర వంటివి వదిలేసి మహిమలు, మాయలు, సినిమాలు, టెలివిజన్ సీరియల్స్, రియాల్టీషోలు... అందులో అక్రమ సంబంధాల కథలు, అక్రమ సంపాదనల కథలు, అక్రమ మార్గాన అధికారపీఠాలెక్కే కథలు చూస్తూ ప్రభావితులవుతున్నారు. అనైతికంగా కోట్ల ఆస్థుల్ని స్వంతం చేసుకునే సన్నాసుల జీవిత చిత్రణలు జన సామాన్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయీ? కొంచెం ఆలోచించుకోవాలి కదా? రాబోయే తరాలకు మనం ఎలాంటి సమాజాన్ని ఇవ్వబోతున్నామో విశ్లేషించుకోవాలి కదా?
తోటి మానవుల్ని దూరం చేసుకుంటూ, బంధాల్ని, ప్రేమల్ని మానవీయ విలువల్ని వదులుకుంటున్నారు. విశ్వజనీనమైన అంశాలగూర్చి ఆలలోచించడం లేదు. ఎవరికి వారు తప్పుడు దారిలో ఉన్న ఫళంగా ధనవంతులైపోవాలన్న దుగ్ధతోనే కదా మూఢ నమ్మకాల్ని నమ్మేది? దైవశక్తే మూఢ నమ్మకమైతే ఇక దాని చుట్టూ తిరిగేవన్నీ మూఢనమ్మకాలే అవుతాయి కదా? మూఢనమ్మకాలు విశ్వసించే వారంతా మానసిక రోగులని ముందుగా గ్రహించుకోవాలి. ఈ మూఢనమ్మకాలతోనే మనుషుల్లో స్వార్థం, కుత్సితబుద్దీ అలవడుతున్నాయి. నిత్య జీవితంలో మనం నీరు కాచి వడబోసి తాగుతున్నాం. ఎందుకూ? ఆరోగ్యం కాపాడుకోవడం కోసం. ఆహారం తీసుకోవడంలో శుభ్రతని పాటిస్తున్నాం. వాతావరణ కాలుష్యాల నుంచి తప్పించుకుంటున్నాం. ఇవన్నీ ఎంతో ప్రాధాన్యమున్న అంశాలు. అలాగే మూఢ నమ్మకాలకు బలికాకుండా ఆరోగ్యకరమైన ఆలోచనలతో జీవితం గడపడం అవసరం. ఈ సంక్లిష్టమైన సమాజంలో మనం నిరంతరం జాగరూకతతో ఉండాల్సిందే! మన తోటి వారిని కూడా మూఢనమ్మకాల నుండి బయటికి తేవాల్సిన బాధ్యత మనదే! దైవ భక్తితో మునిగిపోయిన వారంతా మహానుభావులనే తప్పుడు అభిప్రాయం మార్చుకోవాలి. వాళ్ళంతా మానసిక రోగులని, వారిని మామూలు మనుషులుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందనీ తెలుసుకోవాలి. అలాంటి వారిని గుర్తించి సరైన సమయంలో వైద్య సహాయం అందివ్వకపోవడం వల్లనే కదా... దేవుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? కన్న బిడ్డల్ని సైతం చంపేసుకుంటున్నారు?
''ఉనికిలో లేని ఒక 'ఉత్పతి'కి (ూ=ఉణఖజు)చేసే వ్యాపార ప్రకటనే - మతం'' -క్లైవ్ జేమ్స్.
(ఆస్ట్రేలియన్ రచయిత, జర్నలిస్ట్. 57సంవత్సరాలు యూ.కె.లో 'టెలివిజన్ సమీక్షకుడిగా వ్యాఖ్యాతగా వ్యవహరించినవాడు)
వీటన్నిటికి తోడు ప్రధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్ల వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇతరత్రా ఉన్నత స్థాయిలో ఉన్నవారి ప్రవర్తనల్ని, వారి ఉపన్యాసాల్ని జనం విశ్లేషించుకుంటూ ఉండాలి. అవి మన రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని అవలోకించుకుంటూ ఉండాలి. ఉన్నతస్థితికి చేరినంత మాత్రాన వారికి మానసిక బలహీనతలు ఉండవని కాదుగదా? మనిషయిన వాడికి బలాలతో పాటు బలహీనతలు కూడా ఉంటాయి. పైగా వారి ప్రాచుర్యాన్ని సమాజంలో నిలుపుకోవడానికి వారు జనంలో ఉన్న బలహీనతల్ని కాపాడే ప్రయత్నమే చేస్తారు. జనం బలహీనతల్ని వదిలించే ప్రయత్నం ఏమాత్రం చేయరు. ప్రార్థనా స్థలాల చుట్టూ తిరుగుతూ, మతాధిపతుల, దొంగ సన్యాసుల కాళ్ళు మొక్కుతూ సామాన్య జనానికి వీరు కూడా ఒక 'సూచన' చేస్తుంటారు. ప్రజలు మానసిక రోగులుగా ఉంటేనే వారిని పరిపాలించడం సులభం అని వారికి తెలుసు. అందువల్ల అధికార బాధ్యతలు నిర్వహించేవారు మోసపూరితంగానే జనానికి తప్పుడు సూచనలు ఇస్తుంటారు. అలాంటి సంకేతాల్ని జనం తిప్పి కొట్టాలి. ఏమాత్రం ప్రభావితం కాకుండా ప్రశ్నించడాన్ని, సంఘర్షిస్తూ తమ హక్కుల్ని సాధించుకోవడాన్ని ఏమాత్రం వదులుకోగూడదు.
''మనకు డబ్బుని ప్రేమించే నాయకులు అక్కరలేదు. న్యాయాన్ని ప్రేమించేవారు కావాలి! ప్రచార ఆర్భాటాలకు ఆశపడేవారు కాదు, మనస్ఫూర్తిగా మానవత్వాన్ని ప్రేమించేవారు కావాలి!'' ఇది మార్టిన్ లూథర్‌కింగ్ (జూ) ఎప్పుడో చెప్పిన మాట. ఇప్పుడు ఇది మన దేశ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. న్యాయాన్ని ద్వేషిస్తూ, ప్రజల్ని విభజిస్తూ, మారణకాండలు జరిపించే మన దేశ నాయకులకు- మానవత్వం అనేది ఒకటి ఉంటుందని పాపం ఎలా తెలుస్తుందీ? నీటిలో మునిగిపోతున్న చేపని పాము రక్షించినట్టుగా ఈ దేశ ప్రజల్ని రక్షించడానికి ఆ దేవుడే మన ప్రధాని రూపంలో వచ్చాడని భక్తులు ప్రచారం చేసుకుంటున్నారు. చేప నీటిలో మునిగిపోతుందా? పాము చేపని భక్షించడానికి నోట కరుచుకుందా? లేక రక్షించడానికా? అన్నది ఈ దేశ ప్రజలు తెలుసుకోలేరా? వారు మరీ అంత అమాయకులా?
''జనం గ్రహించే విధంగా అబద్దాల్ని ఎండ గట్టడం, నిజాల్ని నిర్భయంగా ఎలుగెత్తి చెప్పడం మేధావుల కర్తవ్యం'' అని అన్నారు నోమ్‌చామ్‌స్కీ- (అమెరికన్ భాషా శాస్త్రవేత్త, తాత్త్వికుడు, సామాజిక సమీక్షకుడు, రాజకీయ కార్యకర్త). అహేతుకంగా ఆలోచించే వారికి హేతుబద్ధమైన విధానాలు తప్పుగా తోస్తాయి. ఏ ఆలోచనలైతే వాస్తవానికి దగ్గరగా ఉంటాయో, జన బాహుళ్యానికి ఉపయోగకరంగా ఉంటాయో, మానవీయ విలువలతో ఉంటాయో వాటినే మనం ఆచరించాలి. వాటి గురించే ఇతరులకు చెప్పాలి. అంతే! అందుకు విరుద్ధంగా భ్రమల మీద, భక్తి మీద, అర్థరహితమైన అంధవిశ్వాసాల మీద ఆధారపడ్డ ఆలోచనల్ని సమూలంగా నాశనం చేయాలి. హింసను అహింసతోనూ, ద్వేషాన్ని ప్రేమతోను, దైవభావనను హేతువాదం తోనూ జయించాలి! అందుకు అనుక్షణం సంసిద్ధులమై ఉండాలి! తప్పదు!!
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు