Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించే ప్రస్తావన ఏదీ మా వద్ద లేదు'- లోక్‌సభలో స్పష్టం చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ. కేంద్ర ప్రభుత్వం దగ్గర పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభలో డిసెంబర్ 12న రాతపూర్వకంగా స్పష్టం చేసింది. లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఒకసారి కొత్త పెన్షన్ స్కీములో ప్రవేశించాక రాష్ట్ర ప్రభుత్వాలను మళ్లీ పాత పెన్షన్ స్కీములోకి మారడానికి అనుమతించే ప్రసక్తి కూడా లేదని తేల్చి చెప్పింది. 'అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు' అన్న చందాన మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
- ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమును తిరిగి ప్రారంభించాయా ? అయితే ఆ వివరాలను తెలియజేయండి.
- పాత పెన్షన్ స్కీమును మళ్లీ ప్రారంభించడానికిగాను ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఇంతవరకూ కొత్త పెన్షన్ స్కీము కింద కేంద్రానికి చెల్లించిన సొమ్మును తిరిగి వాపసు ఇవ్వమని కోరాయా ?
- ఒకవేళ ఆ విధంగా కోరినట్లైతే ఆ వివరాలను, అందుకు కేంద్ర ప్రభుత్వపు ప్రతిస్పందనను తెలియజేయండి.
- పాత పెన్షన్ స్కీమును తిరిగి ప్రారంభించదలచిన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కొత్త పెన్షన్ స్కీము కింద ఆ రాష్ట్రాలు తనకు చెల్లించిన సొమ్మును వాపసు ఇచ్చే విష యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేయగలరు
- సమీప భవిష్యత్తులో కేంద్రం కొత్త పెన్షన్ స్కీము కింద జమ అయిన సొమ్మును వెనక్కి ఇచ్చే ప్రతిపాదన ఏదైనా కేంద్రం వద్ద పరిశీలనలో ఉందా ? ఉంటే ఆ వివరాలను తెలియజేయండి.''
- ఇది అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ఆర్థిక మంత్రిని అడిగిన ప్రశ్న. దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ ఈ విధంగా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
- 'రాజస్తాన్, చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమును పునరుద్ధ రించాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వానికి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ)కి తెలియజేశాయి.
- 18-11-22న పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కొత్త పెన్షన్ స్కీము వర్తిస్తున్న తమ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమును వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
- రాజస్థాన్, చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలు తాము కొత్త పెన్షన్ స్కీము కింద కేంద్ర పీఎఫ్ఆర్డీఏకు చెల్లించిన మొత్తాన్ని వాపసు ఇవ్వవలసిందిగా కోరాయి. ఇంతవరకూ అటువంటి విజ్ఞాపన ఏదీ పంజాబ్ నుండి రాలేదు.
'రాజస్థాన్, చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తికి స్పందిస్తూ పీఎఫ్ఆర్డీఏ 2013 పీఎఫ్ఆర్డీఏ చట్టం ప్రకారం గాని, పీఎఫ్ఆర్డీఏ (కొత్త పెన్షన్ స్కీము నుండి నిష్క్రమణలు, ఉపసంహరణలు) నిబంధనలు, 2015 ప్రకారంగాని ఒకసారి కేంద్రం వద్ద జమ చేసిన పెన్షన్ నిధులను వెనక్కి ఇచ్చే అవకాశం ఏదీ లేదని తెలియజేసింది. పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీ కేంద్రం పరిశీలనలో లేదు.''
కొత్త పెన్షన్ స్కీమును ప్రవేశపెడుతూ చట్టాన్ని 2003లో తీసుకువచ్చిందీ అప్పటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే. ఒకసారి ఆ స్కీములో తల దూర్చాక మళ్ళీ వెనక్కిపోలేని విధంగా నిబంధనలు 2015లో జారీ చేసిందీ బీజేపీ ప్రభుత్వమే. ఇప్పుడు ఉద్యోగులంతా ముక్త కంఠంతో మాకీ కొత్త స్కీము వద్దు మొర్రో అంటున్నా మొండిగా వ్యవహరిస్తున్నదీ మోడీ ప్రభుత్వమే. కొత్త పెన్షన్ స్కీము రూపంలో కేంద్రానికి ప్రతీ నెలా వేల కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. ఆ సొమ్మునంతటినీ స్టాక్ మార్కెట్లో జూదా నికి వాడుతోంది పీఎఫ్ఆర్డీఏ. తద్వారా బడా కార్పొరేట్లకు ఉద్యోగుల కష్టార్జితాన్ని దోచిపెడుతోంది. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఇంతవరకూ చెల్లించిన మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వవలసిందిగా కోరుతున్నా, ఇచ్చేది లేదని ఇప్పుడు మొండిగా నిరాకరిస్తోంది. 1956లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ స్కీమును మొదట ప్రవేశపెట్టారు. ఉద్యోగులు తమ తమ జీవితాల్లోని అతి ముఖ్యమైన కాలాన్ని ప్రభుత్వ సేవకు అంకితం చేసినందున ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితాలు సవ్యంగా సాగిపోయేలా చూడడం ప్రభుత్వ బాధ్యత అవుతుందని అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. అందుకే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నుండే ఉద్యోగులకు పెన్షన్‌ను చెల్లించడానికి ఏర్పాటు చేసింది. అనంతర కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే మార్గాన్ని అనుసరించాయి. 1982లో సుప్రీంకోర్టు అతి ముఖ్యమైన తీర్పును వెలువరించింది. 'నకారా జడ్జిమెంట్'గా ప్రఖ్యాతి చెందిన ఆ తీర్పు 17-12-1982న వెలువడింది. ఆ తర్వాత కాలంలో ఆ తీర్పు వెలువడిన రోజును అఖిలభారత పెన్షనర్ల దినంగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది.
'పెన్షన్ అనేది యజమాని తన ఇష్టాన్ని బట్టి చెల్లించేది కాదు. దయా దాక్షిణ్యాలను బట్టి చేసే దానమూ కాదు. అది ఒక సామాజిక సంక్షేమ చర్య. తమ తమ యుక్తవయస్సులో అవిశ్రాంతంగా యజమానులకు సేవలందించిన ఉద్యోగులకు సామాజిక-ఆర్థిక న్యాయం చేయడానికి తీసుకున్న చర్య పెన్షన్ విధానం. వద్ధాప్యంలో వారిని పట్టించుకోకుండా వదిలేయబోమన్న హామీ మేరకే ఆ ఉద్యోగులు ఆ విధంగా సేవలందించారు. 'ఇది ఆనాడు సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్న కీలకాంశం. ఉద్యోగ విరమణ అయిన తేదీలు వేరైనప్పటికీ, ఒకే విధమైన సర్వీసును (ఒకే కేడర్‌లో) ఒకే కాలం (సమాన సర్వీసు) అందించిన ఉద్యోగులకు సమానమైన పెన్షన్ ఇవ్వవలసిందేనని ఆ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోబాటు తమకూ పెన్షన్ వర్తింపజేయాలని ఆ తర్వాత కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఉద్యమాలు చేపట్టారు. నయా ఉదారవాద విధానాలు అమలు కావడం మొదలయ్యాక ఉద్యోగులు, కార్మికుల హక్కులమీద దాడులు పలు రూపాల్లో ప్రారంభమయ్యాయి. వాటిలో భాగంగానే పెన్షన్ మీద దాడి కూడా మొదలైంది. పెన్షన్ డిమాండ్ అందరినీ ఏకం చేసే అవకాశం ఉంది. అది నయా ఉదారవాదానికి సుతరామూ నప్పదు. అందుకే రకరకాలుగా ఉద్యోగులను విడగొట్టడానికి పూనుకుంది. అందులో భాగంగానే ఇపిఎస్-1995 వచ్చింది. 1995 కు ముందు చేసిన సర్వీసును లెక్కలోకి తీసుకోకుండా అప్పటినుంచే లెక్కించడం, ఉద్యోగుల జీతాలనుండి కొంత సొమ్మును ఈపిఎఫ్ నిమిత్తం మినహాయించడం, జమ అయిన సొమ్ము నుండే పెన్షన్ చెల్లించడం దీనితోనే మొదలైంది. యజమానిదే పూర్తి బాధ్యత అని నకారా జడ్జిమెంట్ చెప్తూంటే, కార్మికులే తమ భవిష్యత్తు పెన్షన్ నిమిత్తం చెల్లించాలి అని ఈపీఎఫ్ స్కీము అంటుంది. ప్రభుత్వ నిధులనుండే నేరుగా పెన్షన్ చెల్లించాలని సుప్రీం తీర్పు నిర్ధేశించింది. కానీ పెన్షన్ చెల్లించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధిలో సొమ్ము ఉంటేనే చెల్లించగలుగుతాం అని ఈపిఎఫ్ స్కీము ద్వారా ప్రభుత్వం సుప్రీం తీర్పును పక్కన బెట్టింది. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో బండారు దత్తాత్రేయ కార్మిక మంత్రిగా ఉన్న కాలంలో ఈపీఎఫ్ కనీస మొత్తాన్ని నెలకు రు. 6000 చేస్తామని ప్రకటించారు. సన్మానాలు కూడా అందుకున్నారు. అది జరిగి పాతికేళ్లయింది. ఇప్పటికీ కనీస పెన్షన్ ఈపిఎఫ్‌లో రూ. 1000 గానే కొనసాగుతోంది.
ఇక 2003లో తెచ్చిన కొత్త పెన్షన్ స్కీము సంగతి చెప్పనక్కరలేదు. 2004 తర్వాత సర్వీసులో చేరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు, పెన్షన్ స్కీములు అమలులో ఉన్న బ్యాంకులు, ఇన్సూరెన్స్, టెలికం తదితర రంగాల ఉద్యోగులకు సైతం ఈ కొత్త పెన్షన్ స్కీము వర్తిస్తుంది. ఈ స్కీము ద్వారా ఉద్యోగుల జీతాల నుండి మినహాయించే సొమ్ము యావత్తూ పిఎఫ్ఆర్డిఎ వద్దకు చేరుతుంది. అక్కడినుండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడ తారు. ఆ స్టాక్ మార్కెట్ జూదం సంగతి అందరికీ తెలిసినదే. అంటే 66 సంవత్సరాల క్రితం ఒక హక్కుగా మొదలైన పెన్షన్ ఇప్పుడు ఉద్యోగులే తమ సర్వీసు కాలంలో కొనుక్కోవలసిన ఒక సరుకుగా మారిపోయిందన్నమాట. పైగా అది కూడా స్టాక్ మార్కెట్ జూదంలో కార్పొరేట్ల మాయలో చిక్కుకుపోయింది. అక్కడి నుండి వెనక్కి మళ్లించాలని, పెన్షన్‌ను తిరిగి తమ హక్కుగా పరిగణించాలని ఉద్యోగులంతా ఆందోళనలు చేస్తున్నారు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం 'తగ్గేదేలే' అన్నట్టు వ్యవహరిస్తోంది. మన రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిపిఎస్ విధానం రద్దు చేయాలని చాలా కాలం నుండీ ఆందోళనలు సాగిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం బట్టి కొత్త పెన్షన్ స్కీము (లేదా సిపిఎస్) వెనక మూలవిరాట్టులు ఎవరన్నది స్పష్టమవుతోంది. ఒకసారి ప్రవేశపెట్టాక పెన్షన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పటికీ వెనక్కి ఇవ్వబోము అని కేంద్రం కుండబద్దలుగొట్టింది. ఇది ఉద్యోగుల హక్కు మీద దాడి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులమీద కూడా దాడిగా పరిగణించాలి. ఏదేమైనా ఒక విషయం స్పష్టం. నయా ఉదా రవాద విధానాల అమలు పర్యవసానంగా ఉద్యోగుల పెన్షన్ హక్కు కాస్తా ఉద్యోగులు తమ కష్టార్జితాన్నుంచి కొనుక్కునే సరుకుగా దిగజారిపోయింది. ఆ సరుకూ గ్యారంటీగా దొరుకుతుందని చెప్పలేని స్థితి వచ్చింది. అందుచేత దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ఏకమై పోరాడాల్సిన తరుణం వచ్చింది. ఈ' పెన్షనర్స్ డే' నాడు అందరూ ఆ ఐక్య పోరాటానికి సమాయత్తమవుదాం.
- వ్యాసకర్త : శాసనమండలి పూర్వ సభ్యులు
ఎం.వి.ఎస్. శర్మ