Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భావజాలానికి సంబంధించి భారత రాజకీయాలు, 'ముందు నుయ్యి వెనుక గొయ్యి' లాంటి పరిస్థితుల్లో చిక్కుకు న్నాయి.20వ శతాబ్దపు తొలి దశాబ్దాల్లో తన కోసం ఏర్పరచుకున్న భావజాలంలో మునిగిపోయిన పాలక పార్టీ మనకుంది. భావజాల ఊహలు, లక్ష్యాలు, వ్యూహాలు ప్రతీ విధాన ప్రకటనలో, ప్రతీ ఉప న్యాసంలో, ప్రతీ చర్యలో, వాస్తవంగా చెప్పాలంటే పార్టీ కార్యకర్తల ఆలోచనల్లో పెనవేసుకొని ఉన్నాయి. వారి స్పష్టమైన లక్ష్యం కోసం కార్య కర్తలు ప్రతీ సంస్థను మార్చాలనీ, దేశంలో పెళ్లి దగ్గర్నుండి పాఠశాలలు, యూనివర్సిటీలు, అంతరిక్షం దాకా పేర్లను మార్చి, పునర్నిర్మించి, చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు.
హిందూత్వ భావజాలం సరళమైన, సామాన్యమైన నియమాలపై ఆధారపడి ఉంటుంది. అది అనుమానాలను, ప్రశ్నలను, సంకోచాల్ని కూడా అనుమతించదు. ఆత్మవిమర్శ అనే భావన దానికి లేదు. అది జ్ఞానం యొక్క తాత్వికతలోని మార్పులకు ప్రభావితం కాదు. సమతావాదం, స్వేచ్ఛ, హక్కుల న్యాయం, బహుళ సాంస్కతిక వాదం, మైనారిటీ హక్కులలాంటి వాస్తవిక ప్రజాస్వామ్యానికి కారణభూతమయ్యే రాజకీయ సిద్ధాంతాల్లో జరిగే గొప్ప చర్చలతో కూడా హిందూత్వ భావజాలం ప్రభావితం కాదు. హిందూత్వ మానవులను అర్థం చేసుకోడానికి అత్యంత కఠినమైన, ఎవరికీ లొంగుబాటుకాని కొన్ని సూత్రాలను క్రోడీకరించి, వాటిని సమాజానికి నిర్దేశించింది. దానికి హిందూమతంతో సంబంధం లేదు కానీ మతపరమైన అస్థిత్వంపై ఆధారపడి రాజకీయాల్ని నడిపే స్వభావాన్ని కలిగి ఉంటుంది. భావజాల తీవ్రతతో కూడిన ఈ హిందూత్వ ఖచ్చితంగా అభివద్ధి నిరోధకమైనది.
మరోవైపు భావజాలాన్నే ఏవగిం చుకునే ఆమ్ఆద్మీ పార్టీ పాఠశాల విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు ఆచరణీయ (వ్యవహారిక) పరిష్కారాలపైనే కేంద్రీకరిస్తుంది. భావజాలానంతర ప్రపంచం (పోస్ట్ ఐడియలాజికల్ వరల్డ్)పై వారి వాదన కొత్తదేమీ కాదు. ఆప్ ఉద్దేశపూర్వకంగానే ప్రజాస్వామ్యం లాంటి రాజకీయ సమస్యల కంటే కూడా పౌరసంబంధ సమస్యలపై ఎక్కువగా కేంద్రీకరిస్తుంది. దాని భాష లోపభూయిష్టంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు విద్య, వైద్యం లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకునే హక్కులుంటాయి. ఈ సామాజిక నైతిక హక్కులు ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో ఇవ్వడం లేదు. నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి, గహవసతి, ఆదాయవనరులను పొందే హక్కును పౌరులు కలిగి ఉంటారు. మరీ ముఖ్యంగా, పౌర హక్కుల్ని కలిగి ఉండే హక్కు, సరైన కారణం లేకుండా నిర్బంధానికి గురి కాకుండా ఉండే హక్కు, స్వేచ్ఛగా ఆలోచించే హక్కు, భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు, నిరసన తెలిపే హక్కు, ప్రభుత్వాధికారులు లేదా సమాజంలోని సభ్యుల చేతిలో ప్రమాదానికి గురి కాకుండా ఉండే హక్కులు పౌరులకు ఉంటాయి.
ఆప్ దష్టిలో ప్రజాస్వామ్యం
ఆప్ పౌర సేవలపై కేంద్రీకరిస్తుంది కానీ ఢిల్లీ వాసుల పౌరహక్కుల ఉల్లంఘనపై మాత్రం మౌనం వహిస్తుంది. అది 2019,2020లలో జరిగిన పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనల సందర్భంలో గానీ, 2020 జనవరిలో జేఎన్‌యూ బోధనా సిబ్బంది, విద్యార్థులపై గూండాలు అనాగరికంగా దాడులు చేసిన సందర్భంలో గానీ, 2020 ఫిబ్రవరిలో ఉత్తర ఈశాన్య ఢిల్లీలో మతహింస చెలరేగిన సందర్భంలో గానీ, షాహీన్ బాగ్‌లో సాహసోపేతమైన నిరసనలు మిన్నంటిన సందర్భంలోగానీ, జర్నలిస్టులు, విద్యా వేత్తలు, పౌర సమాజంలోని కార్యకర్తలు, విద్యార్థులను విచక్షణారహితంగా అరెస్టు లు చేసిన సందర్భంలో గానీ వాటిని ఖండిస్తూ ఆప్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
ప్రజల్ని రక్షించడంలో ప్రభుత్వ బాధ్యతల ఉల్లంఘన మాత్రమే ఆప్ వైఖరి కాదు. ప్రజాస్వామ్య అంతర్గత నిర్మాణ అంశంగా పౌరహక్కులను విస్మరించినట్టు కనిపించినంత వరకు అది భావజాల పరమైనది. ఇది, ప్రజాస్వామ్యం పట్ల ఆప్‌కు ఉన్న అవగాహనను తెలియ జేస్తుంది, ఆ పార్టీ కేవలం సేవలకు మాత్రమే పరిమితమైంది. అలా చేసే ఉద్దేశాలు ఆప్‌కు ఉండకపోవచ్చు కానీ, మినహాయింపు చర్యలు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన వలే అధికారిక చర్యలుగా పరిగణించబడతాయి. ప్రాథమిక ప్రజాస్వామిక హక్కులపై ఆప్ ఏ వైఖరి తీసుకోనంతవరకు, ఆ పార్టీ కేవలం సేవలు అందించే, ఎన్నికల్లో పోటీ చేసే పార్టీగానే మిగిలి పోతుంది. ఒకప్పుడు ఆప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకిది నిజంగా నిరుత్సాహమే. రెండో విషయమేమంటే, ఆప్ కేవలం ఒక వ్యక్తి - అరవింద్ కేజ్రీవాల్ నీడలోనే ఉంటుంది.ఇది భావజాలం కాదు, ఇది వ్యక్తి ఆరాధన. దీనిలో పార్టీ, నరేంద్ర మోడీ అదుపులో ఉన్న బీజేపీ లాంటి పార్టీగానే(క్లోన్) మిగిలి పోతుంది.
కేజ్రీవాల్ ప్రభుత్వ వ్యవహారాల్లో అనుభవమున్న వ్యక్తి. పార్టీ ఆయన మీద మాత్రమే కేంద్రీకరించినంత కాలం, దేశంలోని మిగతా ప్రాంతాలకు పార్టీ విస్తరించలేదనే విషయాన్నాయన తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యం అనేక విధాలుగా రాజకీయ పార్టీలపై బాధ్యతలను విధిస్తుంది కానీ, అన్నింటినీ మించి ఒక రాజకీయ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేయకుంటే ఆ పార్టీ ప్రజాస్వామికంగా ఉండలేదు. హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఏక వ్యక్తి పార్టీకి ఉండే హద్దుల్ని స్పష్టం చేశాయి. పార్టీకి కార్యకర్తలు అవసరం కానీ అదే పార్టీకి భావజాలం కూడా అవసరమే. దానివల్ల తాము ఎవరికోసం నిలబడాలి, ఎవరికి వ్యతిరేకంగా నిలబడాలి అనే విషయాన్ని ఆ పార్టీ సభ్యులు తెలుసుకుంటారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో రాజకీయ కార్యాచరణ ద్వారా ప్రజా స్వామ్యం, లౌకికతత్వం, సామ్యవాదం, కలుపుకొనిపోయే తత్వం (ఇంక్లూజివ్ నెస్), సహనం అనే భావజాలాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచింది. కాలం గడచిన కొద్ది ఆ భావజాలం వాడుకలో లేకుండా పోయింది. అనేకమంది కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీని వదిలి వెళ్లినపుడు, నేడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో పార్టీకి తెలియదనే విషయం ఏ ఒక్కరూ చెప్పకపోవడం విచారకరం. వారిలో ఎక్కువ మంది ఇతర కారణాలతో పార్టీని వదిలి వెళ్ళారు. పోషకత్వం, నాయకత్వాన్ని సభ్యులకే పరిమితం చేసినపుడు, పార్టీ ఒక దర్బార్ గా మారినపుడు, భావజాలం బలహీనపడి పార్టీ కూడా దెబ్బతింటుంది.
భావజాలం కర్తవ్యం
రాజకీయ ఊహల్ని బలహీనపరచి, సంఘీభావం, కనికరాలకు అడ్డంకిగా మారే అభివద్ధి నిరోధకాన్ని రక్షించే భావన కాదు భావజాలం అంటే. కానీ మనం ఒక రాజకీయ పార్టీకి ఓటు వేయడానికి ముందే ఆ పార్టీ ప్రాపంచిక దక్పథం ఏమిటో తెలుసుకోవాలి. మానవ విముక్తి కోసం, కర్తవ్యాలను సాధించే ప్రపంచాన్ని సష్టించడానికి కష్టపడే పార్టీలూ ఉన్నాయి. పాలక పార్టీ సంఘీభావాన్ని అణచి, ప్రజలను మతాల వారిగా విభజించి, వారి మధ్య చిచ్చు పెట్టి, పౌరసత్వ బంధాలను బద్దలు కొట్టినట్లైతే ఏ ఒక్కరూ ఆ కర్తవ్యాలను సాధించలేరు.
పౌర సమాజంలో తెలివైన జోక్యాలను ఏర్పరిచే పౌరసమాజాన్ని రూపొందించడానికి కులమతాలకు అతీతంగా ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందనే స్పహను ఒక ప్రజాస్వామిక పార్టీ కలిగి ఉండాలి. రంగురంగుల జెండాలు, తోరణాలు చూడ్డానికే కనుల విందుగా ఉన్నప్పటికీ అవి పౌరసమాజాన్ని ఏర్పరచవు. పౌర సంఘీభావానికి ప్రజల మధ్య, ప్రజలు మరియు రాష్ట్రాల మధ్య బహుళ సమాచారాల అవసరం ఉంటుంది. దానికి, ప్రవర్తనా నియమాలను, రాజకీ యాలను ఒక్కచోటకు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ప్రముఖ విమర్శనాత్మక సిద్ధాంతకర్త హార్క్ హైమర్ మాటల్లో చెప్పాలంటే, ఆధిపత్యం, అణచివేతల నుండి మానవ విముక్తిని సాధించాల్సిన అవసరం ఉంది.
రాజకీయ పార్టీలు సామాజిక ఉద్యమాలను గమనించాలి, వాటికి మద్దతు ప్రకటించాలి, ఏకపక్షంగా చేస్తున్న అరెస్టులను ఆక్షేపించాలి, మైనారిటీలకు రక్షణ కల్పించాలి, ఆధిపత్య నిరంకుశవాదానికి అతీతంగా ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థాన్ని విస్తరించి, మంచి సమాజాన్ని నిర్మించే లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఇది భావజాలం యొక్క కర్తవ్యం.
సమానత్వపు హక్కు, స్వేచ్ఛననుభవించే హక్కు, న్యాయాన్ని పొందే హక్కుతో పాటు పౌరహక్కుల్లో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల్లో ఆరోగ్యంగా ఉండే, చదువుకునే హక్కులు భాగంగా ఉన్నాయి. ప్రతీ వ్యక్తికీ న్యాయాన్ని అందించే లలిత కళగా మనం రాజకీయాలను భావిస్తే, హక్కులపై దష్టిని కేంద్రీ కరించడం రాజకీయం అవుతుంది. రాజకీయ భావాలు అభివద్ధి చెందిన ఈ సమయంలో, ప్రతీ ఒక్కరూ న్యాయం పొందడానికి అర్హత కలిగి ఉంటారనే నిర్ధారణ కోసం విస్తతమైన వాదనలు చేయాల్సి నవసరం లేదు. మానవులు కొన్ని నిర్దిష్టమైన పద్ధతుల్లోనే వ్యవహరిం చాలనీ, మానవ గౌరవానికి ప్రతిబంధ కమైన హింస, హత్య, అపాయం తలపెట్టే పద్ధతుల్లో ప్రవర్తించ కూడదని ఇప్పటికే ఓ విశ్వాసం స్థిరపడిపోయింది.
పాఠశాలలు, ఆసుపత్రులను మెరుగుపరచడం ద్వారా ఒక రాజకీయ వేదిక, రాజకీయ క్లిష్టపరిస్థితిని బాగుచేస్తుందని వాదించడం అంటే మానవులకు ఏమివ్వాలనే సమస్యను లేకుండా చేయడమే అవుతుంది. మనకు విద్యావైద్య సదుపాయాలతోపాటు హక్కులు కూడా ఇచ్చారు. మనకు విద్య అవసరం కానీ ఆలోచించే స్వేచ్ఛ, ఏదైనా చర్యలు చేపట్టే స్వేచ్ఛ, భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా అవసరం.
భావజాలం లేని పార్టీ ఒక సాధనంగానే ఉంటుంది, అది ఏ మార్గంలోనైనా వెళ్ళొచ్చు. ఆ పార్టీ విశ్వాసాలేమిటి, పౌరులకు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో ఆ పార్టీకి అవగాహన ఉండే విషయాలు, మానవ స్వభావం గురించి ఆ పార్టీ అవగాహన, అన్నింటినీ మించి మంచి జీవితాన్ని సష్టించడానికి ఆ పార్టీ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో మనకు తెలియదు. ప్రస్తుత పరిస్థితిలో ఉన్న తప్పులేంటి, ఈ క్లిష్ట పరిస్థితుల్నెలా అధిగమించాలి, మానవ గౌరవాన్ని కాపాడేందుకు ఆ పార్టీకున్న లక్ష్యాలేంటి అనే విషయాలను ఒక రాజకీయ పార్టీ భావజాలం మనకు చెప్పాలి. అది విమర్శనాత్మక దష్టిని కలిగి ఉంటూ,అదే సమయంలో ఒక దష్టి కోణాన్ని కూడా కలిగి ఉండాలి.
మనలో చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ పై ఎన్నో ఆశల్ని పెట్టుకున్నాం. కానీ అది మంచి జీవితం కోసం కేవలం పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలకు పరిమితం కాకూడదు.మంచి జీవితానికి సంబంధించి అనేక భాగాలు ఉంటాయి కానీ, చివరకు మానవ గౌరవాన్ని కాపాడేది హక్కులు మాత్రమే.అధికారాన్ని చిక్కించుకున్న పార్టీల ఎజెండాను గుర్తించేది కూడా హక్కులే.ఈ కారణాల వలన, నీ(ఆప్) ప్రాపంచిక దక్పథం ఏమిటో, నీవెవరి కోసం నిలబడతావో, ఎవరికి వ్యతిరేకంగా నిలబడతావో మాకు చెప్పాలి. నీవు కేవలం సేవలందించే సాధనంగా మారావు, నీ ప్రజాస్వామిక విశ్వాస నిదర్శనాలు మరొకసారి పునరుద్ధరించు.
- ప్రొ|| నీరా ఛాంధోక్
(''ద వైర్'' సౌజన్యంతో)
(వ్యాసకర్త ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451