Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊహలకే రెక్కలొస్తే ఎలా ఉంటుందని కవులు రాస్తుంటారు. అలాగే పంచకల్యాణి గుర్రం పై తన రాజు వస్తాడని పడతి వెయిట్ చేస్తున్నట్టు కూడా రాశారు కవులు. ఇంతకూ ఆ పంచకల్యాణి గుర్రానికి రెక్కలుంటాయి, అదే విశేషమక్కడ. ఊహలకు, గుర్రాలకు రెక్కలు రావడమేమిటి అన్న అనుమానం మనకు రాకూడదు. చదువుతూ ఎంజారు చేస్తూ పోవాలి. ఈమధ్య కోడి గుడ్డుకు రెక్కలొచ్చాయి. కోడికి లేదా కోడి పిల్లకు కదా రెక్కలొచ్చేది అనుకోవచ్చు. ఇక్కడ రెక్కలంటే ధరలన్నమాట. కూరగాయల ధరలకు రెక్కలు రావడం మామూలు. అప్పుడు గుడ్డే జనాలకు ఆసరా. అలాంటిది కోడిగుడ్డు కూడా రెక్కలొచ్చి ఏ చెట్టుమీదనో కూచుంటే, లేక ఆకాశంలో తిరిగితే మనిషికి పోషకాహారం దొరకదు. కోడి గుడ్డుపై ఈకలు పీకుతారని కొందరిని అంటుంటారు. అంటే ప్రతి విష యాన్ని పీకి పాకాన పెడతారన్న మాట. ప్రతి దాంట్లోనూ తప్పులు చూస్తారన్న మాట వాళ్ళు. అందులో తప్పేముంది అలా చూసినప్పుడే కదా అందరికీ మంచిది, అసలు మంచిది ఏదో తెలిసేది!! ఏదేమైనా ఈ కోడిగుడ్డు జనాల నాలుకలపై ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందని, గాడిద గుడ్డేం కాదు అని, ఇలా దాన్ని వాడుతుంటారు. అలా నాలుకల మీద తిరగడమే కాని ఇకపై ఆ గుడ్డు పొట్టలోకి పోదని, పోలేదని తెలిసి చాలామంది బాధపడుతున్నారు. కోడి కూయకున్నా తెల్లారుతుంది కాని కోడి గుడ్డులేకుండా జనాల జీవితాలు తెల్లారవు. దాన్ని ఎన్నిరకాలుగానో వండుకుని తింటారు. అందుకే దాన్ని మాంసాహారంలో నుండి శాఖాహారంలోకి వేశారు విజ్ఞులు. ఎగ్ ఈజ్ వెజ్ అన్నది కొత్త నినానదం. ఇలా వెజ్ కాబట్టే అందరూ తినడం మొదలుపెట్టినప్పటి నుండే వీటి ధరలు పెరిగాయని మార్కెట్ల పైన ఏ మాత్రం అవగాహనలేనివారు ఆడిపోసుకుంటూ ఉంటారు, అది వేరే సంగతి. పైన గాడిద గుడ్డు అనుకున్నట్టు ఈ గుడ్డుని తీసేయకూడదు. అసలు డైనోసారులనే రాక్షసబల్లులు 146 మిలియన్ సంవత్సరాల నుండి 200 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద జీవించినట్టు శాస్త్రవేత్తలు చెబుతారు. ఇంతకీ ఇప్పుడు వాటి గురించి ఎందుకు చెబుతున్నట్టు అనే ప్రశ్న రావచ్చు. ఎందుకంటే ఆ రాక్షసబల్లులు కూడా గుడ్లు పెట్టేవి. వాటి జాతులు మొత్తం నశించిపోయినా కొన్ని అవశేషాలు దొరికాయి. వాటిలో రాక్షసబల్లుల గుడ్లు కూడా దొరికాయి. ఈమాట తెలిస్తే కోళ్ళు ఎగిరి గంతేసి తమలాగే రాక్షసబల్లులు కూడా గుడ్లు పెట్టేవా అని ఆనందపడిపోతాయి. గుడ్లు పెట్టే అన్ని జీవాలదీ అదే పరిస్థితి. కాబట్టి గుడ్డును రకరకాలుగా పెట్టి తక్కువచేయడం మంచిది కాదు. ఒకవేళ వాటి గుడ్లను పొదిగించి అవి మళ్ళీ పుడితే అప్పుడు గుడ్లను తక్కువచేసి మాట్లాడినవారి భరతం పడతాయి మొదట. ఐనా ఇది సినిమా కాదులెండి భయపడడానికి.
కోడి గుడ్డే ఇంత ధర పలికితే ఆ రాక్షసబల్లుల గుడ్లు ఇంకెంత ధర పలకొచ్చు అని పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే జనులకు ఆశపుట్టొచ్చు. వేరే గ్రహాల మీద ఆ రాక్షసబల్లుల లాంటి జీవాలేమన్నా దొరకొచ్చేమో అన్న ఆలోచనా రావచ్చు. బ్యాంకులు రుణాలిస్తే ఆ గుడ్లను తీసుకొచ్చి ఇక్కడ అమ్మి బోలెడు సొమ్ము చేసుకోవచ్చు. లేదంటే లోన్లు సులభంగా ఎగ్గొట్టొచ్చు అన్న ఊహలు కూడా ఆ జనాల మెదళ్ళలో గుడ్లు పెట్టొచ్చు. ఏమైనా వాటిని పొదిగించుకొని బాగా డబ్బు సంపాదించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడా వెన్న అని వాడితే గుడ్డు బాధపడు తుంది కాబట్టి గుడ్డు సొనతో పెట్టిన విద్యగా మార్చుకొని చదువుకుందాం. అసలు గుడ్లు కాని, కూరగాయలు కాని, ఇంకేవైనా కాని పండించిన చోట, తయారు చేసిన చోట రెక్కలు లేకుండానే ఉంటాయి. ఒక్కసారి మార్కెట్లోకి వచ్చినవెంటనే వాటికి రెక్కలు మొలుస్తాయి. ఆ రెక్కల్ని గమనిస్తే హోల్ సెల్లర్లు, రిటెైలర్లు, ఇంకా ఇతర మధ్యదళారీలు ఒక్కొక్కరూ ఒక్కో ఈకగా మారి వస్తువులకు రెక్కలుగా మారి టపటపలాడించి మనుషులకు అందకుండా పైపైన తిరుగుతూ, ఆశ పెడుతూ, నోరూరిస్తూ ఉంటారు. రెక్కాడితేకాని డొక్కాడని జనం వేరే ఖర్చులు తగ్గించుకొని తాము కొనేదాంట్లో ఏ సగమో కొని పని అయిందనిపిస్తారు. అలాంటి రెక్కలదారుల్ని సాకడానికే ఈ వ్యవస్థ ఉందని, జనాలు ఎన్ని అవస్తలు పడ్డా వాటికే మేలు జరుగుతుందని, పండించేవాడికి, తయారు చేసేవాడికి కడుపుకోత తప్పదని మనకు రోజువారి బతుకు నేర్పుతుంది. ఆ రెక్కల్ని, ఆ రెక్కలకు బలాన్నిచ్చేవారినీ నిలువరించే అవకాశం ఏదొచ్చినా వదలకుండా అడ్డు పడితే తప్ప ఈ ధరలు భూమికి కాస్త దగ్గరగా ఉంటాయి. మనం భూమి పై ఉండి దాని ఆకర్షణశక్తిని పెంచి ఆ రెక్కల్ని నిలువరించాలి. ఆ రెక్కల్ని కట్టేయాలి. అప్పుడే గుడ్డు ఐనా ఇంకొకటైనా రెక్కలాడించకుండా మనకు అందుబాటులో ఉంటాయి.
జంధ్యాల రఘుబాబు
9849753298