Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వీటివల్ల వెంటనే మౌలికంగా ఏదో జరిగిపోతుందని కాదు గాని, రాజకీయ శక్తులు వ్యక్తులు వ్యవస్థల పాత్ర మారిపోతున్నది. కలయికలు కలహాలు విడిపోవడాలు విలీనాలు ఇవన్నిటి వెనక ఒక అప్రకటిత అవగాహన ఏదో ఉన్నట్టు తోస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగే పరిణామాల మధ్య ఏదో సంబంధం గోచరిస్తుంది. కులవారీ సమీకరణలు, సమావేశాలు వేగం పుంజుకుంటున్నాయి. ఇవి మీడియాలోనూ ప్రతిబింబి స్తున్నాయి. నీరు కన్నా రక్తం చిక్కన అన్నట్టు తెలుగువారు రెండు రాష్ట్రాలయినప్పటికీ రాజకీయ గమనంలో కొన్ని ఉమ్మడి అంశాలు ప్రస్పుటమవుతున్నాయి. పాలక పార్టీలకు సంబంధించినంతవరకూ అధికారం తప్ప మిగిలినవన్నీ ద్వితీయ ప్రాధాన్యతే వహిస్తాయి గనక ఏతావాతా ఏదైనా జరగొచ్చనే భావం రానురానూ ప్రజలలో పెరిగిపోతున్నది. కాకుంటే పైకి కనిపించని రాజకీయాంశాలేమిట,ి వాటి ప్రభావమేమిటి అన్న ఆసక్తి ఒక అస్పష్ట వాతావరణం పెంచుతున్నది.
బిఆర్ఎస్ అవతరణ
ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన మార్పులలో మొదటిది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అవతారమెత్తడం. తెలంగాణ అన్న మాటతో సాగిన పదేండ్ల రాజకీయం, ఆ పేరుతో ఏర్పడిన పార్టీ ఇరవైయేండ్ల గమనం ముగిసి జాతీయ పార్టీగా మారింది. బీజేపీ నిరంకుశత్వాన్ని మతతత్వ రాజకీయాలను రాష్ట్రాలపై దాడులను ఎదుర్కొవడానికి జాతీయపాత్ర పోషిస్తామని కేసీఆర్ అక్టోబర్‌లోనే ప్రకటించారు. లౌకిక పార్టీలు ఆ నిర్ణయాన్ని హర్షించాయి కూడా. ఇదే సమయంలో మునుగోడు ఉపఎన్నిక విజయం దానికి మరింత వూపునిచ్చింది. ఆ ఎన్నికల నాటికే టీిఆర్‌ఎస్ నేతలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారనే కథనాలు వెలువడుతూ వచ్చాయి. పోలింగ్‌కు ముందు చివరి వారంలో ఆపరేషన్ ఫాంహౌస్ దుమారం రేపింది. సీబీఐ, ఈడీ లిక్కర్ స్కాం పేరిట రంగప్రవేశం చేశాయి. ఇందులోనూ రెండు రాష్ట్రాల నేతల పేర్లువచ్చాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తాము బీఆర్ఎస్ విషయంలో వెనక్కు తగ్గేదిలేదంటూ ముందడుగు వేశారు. ఢిల్లీలో కార్యాలయం కూడా ప్రారంభించి యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, వివిధ రాష్ట్రాల రైతునాయకులతో చర్చలు జరిపారు. పంజాబ్ కిసాన్ నేతను తమ పార్టీ రైతువిభాగం అద్యక్షుడుగా ప్రకటించారు. వచ్చేది రైతు ప్రభుత్వమన్నట్టు ప్రకటిస్తున్నారు. ఈ సమయంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ హిందీని గేళి చేస్తూ మాట్లాడ్డం కేసీఆర్ భవిష్యత్ ప్రసంగాలను ఉద్దేశించిందే. కర్ణాటక ఎన్నికలు మూడు మాసాలలోనే వస్తాయి గనక అక్కడ ఇది వరకటి నిజాం సంస్థానభాగాలలో పోటీ చేస్తారంటున్నారు. కుమారస్వామికి కూడా అన్ని విధాల సహాయం అవసరం గనక, ఈ ప్రాంతాలలో బలం కూడా అంతంతే గనక కేసీఆర్‌ను మరింతగా ఆహ్వానిస్తున్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌ఘర్, ఒరిస్సా, తమిళనాడులపైన కూడా ఆ విధమైన ఆశలున్నాయి. ఏపీది మరో ప్రత్యేకత. గత పరిణామాలు, ఉద్యమ కాలపు ఉద్రేకాల రీత్యా బీఆర్ఎస్ ఏపీలో పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉండదు. కానీ సోదర రాష్ట్రంలో పోటీ చేయకపోతే తమ జాతీయ పార్టీకి అర్థం ఉండదని ఆ నాయకులకు తెలుసు. అందుకే వారికి సన్నిహితులైన కొందరు ఫ్లెక్సీలు పెడుతున్నారు. రాజకీయంగా కూడా వైఎస్ఆర్సీపీ, ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీక,ి బీజేపీకి సన్నిహితులుగా పేరొందారు. ఆ మాట కెేసీఆర్ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు కూడా. చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగానే నిలబడిన పరిస్థితితోపాటు బీజేపీకి దగ్గరగా వెళ్లాలని చూస్తున్నది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణలో పునర్వైభవం తెస్తానంటూ వచ్చేవారం ఖమ్మంలో సభ పెడుతున్నారు. మోడీ, అమిత్‌షా బృందం ఏపీలో తెరవెనక నుంచి, తెలంగాణలో నేరుగా రాజకీయ భాగోతం నడిపిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఏపీిలో మళ్లీ ఊపిరిపోయడానికి ప్రయత్నిస్తుండడమే గాక తెలంగాణలో పట్టువున్నా అంతర్గత కలహాలతో రగిలిపోతున్నారు. జనసేన ఏపీలో మాత్రం బీజేపీతో కలసి వస్తుందని అంటుంటే తెలంగాణలో పొత్తు ఉండదన్నట్టే సూచిస్తున్నారు. అయితే అక్కడ టీడీపీ జనసేన విడిగా పోటీ చేయడం బీజేపీకే మేలని కూడా విశ్లేషిస్తున్నారు. ఏపీలో పొత్తులకు తెలంగాణ పోటీ బేరసారాల అస్త్త్రంగా ఉంటుందని భావిస్తున్నారు. వామపక్షాలు తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్తో కలసి బీజేపీిని వ్యతిరేకిస్తున్నా ఎన్నికల నాటికి గాని పొత్తు గురించి చెప్పడానికి లేదని సీపీఐ(ఎం) అంటున్నది. సీపీఐ ఏపీలో టీడీపీతో కలసి పాల్గొంటూ ఉంటే తెలంగాణలో ప్రతి సందర్బంలోనూ బీఆర్ఎస్కు మద్దతులో ముందుంటున్నది. బీజేపీని టీిఆర్‌ఎస్ ఉభయ కమ్యూనిస్టులు కలసి ఎదుర్కొంటున్న తెలంగాణ వాతావరణం, మూడు ప్రాంతీయ పార్టీలూ బీజేపీకి అనుకూలంగా ఉంటున్న ఏపీి రాజకీయాలు భిన్నంగా కనిపిస్తున్నాయి,
విభజన సమస్యలు, వివాదాలు ఈ పరిస్థితి బీఆర్ఎస్ వైసీపీల మధ్య ఏపీ, తెలంగాణల మధ్య కూడా వైరుధ్యాలను పెంచుతున్నది. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ ఆయన స్నేహితులుగా ఉంటారని భావించేవారు. విభజన సమస్యల పరిష్కారమే గాక కొత్త ప్రతిపాదనలు కూడా అప్పట్లో వినిపించాయి, అదంతా ఆచరణలో అక్కరకు వచ్చింది లేదు. ప్రాజెక్టులపై ఆయన ప్రకటనలు ప్రభుత్వం ఆమోదించలేదు. ప్రతిపక్షాలూ విమర్శించాయి. వ్యక్తిగత సంబంధాలు, పరస్పర ప్రశంసలు ఉన్నా విభజన సమస్యలపై వివాదాలే పెరిగాయి. మొదట్లో కెసిఆర్ కేంద్రంతో మంచిగా ఉన్న కాలంలో కూడా పరిష్కారం దిశలో అడుగైనా పడలేదు. ఇక ఇప్పుడు వైరుధ్యాలు మరీ పెరిగాక జరిగిన పలు సమావేశాలు వృథా అయ్యాయి. ఈ దశలో హఠాత్తుగా జగన్ ప్రభుత్వం తెలంగాణ పరిష్కారానికి అడ్డుపడుతున్నదంటూ సుప్రీం కోర్టులో కేసు వేసింది. అయితే అందులో కేంద్రం బాధ్యతను కనీసంగా ప్రస్తావించకపోవడం యాదృచ్చికం కాదు. మోడీ ప్రభుత్వ నిర్దేశంతోనే సుప్రీంలో కేసు వేశారనే అభిప్రాయం ఉంది. దానితో పాటే విభజన చట్టం సక్రమంగా ఆమోదించలేదనే ఆనాటి కేసులు కూడా ముందుకొచ్చాయి. ఆ కేసు వేసినవారిలో ఒకరైన మాజీ ఎంపి ఉండవల్లి తనను ఎవరూ బలపర్చలేదని ఆరోపిస్తూ ప్రభుత్వ వైఖరినీ తప్పు పట్టారు. దాన్ని అవకాశంగా తీసుకుని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవకాశమే ఉంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణ కోరతామనడం, దానిపై తెలంగాణ నేతలు విరుచుకుపడటం టీ కప్పులో తుపానులా తయారైంది. తమాషా ఏమంటే కేసీఆర్, జగన్ కలసి ఈ ప్రహసనం నడిపిస్తున్నారనే కథనాలు మీడియాలో వచ్చాయి గాని, కేంద్రానిదే ప్రధాన పాత్రన్న సంగతి మరుగున పడిపోయింది. ఈ కేసును సుప్రీం విచారణకు స్వీకరించి కేంద్రానికి కూడా నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తతంగంలో మూడో కోణం థర్డ్ డైమెన్ష్న్ జగన్ సోదరి షర్మిల పార్టీ పెట్టి నిత్యం కేసీఆర్ కుటుంబంపైన కేంద్రీకరించి దాడి చేయడం, ఆమెకు పోలీసులు అవరోధాలు కలిగించడం, ఇటీవల ఆమెను కారుతో సహా తరలించడం దీనికి పరాకాష్ట. వైఎస్ విజయమ్మ కూడా ఆమెతో ఉండటం. ఆంధ్రా నేతలు, సమైక్య వాదులు మళ్లీ కుట్రలు మొదలెట్టారని శాసనమండలి చైర్మన్‌తో మొదలుపెట్టి అప్పటి టీఆర్ఎస్ నాయకులందరూ దాడి చేశారు. ఈ నేపథ్యంలో జీ20 సమావేశంలో ప్రధాని మోడీ ఆ ఘటన గురించి జగన్‌తో ప్రస్తావించారని, తర్వాత ఆమెకు ఫోన్ చేశారని కథనాలు వచ్చాయి. ఆయన ఫోన్ చేయలేదని బీజేపీ కీలకనేతలు ఈ వ్యాసకర్తతో చెప్పారు గాని బహిరంగంగా ఖండించలేదు. షర్మిల ఆ విషయమై మాట్లాడబోనన్నారు. ఈ విధంగా తెలుగునాట ప్రాంతీయ పార్టీలన్నిటితోనూ మోడీ నాయకత్వం దాగుడు మూతలాడుతున్నది. వారి రాష్ట్ర నాయకులు మేము అమరావతికే మద్దతు అంటున్నా కేంద్రం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో కూడా రాజధాని ప్రస్తావనపై సాంకేతిక సమాధానాలు ఇవ్వడం తప్ప తమ విధానం చెప్పలేదు. అయితే టీడీపీ నాయకులు మాత్రం అనవసరంగా ఏదో స్పష్టత ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. మరోవంక ప్రధాని పర్యటనతో మొదలుపెట్టి వరుసగా విశాఖలోనే జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేంద్రం విశాఖ ఉక్కును మాత్రం అమ్మితీరతామంటున్నది. పాలక వైసీపీ ప్రతిపక్ష టీడీపీ తమలో తాము ఆరోపణలు చేసుకోడం తప్ప కేంద్రంపై ఉమ్మడిగా ఒత్తిడి తేవడమనే ప్రసక్తే లేకుండా పోయింది. అంతేగాక ఉద్యోగుల జీతభత్యాలు పెన్ష్న్, ఔట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు జీవోలు వంటి అంశాలన్నీ ప్రధాన ప్రతిపక్షానికి అప్రధానంగా ఉన్నాయి. మొత్తంపైన రెండు పార్టీలూ రాజకీయ సర్వేలు, మేమే గెలుస్తామన్న ప్రకటనలలోనే మునిగితేలుతున్నాయి. తమ నాయకులు హుషారుగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. లేకుంటే అభ్యర్థులను మారుస్తామని బెదిరిస్తున్నాయి.
బీజేపీ చెలగాటం
ముందస్తు ఎన్నికలు వస్తాయనేది రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మరో ప్రధాన ప్రచారంగా ఉంది. రెండు పాలకపార్టీలూ ఆ అవకాశం లేదని అగట్టిగా ఖండిస్తున్నా ప్రతిపక్షాలూ కొన్ని మీడియాలు మాత్రం చెబుతూనే వున్నాయి, తాము ఏపీకే పరిమితమనీ, బీఆర్ఎస్ మద్దతు కోరితే అప్పుడు ఆలోచిస్తామని సజ్జల చెప్పారు. అయితే ఆ అవకాశం ఉండదనేది స్పష్టమే. కానీ ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంబిస్తారనీ కేసీఆర్ సభ ఉంటుందనీ కూడా కథనాలు వస్తున్నాయి. జాతీయ పార్టీగా మారారు గనక గతంలో వలె ఆంధ్ర, తెలంగాణ భాషలో మాట్లాడటం కుదరదనీ, సరిగా ఉండదనీ కూడా అభిప్రాయం ఉంది. లిక్కర్ స్కాం వంటివాటిలో వైసీపీ నేతల కుటుంబ సంబంధాలు కొన్ని వినిపిస్తే, ఆపరేషన్ ఫాంహౌస్‌లో వైసీపీ అసమ్మతి ఎంపి పేరు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఐఎస్బి 20వ వార్షికోత్సవ కొనసాగింపు సభలో ప్రత్యేకంగా మాట్లాడుతూ సైబరాబాద్ అభివృద్ది, విజన్2020, దాన్ని రూపొందించిన మెకన్సీ (ఈ స్కూలు వారిదే) మొత్తం 2004 నాటి ఎజెండా ఏకరువు పెట్టారు. అమరావతి ఆలస్యంలో తన పాత్రను దాటేసి అది హైదరాబాద్‌లా పెరిగివుండేదనే పాత కథే పునశ్చరణ చేశారు. వీటన్నిటిలోనూ రాజకీయ కోణాలు దాచేస్తే దాగేవి కావు. బీజేపీ తన ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాలలో తలోవిధంగా చెలగాటమాడుతున్నది గనక బాహాటంగానూ, లోపాయికారిగానూ కనిపించే ఈ పొలీస్ పొలిటికో లీగల్ అంశాలూ ఎలా పరిణమిస్తాయో చూడాల్సిందే.
- తెలకపల్లి రవి