Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రీకృత పరిపాలన, అధికారాలను చెలాయించడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఫెడరల్ వ్యవస్థను బలహీనపరచడం హాల్‌మార్క్ విధానంగా మార్చుకుంటున్నది. రాష్ట్రాల రాజ్యాంగబద్ధమైన అధికారాలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన ముఖ్యమైన మార్గాల్లో ఒకటి... సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం, దానికి అమిత్ షాను మంత్రిగా చేయడం. మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన వెంటనే, భారత సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇస్తూ, బీజేపీ ప్రభుత్వ సాహసయాత్రను కొంతమేరకు పరిమితం చేసింది. 2011లో 97వ రాజ్యాంగ సవరణ పార్ట్ 9బిని రాజ్యాంగంలో పొందుపరిచింది. సహకార సంఘాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి చట్టాల కోసం అనేక షరతులను నిర్దేశించింది. 2022 అక్టోబరులో... 97వ సవరణ స్థానిక సహకార సంఘాలకు వర్తించదు కానీ, కేవలం బహుళ రాష్ట్ర సహకార సంఘాలకు మాత్రమే వర్తిస్తుందని కోర్టు రూలింగ్ ఇచ్చింది. రాష్ట్ర సహకార చట్టాల కింద నమోదైన స్థానిక సహకార సంఘాల్లోకి చొరబడేందుకు 2011 సవరణను ఉపయోగించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వానికి ఈ తీర్పు పెద్ద ఎదురు దెబ్బ. ఇక అప్పుడు రాష్ట్రాల్లో జోక్యం చేసుకోవడానికి బహుళ రాష్ట్రాల సహకార సంఘ మార్గాన్ని ఉపయోగించుకోవాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే 2011 రాజ్యాంగ సవరణను ఉపయోగించి, బహుళ రాష్ట్రాల సహకార సంఘాల చట్టం-2002ను సవరించేందుకు బహుళ రాష్ట్రాల సహకార సంఘాల (సవరణ) బిల్లు-2022ని ప్రవేశపెట్టింది.
ప్రతిపాదిత 2022 బిల్లు చాలా ప్రమాదకరమైనది. రాష్ట్రాల చట్టాల పరిధి కింద పనిచేస్తున్న సహకార సంఘాలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రుద్దేందుకు చేస్తున్న దారుణమైన ప్రయత్నంగా ఉంది. సవరించిన 6వ క్లాజు ప్రకారం... సొసైటీ జనరల్ సమావేశానికి హాజరై, ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో మూడింట రెండు వంతుల మందికి తగ్గకుండా మెజారిటీతో ఆమోదించిన తీర్మానం కల్పించే అధికారాల మేరకు ఏ సహకార సంఘమైనా ప్రస్తుతం ఉన్న బహుళ రాష్ట్రాల సహకార సంఘంలో విలీనమయేందుకు నిర్ణయం తీసుకోవచ్చు. సవరించిన 13వ క్లాజు ప్రకారం, కేంద్ర ఆమోదం లేకుండా బహుళ రాష్ట్రాల సహకార సంఘాల్లో వాటాలను తీసుకోరాదు. 17వ క్లాజు ప్రకారం.. కేంద్ర ఎన్నికల అథారిటీని కేంద్ర ప్రభుత్వమే నియమించాలి. 45వ క్లాజు ప్రకారం... కేంద్ర ప్రభుత్వం డైరెక్టర్ల బోర్డును కాదని అడ్మినిస్ట్రేటర్‌ను నియమించవచ్చు.
రాష్ట్రాల సహకార వ్యవస్థల్లోకి బహుళ రాష్ట్రాల సహకార సంఘాలను చొప్పించేందుకు ఈ సవరణలన్నీ స్పష్టంగా చెపుతున్నాయి. స్థానిక సహకార సంస్థలపై ఒత్తిడి తెచ్చి వాటిని ఇరుకున పెట్టేందుకు, అలాగే శిక్షా చర్యలు, విలీనాలు, బోర్డును స్వాధీనం చేసుకోవడాలు, ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం వంటి చర్యల ద్వారా రాష్ట్రాల మొత్తం సహకార వ్యవస్థపై నియంత్రణను తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఇవి అనుమతిస్తాయి. పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచేందుకు సహకార సంఘాల్లో వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకే 2002 చట్టాన్ని సవరిస్తున్నామంటూ లాజిక్ చెప్పారు. అయితే... ఈ లాజిక్ అనేది పూర్తి అసహేతుకంగా ఉంది. రాష్ట్ర నియంత్రణ నుండి కేంద్ర నియంత్రణకు సహకార సంఘం బదిలీ అయినట్లైతే దాని పారదర్శకత, జవాబుదారీతనం, పనితీరు మెరుగుపడతాయని చెప్పడానికి ఎలాంటి హామీ లేదు. వాస్తవానికి దేశవ్యాప్తంగా బహుళ రాష్ట్రాల సహకార సంఘాలు సంక్షోభంలో ఉన్నాయి. 2021 డిసెంబరులో, అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ, ఆర్థిక నిర్వహణాలోపం లేదా అసమర్థత కారణంగా 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 44 బహుళ రాష్ట్రాల సహకార సంఘాలు దెబ్బతిన్నాయని చెప్పారు. అయితే... కేరళ సహా కొన్ని రాష్ట్ర స్థాయి సహకార సంఘాలు అత్యంత సమర్ధవంతంగా, లాభదాయకంగా పనిచేస్తున్నాయి, ఇతర బహుళ రాష్ట్రాల సహకార సంఘాల కన్నా ఇవి మెరుగ్గా పనిచేస్తున్నాయనడానికీ ఆధారాలు కనిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక బహుళ రాష్ట్రాల సహకార సంఘంగా ఏర్పడేందుకు ఎఎంయుఎల్ స్థానిక ఐదు సహకార సంఘాలతో చేతులు కలుపుతోంది లేదా విలీనమవుతోంది. ఈ సొసైటీ 'సహజసిద్ధమైన వ్యవసాయం', పాల ఎగుమతుల ఉత్పత్తులను ధృవీకరించడంలో నిమగమై ఉంటుంది. ఇటువంటి రాజకీయ ప్రేరేపిత చర్యల వల్ల రాష్ట్ర స్థాయి డెయిరీ సహకార సంఘాలు, అలాగే ఎఎంయుఎల్ వంటి వృత్తిపరంగా నడిచే సహకార సంఘాలు బలహీనపడతాయి. తన ఉద్దేశ్యాలను మరింత స్పష్టంగా వెల్లడి చేసేలా... మోడీ ప్రభుత్వం గుజరాత్, మహారాష్ట్రల్లోని బహుళ రాష్ట్రాల సహకార సంఘాల్లోకి మరింత నగదును చొప్పిస్తోంది. కేరళ వంటి సుదూర రాష్ట్రాల్లో కూడా కొత్త స్థావరాలను ఏర్పాటు చేసేందుకు వాటిని పంపిస్తోంది. కేరళలో స్థానిక సహకార సంఘాల కార్యకలాపాలను బలహీనపరిచి వాటి వ్యాపారాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలనుకోవడం ఆ రాష్ట్రంలో బీజేపీ రాజకీయ పెట్టుబడుల కోసం విస్తరించడం వారి ఉద్దేశ్యంగా ఉంది.
భారతదేశంలో సహకారం స్ఫూర్తి, ప్రాంతీయ వైవిధ్యంపై ఆధారపడి ఉంది. బ్యాంకింగ్ రంగంలో నయా ఉదారవాద విధానాలు ప్రజలను దెబ్బతీశాయి అలాగే రాష్ట్రాల్లోని సహకార సంఘాలను సంక్షోభంలోకి నెట్టివేశాయి. ప్రతిపాదిత 2022 బిల్లులో ప్రయత్నించినట్లుగా, కేంద్రీకరణతో వాటిని దెబ్బతీయడం, నాశనం చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాజకీయంగా, చట్టపరంగా రాష్ట్రాలు చేతులు కలిపి ఈ రాజ్యాంగ విరుద్ధమైన చర్యను తిప్పికొట్టాలి.
(పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం)