Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నయా ఉదారవాద వ్యవస్థలో ఆదాయాల్లో గాని, సంపదలో గాని అసమానతలు చాలా నాటకీయంగా పెరిగిపోయాయనడంలో ఎటువంటి వివాదమూ లేదు. పికెటీ బృందం వాస్తవానుభవాల ఆధారంగా చేసిన అధ్యయనం ఆదాయాల్లో అసమానతలు పెరిగిపోయినట్టు చూపిస్తున్నది. ఒక దేశపు జాతీయ ఆదాయంలో ఆ దేశంలోని అత్యంత సంపన్నులైన ఒక్కశాతం జనాభా ఎంత వాటా కలిగివున్నదీ నిర్థారించడానికి ఆ దేశపు ఆదాయపన్ను లెక్కలను ప్రాతిపదికగా వాళ్లు తీసుకుని లెక్కించారు. ఈ పద్ధతి సరైనదా కాదా అని కొందరు అభ్యంతరాలు పెట్టవచ్చు కాని, ఆ బృందం వచ్చిన నిర్థారణలు ఎంత కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయంటే వాటిని ఎవ్వరూ ప్రశ్నించలేరు.
భారతదేశపు ఉదాహరణనే తీసుకుందాం. 1982లో మన దేశంలోని అత్యంత సంపన్నులైన ఒక శాతం జనాభా ఆనాటి జాతీయ సంపదలో 6శాతం వాటా కలిగివున్నారని పికెటీ, ఛాన్సెల్ బృందం గమనించారు. అది కాస్తా 2013 నాటికి ఏకంగా 22శాతానికి పెరిగిపోయినట్టు, 2014లోనూ అంతే మోతాదులో ఉన్నట్టు వాళ్లు గమనించారు. 1922లో మన దేశంలో ఆదాయపన్నును మొదటిసారిగా ప్రవేశ పెట్టారు. అప్పటినుంచీ చూసుకుంటే 2013నాటికి పెరిగినంత ఎక్కువగా అత్యంత సంపన్నులైన ఒక శాతం జనాభా సంపద అంతకు ముందెన్నడూ పెరిగి ఉండలేదు.
అయితే, ఆవిధంగా ఎందుకు పెరిగిపోయిం దన్నదానికి పికెటీ ఇచ్చిన సైద్ధాంతిక వివరణ మాత్రం ఆమోదయోగ్యం కాదు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ పూర్తిస్థాయిలో ఉపాధి కల్పిస్తుందన్న ప్రాతిపదికపై పికెటీ వివరణ ఆధారపడివుంది. నిజానికి ఆ విధంగా పూర్తిస్థాయిలో ఉపాదికల్పన అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండడం వాస్తవానుభవానికి గాని, తర్కానికి కాని విరుద్ధంగా ఉంది. పూర్తిస్థాయిలో ఉపాధి గనుక ఉంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అందులో ఉత్పత్తిని తాను కోరుకున్న విధంగా అదుపులో ఉంచజాలదు.
ఆదాయాల్లో పెరుగుతున్న అసమానతలను వివరించడానికి పెద్దగా లోతైన సిద్ధాంతం ఏమీ అవసరం లేదు. సాంకేతికపరంగాను, వ్యవస్థీకృతంగాను ఉన్న అన్ని అవరోధాలనూ తొలగించిన తర్వాత నయా ఉదారవాద వ్యవస్థలో శ్రామిక ఉత్పాదకత పెరిగే రేటు ఏ స్థాయిలో ఉంటుందంటే దాని ఫలితంగా ఉపాధి కల్పన పెరిగే రేటు అంతకు మునుపటి కన్నా బాగా దిగువకు పడిపోతుంది. శ్రామికవర్గ జనాభా పెరిగే రేటు కన్నా కూడా దిగువకు పడిపోతుంది. జీడీపీలో వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది జరుగుతుంది. నిరుద్యోగుల నిష్పత్తి ఉద్యోగుల నిష్పత్తితో పోల్చినప్పుడు పెరుగుతుంది. అందువల్ల నిజవేతనాలు కనీసస్థాయిలోనే ఉండిపోతాయి. ఒకవైపు శ్రామిక ఉత్పాదకత పెరుగుతూవున్నా వేతనాల స్థాయి మాత్రం కనీసంగానే ఉంటుంది. దాని ఫలితంగా ఆదాయాల అసమానతలు పెరిగిపోతాయి. నయా ఉదారవాద విధానాల ఫలితంగా ఒక వర్గానికి ఆదాయంలో పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది. మరో వర్గ ఆదాయంలో పెరుగుదల ఉండదు. అందువల్ల ఆదాయాల అసమానతలు పెరుగుతాయి. పికెటీ గుర్తించిన అసమానతల పెరుగుదలకు కారణం ఇదే.
అదే విధంగా సంపదలో వ్యత్యాసాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా దక్షిణార్థ భూగోళంలోని దేశాల్లో ఇది బాగా కనిపిస్తుంది. క్రెడిట్ స్విస్ గణాంకాల ప్రకారం అయితే అమెరికాలో కూడా 2000 - 2021 మధ్య కాలంలో సంపదలో అసమానతలు పెరిగిపోయాయి. అయితే... ఇండియాలో, బ్రెజిల్లో ఈ అసమానతలు పెరిగినంతగా అమెరికాలో జరగలేదు. సంపద అసమానతల అంచనాలు పాచికలాటలో మాదిరిగా నిరంతరం మారిపోతూంటాయి. స్టాక్మార్కెట్లో షేర్ల ధరలు మారిపోతూ ఉండడమే దీనికి కారణం. వాస్తవ సంపదలో ఎటువంటి పెరుగుదలా లేకపోయినా, స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు ఊపుగా పైకి పెరుగుతూంటే అప్పుడు సంపద అంచనాలు అమాంతంగా పెరిగిపోతాయి. షేర్ మార్కెట్లో ఎక్కువగా పాల్గొనేది సంపన్నులే గనుక వారి సంపద మరీ ఎక్కువగా పెరిగిపోతుంది. దాని వల్ల సంపద అసమానతలు కూడా పెరిగిపోతాయి. అదే స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు పతనమైతే అప్పుడు సంపద అసమానతలు కూడా తగ్గుతాయి. ఇండియాలో అత్యంత సంపన్నులుగా ఉన్న ఒక శాతం వ్యక్తుల సంపద 2000లో 32శాతం ఉండగా... అది 2021లో 40.6శాతానికి పెరిగింది. అదే కాలంలో బ్రెజిల్లో ఇది 43శాతం నుండి 49.3శాతానికి పెరిగింది. ఈ పెరుగుదలకు తాత్కాలికమైన స్టాక్ మార్కెట్ ప్రభావాలు కారణం కావు. అంతకన్నా మౌలికమైన కారణాలున్నాయి.
అటువంటి ఒక మౌలిక కారణం ఆదాయాల్లో అసమానతలు పెరగడం. ఆదాయాల్లో అసమానతలు పెరగడం అంటే అదనపు విలువలో పెట్టుబడిదారుల వాటా పెరగడం. ఇలా పెరిగిన వాటా తిరిగి పెట్టుబడి పెట్టి ఆస్తులు అదనంగా పొందాలని అనుకోనవసరం లేదు. పొదుపు చేయడం ద్వారా కూడా జరగొచ్చు. ఒక దేశంలో పోగుబడిన పొదుపు మరో దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడవచ్చు. ఆ విధంగా పెట్టిన పెట్టుబడి ద్వారా తన జాతీయ ఆదాయాన్ని పెంచుకోగలుగుతుంది. జాతీయ ఆదాయంలో సంపన్నుల వాటా పెరుగుతోంది గనుక అప్పుడు సంపన్నుల సంపద కూడా పెరుగుతుంది. దేశంలో పోగుబడే పొదుపులో కూడా సంపన్నుల వాటా మరింత ఎక్కువగా పెరుగుతుంది గనుక ఆ విధంగా చూసినా అది సంపద అసమానతల పెరుగుదలకు దారితీస్తుంది. ఆ విధంగా ఆదాయాల్లో పెరిగే అసమానతలు సంపదలో అసమానతల పెరుగుదలకు దారి తీస్తాయి.
ఇక సంపదలలో అసమానతల పెరుగుదలకు ఇంకో కారణం కూడా ఉంది. దానినే మార్క్స్' పెట్టుబడి కేంద్రీకరణ' అంటాడు. సాంకేతిక మార్పుల కారణంగా, వ్యవస్థీకృత మార్పుల కారణంగా వ్యాపారం చిన్న పెట్టుబడి నుండి పెద్ద పెట్టుబడి వైపు మారుతుంది. కొత్తగా కనుగొనే ఉత్పత్తి ప్రక్రియలు, వాటి ద్వారా వచ్చే ఉత్పత్తులు అంతకంతకూ ఎక్కువ పెట్టుబడి పెట్టవలసివచ్చేవిగా ఉంటాయి. వాటిని ఉత్పత్తి చేయగల శక్తి పెద్ద పెట్టుబడికే ఉంటుంది. అందువల్ల వ్యాపారం చిన్న పెట్టుబడి నుండి పెద్ద పెట్టుబడి చేతుల్లోకి క్రమంగా పోతుంది. దీని పర్యవసానంగా కూడా ఉత్పత్తిలో పోగుబడే మిగులులో అంతకంతకూ ఎక్కువ వాటా పెద్ద పెట్టుబడి చేతుల్లోకి కేంద్రీకృతం అవుతూ వుంటుంది. ఆర్థిక వ్యవస్థలో జరిగే పొదుపులో కూడా పెద్ద పెట్టుబడిదారుల వాటా పెరుగుతుంది. ఆ విధంగా పెట్టుబడి కేంద్రీకరణ జరుగుతున్న కొద్దీ దానితోబాటు సంపద కేంద్రీకరణ కూడా జరిగిపోతూ ఉంటుంది.
ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఉత్పత్తి సామర్థ్యం కనీస స్థాయి కన్నా పెట్టుబడి తక్కువగా ఉంటే... అప్పుడు పరిస్థితి ఏమిటి? మార్కెట్లోకి విడుదలైన సొమ్ము తక్కువగా ఉండి మార్కెట్లోకి వచ్చిన సరుకు ఎక్కువగా ఉంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడం ఒక సమస్య అవుతుంది కదా? తగినంత డిమాండ్ లేనప్పుడు ఆ విధంగా జరుగుతుంది. కాని దాని ప్రభావం చిన్న పెట్టుబడిదారుల మీద, పెద్ద పెట్టుబడిదారులమీద ఇలా అందరి మీదా పడుతుంది. అందువల్ల దాని కారణంగా సంపద కేంద్రీకరణ ధోరణిలో మార్పు రాదు.
సంపద కేంద్రీకరణకు సంబంధించి మార్క్స్ ప్రస్తావించిన మూడో అంశం ఆదిమ సంచయం. అంటే అనాగరిక కాలంలో మాదిరిగా కొల్లగొట్టి దోచుకోవడం. రైతులనుండి పెట్టుబడిదారులు భూములను నామమాత్రపు ధరలకో, లేక ఏమీ చెల్లించకుండా కూడా లాక్కోవడం ఈ మాదిరి విధానమే. అలా లాక్కున్న భూముల ధరలు ఆ తర్వాత మార్కెట్లో మళ్ళీ టౌన్‌షిప్‌ల నిర్మాణం కోసమో, ఇతర వినియోగాల కోసమో అమ్మినప్పటికీ వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు ఒకసారి పైకి, ఇంకోసారి కిందకి పడి, లేస్తూంటాయి. కాని భూముల ధరలు సాధారణంగా ఆ విధంగా పడిపోవు. అందుచేత మనం భూసేకరణను కూడా ఆదిమ సంచయంలో భాగంగానే చూడాలి. భూములు పోగొట్టుకునే రైతులకు నామమాత్రపు ధర దక్కుతుంది. పెట్టుబడిదారులు ఆ భూములను దక్కించుకున్నాక వాటి రేట్లు బాగా పెరుగుతాయి. అంటే వారి సంపద ఈ ప్రక్రియలో పెరుగుతుంది. ఇదీ సంపద కేంద్రీకరణలో భాగమే.
అనేక మార్గాల ద్వారా ఇప్పుడు ప్రజల ఉమ్మడి సంపద అప్పనంగా బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారు. ఆర్థికవృద్ధిని ప్రోత్సహించడం పేరుతో వాళ్లకు ''ప్రోత్సాహకాలు'' ఇస్తున్నామంటూ ఈ పని చేస్తున్నారు. ఆ వృద్ధి వల్ల అన్ని తరగతుల ప్రజానీకానికీ లబ్ధి చేకూరుతుందని నమ్మబలుకుతున్నారు. కానీ నిజానికి దానివల్ల సంపదలో అసమానతలు మాత్రమే బాగా పెరుగుతున్నాయి. మతఘర్షణలు రెచ్చగొట్టడం, రక్తపాతం సృష్టించడం కూడా సంపద కేంద్రీకరణకు దారి తీస్తుంది. ఒకసారి మతఘర్షణలు జరిగితే, దాని కారణంగా అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఇక ఉండలేక ఖాళీ చేసి వెళ్లిపోతారు. అప్పుడు ఆ స్థలాలను బడా పెట్టుబడిదారులు నామమాత్రపు ధరలకే కాజేస్తారు.
ఈ విధంగా నయా ఉదారవాద విధానాలు అడ్డగోలుగా సంపదలో అసమానతల పెరుగుదలకు కారణం అవుతాయి. కార్పొరేట్ల దగ్గర సంపద పోగుబడితే అది సమాజానికే మేలు అన్న ప్రచారంతో ఆ విధానాలను పాలకవర్గాలు సమర్ధిస్తాయి. మరోవైపు ప్రజల ఉమ్మడి సంపదగా ఉన్న ప్రభుత్వ రంగం మీద అన్ని రకాలుగా బురద జల్లి ఆ సంస్థలను ప్రయివేటుపరం చేయడాన్ని కూడా సమర్థించుకుంటారు.
- ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానువాదం)