Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సకల పూల రాశులు ఒక చోట ధారబోసినట్లు
పరిమళించే అక్షర సుగంధాలు!
ప్రతి పేజీ అలలెత్తిన అక్షర కెరటాలు
తనవి తీరని జ్ఞాన ప్రవాహాలు!
ఒక తరం మరో తరానికి నిత్యం ధార పోస్తున్న
ఎన్నడూ కూలనీ జ్ఞాన వంతెనలు!
అన్ని చోట్లా కనిపించని బోధి వృక్షాల కింద మనిషిని
ఆకాశమెత్తు నిలిపిన వెలుతురు పాటలు!
కవులు రచయితలెవరూ మరణించినట్లు లేదు నాకు
పద్మాసనాలు వేసి పలకరిస్తున్నట్లున్నది!
కఠిన చిత్తుల కరవాలాల కత్తికంటిన నెత్తుటి చుక్కల్ని
ఏ అక్షరమూ ఇంకి పోనీయ లేదు!
త్యాగ ధనుల జ్ఞాన సంపదల్ని
ఏ గ్రంధమూ దాచుకో లేదు!
ఏడాది పొడుగునా ఎట్టి కష్టం ఎంత చేస్తే ఏం?
పుస్తకమొక్కటే భుజం తట్టే ఆత్మ బంధువు!
మట్టినీ మనిషినీ ఆకాశాన్నీ ముప్పేటల కలిపి నిలిపిన
అద్వితీయ రూపమే అక్షరం!
సకల దూరాల్ని చెరిపేసే
అక్షరాలకు దగ్గరవుదాం రండి!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి,
సెల్: 9440233261.