Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దిన్ హై సుహాన ఆజ్ పెహలీ తారీఖ్ హై''... ఈ కిషోర్ కుమార్ పాట చిన్నప్పటినుండీ రేడియోలో విన్నారు చాలామంది. చాలా సంవత్సరాలు ఆ పాట శ్రీలంక రేడియో కేంద్రంలో ఒకటో తారీఖున పెట్టేవారట. అది పెద్ద రికార్డు. ఇప్పటి రికార్డులేమిటి అన్న విషయం ఎవరికి వారు మనసులో అనుకొండి. ఒకటో తారీఖున పెద్దోళ్ళ మందుల లిస్టు, భార్య సినిమాకు పోదామనడం, పిల్లలు బొమ్మలు అడగడం, అప్పులవాళ్ళకు సంభందించిన విషయాలన్నీ ఆ పాటలో వస్తాయి. వినని వాళ్ళు వినమని మనవి.
ఒకానొక కాలంలో ఒకటో తారీఖంటే ఇంట్లో పండగే. ఇంటికి ఒక్కరే ఉద్యోగస్తులు ఉన్న రోజులవి. ఇప్పుడు ఇంటినిండా ఉద్యోగులున్నా ఒక్కొక్కరికి ఈ ఒకటో తారీఖు ఒక్కోవిధంగా ఉంటుంది. అసలు కొంతమందికి ఆ ఒకటో తారీఖు రాకుండానే టేబుల్‌పై పింక్ లెటర్ పెట్టే సున్నితమైన రోజులు. ఐనిస్టీన్ మహనీయుడు సాపేక్ష సిద్ధాంతం ఎప్పుడు ఎందుకు చెప్పాడో కాని అందులో చాలా విషయం ఉంది. ఆ ఒకటో తారీఖు జీతం తీసుకునేవాళ్ళకు, ఇచ్చేవాళ్ళకు, ఇంకా ఇతరత్రా దాని అవసరం ఉన్నవాళ్ళకు అంటే ఇ.ఎం.ఐలు వసూలు చేసుకునేవాళ్ళకు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిపిస్తుంది. జీతమొస్తే దాన్ని ఎలా సర్దాలని కొందరు, అసలు జీతమివ్వడానికి ఎలా సర్దుబాటు చేయాలని ఇంకొందరు ఇలా ఈ నవ ప్రపంచీకరణ, నవ నాగరిక, నవ రాజకీయ యుగంలో సతమతమవుతుంటారు. అందుకే 'అమ్మో ఒకటో తారీఖు' అనుకుంటారని సెలవిచ్చింది.
క్యాలెండర్ కనిపెట్టినవారిని తిట్టుకునే రోజు కూడా వస్తుందేమో. అసలు ఒకటి లేకుండా క్యాలెండరు రెండో తారీఖు నుండి మొదలైతే ఎంత బాగుణ్ణు అని కొందరనుకోవచ్చు. అందుకే మహాకవి తారీఖులు దస్తావేదులు ప్రామాణికం కాదని చెప్పాడు. కాబట్టి ఆ ఒకటో తారీఖు ఎప్పుడొచ్చినా ఆస్వాదిస్తున్నారు జనాలు. వచ్చే ఒకటో తారీఖైనా సరిగ్గా ఒకటో తేదీనే వస్తుందని ఆశిద్దాం. క్యాలెండరులో వస్తుంది కాని జేబుకు, సెల్లులో వచ్చే బ్యాంకు తీపి వార్తకు ఒకటే మంచిదని అందరూ కోరుతున్నారు.
ఉద్యోగస్తులకు జీతాలివ్వడానికి ఎలాగైతే ఒక తేదీ ఉందో, అలాగే అందుకోసం అప్పులిచ్చే వాళ్ళూ జీతాలరోజుకు ముందు రోజు ఇవ్వాలని డిమాండు పెట్టొచ్చు. మరీ రెండుమూడు రోజులు ముందుగా అప్పు చేతికందితే అవి పక్కదారి పడతాయని విజ్ఞులు అంటుండగా విన్నట్టు మా మిత్రుడు చెప్పాడు. చివరికి మేము ఫలానా తేదీన జీతాలిస్తున్నాం అని సగర్వంగా చెప్పుకోవడం కూడా జరుగుతుందేమో? ఇకపై ఒకటో తారీఖుననే జీతాలిస్తామని ఎన్నికల మేనిఫెస్టోల్లో కూడాపెడతారేమో? అమ్మో నిజంగానే ఒకటో తారీఖు అంటే తమాషా కాదు సుమండీ... జై ఒకటో తారీఖు.
- జంధ్యాల రఘుబాబు,
సెల్:9849753298