Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎనిమిదేండ్ల కాలంలో తీవ్రంగా నష్టపోయింది పారిశ్రామిక కార్మికులే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు కూడా తాము పర్మినెంట్ అయిపోతామని భావించారు. పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలొస్తాయని ఆశపడ్డారు. వీరి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈ కాలంలో సీఐటీయూ రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల స్థాయిలో చేసిన సర్వేలు, అధ్యయనాల సందర్భంగా అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. కార్మికుల శ్రమదోపిడీ కండ్లకు కట్టినట్టుగా కనబడింది. 12 గంటల పనిదినం సర్వసాధారణ మైపోయింది. పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్‌లు, సెలవులు, ఇతర సౌకర్యాలు ఏ పరిశ్రమలోనూ సక్రమంగా అమలు కావడం లేదు. వేళ్ల మీద లెక్కించగల భారీ పరిశ్రమల్లోనే కొంత అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్ల కాలంలో మొత్తంగా 19,454 పరిశ్రమలు కొత్తగా వచ్చాయనీ, 2,32,311 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామనీ, సుమారు 16,48,956 మందికి ఉపాధి కల్పించామని ప్రకటించింది. 2021-22లోనే 96,863 మందికి ఉపాధి కల్పించామని ప్రభుత్వ నివేదిక చెబుతున్నది. మరి ఇంత మందికి ఉపాధి కల్పిస్తే తెలంగాణలో నిరుద్యోగం ఏటేటా ఎందుకు పెరుగుతున్నదనే ప్రశ్న ఉదయిస్తున్నది. ఎందుకంటే పరిశ్రమల్లో పనిచేయ డానికి యజమానులు నియమించుకుంటున్న కార్మికుల్లో 90 శాతం కాంట్రాక్టు కార్మికులే. అందులోనూ 70 శాతం వలస కార్మికులే. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, తదితర ఉత్తరాది రాష్ట్రాల వారే అత్యధికంగా ఉంటున్నారు. స్థానికులకు ఉపాధి దొరకడం లేదనేది వాస్తవం. దీంతో యువతలో నిరాశనిస్ప్హృలు పెరుగుతున్నాయి.
కార్మికులకంటే యజమానులే ముఖ్యమా?
రాష్ట్రంలోని 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్‌లో పార్ట్-1 కింద 65, పార్ట్-2 కింద 8 ఉన్నాయి. వీటన్నింటిలోనూ కలిపితే సుమారు కోటిమందికిపైగా జీవనోపాధి పొందుతున్నారు. 1948 కనీసవేతనాల చట్టం ప్రకారం ప్రతి ఐదేండ్లకోసారి వేతనాలు పెంచాలి. కానీ, ఎనిమిదేండ్లయినా రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. కార్మికులు వేల కోట్ల రూపాయలను వేతనాల రూపంలో నష్టపోతున్నారు. గతేడాది ఐదు రంగాలకు వేతనాలు పెంచుతూ ఇచ్చిన ఐదు ఫైనల్ నోటిఫికేషన్లలో కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించారు. దీన్ని సహించలేని యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గెజిట్ కాకుండా చేయగలిగాయి. కార్మికుల కంటే యజమానుల ప్రయోజ నాలే పాలకులకు ముఖ్యమనేది తేటతెల్లం అవుతున్నది. ఈ సమస్యపై సీఐటీయూగా ఎన్నో పోరాటాలు చేశాం. కార్మికగర్జన పేరిట 450 కిలోమీటర్ల మేర హైదరాబాద్ చుట్టూతా ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో పాదయాత్ర చేశాం. అక్టోబర్ 8, 2021న కనీస వేతనాల కోసం సమ్మెకు పిలుపునిస్తే ఐదు లక్షల మంది పారిశ్రామిక కార్మికులు పాల్గొన్నారు. వీరితోపాటు భవననిర్మాణ, ట్రాన్స్‌పోర్టు, హమాలీలు, హౌటళ్లు, పెట్రోల్ బంకులు, పవర్లూమ్ కార్మికులు, ఆస్పత్రుల్లోని కార్మికులు, తదితరులు లక్షలాది మంది సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించకుండా యజమానుల కొమ్ముకాసింది. ఏడు లక్షల మంది బీడీ కార్మికుల కనీసవేతనాల జీవోను కూడా సవరించకుండా అన్యాయం చేసింది. అందరికీ పీఎఫ్, జీవనభృతి కల్పించకుండా నష్టం చేస్తున్నది. 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ విషయంపై అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని లేబర్కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాలు చేపట్టాం. ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేశాం. సీపీఐ(ఎం) నాయకత్వం కూడా మునుగోడు ఎన్నికల కంటే ముందు సీఎం కేసీఆర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో తొలి డిమాండ్‌గా కనీసవేతనాల సమస్యనే పెట్టడం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందిచడం లేదు. ప్రయివేటు సెక్టార్లో పనిచేసే కార్మికుల ప్రయోజనాల కన్నా యజమానుల ప్రయోజనమే రాష్ట్ర ప్రభుత్వానికి పరమావధిగా ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలనే ఇక్కడా అమలు చేస్తున్నారు.
ఎవ్వరికీ పట్టని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్లు
రాష్ట్ర ప్రభుత్వ శాఖ పరిధిలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కనీసవేతనాలు కొందరికి 30 శాతం పెంచి చేతులు దులుపుకున్నది. గ్రామపంచాయతీ కార్మికులకు రూ.8,500 మాత్రమే ఇస్తున్నది. మున్సిపల్ కార్మికులకు పక్కరాష్ట్రాల మాదిరిగా రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మిషన్‌భగీరథ కార్మికులకు కనీసవేతనాలు లేవు. వీఆర్ఏలకు పేస్కేలు ఇస్తామని హామీనిచ్చినా ఇంకా నిర్ణయించడం లేదు. లక్షలాది మంది స్కీం వర్కర్లు పనిచేస్తున్నారు. అందులో మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.3 వేలు ఇస్తామన్న హామీ నేటికీ పట్టాలెక్కలేదు. ఆశావర్కర్లకు పనిభారం పెంచింది. ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుండా చాకిరీ చేయిస్తున్న పరిస్థితి ఉంది. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలేదు. ఐకేపీ వీఓలకు జీతాలకు పెంచడం లేదు. 7,600 మంది ఫీల్డు అసిస్టెంట్లను రెండేండ్ల తర్వాత విధుల్లోకి తీసుకున్నా జీతాలు పెంచలేదు. వైద్యారోగ్య శాఖలో నేషన్ హెల్త్ మిషన్, టీశాక్స్, టిమ్స్, ప్రభుత్వాస్పత్రుల్లోని వర్కర్లు, 104, 108, 102, ఆరోగ్యమిత్ర, తదితర రంగాల కార్మికులకు జీతభత్యాలు పర్మినెంట్ ఉద్యోగులకు సమానంగా పెంచడం లేదు. ఏఎన్ఎమ్లపై పనిభారం పెంచి మనోవేదనకు గురిచేస్తున్నది. 2001-02, ఆ తర్వాత కాలంలో నియమించ బడిన కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రతిపాదనలు తెప్పించుకున్న సీఎం కేసీఆర్ ఆ తర్వాత దాన్ని పెండింగ్‌లో పెట్టారు. కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ అంశం కూడా పెండింగ్‌లో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్లకు నామమాత్రపు వేతనాలు ఇచ్చి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ప్రభుత్వం తన పరిధిలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా న్యాయం చేయడంలేదు. దీంతో ఈ మూడేండ్ల కాలంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాటాలు నిర్వహించాం. ఫలితంగా కొన్ని రంగాల్లో జీతభత్యాలు పెంచుకున్నా అత్యధికులకు న్యాయం జరుగలేదు.
ఉద్యోగుల విషయంలోనూ అంతే...
ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కార్మికులకు ఉద్యోగభద్రత లేదు. పీఆర్సీ, డీఏల విషయంలో నాన్చుతున్నది. విపరీతమైన పనిభారం మోపుతూ కార్మికులను వేదిస్తున్నది. కొత్త బస్సులను కొనుగోలు చేయకుండా ప్రయివేటు వారికి లబ్ది చేకూరుస్తున్నది. ఆర్టీసీ డిపోలను మూసేసి ఆస్తులను అమ్మేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కార్మికులకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయల సొమ్మును ఇవ్వకుండా కడుపులను మాడ్చుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అన్యాయమే చేస్తున్నది. అందరికీ బదిలీలు లేవు. చేసినా అంతా గందరగోళమే. ప్రమోషన్ల ముచ్చటను అటకెక్కిం చింది. కొత్తపింఛన్ విధానం(సీపీఎస్) వల్ల లక్షలాది మంది ఉద్యోగులు నష్టపోతున్నా చడీచప్పుడు లేదు. రాష్ట్రంలోని సింగరేణి, కాంట్రాక్టు కార్మికుల యొక్క కనీస వేతనాలు పెంచకుండా కాలయాపన చేయడం వల్ల సుధీర్ఘమైన సమ్మెలు చేశారు. ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు జీతాలు పెంచాలని సమ్మె చేశారు. సూర్యాపేటలోని సిమెంట్ పరిశ్రమలు, గ్రానైట్ పరిశ్రమలు, ఐటీసీ, హైదరాబాద్ చుట్టూ ఉన్న వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో, స్పెషల్ ఎకనామిక్ జోన్లలో అనేక పోరాటాలు చేశాం. రాబోయే కాలంలో ఈ పోరాటాలను మరింత ఉధృతం చేసేందుకు సీఐటీయూ నాలుగో మహాసభలో తీర్మానాలు చేసి ఉద్యమించబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నది.
- భూపాల్