Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక ఎర్రని చరిత్ర స్టాలిన్. హిట్లర్ ఫాసిజం బారి నుండి అగ్రదేశాలతో సహా మొత్తం ప్రపంచాన్నే కాపాడిన మహానేత స్టాలిన్. రష్యాలో 'టిఫ్లిన్' రాష్ట్రం, గోరీ పట్టణంలోని ఒకపేటలో 1878 డిసెంబర్ 21న బెసారియన్ జుగాష్ విరీ - కెటేవన్ గెటాడ్జ్ దంపతులకు జన్మించాడు జోసెఫ్ స్టాలిన్. చెప్పులు కుడుతూ తండ్రి, రజకవృత్తితో తల్లి అతన్ని పెంచారు. వాళ్ళతో పాటు తరచూ కష్టాలు తిని, కన్నీళ్ళు తాగుతూ ఐదుచదరపు గజాల చిన్న గదిలో పెరిగాడు స్టాలిన్!
పేదరికం వల్ల 'గోరీ'లోని మత పాఠశాలలో 'టిఫ్లిన్'లోని ఆధ్యాత్మిక కళాశాలలో కొంతమేరకే చదవగలిగాడు. కానీ, అతనిలోని జ్ఞానతృష్ణ పలు వర్జియన్, రష్యన్ గ్రంథాలను అధ్యయనం చేయించింది. ఆంక్షలున్న డార్విన్ గ్రంథాలను సైతం చాటుగా చదివాడు. 15వ ఏటనే మార్క్సిజాన్ని ఆసక్తిగా అధ్యయనం చేసి 17వ ఏట నుండే ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ క్రమంలోనే జైల్లోని లెనిన్తో కలిసి సంభాషించాక ఆయనతో కలసి పోరాడేందుకు కృతనిశ్చయుడయ్యాడు. నాటి నుండి లెనిన్తో ఎంతగా మమేకమయ్యాడంటే... ''చనిపోయినా కూడా బ్రతికున్న లెనిన్ స్టాలిన్'' అని 'హెన్రీ బార్టూన్' లాంటి ప్రముఖులు విశ్లేషించడమే కాదు, సామాన్య రష్యన్లు కూడ అలా చెప్పుకునేంతగా. 1917 ఏప్రిల్ 4న ''రష్యాలో సోషలిస్టు విప్లవానికి సమయం ఆసన్నమైంది'' అన్న సిద్ధాంతాన్ని (ఏప్రిల్ థీసిన్‌ను) ప్రతిపాదించాడు లెనిన్. పోలిట్బ్యూరోలోని హేమా హేమీలంతా తిరస్కరించినా స్టాలిన్ బలపరచి దాన్ని ప్రజా ఉద్యమంగా మలిచేందుకు లెనిన్తో పాటు అంకిత భావంతో పరిశ్రమించాడు. విప్లవం విజయవంతమై 1917 అక్టోబర్‌లో రష్యాలో సోషలిజం అవతరించింది. కానీ ఆ సోషలిస్టు శిశువు పసి దశలో ఉండగానే 1924లో లెనిన్ అమరులయ్యారు. నాయకత్వం చేపట్టాడు స్టాలిన్. ఆ సమయంలో తిండికి కటకటలాడిస్తున్న కరువు కాటకాలు, సోషలిస్టు వ్యతిరేకుల అంతర్యుద్ధాలు, సామ్రాజ్యవాద దేశాల బాహ్య యుద్ధాల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది రష్యా! ''రేపో, మాపో సోషలిస్టు రష్యా చరిత్ర ముగిసిపోతుంద''ని ఆనందంగా ముచ్చటించుకుంటున్నారు సామ్రాజ్యవాద అగ్రనేతలు. కానీ, ''తన సోషలిస్టు రష్యాను తీవ్ర సంక్షోభాల నుండి గట్టెక్కించటమే కాక, అగ్ర దేశాలు సైతం ఆశ్చర్యపోయేంత సమున్నత స్థాయికి చేర్చాడు స్టాలిన్. అది ఆయనకు ఎలా సాధ్యమైందీ? అంటూ పాశ్చాత్యదేశాల పరిశీలకులు పరిశోధించి చెప్పిన వాస్తవవాలు ఇలా ఉన్నాయి....
1. ప్రజల పట్ల స్టాలిన్‌కు గల ప్రేమ, దేశభక్తి 2. నిరంతర అధ్యయనం 3. విశ్వసనీయత 4. నిజాయితీ. ఇవే రష్యన్ల చేత అద్భుతాలు చేయించి, ఆయనను విజేతగా నిలిపాయి.
ప్రజలపట్ల ప్రేమ: దేశాన్ని తన కుటుంబంగా, ప్రజలను తన బిడ్డలుగా ప్రేమించి, వాళ్ళకోసం అంకిత భావంతో పరిశ్రమించాడు స్టాలిన్. ఉదాహరణకు ఆయన దేశాధ్యక్షుడయినా, కుమారుడు ఒక సామాన్య సైనికుడు. ఆయన భార్య నదేజా తక్కిన ప్రజలతో పాటూ క్రిక్కిరిసిన ట్రాముల్లో పనులకెళ్ళింది. దేశమే స్టాలిన్ కుటుంబమనటానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి!
నిరంతర అధ్యయనం: జ్ఞానమే తన దేశానికి విముక్తి మార్గంగా భావించాడు స్టాలిన్. అందుకే నిరంతర అధ్యయనం ద్వారా తన దేశానికి ప్రజలకు ఉన్న సమస్యలేమిటో, వాటికి పరిష్కార మార్గాలేమిటో స్పష్టంగా తెలుసుకోగలిగాడు. ఆ దిశగా శ్రమిస్తూ, ప్రజలను పరిశ్రమింప జేసాడు స్టాలిన్. ఆ శ్రమే అభివృద్ధి పథంలో రష్యాను అగ్రభాగాన నిలిచింది.
విశ్వసనీయత: ప్రజలకు, పార్టీకి వాస్తవాలను చెప్పటం అలవాటుగా మలుచుకున్నాడు. ఏ అంశాన్నైనా అధ్యయనం చేసి పూర్తి సమాచారాన్ని సేకరించాకే ప్రజలకు, పార్టీకి చెప్పేవాడు. అందుకే స్టాలిన్ నివేదికలు, ఉపన్యాసాల్లో ''దాదాపు, సుమారు, బహుశా, అనుకుంటా'' వంటి పదాలుండవనీ, ఇతరులు గంటలో అందించే సమాచారాన్ని, స్టాలిన్ పదినిమిషాల్లో చెప్పేవాడనీ ప్రతీతి. రూపాయి నుండి ఒక్కపైసా తొలగించినా అది రూపాయి కానట్లే... స్టాలిన్ రాసిన దాని నుండి ఒక్కపదాన్ని తొలగించటానికి కూడా సాధ్యపడేది కాదనీ, అందువల్లనే స్టాలిన్ మాటలను విశ్వసించి ఆయన పిలుపునకు, నినాదాలకు ప్రజలు, సైనికులు అంతగా స్పందిస్తూ అద్భుతాలు చేయగలిగారనీ తమ స్మృతుల్లో రాసుకున్నారు నాటి ప్రముఖులనేకులు. అందుకు వారు ఉదహరించిన సంఘటనల్లో కొన్ని....
సంఘటన 1: రష్యా కరువు కాటకాలతో అల్లాడుతున్న సమయాన తిండిగింజల కోసం స్టాలిన్ చేసిన అభ్యర్థనను ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించాయి అగ్రదేశాలు. 'సోషలిస్టు శిశువును ఆకలితో మాడ్చేయాలన్న' వాళ్ళ దురుద్దేశాన్ని గ్రహించిన స్టాలిన్ తక్షణం ఇలా ప్రకటించాడు... ''స్వయం సమిష్టి కృషితో రష్యన్లు తమ కాళ్ళమీద తాము నిలబడటమే కాదు, పరుగెత్తగలరు. తమ ధాన్యాన్ని తామే పండించుకోగలరు''. ఆ చిన్న ప్రకటనే నిరాశలో కూరుకున్న రష్యన్లలో కొండంత ఆత్మస్థైర్యాన్నీ, దేశభక్తినీ నింపింది. అలా ఉత్తేజితులైన తన ప్రజలను ''సాధించేందుకే ముందుకు సాగుదాం'' అన్న నినాదంతో పరుగులు పెట్టిస్తూ, పంచవర్ష ప్రణాళికా లక్ష్యాలను రెండు, మూడేండ్లకే సాధిస్తూ అనూహ్యంగా సోషలిస్టు రష్యాను ప్రగతిపథానికెక్కించాడు. తద్వారా ''సోషలిజం'' శక్తిసామర్థ్యాల పట్ల రష్యన్లకు విశ్వాసాన్నీ - ప్రపంచ ప్రజలకు ఆసక్తినీ కలిగించగలిగాడు.
సంఘటన 2: రష్యాతో చేసుకున్న నిర్యుద్ధ సంధిని అతిక్రమించి, రాత్రివేళ విరుచుకుపడి రష్యాను దొంగదెబ్బ తీశాయి హిట్లర్ సేనలు. కొద్ది రోజుల్లోనే రష్యా హిట్లర్ పాదాక్రాంతమవుతుందన్న పాశ్చాత్య దేశాల ప్రచారంతో భయభ్రాంతులకు లోనయ్యారు రష్యన్లు. అప్పుడిలా ప్రకటించాడు స్టాలిన్... ''మెరుపు దాడికి దిగిన శత్రువు మనదేశంలో గణనీయ భారాన్ని ఆక్రమించాడు. ఇది వాస్తవం. అయినా భయపడాల్సింది లేదు, సాహసంతో పోరాడితే జయించి తీరుతామన్నది అంతకంటే వాస్తవం'' అని సైనికులకు, ''ఇది దేశభక్త మహా యుద్ధం! ఇందులో బాల బాలికల నుండి, అవ్వా తాతాల వరకు ప్రతి ఒక్కరూ వీరసైనికులే... మన తల్లిని కాపాడుకునే ఈ పోరాటంలో మీ చేతికి చిక్కిందల్లా ఆయుధమే'' అని స్టాలిన్ ఇచ్చిన పిలుపునకు అపూర్వమైన స్పందన వచ్చింది. భద్రతాసిబ్బంది సూచించినట్టు స్టాలిన్ అజ్ఞాత వాసానికి వెళ్ళుంటే అంతటి స్పందన వచ్చేది కాదేమో కానీ, ''మాస్కో పొలిమేరల్లోకి హిట్లర్ సైన్యాలు దూసుకుకొచ్చాయి''అన్న సమాచారం రాగానే ప్రజలను, ప్రభుత్వ రికార్డులను రక్షిత ప్రాంతాలకు తరలింపజేసి, తానక్కడే ఉండి రెడార్మీనీ ముందుకు నడిపించాడు స్టాలిన్. శత్రు విమానాలు విసిరిన బాంబులు అల్లంత దూరాన చుట్టూ మంటలు రేపుతున్నా, ఆ మధ్యలోనే రెడ్‌స్క్వేర్ కవాతునేర్పరచి ''ఎర్ర సైనికులారా! జర్మన్ బందిపోట్లను నిర్మూలించగల సత్తా మనకుందని ప్రపంచం విశ్వసిస్తోంది! హిట్లరుకు చేతులెత్తేసిన ఐరోపా ప్రజలంతా మనల్నే తమ విముక్తి దాతలుగ భావిస్తున్నారు. ఆ ఘనకీర్తికి యోగ్యులం మనం''... అని స్టాలిన్ ఇచ్చిన సందేశం సైనికులకు, ప్రజలకు మరో పెద్ద సైన్యమొచ్చి తమతో చేరినంత శక్తినిచ్చిందని పిమిట్రోల్ స్టెమెంకోల్ - రూకోల్ వంటి ప్రముఖులు తమ స్మృతుల్లో రాసుకున్నారు.
సంఘటన 3: జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ నిజాయితీయుత విదేశాంగ విధానం, హేతుబద్ధమైన ఎత్తుగడలతో రష్యాకు ప్రపంచ ప్రజల దేశాల మద్దతును సంపాదించాడు స్టాలిన్. ''సామ్రాజ్యవాదంలాగా, సోషలిజం దురాక్రమణలకు పాల్పడద''న్న సంకేతాన్ని తన ఆచరణ ద్వారా ప్రపంచానికి అందించాడు స్టాలిన్. నిజాయితీయుతమైన స్టాలిన్ దౌత్యనీతికి ముగ్ధులైన 'లాత్వియా - లిధులేనియా - ఎస్తోనియా రిపబ్లిక్కులు స్వచ్ఛందంగా సోషలిస్టు రష్యాలో కలిసాయి. జర్మనీతో ఉన్న ఒప్పందం ప్రకారం హిట్లర్ రష్యాకు ఆయుధ సరఫరాను వాయిదా వేస్తున్నా... స్టాలిన్ మాత్రం ధాన్యాలు పంపుతూనే ఉన్నాడు. 'రష్యా కూడా సోషలిస్టు సామ్రాజ్యవాదే'నన్న ఆరోపణలతో దాన్ని ఏకాకిని చేయాలనుకున్న సామ్రాజ్యవాదులకు, ఈ పరిణామాలన్నీ నిరాశను కలిగించాయి. రష్యాపై యుద్ధానికి ఏసాకూ దొరకదనీ, అందుకు వేచియుండటం వృధా అన్న భావనతో... అకారణంగా రష్యాపై విరుచుకుపడి అంతర్జాతీయ దురాక్రమణ దారుగా నగంగా బయటపడ్డాడు హిట్లర్! అదే సోషలిస్టు రష్యాకు నైతిక మద్దతును సంపాదించింది! ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజానిరసన సెగలకు తాళలేక హిట్లర్‌ను ఖండిస్తూ రష్యాకు మద్దతు ప్రకటించాయి ప్రపంచ దేశాలు! బ్రిటన్, అమెరికాలు సైతం ప్రజా నిరసనలకు భయపడి, రష్యాకు మద్దతుగా యుద్ధరంగానికి దిగివచ్చాయి. స్టాలిన్ ఎర్రసేన ముందు నిలువలేని హిట్లర్ సైన్యాలు మట్టికరిచాయి.
అలా తన సోషలిస్టు రష్యానే కాదు, ఫాసిజం విషకోరల బారి నుండి ప్రపంచాన్నే కాపాడిన రాజనీతిజ్ఞునిగా, కమ్యూనిస్టు యోధునిగా చరిత్రలో నిలచి ఉన్నాడు స్టాలిన్. ఆ మహానేతకు మన భారతదేశమూ ఎంతో రుణపడి ఉంది.
స్వాతంత్య్రానంతరం భారత ప్రధాని నెహ్రూ ఆహార ధాన్యాల కోసం అభ్యర్థించగా, ఆయన్ని భిక్షగానిగా ట్రీట్ చేశాయి బ్రిటన్, అమెరికాలు. ఆ బాధతో రష్యా వెళ్ళాడు. సాదరంగా స్వాగతించాడు స్టాలిన్. కష్టాల రుచి తెలిసిన ఆయన నెహ్రూకు హితబోధ చేసాడిలా... ''భారీ జనాభా గల భారతదేశం సదా ఆహార స్వయం సమృద్ధిని కలిగివుండాలి. అందుకు భారీ ఆనకట్టల నిర్మాణాల ద్వారా వ్యవసాయాన్నీ, అలాగే పారిశ్రామికాభివృద్ధికి ఉక్కు కర్మాగారాలను విధిగా నిర్మించుకోవాల''ని సూచించటమే కాదు, అందుకు భారీ ఆర్థిక సాయంతో పాటు సంబంధిత రంగాల సాంకేతికతనూ, నిపుణులను కూడా అందించాడు స్టాలిన్. నెహ్రూ నిర్మించి జాతికి అంకితం చేసిన 'భాక్రానంగల్, హీరాకుడ్' ఆనకట్టలు - 'భిలారు - రూర్కెలా' ఉక్కు కర్మాగారాలు స్టాలిన్ సహకార ఫలాలేనని మరువకూడదు.
''చరిత్రలో విజేతలున్నారు కానీ స్టాలిన్ వంటి రాజనీతిజ్ఞులు అతికొద్ది మందే'' అని నాటి బ్రిటన్ ప్రధాని చర్చిల్... ''సిసలైన రష్యన్ ప్రజానేత జోసెఫ్ స్టాలిన్! ఆయన సారధ్యంలో రష్యన్ సైనికులు, ప్రజలు చేసిన సాహసాలను, ఆత్మత్యాగాలను ప్రపంచం మునుపెన్నడూ కనీ వినీ ఎరుగదు'' అని నాటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌లు సైతం తమ స్మృతుల్లో రాసుకున్నారు. అదీ స్టాలిన్ చరిత్ర...
- పి. వెంకటేశ్వరరావు
సెల్: 9849081889