Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ రైల్వేలను ప్రయాణ ప్రగతికి మార్గాలుగా భావిస్తాం. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రధానంగా వయోవృద్ధులను తీవ్రంగా కలచివేసింది. గతంలో అమలైన సీనియర్ సిటిజన్స్ రాయితీలను కొనసాగించలేమని, ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ ప్రజానీకానికి ప్రయాణ వాహక నౌకగా కీర్తించబడే రైళ్ళలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు ఎత్తేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైళ్ళలో గతంలో సాధారణ ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకుని 58ఏండ్లు నిండిన మహిళలకు 50శాతం, 60ఏండ్లు నిండిన పురుషులకు 40శాతం రాయితీలు ఇస్తున్నారు. ఈ సౌకర్యం ఎన్నో ఏండ్లనుంచి అమలవుతోంది. కరోనా పుణ్యమాని సీనియర్ సిటిజన్స్ రాయితీలను నిలిపివేశారు. ఆ పిమ్మట అంతటా సాధారణ పరిస్థితులు నెలకొన్నా రాయితీల పునరుద్ధరణ జరగలేదు. ఇప్పుడేమో మొత్తానికే కుదరదని మన రైల్వే మంత్రి సెలవిచ్చారు. ఇది తమకు భారమవుతోందనీ, ప్రయాణికుల సేవల కోసం ప్రభుత్వం గత ఏడాది రూ.59వేల కోట్లు రాయితీ ఇచ్చిందనీ కేంద్రం చెబుతోంది. అదే సమయంలో ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు సమకూరుస్తున్నట్లు రైల్వేశాఖ వివరిస్తోంది. అయితే రాయితీల అంశం ప్రయాణికుల సదుపాయాల్లోకి రాకపోవడం శోచనీయమని సీనియర్ సిటిజన్ల సంఘాలు నివేదిస్తున్నాయి.
సగటు జీవికి అందుతున్న రైల్వే రాయితీలు భారమవుతున్నా యంటున్న పాలకులకు కార్పొరేట్లు, బహుళ జాతి సంస్థలకు ఇస్తున్న రాయితీలు భారమవటం లేదా? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. దీన్ని మేధావులు, మీడియా తులనాత్మకంగా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. కరోనా అనంతరం ఈ రాయితీల పునరుద్ధరణ కోసం అందరూ డిమాండ్ చేస్తుండగా, ఆ మధ్య రాయితీల ప్రకటనపై తర్జన భర్జనలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. వయోపరిమితిని 60 నుంచి 70ఏండ్లకు పెంచడం, జనరల్ క్లాస్, స్లీపర్ క్లాస్‌లకు మాత్రమే వర్తించేలా ప్రకటన రావచ్చంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. తీరా చూస్తే అసలుకే మోసమొచ్చింది. ఇది అన్యాయం. ఎందరికో ఉపకరించే సీనియర్ సిటిజన్స్ రాయితీల పునరుద్ధరణపై కేంద్రం పెద్ద మనసుతో వ్యవహరించాలని, వారి అవసరాలను గుర్తించాలని ప్రజల ఆకాంక్ష....ఘోషా...!
చెన్నుపాటి రామారావు
9959021483