Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ప్రాచీన జానపద కళారూపాలలో వీధినాటకం ఒకటి. వీధిబాగోతంకు పర్యాయపదమే వీధినాటకం. ఉభయ రాష్ట్రాల్లో తెలుగునాట మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ తత్సంబంధమైన బయలునాటకం, చిందు బాగోతం, చెంచుబాగోతం మొదలైన కళారూపాల అవశేషాలను తిలకించవచ్చు. భాగవతం - బాగోతం అంటే లీల, 'మాయ'. చతుర్విద అభినయ సమేత (ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం) దృశ్యకావ్యంగా మలచబడిన కళారూపం ఇది. యక్షగాన దరువులతో పాటు సంగీత రాగ శృతి తాళ ధ్వనులు గల పద్యపాటలు మిళితమై ఉంటాయి. శబ్దాలంకార వచన మాధుర్యం సరేసరి. నాటకం సర్వకళల సమాహారం అన్న విషయం తెలిసిందే కదా!
అయితే ఈ వీధినాటిక ప్రదర్శనా కళారూపం కేవలం పుక్కిట పురాణాలకే పరిమితం కాలేదు. సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలు కూడా తెలిసో తెలియకో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, ఎక్కువగానో, తక్కువగానో ఆయా సందర్భల్లో ఈ కళారూపాల్లో వ్యక్తం కావడం కద్దు. కళ-సామాజిక జీవితం పెనవేసుకునే ఉంటాయనడానికి ఇదో గొప్ప తార్కాణం.
ఉదాహరణకు 'వాలకం' అనే కళారూపంలో మొండిమొలతో ఉన్న కళాకారుని వెనుక ఒక తాటాకు ఉంటుంది. దానికి పిల్లలు నిప్పంటిస్తారు. ఆ మంట ఆరేలోపు ఆ కళాకారుడు ప్రజల ఈతిబాధలకు కారణమైన ఆనాటి నాయకుల, వ్యవస్థల దుర్మార్గా లను నిర్భయంగా విమర్శించవచ్చు. ఒక వలయకార ప్రేక్షక జనసందోహం మధ్యన రంగభూమిపై ఇది బహిరంగంగా ప్రదర్శితమవు తుంది. దానిని ఎవరూ ఆక్షేపించడానికి, అడ్డుకోవడానికి వీలులేదు. ఆ విధంగా ఆ కళారూపం ఓ ధిక్కార స్వరం గల స్వేచ్ఛా హక్కును పొందగలిగింది. అంటే నిజమైన ప్రజాస్వామ్య భావప్రకటనా స్వేచ్ఛకు ఆ కళారూపం ప్రతీక అని మనం గమనించాలి.
సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు సవాలుగా నిలిచినప్పుడు, వాటిని కళాకారుడు తమ కళారూపాలతో ప్రజల పక్షాన ధీటుగా ఎదుర్కొవడం అంటే ఇదేగా మరి. ఆ వరవడి నుండి పరిణామ క్రమంలో కళారూపాలు ఎప్పటికప్పుడు, ఎన్నెన్నో విధాలుగా వస్తు-రూపంలో మార్పుచెందుతూ ఉన్నాయి, ఉంటాయి. ఈ మార్పు అనివార్యం. శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు తోడవుతుంది. నాటకం, సినిమా, టీవీ, సెల్‌ఫోన్ అన్ని ప్రక్రియలు నేడు మనం చూస్తున్నాం. అనుభవిస్తున్నాం. అయితే అన్నింటికీ నాటకం తల్లివేరు వంటిదని మరువరాదు. ఆధునిక వీధి నాటిక ప్రక్రియకు ఈ ప్రజాస్వామ్యభావనే, రుగ్మతలపై ఎక్కుపెట్టే ధిక్కార స్వరమే ప్రధానం. తక్కినదంతా ద్వితీయం. దోపిడీ వ్యవస్థలో మనిషి నానాటికి పరాయికరణైపోతూ (ఎలియనేట్) మనిషితనాన్ని కోల్పోతున్నాడు. జంతువుగానో, యంత్రంగానో దిగజారిపోతున్నాడు. మనిషిని మనిషిగా సమున్నతంగా నిలబెట్టే కర్తవ్యాన్ని నాటకం చేబట్టింది. ప్రజల మధ్యకు, ప్రజలకు మరింత చేరువగా చేయడమే ఆధునిక వీధినాటక లక్ష్యంగా నేడు తోసుకువచ్చింది. అందుకే సప్దర్ హష్మి 'వీధినాటకం ప్రజాపోరాటాయుధం' అనే విప్లవాత్మక నినాదం ఇచ్చాడు. అతడు గతించి 34ఏండ్లు కావస్తున్నా వీధినాటిక ప్రాశస్త్యం అంతకంతూ పెరుగుతున్నదే తప్ప తరగడం లేదు.
దీని రచనాశైలి విభిన్నం. క్షణక్షణం సన్నివేశాలు మారిపోతుంటాయి. అక్కడికక్కడే ప్రజా సమూహాలు చిన్న చిన్న డైలాగ్‌లు మాట్లాడుకుంటాయి. అది బస్టాండ్, రైల్వేస్టేషన్, మార్కెట్ ఏదైనా కావచ్చు. రకరకాల భంగిమలతో ఆకారాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి పాత్రలంటూ అప్పుడు ఉండవు. ఒకే నటుడు సజీవ, నిర్జీవ పాత్రలు పోషిస్తాడు. ఆంగిక విన్యాసాలు అబ్బురపెడ్తాయి. ఒక్కోసారి మాటలే (డైలాగ్స్) ఉండవు. అంతా నిశ్శబ్దమే. సన్నివేశమే కండ్లకు కడుతుంది. అంతా మెరుపువేగంతో అప్పటికప్పుడే అల్లుకుంటుంది. అందువల్ల ఆధునిక వీధినాటిక ప్రక్రియను అర్థంచేసుకోకుండా ఈ నాటక రచనకు ఉపక్రమించడం కష్టసాధ్యం. రచయితకు, దర్శకునికి, నటులకు మధ్య గరిష్టస్థాయిలో సమన్వయాన్ని ఈ ప్రక్రియ డిమాండ్ చేస్తుంది. తెరలుండవు, మైకులుండవు, లైట్లు ఉండవు. అంతా బహిరంగమే. పట్టపగలు నడిరోడ్డుపై ప్రజల మధ్య ప్రదర్శిస్తారు. సుకుమారం ఉండదు. చెమటోడ్చాలి. శ్రమైకజీవన సౌందర్యం తాండవిస్తుంది. కనుకనే ప్రేక్షకులు మైమరుస్తారు. నాటకంలో సులభంగా లీనమవుతారు. ఇదే ఈ ప్రక్రియ వైశిష్ట్యం.
ఎమర్జెన్సీ చీకటిరోజుల తర్వాత ఆనాటి పరిస్థితుల్లో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతే దేశానికి శరణ్యం అన్న రీతిలో ఈ నాటికను ఆలంబనగా చేసుకుని స్వీయ దర్శకత్వంలో 'అద్దం' పేరుతో (రచన-దేవేంద్ర) ప్రజానాట్యమండలి విజయవాడ దళం రూపొందించుకుని అప్పట్లోనే శతాధిక ప్రదర్శనలు ఇచ్చింది. ప్రక్రియలో రూపనవ్యత, వస్తువులో సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక వాస్తవికత జమిలిగా కండ్లకు కట్టడంతో ప్రేక్షకులు ఎక్కడికక్కడ ఈ ప్రదర్శనలకు బ్రహ్మరథం పట్టారు.భారత నాట రంగ చరిత్రలో ''హల్లాబోల్' (గొంతెత్తి నినదించు) వీధినాటిక ఓ మైలు రాయి. సప్దర్ హష్మీ దీని సృష్టికర్త. వారి నాటక బృందం జన నాట్యమంచ్ (జనమ్) 1980 దశకం చివర్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రదర్శించింది. చిన్న చిన్న ఫ్యాక్టరీలలో, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల వేతనాల పెంపుకోసం రూపొందించిన నాటిక ఇది. ఆ నిరుపేద మురికి వాడల జీవితాలను ప్రతిబింబిస్తూ, వారి హక్కుల సాధనకోసం, మెరుగైన జీవన సౌకర్యాల కోసం సంఘటిత పోరాటం అనివార్యమని తెలియచెప్పే నాటిక ఇది.
ఇతివృత్తం ఇలా ఉంటుంది. కార్మికవర్గాన్ని చైతన్య పరిచేందుకు ప్రజాకళాకారులు అక్కడకు చేరి పాటలు పాడుతూ ప్రదర్శన చేస్తుంటారు. రాజ్యానికి ప్రతినిధి అయిన ఓ పోలీసువచ్చి, నాటకం అంటే ప్రేమలు, డ్యాన్స్‌లు ఉండాలిగాని మీరేంటి చైతన్యం, పోరాటం అంటూ కార్మికుల్ని రెచ్చగొడితే ఎలా? టాట్ నా ఏరియాలో ఇలాంటివి ఒప్పుకోను అంటాడు. పోలీసు కోరిక ప్రకారం ప్రేమ సన్నివేశాలతో నాటకం మొదలవుతుంది. అమ్మాయిని అబ్బాయికి ఇవ్వాలంటే అబ్బాయి ఓ చిన్న ఫ్యాక్టరీ కార్మికుడు. తక్కువ జీతం. మురికివాడ నివాసం. అలాంటి అబ్బాయికి తమ అమ్మాయిని ఇచ్చేది లేదని తల్లిదండ్రులు తెగేసి చెపుతారు. ఎక్కువ జీతం కోసం మా యూనియన్ పోరాడుతుంది అని అంటాడు అబ్బాయి. 'అదిగో మళ్ళీ యూనియన్, హక్కులు, జీతాలు, మాట్లాడుతున్నా'రంటూ పోలీసు అడ్డుపడతాడు.
ఈ దేశంలో కష్టజీవి బతకాలంటే అడుగడుగున పోరాటం చేయక తప్పదు. ఈ ధర్మ సూక్ష్మం మీకు తెలియకపోతే ఎలా? అని కళాకారులు ఎదురు తిరగడంతో పోలీసు పారిపోతాడు. ఫ్యాక్టరీ గేట్ల ముందు, మురికి వాడల్లో ప్రదర్శిస్తున్నప్పుడు నాటకమే జీవితం అవుతుంది. జీవితమే నాటకం అవుతుంది. కళాకారులు, ప్రేక్షకుల మధ్య గల చిన్న అంతరం పూర్తిగా అంతరించిపో తుంది. నాటకం ప్రయోజనం అమోఘంగా సిద్ధించింది అనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏముంటుంది. అలా హల్లాబోల్ నాటికే అప్పుడు ఓ పెద్ద పోరాటాయుధంగా మారింది. ఎక్కడ ప్రదర్శించినా తండోపతండాలుగా జనం హాజరయ్యే వారు. మళ్ళీ మళ్ళీ చూసేవారు.
అందుకే ఫ్యాక్టరీ యజమానులకు, వారితో మిలాఖత్ అయిన రాజకీయ నాయకులకు కంటగింపు అయింది. పథకం ప్రకారం 1989 జనవరి 1వ తేదీన ఢిల్లీకి సమీపాన ఉన్న ఘజియాబాద్ వీధుల్లో 'హల్లాబోల్' నాటిక ప్రదర్శిస్తుండగా పట్టపగలు కిరాయి గూండాలు మారణాయుధాలతో దాడిచేసారు. అంతా కకావికలమయింది. ప్రేక్షకులు, కళాకారులు చెల్లా చెదురయ్యారు. నేలంతా రక్తసిక్తమయింది. క్షతగాత్రుడైన హష్మీ మరుసటిరోజు అమరుడయ్యాడు. దేశరాజధాని నొసట చెరగని నెత్తుటితిలకయ్యాడు. అంతిమ యాత్ర అనంతరం సప్దర్ హష్మీ సతీమణి మలయశ్రీ హష్మీ సారధ్యంలో ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడే అదే 'హల్లాబోల్' నాటికను కళాకారులు ప్రదర్శించి ఖబడ్దార్! అంటూ కళా హంతక నైజాన్ని హెచ్చరించారు. భారత ప్రజాస్వామ్య నాటక కళకు ఈ ఘటన కొత్త ఊపిరులు ఊదినట్లయింది. ప్రజా నాటకాన్ని ఎవరూ అంతం చేయలేరని తిరుగులేని పద్ధతుల్లో చాటిచెప్పింది. తదనంతరం భిన్న భాషల్లో భిన్న ప్రాంతాల్లో విశ్వ వ్యాప్తంగా వందలాది దళాలు 'హల్లాబోల్' నాటికను వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చాయి. ఆధునిక వీధి నాటిక కు హష్మీవీధి నాటకం అలా పర్యాయపదమైంది. తెలుగునాట ప్రజారంగస్థల ప్రయోక్త టి.జె. రామనాధం దర్శకత్వంలో 'హల్లాబోల్' నాటికను అనేక దళాలు ప్రదర్శించాయి. ఇప్పటికీ ప్రదర్శిస్తున్నాయి. అప్పుడు తఆయన అచ్చమైన తెలుగుదనంతో రూపకల్పన చేసిన డిజైన్ ఇప్పటికీ ఎవరు ప్రదర్శిస్తున్నా అలరిస్తూనే ఉన్నది. ప్రజానీకాన్ని చైతన్యపరుస్తూనే ఉన్నది. శ్రామికవర్గం తమ హక్కుల కోసం పోరాడినంత కాలం హష్మీ వీధినాటకం ఆ విధంగా ప్రజా పోరాటాల్లో మమేకం అవుతూ కలకాలం నిలిచే ఉంటుంది.
('ఆధునిక వీధినాటిక ప్రక్రియ-హల్లాబోల్ నాటిక' అంశంపై ఇటీవల ఏపీ అభ్యుదయ రచయితల సంఘం అంతర్జాల సదస్సులో చేసిన ప్రసంగం)
సెల్:9959745723
కె శాంతారావు