Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అణగారిన వర్గానికి చెందిన ఒక ఛారువాలాకి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే హక్కును, అవకాశాన్ని భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ప్రసాదించాడు''... ఇవి స్వయాన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలిపిన మాటలు. కానీ, అంబేద్కర్ని కీర్తిస్తూ రాజ్యాంగాన్ని విస్మరించడమే ఆచరణలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించే విధానం అని చెప్పక తప్పదు.
మన రాజ్యాంగం 19వ అధికరణం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను (ఫ్రీడం ఆఫ్ స్పీచ్) ఇచ్చింది. అందులో భాగమైన ఎటువంటి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం జరుపుకొను హక్కు, అసోసియేషన్లు లేక యూనియన్లు లేక సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు, భారత భూభాగంలో ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు మొదలైన ఈ స్వేచ్ఛలన్నింటినిపై బీజేపీ దాడులు చేస్తున్నది.
మోడీ రాజకీయ సంస్ధ అయిన బీజేపీ పెట్టుబడిదారి సామాజిక వ్యవస్థలకు కేంద్రంగా ఉంది. దేశంలో అదాని గ్రూప్, అంబానీ గ్రూపులు గుజరాత్ కేంద్రంగానే ఎదుగు తున్నాయి. దేశీయంగా అగ్రశ్రేణి 100 సంస్థలు 2017-22 మధ్యకాలంలో ఏకంగా 92.2 లక్షల కోట్ల సంపదను ఆర్జించాయనిమోతిలాల్ ఓష్వాల్ నివేదిక పేర్కొంది. ఈ సంపదలో రిలయన్స్ ఇండిస్టీస్ను మించి రెండు అదానీ గ్రూప్ కంపెనీలు ఆయనను 2022 అత్యంత ధనికుల జాబితాలో చేర్చాయి. ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో 155.7 బిలియన్ డాలర్ల నికర విలువలతో అదాని రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ ఆర్థిక దోపిడీ మోడీ, షా ల కాలంలోనే జరిగింది.
బీజేపీ నయా ఉదారవాద విధానాలను, భారత రాజ్యాంగాన్ని దెబ్బతీసే మతోన్మాద కుతంత్రాలను మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అర్థం చేసుకుంటున్నారని ఇటీవల జరిగిన ఎన్నికల వలన మనకు అర్థమవుతుంది. భారత రాజ్యాంగానికి విరుద్ధమైన విషయం ఏమిటంటే? ముస్లింలు కూడా భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే పెరిగారు. వారు విదేశీయులు కాదు. కానీ ముస్లింలకు వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా హిందువుల ఓట్లను సమీకరించే ఓ ప్రమాదకరమైన భావజాలాన్ని బీజేపీ విస్తృతం చేయాలని ప్రయత్నం చేస్తున్నది. ముస్లింలకు, క్రైస్తవులకు బౌద్ధులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్లు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. దానివల్ల హిందువులు మొత్తం సమాజం నుండి వేరు పడుతున్నారని గుర్తించలేకపోతున్నారు.
రాజ్యాంగం ప్రకారం స్వయం ప్రతిపత్తి సంస్థలైన ఆర్బీఐ, సిబిఐ, యూజీసీ, ఐటి, ఇడి మొదలైన దేశంలోనే అతి ముఖ్యమైన ప్రతిష్టాత్మక సంస్థలు కూడా రాజకీయ రంగును అద్దుకొని తమ విలువైన స్వతంత్రతను విశ్వసనీయతను కోల్పోతున్నాయి. దేశంలో విపరీతంగా పేరుకుపోయిన నల్లడబ్బు వెలికి తీసి పేదలకు పంచుతామని అధికారంలోకి వచ్చిన బీజేపీ, అందుకు విరుద్ధంగా నోట్ల రద్దు, జీఎస్టీ చర్యలతో ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీసి, వివిధ ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాలు లేకున్నా కార్పొరేట్ శక్తులకు అమ్మి వేస్తున్నది. అదాని, అంబానీలను ప్రపంచ కుబేరులుగా మార్చే రాజకీయ, వ్యాపార ప్రక్రియ కొనసాగుతోంది. మరోపక్క దేశంలో ఆర్థిక పరిస్థితి అదుపుతప్పుతోంది. రోజు రోజుకు ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంటే? ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం కలగలిసి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ స్థితిలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ప్రజలపై భారాలను మోపుతుంది. మోడీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్ల కాలంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ మీద ఇంధన పన్నుల రూపంలో 26,51,919 కోట్లు వసూలు చేసింది. అంటే ప్రతి కుటుంబం నుండి సగటున లక్ష రూపాయలు ఇందన పన్నుగా వసూలు చేసింది. 2015 మార్చిలో టోకు ధరల సూచిక 7.89శాతానికి, మార్చి 2022 నాటికి 14.55 శాతానికి పెరిగింది. అంటే సంవత్సర కాలంలో రెట్టింపు అయింది. ఇక ద్రవ్యోల్బణం 8ఏండ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగబాకింది. గత ఎనిమిదేండ్లలో జీడీపీ వృద్ధిరేటు తిరోగమించడం మోడీ ప్రభుత్వ పనితీరుకు సంకేతం. పడిపోయిన గ్రామీణ కూలీల వేతనాలు, భారీగా పెరిగిన నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి నిదర్శనం. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం చెప్పుకుంటున్నవి డాంభికాలే తప్ప వాస్తవాలు కాదని తాజాగా విడుదలైన రిజర్వ్ బ్యాంకు నివేదిక సైతం స్పష్టం చేసింది.
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీడీపీని పరుగులు పెట్టించామని, పారిశ్రామిక అభివృద్ధి పెంచామని, గ్రామీణ ఆదాయాన్ని రెట్టింపు చేశామని, నిరుద్యోగాన్ని, పేదరికాన్ని తగ్గించామంటూ బీజేపీ చేస్తున్నది ప్రచార ఆర్భాటమేననీ ''కరెన్సీ అండ్ ఫైనాన్స్ 2021-22'' పేరుతో విడుదల చేసిన నివేదిక రుజువు చేస్తున్నది. ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఆర్బీఐ గణంకాలతో సహా వివరించింది. స్థూలంగా చూసినప్పుడు పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను, కోవిడ్ విపత్తు వలన ఇప్పటికీ చాలా కంపెనీలు ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి తరహా పరిశ్రమలు దివాలా తీశాయి. ఉత్పత్తి కార్యకలాపాలు మామూలు సామర్థ్య స్థాయికి చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఉత్పత్తి సామర్థ్యం పెరగకుండా ఉపాధి అవకాశాలు మెరుగు పడవు. ఉత్పత్తి పెరగాలంటే మార్కెట్లో సరుకులకు గిరాకీ పెరగాలి. మార్కెట్లో వినియోగ వస్తువులకు గిరాకీ పెరగాలంటే ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరగాలి. ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల అధిక ద్రవ్యోల్బణంతో పాటు ఉపాధి అవకాశాలు, నిజవేత నాలు పడిపోవటం వంటి ఫలితాలు చూస్తున్నాం. ఈ తీవ్ర సంక్షోభిత పరిస్థితులు కార్మిక వర్గ జీవన విధానాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఆలోచిస్తే భారత రాజ్యంగంపై ప్రమాణం చేసిన మన దేశ ప్రధాని ఏ వర్గ ప్రజాప్రతినిధిగా ఉన్నారో ఆర్ధమవుతుంది. అంబేద్కర్ను కీర్తించడం కేవలం ప్రచార ఆర్భాటమే? చిత్తశుద్ది శూన్యం. అందుకే ఒక మహానుభావుడు అన్నట్లు ఏ మాటల వెనుక ఏ వర్గ స్వభావం దాగి ఉందో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారనే సూక్తి ప్రస్తుతం సందర్భోచితం అనుకోవచ్చు. సామాజిక న్యాయం బీజేపీ పాలనలో అందని ద్రాక్షగా ఉన్నది. పునాది వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టి, మహిళల సంక్షేమం, అభివృద్ధి కేవలం పాలక వర్గాల ప్రచార నినాదంగా అవతరించింది.
ఈ స్ధితిలో పునాది వర్గాల ప్రజానీకం, ఆ వర్గాల సంక్షేమం కోసం పని చేసే సంస్ధలు, రాజకీయ పార్టీలు బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై పోరాడవలసిన బాధ్యతను తీసుకోవాలి. ఆ వర్గాల చైతన్యానికి చిత్తశుద్దితో పూనుకోవాలి. అప్పుడు మాత్రమే అంబేద్కర్ని కీర్తించి, ఆయన భావజాలన్ని నిర్వీర్యం, నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాతోన్మాద శక్తులకు అడ్డుకట్ట వేయగలం.
- మచ్చా వెంకటేశ్వర్లు
సెల్: 9490098192