Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రం పాఠశాల విద్యలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది మరింత ప్రగతి సాధించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ''మన ఊరు- మనబడి/ మన బస్తీ-మనబడి'' కార్యక్రమా(కొత్త పథకా)న్ని చేపట్టింది. మన రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి బడ్జెట్ సమావేశాల సందర్భంగా దీనిని ప్రకటించింది. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలలో మన ఊరు మనబడి గాను, పట్టణ ప్రాంతాల్లో మనబస్తీ మనబడి గాను రూపొందించ బడింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులను కల్పిస్తూ పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్న అనేక సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందనేలా ప్రాచుర్యం కల్పించారు. విద్యా వ్యవస్థలో అరకొరగా ఉన్న మౌలిక వసతులు, వనరులను సంపూర్ణంగా అందించడం, పాఠశాల భవనాలు, తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, విద్యార్థుల అన్ని అవసరాలను తీర్చినప్పుడే విద్యా వ్యవస్థ బలోపేతమౌతుందనేది వాస్తవం. ఈ పథకాన్ని మన రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో మూడు దశల్లో చేపట్టి, మూడు సంవత్సరాలకు గాను రూ.7,289.62 కోట్ల ఖర్చుతో ఆధునికీకరించడానికి నిధులను కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలా మొదటి విడతలో 2021-22సంవత్సరంలో ప్రతి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుండి అధిక విద్యార్థుల నమోదు కలిగిన 9,123(35 శాతం) పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.3,497.62 కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించింది. అదే విధంగా మిగిలిన పాఠశాలలలో రెండు, మూడవ విడతలలో ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలనుకుంది. ఈ అభివృద్ధి పనులను పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసి) చేపట్టాల్సి ఉంది. ఈ పథకం కింద చేయాల్సిన పనులు 12రకాలు. నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుదీకరణ, తాగునీరు, ఫర్నీచర్ (విద్యార్థులకు-ఉపాధ్యాయులకు) రంగులు వేయడం. పెద్ద చిన్న తరహా మరమ్మతులు చేయడం, గ్రీన్ బోర్డులు, ప్రహారీ గోడలు, వంటగదుల నిర్మాణం, శిథిల భవనాల స్థానంలో నూతన గదులు, భోజనశాలలు (ఉన్నత పాఠశాలలో మాత్రమే),డిజిటల్ సౌకర్యాలు.
ఈ కార్యక్రమంలో పనులు నత్తనడకన సాగు తున్నాయి. ఈ కార్యక్రమం ప్రకటించిననాడు అంటే? మార్చిలో (వేసవి సెలవులలో) పనులు పూర్తిచేసి, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరకపోవడం విచారకరం. కాగా, వచ్చే ఏడాది కూడా సంపూర్ణంగా పనులు పూర్తి చేసే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. తక్కువ వ్యయంతో చేసే విద్యుత్ పనులే రాష్ట్రంలో ఎక్కువ చోట్ల పూర్తవుతున్నాయి. ఆ తర్వాత క్రమంలో చిన్న మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహరీ గోడల నిర్మాణ పనులు ఎక్కువ చోట్ల మొదలే కాలేదు. శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదుల స్థానంలో కొత్తవి వస్తాయని ఆశించిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవస్థలు తీరకపోవడంతో నిరాశ తప్పడంలేదు. మార్చి 9న వనపర్తిలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ప్రచార ప్రకటనల తీరుచూస్తే వేసవి సెలవుల్లో పనులు పూర్తిచేసి జూన్లో పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి అందిస్తారని అందరూ భావించారు. కానీ ఈ విద్యా సంవత్సరం 2022- 23 ఏప్రిల్లో ముగిసే నాటికి కూడా ఈ పథకంలోని పనులు పూర్తి అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. రాష్ట్రంలోని కొన్నిచోట్ల పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. టెండర్లు ఖరారు కాకపోవడంతో పనులు మొదలు కాకపోవడంతో చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రాథమిక స్థాయిలో ఎఫ్ఎల్ఎన్ కృత్యాధార బోధన, గుణాత్మక విద్య కోసం తరగతి గదుల అవసరం తప్పనిసరి అయినప్పటికీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ బడుల రూపురేఖలు మార్చాలనుకున్న గొప్ప ఆశయం, సంకల్పం అభినందనీయమే. కానీ ఆచరణలోకి వచ్చేసరికి క్షేత్రస్థాయిలో పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ పథకానికి ప్రభుత్వం కల్పించిన ప్రచార స్థాయిలో పనులు జరగకపోవడంతో విద్యార్థుల విలువైన బోధన కాలాన్ని సద్వినియోగం చేయడానికి ఆటంకంగా మారింది. కనీసం ఇప్పటికైనా ఆ బృహత్తర పథకం నత్తనడకన సాగడానికి ఉన్న అడ్డంకులను అధిగమించేలా ప్రభుత్వం సమీక్షలు జరిపి నిధులను విడుదల చేయాలి. సంబంధిత అన్ని శాఖలను అప్రమత్త పరచాలి. ఎక్కడ అవినీతికి తావు లేకుండా పనుల్లో నాణ్యతను పాటిస్తూ సకాలంలో పూర్తిచేసి మన ప్రభుత్వ బడులకు మెరు గులుదిద్ది లక్ష్యానికి చేర్చాలి. ప్రభుత్వ బడుల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థుల, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలి.
- మేకిరి దామోదర్
9573666650