Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మికులంటే ఎనలేని గౌరవం ఉన్నవాడు. వారి హక్కుల సాధనకై నిరంతర పోరుసల్పినవాడు. కార్మికుల సమస్యలపై పోరాడటమంటే ఎంత కష్టమైనా ఇష్టంగా ఎదుర్కొనేవాడు. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగిగా సిఐటియు అనుబంధంగా ఉన్న బ్యాంకు ఉద్యోగుల సంఘంలో పని చేస్తూ సమస్త కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించిన వాడు. కార్మికవర్గానికి అండగా నిలిచేది, కార్మికులకు న్యాయం చేయగలిగేది కేవలం కమ్యూనిస్టులే నన్న వాస్తవాన్ని గుర్తించినవాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి సీపీఐ(ఎం)పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా వచ్చిన నిక్కచ్చి కమ్యూనిస్టు కామ్రేడ్ శేఖర్.
శేఖర్ ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్‌లోనే గడిచింది. బిఎస్సీలో ప్రథమశ్రేణిలో పాసయ్యాడు. అనంతరం బ్యాంక్ ఉద్యోగంలో చేరాడు. ఆ సంఘం నాయకుల సలహాతో కులాంతర వివాహం చేసుకున్నాడు. అప్పటికే డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న శారదని పరిచయం చేసారు సంఘం నాయకులు. మొదటిసారి కా||శారదని కలిసినప్పుడు ''నేను బ్యాంక్ డ్యూటి కాగానే యూనియన్ పనుల్లో ఉంటాను. ఇంటికి రావడానికి ఎంత రాత్రైనా పట్టొచ్చు. బ్యాంకు నుండి నేరుగా ఇంటికి రావాలని, అందరిలా మామూలుగా సమయం గడపాలని అనుకోకండి. పెళ్లి కూడా హంగు ఆర్బాటాలుండవు. దండల పెళ్ళి మాత్రమే జరగాలి. మీ చదువు, మీ ప్రాక్టీస్ మీ ఇష్టం'' అన్నారని సహచరి డా||శారద తెలిపారు. శారద ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా, పార్టీ గురించి తెలిసిన వ్యక్తిగా ఆ అవగాహన ముందే ఉన్నందుకు 'అటువంటి నిర్ణయంతోనే ఉన్న నాకు కా||శేఖర్ అభిప్రాయం విన్న తర్వాత తన అభిప్రాయం సూటిగా చెప్పడం నచ్చింది'' అంటారామె.
''నిత్యం ప్రజలకోసమే ఆలోచించేవారు. తన జీవన శైలి, ఆలోచనా విధానం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేవి. ఉద్యమ అవసరాల కోసం తెలుగు నేర్చుకున్నాడు. కొత్తపదాలు, సామెతలు నేర్చుకున్నాడు. ఉర్దూ నేర్చుకునే ప్రయత్నం చేశాడు. ఎప్పుడూ వర్గథృక్పదంతో ఆలోచించే వాడు. మహిళలు, అణగారిన ప్రజలవైపు నిలబడేవాడు. పేద పిల్లలను, మహిళలను చూస్తే చలించిపోయేవాడు. నీదగ్గర వస్తే పేదలకు ఉచితంగా వైద్యం అందించు. ఏ పద్ధతిలో చేయగలిగితే ఆ పద్ధతిలో సహాయం చేయి అని పదేపదే చెప్పేవాడు. ఆ నిరాడంబరత, కార్మికవర్గంపట్ల తనకున్న గౌరవం అపారమైనది'' అంటారామె... అలాంటి కా||శేఖర్ 46సంవత్సరాల నడి వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించడం కార్మికవర్గానికి తీరనిలోటు. 2006లో ''నేను ఉద్యోగానికి రిజైన్‌చేసి పూర్తికాలం కార్యకర్తగా పని చేస్తా'' అంటూ నాయకులతో చెబితే ''ఉద్యోగం చేస్తూనే సంఘానికి సహకరిస్తేనే మంచిది. మధ్యతరగతిలో బలపడాలంటే మీలాంటివారు అక్కడే ఉండాలి. ఇప్పుడు బాగానే పని చేస్తున్నావు. ఇలాగే చేయొచ్చు. రిజైన్ చేయొద్దు'' అని చెబితే వినలేదు. పార్టీ రాష్ట్రకేంద్రంలో కూర్చోబెట్టి నచ్చజెప్పారు. అయినా తనకు ఉద్యోగానికి రిజైన్ చేసి కార్మికులతో మమేకమై ప్రత్యక్షపోరాటాల్లోకి రావాలన్నదే లక్ష్యం. భూపోరాటంలో జైలుకు వెళ్ళినా ఇబ్బంది పడలేదు. పాతబస్తీలో ఉన్న పేదరికం, నిరక్ష్యరాస్యతా చాలా సమస్యలకు కారణమవుతుంది. వారి నాయకుల స్వార్థానికి పేద ప్రజలు బలవుతున్నారు. అలాంటి మైనారిటీ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడారు. ''ఒకవేళ నేను ఉద్యోగం చేసి తీరాలని పట్టుపడితే చేసేవాడేమో కానీ, చివరి కొన్ని సంవత్సరాలు తను తృప్తిగా పనిచేసి, నేను తలెత్తుకు తిరిగేలా చేసి వెళ్లాడు. కొంత అనారోగ్యం ఉన్నా ఇంత ప్రమాదం ఉందని ఎవరూ, ఎప్పుడూ ఊహించలేదు. చివరి క్షణం వరకూ సమాజం కోసం పని చేస్తూ ఈ లోకం నుండే సెలవు తీసుకున్న శేఖర్ కుటంబ సభ్యులకే కాదు, తోటి ఉద్యమాకారులకు కూడా ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడు'' అంటూ కంట తడిపెట్టారు శారద.
పాత నగరంలో పార్టీ నిలదొక్కుకోవాలంటే స్థానికంగా ఆఫీసు కావాలని రాష్ట్ర పార్టీ పర్మిషన్ తీసుకుని జంగంమెట్ వద్ద పార్టీ ఆఫీస్ కొనడంలో ముఖ్యపాత్ర పోషించాడు. స్థానిక ఎంఐఎం పార్టీ కార్యకర్తలు చేసే గొడవలను మనం ఎలా ఎదుర్కోవాలో కార్యకర్తలకు తర్ఫీదునిస్తూ ఉండేవాడు. అనేక సందర్భాల్లో ఎంఐఎం కార్యకర్తల భౌతికదాడులు ఎదుర్కొన్నాడు. 2007లో ఇండ్ల స్థలాలకోసం జరిగిన భూపోరాటంలో జైలుకెళ్ళి అక్కడున్నవారికి సైద్ధాంతిక అవగాహన, భౌతికవాద దృక్పథం, పోరాటపటిమ ఎలా వస్తుందో క్లాసుల రూపంలో చెప్పేవారని తనతో జైల్లో ఉన్నవారు చెప్పారు. అలా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి కార్మికోద్యమాలకోసం కడదాకా నిలిచిన కార్మిక నాయకుడు కా||కె.శేఖర్ నేటి తరానికి ఆదర్శవంతుడు.
(నేడు వర్థంతి సందర్భంగా)
-మహేష్ దుర్గే 9700888972